మూడేళ్లకోసారి రెండు బ్రహ్మోత్సవాలు

శ్రీవారికి నిత్యమూ ఉత్సవాలే.. అన్నింటిలోనూ ప్రత్యేకమైనవి సంవత్సరానికి ఒకసారి నిర్వహించే బ్రహ్మోత్సవాలే. ప్రతి మూడేళ్లకు ఒకసారి అధిక మాసం రావడంతో రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 

Updated : 07 Oct 2021 09:28 IST

శ్రీవారికి నిత్యమూ ఉత్సవాలే.. అన్నింటిలోనూ ప్రత్యేకమైనవి సంవత్సరానికి ఒకసారి నిర్వహించే బ్రహ్మోత్సవాలే. ప్రతి మూడేళ్లకు ఒకసారి అధిక మాసం రావడంతో రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఒకటి వార్షిక(సాలకట్ల) బ్రహ్మోత్సవాలు, రెండు నవరాత్రి బ్రహ్మోత్సవాలు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ, ధ్వజావరోణం ఉండవు. ఉత్సవాలకు అష్టదిక్పాలకులు, దేవతలను ఆహ్వానించరు. వాహన సేవలు మొదటి బ్రహ్మోత్సవం మాదిరి యథావిధిగా జరుగుతాయి. మొదటి బ్రహ్మోత్సవంలో కొయ్యతేరు(రథం)ను, రెండో బ్రహ్మోత్సవంలో బంగారు రథాన్ని ఉపయోగిస్తారు. బ్రహ్మోత్సవాలలో జరిగే వాహనసేవల్లో శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ మలయప్పస్వామి పెద్దశేష, ముత్యపుపందిరి, కల్పవృక్ష, సర్వభూపాల వాహనం, స్వర్ణ రథం, బంగారు తిరుచ్చి(పల్లకి) వాహనాల్లో మాడవీధుల్లో ఊరేగుతారు. మలయప్పస్వామి ఒక్కరే చిన్నశేష, హంస, సింహ, మోహినీ అవతారంలో పల్లకి, గరుడ, హనుమంత, గజ, సూర్యప్రభ, చంద్రప్రభ, అశ్వ వాహనాలపై తిరుమల మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.

బ్రహ్మ ప్రారంభించిన ఉత్సవం
సృష్టికర్త బ్రహ్మ స్వయంగా ప్రారంభించినందున బ్రహ్మోత్సవం అనే పేరు వచ్చింది. బ్రహ్మోత్సవాల్లో వాహనాల ఊరేగింపులకు ముందు ఒక చిన్నరథం సాగుతుంటుంది. దానికే బ్రహ్మ రథమని పేరు. ఈ రథంలో బ్రహ్మదేవుడు ఉండి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. 

కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి ముందు శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేస్తారు. దీన్ని ‘కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం’ అంటారు. తిరుమలలో సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.  

విష్వక్సేనుని పర్యవేక్షణ
శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుని పర్యవేక్షణలో వేెంకన్న బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. ముందురోజు రాత్రి ఆలయానికి నైరుతి దిశలో నిర్ణీత ప్రదేశంలో భూదేవిని పూజించి, మృత్తికను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి తీసుకొస్తారు. అలా తెచ్చిన ఆ మట్టిలో నవధాన్యాలు మొలకెత్తించే కార్యక్రమానికి అంకురార్పణ అని పేరు. 

గరుడుని స్వాగత పత్రిక
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులనూ ఆహ్వానిస్తారు. శ్రీస్వామివారి వాహనమైన గరుడుడి చిత్రాన్ని కొత్త వస్త్రంపై చిత్రీకరిస్తారు. దీన్నే ‘గరుడ ధ్వజపటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతోచేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవమూర్తులైన శ్రీ మలయప్పస్వామి, శ్రీదేవి, భూదేవి సమక్షంలో మీన లగ్నంలో కొడితాడుకు కట్టి నూతన కేతనాన్ని పండితులు వేదమంత్రాలతో, మంగళ వాయిద్యాలతో బంగారు ధ్వజస్తంభంపై ఎగురవేస్తారు. ఆకాశానికెగసిన గరుడుడు బ్రహ్మోత్సవాలకు రమ్మంటూ ముక్కోటి దేవతలనూ, ఆబాలగోపాలాన్ని ఆహ్వానిస్తాడని అర్థం.

శ్రీవారి వాహనసేవలు
బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారు అధిరోహించే ఒక్కో వాహనానికి ఒక్కో చరిత్ర ఉంది. ప్రతి వాహనంపై నుంచి శ్రీవారు ఒక్కో సందేశమిస్తారు.

ఏడు పడగలపై ఏడుకొండల వాడు
ధ్వజారోహణం జరిగిన రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామి ఏడు పడగల పెద్దశేష వాహనంపై భక్తులను కటాక్షిస్తారు. పెద్దశేషునిపై స్వామివారు శ్రీపద్మనాభస్వామి వారి అలంకరణలో భక్తులను సాక్షాత్కరిస్తారు. 
చిన్నశేషునిపై శ్రీనివాసుడు..
శ్రీవారు ఒక్కరే రెండోరోజు ఉదయం ఐదు పడగల చిన్నశేష వాహనంపై ఊరేగుతాడు. చిన్నశేష వాహనంపై శ్రీ మలయప్పస్వామి నెమలి పింఛం, పిల్లన గ్రోవితో మురళీకృష్ణుడి అలంకారంలో భక్తులను కటాక్షిస్తారు.
హంస వాహనంపై చదువులతల్లిగా..
 రెండోరోజు రాత్రి శ్రీస్వామివారు సరస్వతీ రూపంలో హంస వాహనంపై దర్శనమిస్తారు. భక్తులలోని అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
సింహ వాహనంపై సప్తగిరీశుడు
మూడోరోజు ఉదయం యోగనృసింహస్వామి అలంకారంలో సింహ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిస్తారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణకు సింహంపై ఊరేగుతారు. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను సింహ సమానంతో ప్రయత్నిస్తానని ఈ వాహనం ద్వారా శ్రీవారు నిరూపించారు.
ముత్యపు పందిరిలో.. మూడు నామాలవాడు
మూడో రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి కాళీయమర్దన చిన్నికృష్ణుడిగా కొలువుదీరుతారు. నవరత్నాల్లో ముత్యం ఒకటి. ఇది చంద్రునికి ప్రతీక. చంద్రుడు చల్లనివాడు. ఆరోగ్యప్రదాత స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు, రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్టస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి. 
వరాలిచ్చే కల్పతరువు
నాలుగోరోజు ఉదయం కల్పవృక్షంపై గోవులగోపన్న అలంకారంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారు భక్తులను కటాక్షిస్తారు. కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అలాంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి స్వామివారు భక్తులకు అభయ ప్రదానం చేస్తారు. 
సప్తగిరీశుడి సేవలో సర్వభూపాలురు
నాలుగోరోజు రాత్రి శ్రీదేవి, భూదేవులతో మలయప్పస్వామి సర్వభూపాల వాహనంపై ఊరేగుతారు. సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులూ ఉన్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని కీర్తిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.
జగన్మోహినిగా..
ఐదోరోజు ఉదయం శ్రీ స్వామివారు మోహినీ అవతారంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిస్తారు. శ్రీకృష్ణస్వామి మరో పల్లకిలో అనుసరిస్తారు. ఈ వాహనసేవలో స్త్రీలు ధరించే అన్ని ఆభరణాలతో స్వామిని అలంకరిస్తారు. 
గరుడ వాహనంపై పరంధాముడు
ఐదోరోజు రాత్రి జరిగే గరుడోత్సవం ముఖ్యమైంది. మలయప్పస్వామివారు తనకు ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై దర్శనమిస్తారు. ఉత్సవంలో మలయప్పస్వామిని మూలమూర్తికి నిత్యం అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, వేంకటేశ సహస్ర నామాలు మొదలైన విశిష్టాభరణాలతో అలంకరిస్తారు.
హనుమంత వాహనంపై విహారం
ఆరోరోజు ఉదయం మలయప్పస్వామి వేంకటాద్రిరాముని అలంకారంలో హనుమంత వాహనంపై కొలువుదీరుతారు. తన అనన్యభక్తుడైన హనుమంత వాహనసేవలో భక్తులను కటాక్షి¨స్తారు. 
బంగారు రథంలో స్వామి
ఆరోరోజు మధ్యాహ్నం శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ మలయప్పస్వామికి వసంతోత్సవం జరుగుతుంది.  సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి బంగారు రథాన్ని అధిరోహిస్తాడు.  
కరిపై బ్రహ్మాండ నాయకుడు
ఆరోరోజు రాత్రి గజ వాహనంపై శ్రీ మలయప్పస్వామి వారు కొలువుదీరి భక్తులకు అభయప్రదానం చేస్తారు. ఈ వాహనసేవ దర్శనం వల్ల కర్మ విముక్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. 
సూర్యప్రభలో శ్రీనివాసుడు
ఏడోరోజు ఉదయం ఏడు అశ్వాలున్న సూర్యుని రథంపై ఎర్రటి పూలమాలలు ధరించి స్వామి దర్శనమిస్తారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు. సూర్యప్రభ వాహనంలో ఉండే నారాయణుడిని దర్శించే భక్తులకు ఇతోధిక భోగభాగ్యాలు, సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. 
చుక్కలరేడుపై చక్కదనాలస్వామి
ఏడోరోజు రాత్రి చల్లని వాతావరణంలో చంద్రప్రభ వాహనంపై వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో స్వామి దర్శనమిస్తారు. చంద్రప్రభ వాహనంపై ఊరేగే స్వామివారి దర్శనం భక్తులకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. 
దివ్యరథంపై మహా వైభవం
ఎనిమిదో రోజు ఉదయం సూర్యుని కిరణకాంతుల్లో మేరుపర్వతం లాంటి రథంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఊరేగుతారు. భక్తులు రథం పగ్గాలను పట్టుకుని స్వయంగా లాగడం రథోత్సవ ప్రత్యేకత. 
అశ్వ వాహనంపై కల్కి అవతారియై 
ఎనిమిదో రోజు రాత్రి అశ్వ వాహనంపై స్వామి ఊరేగుతారు. శ్రీవారు అశ్వాన్ని అధిరోహించి కల్కి అవతారంలో భక్తులను అనుగ్రహిస్తారు. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వ వాహనంపై కల్కి అవతారంలో వచ్చి దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తాడని చెప్పడమే ఈ వాహన ఉద్దేశం. 
చక్రస్నానం
తొమ్మిదోరోజు ఉదయం శ్రీ స్వామి పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది. ఎనిమిది రోజుల పాటు వాహనసేవల్లో అలసిపోయిన స్వామి సేదతీరడానికి ఈ స్నానం జరిపిస్తారు. వరాహస్వామి ఆలయ ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో, ఉభయనాంచారులతో స్వామికి అభిషేకసేవ నిర్వహిస్తారు. అనంతరం చక్రత్తాళ్వారును వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. 
ధ్వజావరోహణంతో సమాప్తం
తొమ్మిదోరోజు రాత్రి ఆలయంలో ధ్వజావరోహణం జరుగుతుంది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో బ్రహ్మాది దేవతలకు, అష్టదిక్పాలురకు వీడ్కోలు చెబుతూ గరుడ కేతనాన్ని ధ్వజస్తంభం మీది నుంచి దించుతారు. దాంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.

-న్యూస్‌టుడే, తిరుమల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని