ఆ లోపాలు వద్దు!

వినాయక చవితి పూజలో ప్రతిష్ఠించే విగ్రహం తీసుకునేటుప్పుడు ఏఏ అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి?

Published : 06 Sep 2018 01:30 IST

సందర్భం
ఆ లోపాలు వద్దు!

* వినాయక చవితి పూజలో ప్రతిష్ఠించే విగ్రహం తీసుకునేటుప్పుడు ఏఏ అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి?
వినాయక చవితినాడు ఇంట్లో, వినాయక మంటపంపై ప్రతిష్ఠించే విగ్రహం విషయంలో కొన్ని సూచనలు పాటించాలి. సాకారంగా దైవాన్ని ఆరాధించేటప్పుడు ఆ రూపం ఏ విధమైన అవయవలోపం లేకుండా శిల్ప సౌందర్యం కలదిగా ఉండాలని శాస్త్రం చెబుతోంది. మట్టితో చేసిన వినాయక విగ్రహాలే ప్రశస్తమైనవి. లోపల డొల్ల లేకుండా నిండుగా ఉన్న విగ్రహాలను పూజించడం మంచిది.

* లోహాలతో తయారు చేసిన విగ్రహాలను చవితి పూజలో ప్రతిష్ఠించవచ్చా?
ఏ లోహంతో చేసిన విగ్రహాన్నయినా పూజించవచ్చని పెద్దలు చెబుతారు. అయితే ఇంటిలో పూజించే ప్రతిమ ఆరు అంగుళాల పరిమాణం మించకుండా ఉంటే మంచిది. వినాయక చవితి నాడు పచ్చిమట్టితో చేసిన గణపతి ప్రతిమను ఏర్పాటు చేసుకోవడం బాగుంటుంది. ఆనాడు పార్వతీదేవి నలుగుపిండితో చేసిన చిన్న బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసిన పురాణకథ ఆధారంగా ఈ విశ్వాసం లోకంలో బలపడింది. అంతేగాక వినాయకుడు మూలాధారానికి అధిపతి అనీ, పృథ్వీ తత్వానికి చెందిన వాడని చెప్పే యోగశాస్త్ర రీత్యా కూడా ఈ ఆచారం అమల్లోకి వచ్చింది.

* గణపతి పూజకు గరిక విశేషమైనదని అంటారెందుకు?
గరిక పూజను స్వీకరించడం గణపతి నిరాడంబరత్వాన్నీ, ప్రకృతి ప్రియత్వాన్నీ సూచిస్తుంది. వినాయకుడిని వివిధ రకాల పత్రాలతో పూజించడం వెనుక ఓ ఆంతర్యం ఉంది. పూజలో వినియోగించే రకరకాల పత్రాల గురించి, వాటిలోని ఔషధ గుణాల గురించి మనకు అవగాహన కల్పించడం ఇందులోని ముఖ్య ఉద్దేశం. అంతేకాదు గరిక.. మట్టితో ఉన్న అనుబంధానికి ప్రతీకగా భావిస్తారు. గరికతో పూజ చేసిన వారిని విశేషంగా అనుగ్రహిస్తానని గణపతి ప్రకటించినట్లు ఓ పురాణ కథనం కూడా ఉంది.

* గణేశ నవరాత్రుల్లో పూజించిన విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా ఇంట్లో ఉంచుకోవచ్చా?
చవితి పూజలో వినియోగించే విగ్రహాన్ని నిమజ్జనం చేయడమే సంప్రదాయం. అయితే అలా నిమజ్జనం చేయని పక్షంలో మన ఇంటి పెరటిలో ఎవరూ తొక్కకుండా.. చెట్టుపాదులో ఉంచవచ్చు. బంగారం, వెండి వంటి విలువైన లోహాలతో రూపొందించిన విగ్రహాలు పూజలో ఉంచితే.. నిమజ్జనం రోజు ఉద్వాసన పలికి, తిరిగి యథావిధిగా పూజామందిరంలో ఉంచవచ్చు. పచ్చిమట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడంలో ఒక చిత్రమైన ఆంతర్యం ఉంది. నిమజ్జనం అంటే నీటిలో ముంచడం. అంటే ప్రవాహ జలంలోగానీ, కనీసం ఊరి చెరువులోగానీ నిమజ్జనం చేయాలి. వర్షరుతువులో వచ్చే ఈ పండగ వేళ పచ్చిమట్టి కోసం మనకు తెలియకుండానే చెరువులకు పూడికలు తీసే పని జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చాడో మళ్లీ అక్కడికే వెళ్తాడు వినాయకుడు. ఈ సత్యం మనకు ప్రబోధించడమే నిమజ్జనంలోని ఆంతర్యం.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు