Published : 09 Mar 2023 00:36 IST

మందార మకరంద మాధుర్యమున దేల్చు..

‘కవిత్వమనే చిక్కని ఆవుపాలలో భక్తి అనే చక్కని పంచదార కలిపి, మధురాతి మధురమైన పాకం చేసి మహాభాగవత రసాయనాన్ని మాకు అందించావు. సుమధుర సుగంధాలు గుబాళిస్తూ మల్లెలు, సన్నజాజులు, కలబోసి మాలలు కట్టినట్లున్న అలాంటి పద్యాలు రాయటం ఎక్కడ నేర్చావయ్యా?’ అంటూ మాధుర్యంలో తేల్చే పోతనామాత్యుల శైలికి ముగ్ధులైన కవులు, పండితులు శ్లాఘించారు.

నిండుపున్నమి రేయి.. పండువెన్నెల జలపాతమై కురుస్తోంది.. ఆకాశాన్నంటే అలలతో గోదారిగంగ పరవళ్లు తొక్కుతోంది. అప్పుడే అక్కడికొచ్చాడు పరమశివభక్తుడు, సహజకవి బమ్మెర పోతనామాత్యులు. నింగీనేలా నీరూగాలీ ఆ అనుకోని అతిథి ఆగమనానికి ఆహ్వానం పలుకుతున్నట్లు కొత్త అందాలను సంతరించుకున్నాయి. ఇంతలో అతడు నదీస్నానం చేసి తీరానికి చేరాడు. ఎత్తయిన ఇసుక తిన్నె మీద కూర్చుని భక్తిగా అర్ధనారీశ్వరుణ్ణి ధ్యానిస్తున్నాడు. ఇంతలో అమృతం లాంటి దరహాసంతో జగన్మోహనాకారుడు జానకిరాముడు ప్రత్యక్షమయ్యాడు. విస్తుపోగా ‘నేను రామభద్రుణ్ణి. నాకోసం భాగవతాన్ని తేటతెలుగులో రచించు. నీ సంసార బంధాలు తొలగిపోతాయి’ అని ఆనతిచ్చి అంతర్ధానమయ్యాడు. శ్రీరాముడి సాక్షాత్కారంతో పోతన స్థాణువైపోయాడు. ‘అల్పుడను నేనెక్కడ? అమృతతుల్య మహాభాగవతమెక్కడ?’ అని ఆశ్చర్య పోయి అంతలోనే ‘ఏమి నా భాగ్యం?’ అంటూ మురిసిపోయాడు. ఆశువుగా...

పలికెడిది భాగవతమట
పలికించెడి వాడు రామభద్రుండట నే
పలికిన భవహర మగునట
పలికెద వేరొండు గాథ పలుకగ నేలా

అంటూ పద్యం చిలికింది. ‘పలికేది పరమపవిత్ర భాగవతమా? పలికించిన ప్రభువు కరుణా సముద్రుడైన రామభద్రుడా? పలికితే భవబంధాలు పరిహారమవుతాయా? అటువంటప్పుడు మరేదో ఎందుకు? భాగవతమే పలుకుతాను’ అని పరవశించిపోయాడు. ఇక భాగవతాన్ని తెనిగించే క్రమంలో పోతనకు ఎన్నో దివ్యదర్శనాలయ్యాయి. పోతన భక్తికి మెచ్చి శ్రీరాముడు ఇచ్చిన ఆనతి ఆంధ్ర భాగవతం. ఆబాలగోపాలాన్ని భక్తిసాగరంలో జలకమాడించి పునీతులను చేసిన కవీశ్వరుడు బమ్మెర పోతన.

ఆధ్యాత్మిక కల్పవృక్షం

రామాయణం కుటుంబవ్యవస్థకు దిక్సూచి అయితే, భారతం రాజకీయ చతురతకు దర్పణం. ఇక భాగవతం ప్రేమభక్తి సామ్రాజ్యానికి మహాద్వారం. వేదాంత, ఆధ్యాత్మిక రసరమ్య గ్రంథరాజం. ధర్మార్థకామమోక్షాలను ప్రతిపాదించి పురాణాల్లో ఉత్తమంగా నిలిచింది.

‘సర్వేషాం చ పురాణానాం శ్రేష్ఠం భాగవతం స్మృతమ్‌’ అంటోంది భవిష్యపురాణం. భాగవతం 12 స్కందాల కల్పవృక్షం. కృష్ణభక్తి రసాలవాలం. ఉద్ధవుని ప్రేమపూర్వక అభ్యర్థన మేరకు తన దివ్యతేజస్సును నిక్షేపించాడు శ్రీకృష్ణుడు. అందుకే భాగవతం భగవానుని ప్రత్యక్ష వాఙ్మయమూర్తి. మన హృదయక్షేత్రాల్లో భక్తిప్రసూనాలను పరిమళింపచేసే దివ్య గ్రంథం. భాగవత రచనకు ముందు పోతన మహాశివుణ్ణి ధ్యానించాడు. కానీ ఆశ్చర్యంగా శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చాడు. ఆయన ఆనతో కృష్ణ లీలల్ని కీర్తించాడు. ఇలాంటి వైవిధ్యం, మాధుర్యం మరెక్కడా వినం, కనం. శైవం, వైష్ణవం ఒకటేనని నిరూపించాడు. భక్తితోబాటు మానవీయతనూ అక్షరబద్ధం చేసి భాగవతాన్ని సుసంపన్నం చేశారు.

నీ పాదకమల సేవయు
నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాం
తాపార భూతదయయును
తాపస మందార, నాకు దయసేయగఁదే

అని ప్రార్థించాడు. పరమాత్మ పాదసేవ, పరమభక్తుల సాంగత్యం, సకల జీవులపై దయను ప్రసాదించమని వేడుకున్నాడు.

పరభాషీయులకూ ప్రియసారస్వతం

తెలుగులో భాగవతం వచ్చిన తర్వాతే ఇతర భాషల్లో వచ్చింది. ఛత్రపతి శివాజీ గురువు సమర్థరామదాసు తన ‘దాసబోధ’ గ్రంథంలో పోతనను ప్రశంసించారు. తమిళకవి సుబ్రహ్మణ్య భారతి బమ్మెరవారిని కొనియాడారు. అలాగే వల్లభాచార్యులు, చైతన్యమహాప్రభు, అన్నమయ్య, రామదాసు, త్యాగరాజులపై పోతన భాగవతం ప్రభావం ఉన్నట్లు ఆధారాలున్నాయి. త్యాగయ్య పోతన భాగవతాన్ని పారాయణ చేసేవారట. నారాయణతీర్థులు పోతన భాగవతంలోని కొంత భాగాన్ని తరంగాలుగా రచించారు.

దాశరథి రంగాచార్య పనిచేసిన కార్యాలయంలో వాసుదేవ మొదలియార్‌ అనే తమిళ ఉన్నతాధికారి ఉండేవారు. ఆయనోసారి ‘పోతన భాగవతం చదువుకునే అదృష్టం మా పరభాషీయులకు లేదు. మీరు ధన్యులు’ అని ఉద్విగ్నతకు లోనయ్యారట.  ఆ ఆరాధనతోనే తన చివరి రోజుల్లో దాశరథి వారిచే పోతన పద్యాలను ఆలపించమని కోరడమే గాక వాటి వివరణను చెప్పించుకునేవారట! అలాగే స్వాతంత్య్ర సమరయోధులు రావి నారాయణరెడ్డి పోతన భాగవతం తనకు ప్రియమైందని చెప్పుకో వడమే కాదు, దాన్ని కంఠస్థం చేశారట. ఆఖరి రోజుల్లో వామన అవతార ఘట్టంలోని ‘కారే రాజులు? రాజ్యముల్‌ కలుగవే? గర్వోన్నతిం పొందరే? వారేరీ? సిరి మూటగట్టుకొని పోవం జాలిరే..’ అన్న పద్యాన్ని పలవరించేవారట!

మహర్షి మెచ్చిన మధురభక్తి కావ్యం

నిత్యం ఆత్మానందంలో ఓలలాడే రమణ మహర్షి కూడా పోతన భాగవత పద్యాలు ఆలకించి పరవశులయ్యేవారు. ఒకసారి ఆశ్రమంలో ఓ మహా పండితుడు పోతన భాగవతాన్ని పఠిస్తున్నారు. దశమస్కందంలో శ్రీకృష్ణుడు రేపల్లెను విడిచి అక్రూరునితో మధురకు వెళ్లే ఘట్టంలో గోపికల వ్యాకులతను పద్యాలుగా వినిపిస్తుంటే రమణులు చలించి ‘తత్త్వం ఎంతైనా చెప్పుకోవచ్చు. కానీ భక్తి, కరుణల ఆవేశం సహించటం సాధ్యం కాదు’ అంటూ ఉద్విగ్నతకు లోనయ్యారు.

మూల గ్రంథాన్ని మించి..

కవిత్వం పోతనకు కైవల్యసాధనం. మోక్షాన్ని ప్రసాదించే మధురకావ్యాన్ని అందించినా, అహంకరించక పండితుల నుంచి విన్నదీ, చూసి నేర్చుకున్నదీ రాస్తున్నానని విన్నవించుకున్నాడు. అందుకే అది తెలుగుతల్లికి అందాల ఆభరణమైంది. తెలుగు ప్రజలకు ఆరాధ్యగ్రంథమైంది. ఆ పద్యాలు మన నాలుకలపై నిలిచిపోయాయి. భక్తివేదాంత తత్వప్రచారానికి భవ్యకవితావేశం అందించిన విద్వాంసుడు, మహాకవి బమ్మెరపోతనే. వ్యాసుడి సంస్కృత భాగవతాన్ని మరింత శోభాయమానం చేశాడు. అందుకే మూల గ్రంథం కంటే పోతన రచన అలరిస్తోంది. 

బి.సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు