వడ్డికాసుల వాడికి లక్ష్మీకళ

శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు మొక్కుల చెల్లింపులో భాగంగా హుండీలో కానుకలు సమర్పిస్తారు. బ్రిటిష్‌ కాలంలో ఆలయంలో హుండీ ఏర్పాటు చేసినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. అంతకుముందు భక్తులు తమ కానుకలను హారతుల పళ్లెంలో సమర్పించేవారు.

Published : 07 Nov 2021 15:17 IST

న్యూస్‌టుడే, తిరుమల: శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు మొక్కుల చెల్లింపులో భాగంగా హుండీలో కానుకలు సమర్పిస్తారు. బ్రిటిష్‌ కాలంలో ఆలయంలో హుండీ ఏర్పాటు చేసినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. అంతకుముందు భక్తులు తమ కానుకలను హారతుల పళ్లెంలో సమర్పించేవారు. బ్రిటిష్‌ ప్రభుత్వం స్వామివారి కానుకలు లెక్కించడానికి 1821 జులై 25న ఆలయంలో హుండీని ఏర్పాటు చేసినట్లు ఆలయ పరిపాలనా విధానాలు నిర్దేశించిన చట్టం బ్రూస్‌ కోడ్‌ 12లో పేర్కొన్నారు. సాధారణంగా హుండీని రోజుకు రెండుసార్లు అంటే.. మొదటిది శ్రీవారికి రెండో నైవేద్యం సమర్పించే మధ్యాహ్నం 12 గంటల సమయంలో, మళ్లీ రాత్రి ఏకాంతసేవ సమయంలో మారుస్తారు. కాలక్రమేణ పెరుగుతున్న భక్తుల రద్దీతోపాటు  సమర్పించే కానుకలు పెరగడంతో రోజుకు ఆరు నుంచి ఏడుసార్లు మారుస్తున్నారు. ఒక్కోరోజు అత్యధికంగా 12 సార్లు హుండీని మార్చిన సందర్భాలు ఉన్నాయి. 

పెరుగుతున్న బంగారం, నగదు నిల్వలు
 సాధారణ రోజుల్లో సరాసరి రూ.మూడుకోట్లకు పైగా నగదు, నెలకు వంద కిలోలకు పైగా బంగారు లభిస్తోంది. బంగారు నిల్వలను తితిదే బ్యాంకులో డిపాజిట్‌ చేస్తోంది. ఇప్పటి వరకు వివిధ బ్యాంకుల్లో తొమ్మిది టన్నుల బంగారాన్ని డిపాజిట్‌ చేసింది. ఇవికాకుండా భక్తులు సమర్పించే బంగారు కానుకలు అనేకం. ఇలా సమర్పించిన ఆభరణాలతో ప్రస్తుతం 1093 రకాల ఆభరణాలను స్వామి అలంకరణలో తితిదే వినియోగిస్తోంది.

ట్రస్టుల ద్వారా భూరి విరాళాలు
తితిదే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులకు భక్తులు రూ.లక్ష నుంచి ఎంతైనా విరాళంగా అందించవచ్చు. ప్రస్తుతం తితిదే ఆధ్వర్యంలోని ట్రస్టులు శ్రీబాలాజీ ఆరోగ్యవరప్రసాదిని ట్రస్టు, శ్రీబర్డ్‌ ట్రస్ట్‌, శ్రీ వేంకటేశ్వర భక్తిఛానల్‌ ట్రస్టు, శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయ ట్రస్టు, శ్రీవేంకటేశ్వరప్రాణదాన ట్రస్టు, శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టు, శ్రీవేంకటేశ్వర హెరిటేజ్‌ ప్రిజర్వేషన్‌ ట్రస్టు, శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టు, శ్రీవేెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టు, శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్టులకు భక్తులు తితిదే ఈవో పేరు మీద విరాళాలను అందించవచ్చు. ఈ- హుండీ ద్వారాను భక్తులు విరాళాలను అందించే అవకాశాన్ని తితిదే కల్పించింది. ప్రస్తుతం కరోనా సమయంలో ఈ హుండీ ద్వారా భక్తులు శ్రీవారికి కానుకలు చెల్లిస్తున్నారు. 

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని