Published : 29 Dec 2022 00:23 IST

అవివాహితులకు పెళ్లవుతుంది...

గుంటూరు జిల్లా చేబ్రోలులో ఉన్న భీమేశ్వర స్వామి ఆలయం చోళుల కాలం నాటిది. ఈ ఆలయం రెండు ప్రాకారాలుగా ఉంది. రెండో ప్రాకారంలో స్వామి వారు కొలువయ్యారు. ఇది ద్రాక్షారామం భీమేశ్వరాలయం, సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయాలను పోలి ఉంది. ఈ ఆలయానికి సరిగ్గా ఎదురుగా ఆదికేశవ స్వామి దేవస్థానం ఉంది. దీన్ని సూర్యవంశానికి చెందిన కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి కాలంలో నిర్మించినట్లు శాసనాలున్నాయి. చిదానంద చిద్విలాస స్వరూపుడైన ఆదికేశవ స్వామి ప్రాంగ్ముఖంగా అర్చావతారమూర్తిగా దర్శనమిస్తాడు. స్వామి పద్మ, శంఖ చక్ర, గదాధారిగా సహస్రకోటి కిరణాలు వెెదజల్లే చంద్ర ప్రభతో ప్రకాశిస్తుంటాడు. స్వామికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, దక్షిణాభిముఖంగా ప్రసన్నాంజనేయస్వామి కొలువై ఉన్నారు. స్వామి దక్షిణహస్తంతో శంఖం, వామహస్తంతో చక్రం ధరించడం ఇక్కడి ప్రత్యేకత. ముఖమండపానికి ఇరు పక్కలా గజాన్ని అధిరోహించిన ‘యాలి’ శిల్పాలు కాకతీయ శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. స్వామివారి విమాన గోపురం త్రితలంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే అవివాహితులకు పెళ్లవుతుందని, సంతానార్థులకు పిల్లలు కలుగుతారని భక్తులు విశ్వసిస్తారు. విజయవాడ నుంచి బాపట్ల, చీరాల బస్సు ఎక్కితే నేరుగా చేబ్రోలులోనే దిగవచ్చు. ఇక్కడ పురాతన బ్రహ్మదేవాలయాన్ని కూడా దర్శించుకోవచ్చు.

బి.విశాల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని