అనుబంధం.. భక్తుల ఆనందం

కలియుగదైవం శ్రీనివాసుడు పద్మావతీదేవిని పరిణయమాడిన పుణ్యక్షేత్రంగా నారాయణవనం అలరారుతోంది. ఆకాశ మహారాజు కుమారై పద్మావతీదేవికి,  శ్రీనివాసుడుకి వైశాఖమాసం శుక్ల దశమి ఉత్తర ఫల్గుణి నక్షత్రం ..

Published : 07 Nov 2021 15:11 IST

పరిణయ వనం..  
కలియుగదైవం శ్రీనివాసుడు పద్మావతీదేవిని పరిణయమాడిన పుణ్యక్షేత్రంగా నారాయణవనం అలరారుతోంది. ఆకాశ మహారాజు కుమారై పద్మావతీదేవికి,  శ్రీనివాసుడుకి వైశాఖమాసం శుక్ల దశమి ఉత్తర ఫల్గుణి నక్షత్రం శుక్రవారం సకల దేవతల సమక్షంలో పరిణయం జరిగింది. వారి వివాహ వేడుకకు గుర్తుగా ఆకాశరాజు నారాయణవనంలో శ్రీపద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని నిర్మించారు. స్వామివారు వేటమార్గంలో తెచ్చిన ఖడ్గం, పద్మావతీదేవికి నలుగు పిండి విసిరిన తిరగలిని నేటికి ఆలయంలో చూడొచ్చు. 

మత్స్యావతారం.. నాగలాపురం 
మత్స్యావతారంలో శ్రీమహావిష్ణువు కొలువైన క్షేత్రమే నాగలాపురం. బ్రహ్మదేవుని నుంచి వేదాలను సోమకుడు అనే రాక్షసుడు అపహరించి సముద్ర గర్భాన దాక్కుంటాడు. బ్రహ్మది దేవతల వినతి మేరకు స్వామి మత్స్యరూపం ధరించి సంవత్సరాల పాటు సోమకునితో పోరు చేసి అతడిని సంహరించి వేదాలను తీసుకు వస్తాడు. సముద్ర నుంచి ఒడ్డుకు వచ్చిన ప్రాంతమే నాగలాపురం. 

శ్రీ కోదండ రామాలయం 
శ్రీరాముడు సందర్శించినందుకు గుర్తుగా తిరుపతిలో కోదండ రామాలయం నిర్మితమైనట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి వారు సందర్శనకు గుర్తుగా సీత, రామ, లక్ష్మణుల అర్చామూర్తులతో ఈ ఆలయం నిర్మించారని, దీనిని జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించారని ‘సవాల్‌ జవాబ్‌ పట్టీ’లో ఆధారాలు ఉన్నాయని అర్చకులు చెబుతున్నారు. ఆలయంలోని మూర్తులను జాంబవంతుడు ప్రతిష్ఠించారని ప్రతీతి.  స్వామివారు ఇంచుమించు తిరుమల శ్రీవారిలా దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులచే శ్రీరామకోటి లిఖించడం ఏటా జరుగుతోంది.

శ్రీనివాసమంగాపురం మీదుగా తిరుమలకు..
తిరుమల శ్రీవారికి ప్రతిరూపంగా శ్రీనివాసమంగాపురంలో అర్చావతార ప్రతిరూపంలో శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు వెలిసి ఉన్నారు. స్వామివారు శ్రీపద్మావతిదేవిని పరిణయమాడిన తర్వాత తిరుమల కొండకు వెళ్తూ తొండవాడ సమీపంలోని శ్రీఅగస్త్య మహాముని ఆశ్వీరచనం పొందడానికి వెళ్లారు. పసుపు పారాణి ఆరని దుస్తులతో ఉన్న శ్రీపద్మావతీదేవి సమేత శ్రీనివాసుడుని నిండు మనస్సుతో దీవించారు. పసుపు.. పారాణి దుస్తులు, కాళ్లతో తిరుమలకు వెళ్లడం శ్రేయస్కరం కాదని శ్రీనివాసమంగాపురంలో ఆర్నెల్లపాటు విడిది చేసిన తర్వాత తిరుమలకు వెళ్లాలని సూచించారు. మహాముని ఆజ్ఞతో స్వామివారు శ్రీనివాసమంగాపురంలో ఆర్నెల్ల్లపాటు విడిది చేయడంతో శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి దేవాలయం ప్రసిద్ధి చెందింది. 

అప్పలాయగుంట..
శ్రీవేంకటేశ్వరస్వామి నారాయణవనంలో పద్మావతిని పరిణయమాడిన తరువాత తిరుమల వకుళామాత ఆశ్రమానికి వెళ్తూ మార్గమధ]్యలో గల అప్పలాయగుంటకు సమీపంలోని వేముల కొండకు చేరుకున్నారు. ఆ ప్రాంతంలో శ్రీవేంకటేశ్వరస్వామి గురించి తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర మహర్షిని అభయహస్తంతో ఆశీర్వదించి ఈ ఆలయంలో కొలువుదీరాడు. 

శయనమూర్తి... శ్రీగోవిందరాజస్వామి
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయం అత్యంత పురాతనమైంది. గోపురాలు, అపురూప శిల్ప కళాసంపదతో అలరిస్తోంది. తిరుమల వెళ్లే యాత్రికులు ఇక్కడ స్వామిని దర్శంచుకోవడం సంప్రదాయంగా వస్తోంది. శ్రీగోవిందరాజస్వామి తిరుమల శ్రీవారికి అన్నగా పేరొందారు. కొండమీద వడ్డీకాసుల్ని కొలవడంతో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారని చెబుతారు. అందుకు తగ్గట్టే కుంచాన్నే తలగడగా చేసుకొని స్వామి నిద్రపోతున్న విగ్రహాన్ని ఇక్కడ చూడొచ్చు. తిరుపతి నగరం ఏర్పడక ముందే ఈ ఆలయ నిర్మాణం జరగడం విశేషం.

కపిలేశ్వరాలయంలో త్రివర్ణ మూలమూర్తి 
 శ్రీ కపిలేశ్వరాలయం... తితిదే పర్యవేక్షణలో ఉన్న ఏకైక శివాలయం. స్వయంభుగా వెలసిన శ్రీ కపిలేశ్వరస్వామి త్రివర్ణ రూపంలో ఉంటారు. పానవట్టం భాగంలో తెలుపు.. మధ్యలో పసుపు పచ్చ.. పైన తేనె రంగులో మూలమూర్తి ప్రకాశిస్తుంటారు. శివలింగం మధ్య భాగంలో కళ్లు రూపం.. పైభాగంలో ఆవు గిటక గుర్తు ఇప్పటికీ ఉంది. అగస్త్య మహాముని కపిలతీర్థం క్షేత్రాన్ని సందర్శించారు.  రాజేంద్ర చోళుడి కాలంలో ఆలయ పునరుద్ధరణ జరిగింది. ఏటా శివయ్యకు బ్రహ్మోత్సవాలు నిర్వహించి పుష్కరిణిలో త్రిశూల స్నాన ఘట్టం  శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి, శ్రీకోదండరామస్వామి ఉత్సవాల  అనంతరం చక్రస్నాన ఘట్టం ఇక్కడి పుష్కరిణిలో పూర్తి చేస్తారు. శ్రీవారి పాదాలను తాకుతూ తిరుమల గిరుల్లో ప్రవహించి చివరిగా ఈ పుష్కరిణికి నీటిధార చేరుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు