ఏది ఎక్కువ పుణ్యమంటే...

ఒకరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుడి ఆశ్రమానికి వచ్చాడు. చాలాసేపు ఎన్నో విషయాలు మాట్లాడు కున్నాక అతడు తిరిగి వెళ్లేటప్పుడు కలకాలం గుర్తుండే కానుక సమర్పించాలని తన వెయ్యేళ్ల తపశ్శక్తిని ధారపోశాడు విశ్వామిత్రుడు.

Published : 16 Feb 2023 00:21 IST

కరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుడి ఆశ్రమానికి వచ్చాడు. చాలాసేపు ఎన్నో విషయాలు మాట్లాడు కున్నాక అతడు తిరిగి వెళ్లేటప్పుడు కలకాలం గుర్తుండే కానుక సమర్పించాలని తన వెయ్యేళ్ల తపశ్శక్తిని ధారపోశాడు విశ్వామిత్రుడు. కొన్నాళ్లకు తన ఆశ్రమానికి విశ్వామిత్రుడు రాగా సకల ఉపచారాలూ చేశాడు వశిష్ఠుడు. పుణ్యానికి సంబంధించిన విషయాలు మాత్రం కొద్దిసేపే మాట్లాడుకున్నారు. వీడ్కోలు సమయంలో అందాకా తాము మాట్లాడుకున్న మంచి విషయాల పుణ్య ఫలాన్ని బహుమానంగా ఇస్తున్నట్టు చెప్పాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుడు చిన్నబోయాడు. తాను కానుకగా ఇచ్చిన వెయ్యేళ్ల తపఃఫలానికి బదులు కొద్దిసేపు మాట్లాడుకున్న మంచి మాటల పుణ్యఫలం సాటి రాదుగా అనుకుని, ఆ మాటే అడిగాడు విశ్వామిత్రుడు. వాదన పెరిగి, ఏది గొప్పదో తెలుసు కోవడానికి ఇద్దరూ బ్రహ్మవద్దకు వెళ్లారు. ఆయన విష్ణువు వద్దకు వెళ్లమన్నాడు. విష్ణువు.. పరమశివుడే సరైన సమాధానం చెప్పగలడన్నాడు. శివుడేమో పాతాళంలో ఉన్న ఆదిశేషుడు తప్ప మరెవరూ చెప్పలేరని అక్కడికి పంపాడు. సందేహాన్ని తీర్చాలంటే కొంత వ్యవధి కావాలని, అప్పటివరకు తాను మోస్తున్న భూలోకాన్ని ఇద్దరిలో ఎవరో ఒకరు మోయా లంటూ షరతు పెట్టాడు ఆదిశేషుడు. తలపై పెట్టుకుంటే బరువు కనుక గగనంలో నిలబెట్టగలిగితే మంచిదని సలహా ఇచ్చాడు. వెంటనే విశ్వామిత్రుడు ‘నా వేయి సంవత్సరాల తపఃఫలాన్ని ధారపోస్తాను. ఆ తపశ్శక్తితో ఈ భూమి ఆకాశంలో నిలబడు గాక!’ అన్నాడు. కానీ భూమిలో చలనం లేదు. అప్పుడు వశిష్ఠుడు ‘ఒక పూట సమయంలో మేం చర్చించిన ఆధ్యాత్మిక విషయాల వలన కలిగిన పుణ్యఫలం ధారపోస్తున్నాను. ఆ శక్తితో భూమి ఆకాశంలో నిలబడాలని కోరుకుంటున్నాను’ అన్నాడు.
అంతే.. ఆదిశేషుని తలపై ఉన్న భూమి ఆకాశంలో తేలుతూ నిలబడింది. కాసేపయ్యాక ఆదిశేషుడు తిరిగి భూమిని తన తలపై పెట్టుకుని ‘మీరిద్దరూ ఇక వెళ్లవచ్చు’ అన్నాడు. వెయ్యేళ్ల తపశ్శక్తి కంటే కొద్దిసేపటి మంచి మాటల పుణ్యఫలమే గొప్పదని గ్రహించారు. మంచి మాటల ప్రభావం గొప్పదంటూ రామానుజులు చెప్పిన కథ ఇది. 

కె.వి.యస్‌.యస్‌.శారద


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు