Agri Business Management: అటు వృత్తి... ఇటు సంతృప్తి.. అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు!

మీకు వ్యవసాయమంటే ఇష్టమా? చిన్న, సన్నకారు రైతులకు సాయపడేలా.. అదే సమయంలో ఉన్నతస్థాయి ఉద్యోగంలో స్థిరపడితే బాగుంటుంది అనుకుంటున్నారా? రైతులకూ,  వినియోగదారులకూ మేలు చేసేలా, మెరుగైన పంపిణీ వ్యవస్థకు మీవంతు కృషి చేయాలని భావిస్తున్నారా? 

Updated : 19 Jun 2024 03:50 IST

మీకు వ్యవసాయమంటే ఇష్టమా? చిన్న, సన్నకారు రైతులకు సాయపడేలా.. అదే సమయంలో ఉన్నతస్థాయి ఉద్యోగంలో స్థిరపడితే బాగుంటుంది అనుకుంటున్నారా? రైతులకూ,  వినియోగదారులకూ మేలు చేసేలా, మెరుగైన పంపిణీ వ్యవస్థకు మీవంతు కృషి చేయాలని భావిస్తున్నారా? ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా దేశ రైతాంగానికీ, వ్యవసాయానికీ మేలు చేయాలి అనుకుంటున్నారా? అయితే అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు మీకు సరైన ఎంపిక!

వ్యవసాయ సంబంధిత అంశాల మేనేజ్‌మెంట్‌ కోర్సులు.. సాధారణ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోనే ఒక శాఖగా ఉన్నాయి. ఆహార ప్రాసెసింగ్, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, వేర్‌హౌసింగ్, రిటైలింగ్‌ వంటివన్నీ ఇందులో భాగం. ధరలు నిలకడగా ఉండేందుకు, రైతుల సరకకు డిమాండ్‌ తేడాలను తగ్గించడంలో ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. ఫామ్‌ ప్లానింగ్, వెదర్‌ ఫోర్‌కాస్టింగ్, ల్యాండ్‌ రిసెర్చ్, సాయిల్‌ మేనేజ్‌మెంట్, సీడ్‌ ప్రొడక్షన్, మెషినరీ, ప్లాంట్‌ ప్రొటెక్షన్‌.. వంటివన్నీ విద్యార్థులు ఇందులో నేర్చుకుంటారు.  

  • ఎంబీఏ చదవాలనుకునే విద్యార్థుల్లో చాలామందికి ఇది ప్రథమ ఎంపిక కాకపోయినా.. దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా చాలా ముఖ్యమైన, డిమాండ్‌ ఉన్న రంగం ఇది. భారత ఆర్థిక వ్యవస్థలో దాదాపు 17.5 జీడీపీ వ్యవసాయం వల్లే సాధ్యమవుతోంది. వ్యవసాయ రంగం సాధారణ జీవనాధారం స్థాయి నుంచి ఉన్నతస్థాయి అభివృద్ధి అవకాశంగా రూపుదిద్దుకుంది. ఈ పరిశ్రమ అభివృద్ధి చెందుతూ ఉండటం వల్ల.. నిపుణులైన యువత అవసరం దీనికి ఉంది. దీంతో అగ్రిబిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కెరియర్‌ ప్రస్తుతం ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది.
  • అగ్రి బిజినెస్‌ను అగ్రికల్చరల్‌ ప్రొడక్షన్, ప్రాసెసింగ్, డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్‌ల కలయికగా చెప్పవచ్చు. ఇది వ్యవసాయాన్నీ,  వ్యాపారాన్నీ కలగలుపుతుంది. ఫార్మ్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఆగ్రో కెమికల్స్, మెషినరీ, రిటైలింగ్‌ వంటి అంశాలూ ఇందులో భాగం. స్థిరమైన ఆహార సరఫరా, అగ్రికల్చర్‌ ప్రొడక్ట్‌ల పంపిణీలో ఈ విషయ నిపుణులు ముఖ్యపాత్ర పోషిస్తారు. ఎప్పటికప్పుడు పెరుగుతున్న విదేశీ డిమాండ్‌ను అందిపుచ్చుకుంటే వ్యవసాయానికి మంచి బిజినెస్‌ అవకాశాలు అందించవచ్చు.

కోర్సులు

భారత్‌లో కొన్ని ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లు ఈ తరహా మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందిస్తున్నాయి. అగ్రికల్చర్‌ సెక్టార్‌లోని ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్‌పై ఈ కోర్సులు దృష్టి సారిస్తాయి. ముఖ్యమైన వ్యాపార విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రిస్క్‌ను తగ్గించడం వీటి ఉద్దేశం. ఇందులో డిగ్రీ స్థాయిలో బీకాం, బీబీఏ, బీఎస్సీ (ఆనర్స్‌), పీజీ స్థాయిలో ఎంకాం, ఎంబీఏ, ఎంఫిల్, ఆపైన పీహెచ్‌డీ, డిప్లొమా వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవేకాక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు వర్శిటీలు, కళాశాలల్లో దీనికి సంబంధించిన రెండు, మూడేళ్ల కోర్సులు వివిధ ఫార్మాట్లలో లభిస్తున్నాయి. బీబీఏ, ఎంబీఏ అగ్రిబిజినెస్‌ మేనేజ్‌మెంట్, బీటెక్‌ - బీఈ - ఎంటెక్‌ అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, ఎమ్మెస్సీ అగ్రికల్చర్, ఎంబీఏ అగ్రోనమీ వంటివి ప్రస్తుతం విద్యార్థులు అధికంగా ఎంచుకుంటున్న కోర్సులు.

అవకాశాలు

ప్రస్తుతం అగ్రికల్చర్‌ ఒక బిజినెస్‌గా అవతరించింది. అందుకే ప్రొఫెషనల్‌ మేనేజ్‌మెంట్‌ అవసరం అవుతోంది. భారత్‌లో కమర్షియల్‌ అగ్రికల్చర్‌ ఎన్నో అవకాశాలకు వేదికగా మారింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల వినూత్న ఆలోచనలతో గత కొన్ని దశాబ్దాలుగా ఈ రంగం ఊపందుకుంటోంది. పబ్లిక్, ప్రైవేట్, కోఆపరేటివ్‌ వ్యవస్థల్లో ఈ రంగ నిపుణుల అవసరం ఉంది. వ్యవసాయంతోపాటుగా రియల్‌ఎస్టేట్, రిటైల్‌ మార్కెటింగ్, డెయిరీ, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఫుడ్‌ ప్రొడక్షన్‌.. వంటి అనుబంధ రంగాల్లోనూ వీరు రాణించవచ్చు.

ఉద్యోగాలు

ఈ కోర్సులు పూర్తి చేసిన అనంతరం అగ్రికల్చర్‌ మేనేజర్, ఫామ్‌ మేనేజర్, అగ్రికల్చర్‌ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్, టెక్నీషియన్, క్వాలిటీ ఎస్యూరెన్స్‌ మేనేజర్, మార్కెట్‌ అనలిస్ట్‌ వంటి పలు హోదాల్లోకి ప్రవేశించవచ్చు. ఇంకా లాజిస్టిక్స్‌ మేనేజర్, మార్కెటింగ్‌ మేనేజర్, హెచ్‌ఆర్‌ మేనేజర్, అకౌంటింగ్‌ మేనేజర్, అగ్రికల్చర్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ వంటి పోస్టుల్లోకి వెళ్లవచ్చు. 
‘పరిశ్రమ అభివృద్ధి పథంలో ఉండటం వల్ల నిపుణులైన యువత అవసరం దీనికి ఉంది. దీంతో అగ్రిబిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కెరియర్‌ ఎక్కువమందిని ఆకర్షిస్తోంది,

  • ఐటీసీ, హిందుస్థాన్‌ యూనీలీవర్‌ లిమిటెడ్, నెస్లే, జేకే అగ్రి జెనెటిక్స్‌ లిమిటెడ్, హెచ్‌పీసీ బయోసైన్సెస్‌ లిమిటెడ్, నాథ్‌ బయో-జీన్స్‌ (ఇండియా) లిమిటెడ్‌.. వంటి అనేక సంస్థలు ఈ చదువులు పూర్తి చేసిన అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ అనేక అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. ఉదాహరణకు నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌), ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ), ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌ వంటి సంస్థల్లో ఈ నిపుణుల అవసరం ఉంటుంది.

    యూజీ - పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హతలు..

అగ్రికల్చర్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందగోరే విద్యార్థులు సైన్స్‌ సబ్జెక్టుల్లో ఇంటర్‌ చదివి ఉండాలి. ప్లస్‌టూలో కనీసం 50శాతం మార్కులు సాధించి ఉండాలి. ప్రతి యూనివర్సిటీ తమకంటూ కొన్ని అర్హతలను ఏర్పాటు చేసుకోవడంతోపాటు ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తుంది. వాటిలో మంచి ర్యాంకు సాధించడం ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని