సివిల్‌ ఇంజినీరింగ్‌ చేశాక?

సివిల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశాక మీ ముందు ప్రధానంగా రెండు మార్గాలు ఉంటాయి. మొదటిది ఉద్యోగం, రెండోది ఉన్నత విద్య.

Published : 09 Jul 2024 00:48 IST

బీటెక్‌ (సివిల్‌) నాలుగో ఏడాది చదువుతున్నాను. ఈ కోర్సు పూర్తయిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది?

ఎస్‌.చిన్నారావు

సివిల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశాక మీ ముందు ప్రధానంగా రెండు మార్గాలు ఉంటాయి. మొదటిది ఉద్యోగం, రెండోది ఉన్నత విద్య. ప్రభుత్వ ఉద్యోగాల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంబంధమైనవీ, ప్రభుత్వ రంగ సంస్థల్లోనివీ ఉంటాయి. రోడ్లు భవనాలు, నీటిపారుదల, పంచాయతీరాజ్, రూరల్‌ వాటర్‌ వర్క్స్, మునిసిపల్‌ కార్పొరేషన్‌ వాటర్‌ వర్క్స్, మైన్స్, విద్యుత్తు శాఖల్లో అవకాశాలు లభిస్తాయి. యూపీఎస్‌సీ నిర్వహించే ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్షలో మెరుగైన ప్రతిభ కనపరిస్తే సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్, సెంట్రల్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్, మిలటరీ ఇంజినీరింగ్‌ సర్వీసెస్, బోర్డర్‌ రోడ్స్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్, ఇండియన్‌ రైల్వే సర్వీసెస్, సెంట్రల్‌ వాటర్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌లో కొలువులు దక్కించుకోవచ్చు. ఇవి కాకుండా భారత సైన్యంలో కూడా సివిల్‌ ఇంజినీర్లకు ఉద్యోగావకాశాలు ఉంటాయి. ప్రైవేటు ఉద్యోగాల విషయానికొస్తే- డిజైన్‌ ఇంజినీర్, స్ట్రక్చరల్‌ ఇంజినీర్, సైట్‌ ఇంజినీర్, ఫెసిలిటీస్‌ ఇంజినీర్, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ లాంటివాటి గురించి ఆలోచించవచ్చు. 

బోధన రంగంపై ఆసక్తి ఉంటే- బీటెక్‌ విద్యార్హతతో పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ ఉద్యోగం చేయవచ్చు. ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటే గేట్‌ రాసి, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్‌ చదవొచ్చు. ఎంటెక్‌ చదివాక ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అధ్యాపకులుగా స్థిరపడే అవకాశం ఉంది. మనదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా సివిల్‌ ఇంజినీరింగ్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేయొచ్చు. మీకు పరిశోధనపై ఆసక్తి ఉంటే సివిల్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేయొచ్చు. మేనేజ్‌మెంట్‌ రంగంలోకి ప్రవేశించాలనుకొంటే.. క్యాట్‌ రాసి ఐఐఎం లాంటి విద్యాసంస్థల్లో ఎంబీఏలో చేరవచ్చు. చివరిగా- కొంత అనుభవం గడిచాక మీరు ఒక కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ప్రారంభించి కొంతమందికి ఉపాధి కల్పించే అవకాశమూ ఉంటుంది. 

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌   


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని