సత్యం శివం సుందరం

మహాశివుణ్ణి తలచుకోగానే తాండవం గుర్తొస్తుంది. అదొక అద్భుత విన్యాసం. అపరిమిత ఆధ్యాత్మిక భావసంచయం. నటరాజ నృత్యంలో సృష్టి, స్థితి, పారలౌకిక రహస్యాలెన్నో దాగి ఉన్నాయి.

Updated : 18 Feb 2023 07:46 IST

ఫిబ్రవరి 18 మహా శివరాత్రి

మహాశివుణ్ణి తలచుకోగానే తాండవం గుర్తొస్తుంది. అదొక అద్భుత విన్యాసం. అపరిమిత ఆధ్యాత్మిక భావసంచయం. నటరాజ నృత్యంలో సృష్టి, స్థితి, పారలౌకిక రహస్యాలెన్నో దాగి ఉన్నాయి. అందులో పరమాత్మ విశ్వరూపం దర్శనమిస్తుంది. సత్యం శివం సుందరం తత్వానికి నిదర్శనమై నిలుస్తుంది.

టరాజ నృత్యం.. అపూర్వం, అపురూపం. ఉల్లాసాన్నీ ఉద్వేగాన్నీ ఏకకాలంలో ప్రదర్శించే ఈ రీతిని నాదాంతం అంటారు. తమిళనాడు చిదంబరాలయ నటరాజమూర్తి భంగిమ నాదాంత శైలిలోనే ఉంది. ఈ నటరాజుకి నాలుగు చేతులుంటాయి. స్థలంగా చిదంబరం విశ్వకేంద్రం. జీవులకు అన్వయించినపుడు అది భక్తుల హృదయం. నటరాజు ఏక రూపుడై కనిపించినా నిజానికి అర్ధనారీశ్వరుడు. ఇందుకు నిదర్శనంగా స్వామి మెడలో తుమ్మిపూల మాల, ఎడమ చెవికి స్త్రీలు ధరించే చెవికమ్మలు కనిపిస్తాయి.

గంగను అనుసరించాలని..

సృష్టి, స్థితి, సంహార, తిరోభావ, అనుగ్రహ అనే అయిదు విధులను నిర్వర్తిస్తాడు కనుక శివుడు పంచకృత్యుడు అయ్యాడు. సాధారణంగా నాట్యం ఆరోహణ, అవరోహణ, మంద్ర గతుల్లో సాగుతుంది. నటరాజనృత్యం మాత్రం పంచకృత్యాలను సూచిస్తూ ఐదు గతుల్లో, ఐదు మండలాలుగా, ఐదు కొలతలలో (ఫైవ్‌ డైమెన్షనల్‌) అలరారడం విశేషం.

మూర్తి చుట్టూ ఉన్న మొదటి అగ్నివలయం ప్రభా మండలం. ఇది విశ్వ సృష్టికి సంకేతం. ప్రతి రెండు అగ్ని శిఖల మధ్య తుమ్మి ఆకుల వలయం ఉంటుంది. అగ్ని శిఖలు జననాలు కాగా, వలయ వృత్తాలు మరణాలు. అవి పుట్టుక వల్ల కలిగే సంతోషాన్ని, మరణం వల్ల కలిగే దుఃఖాన్ని సూచిస్తాయి. తుమ్మి వైరాగ్యానికి ప్రతీక. ఈ పూలతో శివుణ్ణి పూజించడం అత్యంత శ్రేష్ఠమంటారు. చావు పుట్టుకల పట్ల వైరాగ్యభావన ఉండాలనేది సందేశం. ప్రభామండలం శివుడి జటాజూటంపై ఉన్నందున అంతరిక్షాన్ని ధరించి, భరించే వ్యోమకేశుడంటారు.

రెండోది రత్నాలతో ప్రకాశించే తారామండలం జ్ఞానానికి సంకేతం. మూడోది తామ్ర తటస్థ మండలం. శివుడి జటాజూటాల రాగివర్ణం ఇక్కడ ప్రతిఫలిస్తుంది. పై రెండు మండలాల్లోని అంశాల పట్ల ఆసక్తి, అనాసక్తి లేకుండా తటస్థంగా ఉంటుంది. దీని కింద ఉండే తుమ్మి ఆకుల వలయం ఉత్తమ, ఉన్నత లోకాల ప్రాప్తికి తొలిమెట్టని చెబుతుంది. నాలుగో మండలంలో నటరాజ జటాజూటాలు తరంగాలను తలపిస్తాయి. విష్ణు పాదాల చెంత పుట్టిన గంగ శివుడి తలపై కొలువైనట్లుగా.. జీవులు సహస్రార చక్రంలో ఉండే శివపార్వతులను పొందాలనేది సూచన. పవిత్రత, పరిశుభ్రత, జ్ఞానతృష్టలను నిరంతరం ప్రవహింప చేసే గంగలా జీవులు నైర్మల్యాన్ని, జ్ఞానాన్ని, సంపదలను ఇతరులకు పంచాలన్నది భావన. ఐదో మండలం అజ్ఞాన సూచకమైన అపస్మారుడున్న భూమి.

శివుడాజ్ఞ లేనిదే...

శివుడి సిగలోని నెలవంక సృష్టికి, మనసుకి ప్రతీక. మనసుతో ప్రయత్నించి మార్గాన్ని అన్వేషించాలని చెప్పడమే నెలవంక దాల్చడంలో అంతరార్థం. జటాజూటంలో కిరీటాన్ని తలపించే తుమ్మి పత్రాలు గ్రహాల చలనానికి సూచికలు. చేతనున్న డమరుకం జీవసృష్టికి సంకేతం. ఇది దిశా నిర్దేశం చేస్తుంది. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనే నానుడికీ, నటరాజ నృత్యానికీ అవినాభావ సంబంధం ఉంది. ఎలాగంటే విశ్వంలో చరాచరాలన్నీ పరమాత్మ ఆదేశంతోనే కర్మలను అనుసరిస్తున్నాయి, విధులను నిర్వర్తిస్తు న్నాయి. నటరాజ నాట్య భంగిమలే జీవుల కదలిక. అది ఆగిందంటే సృష్టి స్తభించిపోవడం తథ్యం.

డాక్టర్‌ జయదేవ్‌ చల్లా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని