తొలకరే కొత్త వత్సరం

సాంకేతికత లేని రోజుల్లోనే ఆకాశంలోకి దృష్టి సారించారు మహర్షులు. ఖగోళాన్ని గణించారు. గ్రహాల్నీ, నక్షత్రాల్నీ దర్శించారు. వాటి గమనాలను అంచనా వేశారు.

Published : 29 Dec 2022 00:28 IST

సాంకేతికత లేని రోజుల్లోనే ఆకాశంలోకి దృష్టి సారించారు మహర్షులు. ఖగోళాన్ని గణించారు. గ్రహాల్నీ, నక్షత్రాల్నీ దర్శించారు. వాటి గమనాలను అంచనా వేశారు. ఇంతకూ మన సంవత్సరాది ఎప్పుడు? ఎలా వేడుక చేసుకునేవారు?!

జనవరి ఒకటిని కొత్త సంవత్సరంగా సంబరం చేసుకుంటున్నాం. కానీ మన అసలైన సంవత్సరాది అది కాదు. కొందరు ఉగాదిని కొత్త వత్సరంగా భావిస్తున్నారు. నిజానికి ఉగాది లేదా యుగాది అంటే బ్రహ్మ దేవుడు యుగ విభజన చేసి, సృష్టి క్రమాన్ని ప్రారంభించిన రోజు. కనుక యుగాది వేరు, నూతన సంవత్సరం వేరు. వేదకాలంలో కొత్త సంవత్సరాన్ని జరుపుకునే తీరును రుగ్వేదం, శతపద బ్రాహ్మణం, తైత్తరీయోపనిషత్తు వర్ణించాయి. ఏ ప్రాణీ ఆకలితో ఉండకూడదనే సంకల్పం, కార్యాచరణ వారివి. పర్యావరణ పరిరక్షణ, మూగజీవాలను బంధుగణంగా భావించడం లాంటి తంతులుండేవి.

స సర్గేణ శవసా తక్తో అత్యైర్‌ అప ఇంద్రో దక్షిణాతస్‌ తురసాత్‌
ఇతహ్‌ సృజన అనపవృద్‌ అర్థమ్‌ దివి దివే వివిషుర్‌ అప్రమృష్యమ్‌

వర్షాన్ని సంస్కృతంలో వర్ష అంటారు. తొలకరి జల్లు పడిన ఆ తేదీ నుంచి కొత్త సంవత్సరాన్ని లెక్కించేవారు. అంటే తొలకరే సంవత్సర ఆరంభం. అదే దక్షిణాయనంలో తొలి మృగశిర నక్షత్రం. అందుకే వేదాలు సంవత్సరాన్ని వర్ష అన్నాయి. మృగశిర మన జీవన వ్యాపార కర్మలకు సంబంధించింది. వ్యవసాయం మన జీవనాధారం కనుక వర్షాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆ గణాంకాలతో పంచాంగం ఏర్పడింది. ప్రజలు తొలకరితో కొత్త సంవత్సరం ప్రారంభించారని రుగ్వేదంలోనూ లిఖితమైంది. అధిక శూన్య మాసాలు వచ్చినప్పుడు తేదీ మారుతుంది. ఈసారి.. అంటే 2023లో కొత్త సంవత్సరం జులై 15 అర్ధరాత్రి మొదలవుతుంది.

సనా సో అస్‌ సిద్‌ భువనా భవిత్వా మద్భిః శరద్భిర్‌ దురో వరంత వః ఆయతంత కారతో అన్యద్‌-అన్యద్‌ ఇద్‌ యా చకార వాయునా బ్రహ్ణస్‌ పతిః
తొలకరి చిరుజల్లులనే నూతనవత్సర తలుపులు తెరవడంతో సూర్యుడి దక్షిణాయన ప్రయాణం మొదలవుతుంది- అని ఈ రుక్కుకు అర్థం.


కప్పల సందడి

సంవత్సరం సస్యాయాన బ్రాహ్మణ వ్రతకరిణః
వాకం ప్రజన్య జిన్వితం ప్ర మండూక అవధిషుహు

తొలకరి జల్లులు మీద పడగానే బ్రాహ్మణులు వేదాలను పఠించినట్లు కప్పలు ధ్వనిచేస్తాయని భావం. తొలకరిలో కప్పలకు పెళ్లిళ్లు చేసే సంప్రదాయం అలా ఏర్పడిందే. ఈ ఆచారం ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో కొనసాగుతోంది.
శ్రీరాముడికి 15 తరాల ముందువాడైన కల్మాషపాదుడనే శాపగ్రస్తుడైన రాజును, వశిష్ట మహర్షి నూరుగురు కొడుకులను కొత్తవత్సరాన (తొలకరి) చంపినట్లుగా రుగ్వేదం పేర్కొంది. అంటే త్రేతాయుగం నుంచి తొలకరే కొత్త సంవత్సరం అన్నమాట. ఇంద్రుడు కురిపించే తొలకరి వానలకు భరత శత్రుఘ్నులు రెండు సింహాల్లా చెరో పక్కనా నిలబడి కొత్త సంవత్సరానికి స్వాగత తోరణాల్లా దర్పంగా, దర్జాగా నిలిచారని వాల్మీకి మహర్షి వర్ణించడం మరో నిదర్శనం.

ఉత్థితౌ తౌ నర వ్యాఘ్రౌ ప్రకాశతే యశస్వి నౌ
వర్ష ఆతప పరిక్లిన్నౌ ఇతగ్‌ ఇంద్ర ధ్వజావ్‌ ఇవ


ఇదీ నాటి ఆచారం

కొత్త సంవత్సరం రోజున రెండు వెదురు స్తంభాలను ఊరి మధ్యలో పాతి వాటి పైన ఇంద్రుణ్ణి, వరుణుణ్ణి.. అలాగే శునకం, నక్క, కప్పల పెళ్లిని కళ్లకు కట్టేలా చిత్రాలను అలంకరించేవారు. జూన్‌, జులై నెలల్లో ఒక్కోసారి ఎండా వానా రెండూ కలసికట్టుగా వస్తాయి. అలాంటప్పుడు ‘ఎండా వానా.. కుక్కా నక్కల పెళ్లి..’ అంటూ పిల్లలు కేరింతలు కొట్టేవారు. దీనికీ కొత్త సంవత్సరపు రాకకూ సంబంధం ఉంది.

రుగ్వేదం 1-161-13లో నిద్రిస్తున్న మేఘాలను లేపిందెవరని ఇంద్రుడు అడిగాడు. అది సంవత్సరంలో చివరి రోజు కనుక ఓ శునకం మేఘాలను లేపిందంటూ బదులిచ్చాడు సూర్యుడు. ఇక్కడ కుక్క జంతువు కాదు. మిథునరాశిలో మృగశిర. ఈ నక్షత్రం కుక్క ఆకారంలో ఉంటుంది. మర్నాటి తొలకరికి స్వాగతం పలకమంటూ మేఘాలకి గుర్తుచేస్తోందట. ఖగోళ, జ్యోతిష శాస్త్రాల పరంగానూ ఈ మంత్రం వర్తిస్తుంది. సూర్యుడు మృగశిరలో 13 రోజులు సంచారం చేసి ఆరుద్ర నక్షత్రంలోకి వస్తాడు. అప్పుడు భూమి వర్షంతో నాని, నాట్లు వేయడానికి అనువుగా ఉండి, ఆహారధాన్యాలకూ, ఔషధ వృక్షాలకూ నెలవుగా ఉంటుంది. సంవత్సరం మొదలవగానే హలాన్ని పట్టి పొలాలకు వెళ్లడంలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో ఉండరాదన్నది సద్భావన. పనే దైవం, సోమరితనం కూడదు అన్నది సదాశయం.

డాక్టర్‌ జయదేవ్‌ చల్లా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని