సిరుల తల్లి.. శ్రీపద్మావతి

 శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవేరి శ్రీపద్మావతీ అమ్మవారు కొలువుదీరిన పుణ్యక్షేత్రం తిరుచానూరు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు.

Published : 07 Nov 2021 15:16 IST

న్యూస్‌టుడే, తిరుచానూరు: శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవేరి శ్రీపద్మావతీ అమ్మవారు కొలువుదీరిన పుణ్యక్షేత్రం తిరుచానూరు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. తిరుమల తరహాలో ఇక్కడా ఆర్జిత సేవలు అమలులో ఉన్నాయి. కార్తిక బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీపద్మావతీదేవి తొమ్మిది రోజుల పాటు పలు వాహనాలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తారు. పూర్వం ఇక్కడ శుకమహర్షి ఆశ్రమం ఉండటంతో గ్రామానికి శుకనూరుగా.. కాలక్రమంలో తిరుచానూరుగా పేరొందింది. శ్రీపద్మావతీ ఆవిర్భావం వెనక ఆసక్తికరమైన పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం భృగుమహర్షి మూడు లోకాలను సందర్శిస్తూ వైకుంఠం చేరుకుంటారు. అదే సమయంలో శ్రీమహావిష్ణువు, శ్రీమహాలక్ష్మి ఇద్దరూ భృగుమహర్షి రాకను గమనించలేదు. ఆయన ఆగ్రహించి శ్రీమహావిష్ణువు వక్షస్థలంపై కాలితో తన్నాడు. దాంతో శ్రీమహాలక్ష్మి అలిగి భూలోకంలోని కొల్హాపూర్‌ చేరుకుంటుంది. వైకుంఠ నారాయణుడు అమ్మవారిని వెతుక్కుంటూ భూలోకానికి వస్తారు. కొల్హాపూర్‌లో అమ్మవారి కోసం ఎంత  వెతికినా కనిపించకపోవడంతో నిరాశకు గురవుతారు. స్వర్ణముఖి నదీ ప్రాంతంలో తపస్సు చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందన్న మాటలు ఆకాశవాణి ద్వారా వినిపిస్తాయి. శ్రీమహావిష్ణువు వెంటనే తిరుచానూరు చేరుకుని పద్మసరోవరం నిర్మించి అందులో దేవలోకం నుంచి తీసుకొచ్చిన బంగారు పద్మాలను ప్రతిష్ఠించారు. బంగారు పద్మాల వికాసం కోసం సరోవరానికి ఎదురుగా శ్రీసూర్యనారాయణుడిని ప్రతిష్ఠించి పూజించారు. అమ్మవారి అనుగ్రహం కోసం 12 ఏళ్ల పాటు శ్రీనివాసుడు తపస్సు చేశారు. కఠోర తపస్సు చేసిన శ్రీనివాసుడికి కార్తిక శుక్ల పంచమి ఉత్తరాషాఢ నక్షత్రం రోజున శ్రీమహాలక్ష్మీదేవి శ్రీపద్మావతీదేవిగా సాక్షాత్కరించారు. ఆనాటి నుంచి అమ్మవారికి నిత్యపూజలు, ఉత్సవాలు, ఊరేగింపులు, కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా ఆమె జన్మనక్షత్రం రోజున పంచమీ తీర్థం నిర్వహిస్తున్నారు. 

అనుబంధ ఆలయాలు
శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో మరో రెండు ఆలయాలు ఉన్నాయి. ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే కుడి వైపు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీసుందరరాజస్వామి ఆలయం ఉంటుంది. ఆలయంలో మహావిష్ణువు రూపంలో ఉన్న స్వామివారు సుందరరాజస్వామిగా పూజలు అందుకుంటున్నారు. 

శ్రీకృష్ణ, బలరాముల దర్శనం
శ్రీకృష్ణుడు తన సోదరుడు బలరాముడితో కలిసి కొలువుదీరాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఇక్కడ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆలయంలో స్వామివారి జన్మనక్షత్రం రోహిణి రోజున ప్రతినెలా మూలమూర్తికి అభిషేక పూజలు చేస్తారు. అదేరోజు సాయంత్రం రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణుడు తిరుచ్చి వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతారు. ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని మూడు రోజుల పాటు ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తారు. ఆలయం వెనక వైపు నాగదేవత ప్రతిమ ఉంది. దర్శనానికి వచ్చే  భక్తులు ముందుగా నాగదేవతను దర్శించుకున్న తర్వాతనే అమ్మవారి సేవలో తరిస్తారు.

శ్రీసూర్యనారాయణస్వామి ఆలయం
శ్రీపద్మావతీ అమ్మవారి పద్మసరోవరం అభిముఖంగా శ్రీసూర్యనారాయణస్వామి ఆలయం ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామి స్వయంగా ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆలయంలో స్వామివారికి ప్రతి ఆదివారం ప్రత్యేక అభిషేక పూజలు చేస్తారు. ఏటా శ్రీసూర్య జయంతి రోజున వేకువ జామున స్వామివారు ఆరు గంటలకు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు.తిరుచానూరులోని శ్రీసూర్యనారాయణుడిని దర్శించుకుంటే ఆరోగ్యం సిద్ధిస్తుందని... సకల రోగాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. ఇటీవల ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. భక్తుల రాకకు అనుగుణంగా ఆలయాన్ని తితిదే అన్ని విధాలా అభివృద్ధి చేసింది. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని