ధర్మం ఎంత గొప్పదంటే...

పూర్వం ఒక బ్రాహ్మణుడు యజ్ఞం చేయాలను కున్నాడు. కానీ తగినంత ధనం లేదు. దానికోసం తీవ్రంగా తపస్సు చేశాడు.

Published : 29 Dec 2022 00:25 IST

పూర్వం ఒక బ్రాహ్మణుడు యజ్ఞం చేయాలను కున్నాడు. కానీ తగినంత ధనం లేదు. దానికోసం తీవ్రంగా తపస్సు చేశాడు. తర్వాత కొంత కాలానికి కుండధారుడనే దైవప్రతినిధి వచ్చి ‘ఏం కోరుకుంటు న్నావు?’ అనడిగాడు. యజ్ఞానికి అవసరమైన ధనం కోసం తపస్సు చేస్తున్నాను’ అన్నాడు. కుండధారుడు సరేనని మణిభద్రుడనే కుబేరుడి భృత్యుణ్ణి తలచు కున్నాడు. అతడు ప్రత్యక్షం కాగానే బ్రాహ్మణుడికి వలసినంత ధనం ఇవ్వమన్నాడు. బదులుగా తక్షణం ఇస్తానన్నాడు మణిభద్రుడు.

ఆ బ్రాహ్మణుడి పట్ల సానుభూతి కలిగిన కుండ ధారుడికి ధనాన్ని మించింది ఇవ్వాలనిపించింది. నిష్ఠాపరుడు, స్వార్థం లేదు కనుక లౌకికమైన ధనం కంటే ధర్మమార్గం వైపు మళ్లిస్తే అతడే ఇతరులకు సంపదలు పంచగలడు- అనుకుని మణిభద్రుణ్ణి వెనక్కి పిలిచి తన అభిప్రాయం చెప్పాడు. అతడు అంగీకరించి, బ్రాహ్మణుడికి ధర్మాభినివేశం కలిగించమని ప్రార్థించాడు. దేవతల అనుగ్రహంతో అతడిలో ధనాశ పోయి తీవ్ర తపస్సు చేస్తుండగా కుండధారుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రాహ్మణుడు నమస్కరించి, ‘మహానుభావా! తమ దయ వల్ల ధనాశ నశించింది. నాకిప్పుడు ధనం వద్దు, నిరంతర తపోనిష్ఠకు అనుమతివ్వండి’ అన్నాడు. ఆ పరిణామానికి కుండధారుడు సంతోషించాడు. అతడు కోరుకున్నది అదే మరి. విప్రుడు కందమూలాలు, పండుటాకులే తింటూ తపస్సు చేశాడు. తర్వాత గాలి, నీళ్లే స్వీకరించేవాడు. దాంతో దివ్యశక్తులు కలిగాయి. ‘ధనకనక వస్తువాహనాలు ఇవ్వగలగడమే కాదు, పాపాలను రూపుమాపి ధర్మమార్గంలో నడిచేలా చూడగలను’ అనే నమ్మకం కలిగింది. అలాంటి శక్తి ప్రసాదించిన కుండధారుణ్ణి తలచు కున్నాడు. ప్రత్యక్షం కాగానే తన తపశ్శక్తితో కల్పించిన దివ్యగంధమాల్యాదులతో పూజించి, సాష్టాంగనమస్కారం చేశాడు. ‘అర్థకామాల కన్న ధర్మం గొప్పదని అర్థమైందిగా?!’ అంటూ అభినందించాడు కుండధారుడు. విప్రుడు తపస్సు కొనసాగించి దేవతల మెప్పు పొందాడు.

డాక్టర్‌ అనంతలక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని