భవసాగరాన్ని దాటించే తెప్పోత్సవం

ఆగమ శాస్త్రాన్ని అనుసరించి దేవతా మూర్తులకు చేసే ప్రధాన రాజోపచారం తెప్పోత్సవం. తిరుమలలో జరిగే 14 ప్రధాన ఉత్సవాల్లో ఇదొకటి.

Updated : 02 Mar 2023 03:08 IST

ఆగమ శాస్త్రాన్ని అనుసరించి దేవతా మూర్తులకు చేసే ప్రధాన రాజోపచారం తెప్పోత్సవం. తిరుమలలో జరిగే 14 ప్రధాన ఉత్సవాల్లో ఇదొకటి.

జగన్నాథుడికి బ్రహ్మోత్సవాలు, నవరాత్రులు.. తదితర విశేష దినాల్లో ఛత్రం, చామరం, నృత్యం, గీతం, ఆందోళిక (పల్లకి, ఊయల, పడవలో జల విహారం),  అశ్వారోహణ, గజారోహణ, రథోత్సవాలను నిర్వహిస్తారు. వీటికోసం ఆలయాల్లో ప్రత్యేక మండపాలుంటాయి. సంగీత, వాయిద్య, నృత్యాలు భగవత్‌ సేవలో భాగం. అందుకే ఆలయాల్లో కచేరి చేయడాన్ని అదృష్టంగా భావిస్తారు.
సంసారమనే సాగరాన్ని దాటించి ఆనంద తీరాల వైపు తీసుకెళ్లే ఏకైక సరంగు అంతర్యామే. అందుకే స్వామిని ఆనంద నిలయుడంటారు. తెప్ప అంటే తరలించేది, లేదా దాటించేది. వీటిని నదులు, చెరువులను దాటడానికి ఉపయోగించడం తెలిసిందే. స్వామి, దేవేరుల ఉత్సవ విగ్రహాలను ఆలయ తీరంలో ఉన్న పుష్కరిణి లేదా కోనేరుకు తీసుకెళ్తారు. మామిడాకుల, పూల తోరణాలు, రంగురంగుల పతాకాలతో అలంకరించి హంస ఆకృతిలో సిద్ధంగా ఉన్న తెప్పపై స్వామి, అమ్మవార్లని మేళ తాళాల మధ్య జల విహారం చేయిస్తారు. అనంతరం దేవస్థాన ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో ఉపచారాలు, నివేదనలు, హారతులను వేదోక్తంగా నిర్వహిస్తారు. మన పురాణాలూ, ఇతిహాసాలూ హంసకు ఇచ్చే ప్రత్యేక స్థానాన్ని పురస్కరించు కుని తెప్పోత్సవంలో పడవను హంసలా తీర్చిదిద్దుతారు.

తిరుమలలో ఘనంగా

పురాణాలను అనుసరించి పేదవాడైన ఆత్మారాముడు సనత్కుమార మహర్షి ఆదేశంతో శ్రీవారి పుష్కరిణిలో తీర్థమాడి స్వామివారిని సేవించి, ఇష్టార్థ సిద్ధి పొందాడు. అలాగే తారకాసురుణ్ణి సంహరించిన కుమారస్వామి బ్రహ్మ హత్యా పాతకం నుంచి నివారణ పొందడానికి ఈ పుష్కరిణిలో స్నానమాచరించాడు. అంతేకాదు, ఈ పుష్కరిణిలో కుబేర, గాలవ, మార్కండేయ, అగ్ని, యమ, వశిష్ట, వరుణ, వాయు, సరస్వతి తీర్థాలు అంతర్లీనంగా ప్రవహిస్తున్నాయి. ఇక్కడ స్నానమాచరించి శ్రీనివాసుణ్ణి దర్శించుకుంటే పునర్జన్మ ఉండదంటారు. అంతటి పవిత్ర పుష్కరిణిలో స్వామివారిని సర్వభూపాల వాహనంమీద తీసుకొచ్చి తెప్పోత్సవం నిర్వహిస్తారు.
ఫాల్గుణ శుద్ధ ఏకాదశినాడు మొదలై పౌర్ణమితో ముగిసే అయిదు రోజులూ తెప్పలో ఉన్న కోనేటి రాయుణ్ణి దర్శించుకుంటే దైనందిన జీవితంలో ఎదురయ్యే తిప్పలు తప్పుతాయంటారు. ‘తెప్పపై ఊరేగే తిరుమలప్ప.. నిను చూడగ వేయికనులు చాలవుగా..’ అంటూ తెప్పోత్సవ వైభవాన్ని వర్ణించాడు అన్నమయ్య.

కొత్త సంవత్సరానికి స్వాగత సన్నాహం అన్నట్టు చైత్ర మాసంలో ఈ తెప్పోత్సవం జరుగుతుంది. ఇందులో నియమబద్ధమైంది విహార ప్రక్రియ. మొదటి రోజున సీతా లక్ష్మణ సమేతుడైన రాముణ్ణి పూజించి, స్వామి పుష్కరిణిలో అలంకరించిన తెప్పపై స్వర్గ విహారం చేయిస్తారు. రెండో రోజున రుక్మిణీ శ్రీకృష్ణులను పూజించి ఆనందోత్సాహానికి తీసుకెళ్తారు. మూడోరోజు కోనేటిలో మూడుసార్లు స్వామిని విహరింప జేస్తారు. ఆదిభౌతిక, ఆదిదైవిక, ఆధ్యాత్మిక- ఇలా తాపత్రయ నివారణకు సంకేతమిది. నాలుగోరోజు విహారం స్వామి అయిదుసార్లు వర్తులాకారంలో సాగుతుంది. పంచ- తన్మాత్రలు, భూతాలు, భావాలు, కోశాలకు సంకేతంగా ఈ విహారాన్ని వర్ణిస్తారు. అయిదోరోజు, ఆఖరిరోజు ఏడుసార్లు విహరించి భక్తులకు దర్శనమిస్తారు. సప్త మోక్ష ద్వారాలకు, సప్త పవిత్ర తీర్థాలు, సప్త గిరులకు సంకేతంగా సమన్వయం చేసి చెబుతారు. తెప్పోత్సవాలను మనం ‘తెప్ప తిరునాళ్లు’ అంటే తమిళంలో ‘తిరుపల్లి ఓడై తిరునాళ్‌’ అంటారు.
త్రయోదశి నుంచి మూడురోజులు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామిని పుష్కరిణిలో విహరింపజేస్తారు. ముందుగా ఉత్సవ విగ్రహాలను వివిధ దివ్యాభరణాలు, రంగురంగుల పుష్పమాలికలతో ముస్తాబు చేసి వేద పండితుల మంత్రోచ్చారణ, భక్తుల జయజయధ్వానాలు, మేళతాళాల మధ్య మాడ వీధుల్లో ఊరేగిస్తారు. దీన్ని తిరువారాధన అంటారు.

ఎప్పుడు మొదలైంది...

తిరుమల శ్రీవారికి ఫాల్గుణమాసంలో ప్రతి సంవత్సరం ఏకాదశి నుంచి ప్రారంభమై పౌర్ణమి వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. శతాబ్దాలుగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. సాళువ నరసింహ రాయలు 1468లో పుష్కరిణి మధ్యలో నీరాళి మండపం నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దినట్లు చరిత్ర చెబుతోంది. తాళ్లపాక అన్నమాచార్యులు ఈ ఉత్సవాల ఘనతను కీర్తించారు. ఈ సందర్భంగా అశేష భక్తజనావళి స్వామివారిని దర్శించుకుంటుంది. తిరిగి చైత్ర మాసంలోనూ స్వామి పుష్కరిణిలో ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు.

ఇతర క్షేత్రాల్లో..

అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, భద్రాచలం, అంతర్వేది విజయవాడ తదితర పుణ్యక్షేత్రాల్లోనూ తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆలయాలకు అనుబంధంగా ఉన్న పుష్కరిణిలో గానీ దగ్గరలో ఉన్న చెరువులు, నదుల్లో గానీ ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. శ్రీశైలంలో శివరాత్రి నాడు, అంతర్వేదిలో రథసప్తమికి, అన్నవరం స్వామికి కార్తిక మాసంలో, విజయవాడ దుర్గమ్మకు శరన్నవరాత్రుల ముగింపులో, విజయనగరం పైడిపల్లి అమ్మవారి జాతర ముగింపులో నిర్వహిస్తారు. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశికి ముందు 10 రోజులు మహల్‌పట్టు ఉత్సవాలుంటాయి. రోజుకొక అవతారం చొప్పున స్వామివారు దర్శనమిస్తారు. పదోరోజున తెప్పోత్సవం జరుగుతుంది. కష్టాలనే భవ సాగరాల నుంచి తప్పించి తరింపచేయమని భగవంతుణ్ణి ప్రార్థించడమే ఈ ఉత్సవాల్లో ఉన్న అంతరార్థం.
అయ్యగారి శ్రీనివాస రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని