దండాయుధపాణికి పాలకావిడి!

పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన సుబ్రహ్మణ్యుడిని స్కంధుడు, మురుగన్, కుమారస్వామి అని పిలుస్తుంటారు. ఆ స్వామి నడయాడిన ఆరు క్షేత్రములను ఆరు పడైవీడుగా పేర్కొంటారు. ఇవి తమిళనాడులో ఒక మాలలా ఉంటాయి. నవగ్రహాల దోషాలున్నవారు, అనారోగ్యంతో

Published : 02 Apr 2021 17:35 IST

పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన సుబ్రహ్మణ్యుడిని స్కంధుడు, మురుగన్, కుమారస్వామి అని పిలుస్తుంటారు. ఆ స్వామి నడయాడిన ఆరు క్షేత్రములను ఆరు పడైవీడుగా పేర్కొంటారు. ఇవి తమిళనాడులో ఒక మాలలా ఉంటాయి. నవగ్రహాల దోషాలున్నవారు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, ఆర్థిక ఇబ్బందులున్న వారికి ఈ క్షేత్రాల దర్శనంతో ఉపశమనం కలుగుతుందని నమ్మకం. 

తిరుపరన్‌ కుండ్రమ్‌... దక్షిణ తమిళనాడులోని మధురై నగరానికి శివారు ప్రాంతంలో ఈ దేవాలయం ఉంది. రాక్షసులను సంహరించి విజయోత్సాహంతో స్వామి ఇక్కడ అడుగు పెట్టాడు. అందుకు గుర్తుగా సుబ్రహ్మణ్యస్వామి యుద్దంలో ఉపయోగించిన వేలాయుధానికి ఇక్కడ ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు నిర్వహిస్తుంటారు. స్వామి శక్తిని గుర్తించిన దేవేంద్రుడు తన కుమార్తెను ఇచ్చి ఇక్కడే వివాహం చేసినట్లు చెబుతారు. సుబ్రహ్మణ్యస్వామి దేవయానితో కలిసి కూర్చొన్న భంగిమలో భక్తులకు దర్శనం ఇస్తుంటారు. 


తిరుచెందూర్‌... ఆరు పడైవీడులలోని అన్ని క్షేత్రాలు కొండల మీద ఉండగా, ఇది మాత్రం తిరునల్వేలి సమీపంలో సముద్ర తీరంలో ఉంది.సాధారణంగా దక్షిణాదిన దేవాలయాలకు తూర్పు వైపున రాజగోపురం ఉంటుంది. కానీ ఇక్కడ తూర్పున సముద్రం విస్తరించి ఉండటంతో పశ్చిమం వైపు తొమ్మిది అంతస్తుల రాజగోపురం ఉంటుంది.  స్వామి వారి సర్వ సైన్యాధ్యక్షతకు గుర్తుగా ఇఇక్కడ ప్రతీ కార్తీక మాసంలో విజయోత్సవం నిర్వహిస్తారు. లక్షల సంఖ్యలో భక్తులు దీనికి హాజరవుతారు.


పళముదిర్‌ చోళై.. దక్షిణ తమిళనాడులోని మధురై నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధుర మీనాక్షి  అమ్మవారి చరిత్రతో అనుసంధానమై కనిపిస్తుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి తన ఇద్దరు దేవేరులు అయిన వల్లీదేవి, దేవయాని లతో కలిసి దర్శనమిస్తారు. ఈ కొండ పైన నిపుర గంగ అనే పేరుతో జలపాతాలు కనువిందు చేస్తుంటాయి. ఇక్కడ అనేక ఇతర దేవాలయాలు కూడా భక్తుల పూజలు అందుకొంటూ కనిపిస్తాయి.


తిరుత్తణి... చెన్నైకి 70 కిలోమీటర్ల దూరంలో,ఆంధ్రప్రదేశ్‌ తమిళనాడు సరిహద్దులలో ఈ క్షేత్రం ఉంది. అనేక యుద్ధాల తర్వాత స్వామి వారు సేదతీరేందుకు ఈ కొండను ఎంచుకొన్నారు. స్వయంగా సుబ్రహ్మణ్య స్వామే ఈ కొండ గురించి వివరించినట్లు చెబుతారు.  వల్లీదేవిని ఆమెను వివాహం చేసుకొన్న క్షేత్రమిది. డిసెంబర్‌ చివరలో ఈ ఘట్టాన్ని స్మరించుకొంటూ ..తిరుప్పగళ్‌ అనే కీర్తనలను ఆలపిస్తూ వేలాది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు. 


పళని.... తమిళనాడులోని ప్రముఖ క్షేత్రాలలో ఇది ఒకటి. లక్షలాది భక్తులు పాల్‌ కావిడి పేరుతో మొక్కుబడులు చెల్లించుకొనే పవిత్ర స్థలం. దీని పూర్వ నామం తిరువావినాన్‌ కుంది... అంటే లక్ష్మి (తిరు), గోవు (ఆవ్‌), సూర్యుడు (ఇనాన్‌). భూమి (కున్‌ ), అగ్ని (ది) సంయుక్తంగా పూజలందుకొనే ప్రాంతం అని అర్థం. ఆగస్త్యుడు వంటి మహా రుషులు ఇక్కడ తపస్సు చేశారని చెబుతారు. క్కడ కొండమీద భగవానుడ్ని దండాయుధ పాణిగా కొలుస్తారు. కొండ దిగువన తిరువావినాన్‌ కుంది పేరుతో మరో ఆలయం ఉన్నది. దిండిగల్‌ జిల్లాలో దట్టమైన అడవులు, కొండల మధ్య ఉంది.


స్వామి మలై... తమిళనాడులోని మధ్య ప్రాంతంలో కుంభకోణం సమీపంలో ఉంటుంది. కావేరీ నదికి దక్షిణ భాగంలో కొండమీద కొలువైన క్షేత్రం ఇది. ఇక్కడ సాక్షాత్తూ తన తండ్రి పరమేశ్వరునికి ఓంకారం గొప్పతనాన్ని సుబ్రహ్మణ్య స్వామి ఉపదేశించినట్లు చెబుతారు. తండ్రికే గురువు అయినందున గురునాథుడు అని, ఉపదేశం ఇచ్చినందున స్వామినాథుడు అని పిలుస్తారు. ఈ కొండకు ఉన్న 60 మెట్లను తమిళ కాలమానం ప్రకారం 60 సంవత్సరాలకు గుర్తుగా చెబుతారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి భారీ విగ్రహ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు.

....యలమంచిలి రమా విశ్వనాథన్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని