Lord Buddha: పవిత్రతే పరమాత్మ

ఒకరోజు అయిదుగురు పండితులు గౌతమ బుద్ధుడి వద్దకు వచ్చి తమ వివాదాన్ని పరిష్కరించమని అడిగారు.

Published : 30 Mar 2023 00:17 IST

కరోజు అయిదుగురు పండితులు గౌతమ బుద్ధుడి వద్దకు వచ్చి తమ వివాదాన్ని పరిష్కరించమని అడిగారు. వాళ్లలో ఒకరు- దేవుడు ఇలాంటివాడు, అలాంటివాడు, అతణ్ణి పొందే మార్గాల గురించి తన గ్రంథంలో స్పష్టంగా ఉంది.. అంటూ సిద్ధాంతాలు ప్రతిపాదించాడు. మరొకరు లేచి ‘అయ్యా! అది శుద్ధ తప్పు. దేవుణ్ణి సాక్షాత్కరించుకోవాలంటే నా గ్రంథం నిర్దేశించిన మార్గంలో పయనించడమే ఉత్తమం’ అని వాదించాడు. ఇలా ఎవరికి వారే తమకు తెలిసిన, తాము నమ్మిన రీతిలో, వాదనా పటిమతో భగవంతుణ్ణి నిర్వచిస్తున్నారు. అవన్నీ సావధానంగా ఆలకించిన తథాగతుడు ‘దేవుడు స్వార్థపరుడు, అపవిత్రుడు, సంకుచిత స్వభావుడు. అతడు ఎప్పుడైనా ఆగ్రహిస్తాడు, ఎవరినైనా హింసిస్తాడు- అని మీ గ్రంథాలు చెబుతున్నాయా?’ అని ప్రశ్నించాడు. అందరూ ఒక్కసారిగా ‘లేదు స్వామీ! భగవంతుడు పరమపవిత్రుడు, దయామయుడు, మంగళస్వరూపుడు- అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి’ అన్నారు. సిద్ధార్థుడు ప్రేమ దృక్కులతో, గంభీర స్వరంతో వారివైపు చూస్తూ ‘అయితే మీరీ వాదాలూ, వివాదాల జోలికి వెళ్లకుండా స్వచ్ఛమైన మనసుతో సాధుశీలురుగా ఉంటే సరిపోతుంది కదా! అప్పుడే భగవంతుడి లీలలను మరింత బాగా అర్థం చేసుకోగలుగుతారు. అలా కాకుండా ఎంత వాదించినా ప్రయోజనం లేదు’ అన్నాడు.

ప్రహ్లాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని