Indian History: సైన్య సహకార విధానంతో.. రాజకీయ శక్తిగా ఆంగ్లేయులు!

బ్రిటిష్‌ వారు యుద్ధాల ద్వారా మాత్రమే కాకుండా పలు సంస్కరణల ద్వారా కూడా సామ్రాజ్య విస్తరణను చేపట్టారు. దీనిలో భాగంగా పలువురు బ్రిటిష్‌ అధికారులు వివిధ విధానాలను అవలంబించారు. అందులో సైన్య సహకార విధానం ఒకటి.

Updated : 15 Jun 2024 00:45 IST

ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
భారతదేశ చరిత్ర
భారత్‌లో బ్రిటిష్‌ గవర్నర్‌ 
జనరల్స్‌ - సంస్కరణలు

బ్రిటిష్‌ వారు యుద్ధాల ద్వారా మాత్రమే కాకుండా పలు సంస్కరణల ద్వారా కూడా సామ్రాజ్య విస్తరణను చేపట్టారు. దీనిలో భాగంగా పలువురు బ్రిటిష్‌ అధికారులు వివిధ విధానాలను అవలంబించారు. అందులో సైన్య సహకార విధానం ఒకటి. ఈ విధానాన్ని అమలుపరిచినవెల్లస్లీ పలు షరతులను విధించాడు. వీటికి అంగీకరించిన స్వదేశీ రాజులు తమ రాజ్యాల్లో నామమాత్రపు రాజ్యాధినేతలుగా మారిపోయారు. బెంటింక్‌ ప్రవేశపెట్టిన సంస్కరణలు దేశ చరిత్రలో కొత్త అధ్యాయాలను లిఖించాయి. వీటిపై పరీక్షార్థులకు అవగాహన అవసరం.

లార్డ్‌ వెల్లస్లీ సైన్య సహకార విధానం

భారతదేశంలో బ్రిటిష్‌ అధికారాన్ని విస్తరింపజేసి, సుస్థిరపరిచిన గవర్నర్‌ జనరళ్లలో లార్డ్‌ వెల్లస్లీ ఒకరు. 

 • ఇతడు కేవలం యుద్ధాల ద్వారానే కాకుండా, సైన్య సహకార విధానం ద్వారా కూడా స్వదేశీ రాజ్యాలపై ఆంగ్లేయుల అధికారాన్ని నెలకొల్పాడు. 
 • సామ్రాజ్యకాంక్ష మూర్తీభవించిన వ్యక్తి వెల్లస్లీ.
 • ఈస్ట్‌ ఇండియా కంపెనీ బెంగాల్, మైసూర్, కర్ణాటక, మరాఠా భూభాగాలపై క్రీ.శ. 1757 - 98 మధ్యకాలంలో చేసిన యుద్ధాల  ద్వారా తమ రాజ్యాన్ని గణనీయంగా విస్తరింపజేసింది.
 • ఇన్ని యుద్ధాలు చేసినా భారతదేశంలో ఇంకా అనేక స్వదేశీ రాజ్యాలు ఉండేవి. ఈ రాజ్యాలు పుష్కలమైన సహజ వనరులకు నెలవు. కానీ ఈ రాజ్యాల పాలకులు రాజకీయ, సైనిక, ఆర్థిక ఇబ్బందులతో నిత్యం సతమతమవుతూ ఉండేవారు.
 • వీరిలో హైదరాబాద్, మరాఠా ప్రాంతాల్లోని పాలకులు 1798కి పూర్వమే ఈస్ట్‌ ఇండియా కంపెనీతో ఒడంబడికలు చేసుకుని, వారి వారి శత్రువుల నుంచి తమ రాజ్యాలను, సింహాసనాలను కాపాడుకున్నారు.
 • నీ ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్‌ జనరల్‌గా వచ్చిన లార్డ్‌ వెల్లస్లీ సైన్య సహకార విధానాన్ని రూపొందించాడు. ఏ స్వదేశీ రాజ్యాధినేతైనా తమ శత్రువుల నుంచి రక్షణ పొందాలనుకునే వారికి తమ సైన్యం ద్వారా సహాయం అందజేయడానికి ఈస్ట్‌ ఇండియా కంపెనీ సిద్ధంగా ఉందని ప్రకటించాడు. అయితే సైన్య సహకారం పొందాలనుకునే రాజులు కొన్ని షరతులు పాటించాలని తెలిపాడు.

షరతులు

సైన్య సహకార విధానానికి అంగీకరించిన స్వదేశీ రాజ్యాధినేత తన విదేశాంగ వ్యవహారాల్లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ సార్వభౌమాధికారాన్ని అంగీకరించాలి.

 • కంపెనీ అనుమతి లేనిదే యుద్ధాలు, ఒడంబడికలు చేయరాదు. స్వదేశీ రాజు తన రాజధానిలో బ్రిటిష్‌ రెసిడెంట్‌ శాశ్వతంగా ఉండటానికి అధికార నివాసాన్ని ఏర్పాటు చేయాలి.
 • ఇంగ్లిష్‌ వారితో, వారి మిత్రులతో తప్ప మిగిలిన ఏ ఐరోపా రాజ్యంతో స్నేహం చేయరాదు. అంతవరకు ఉన్న స్నేహాన్ని, ఒడంబడికలను తక్షణమే రద్దు చేసుకోవాలి.
 • స్వదేశీ రాజ్య అంతరంగిక వ్యవహారాల్లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఎలాంటి జోక్యం చేసుకోకూడదు. అన్ని రకాల దాడుల నుంచి సంధి షరతులపై సంతకాలు చేసిన రాజ్యాన్ని ఈస్ట్‌ ఇండియా కంపెనీ రక్షించాలి.
 • సైన్యాలను రాజధానిలో నిలపడానికి, వాటి ఖర్చులను భరించడానికి స్వదేశీ రాజులు సిద్ధంగా ఉండాలి.

ఫలితాలు

వెల్లస్లీ ప్రవేశపెట్టిన ఈ సైన్య సహకార పద్ధతి షరతులపై మొట్టమొదట హైదరాబాద్‌ రాజ్య పాలకుడైన నిజాం అలీఖాన్‌ సెప్టెంబరు 1798లో సంతకం చేశాడు. అంతవరకు తన సైన్యంలో ఉన్న ఫ్రెంచ్‌ సేనలను తొలగించాడు.

 • ఆరు బెటాలియన్ల ఇంగ్లిష్‌ సేనలను తన రాజధానిలో నిలపడానికి, పోషణ ఖర్చులు భరించడానికి అంగీకరించాడు. బదులుగా నిజాం రాజ్యాన్ని మహారాష్ట్రుల దాడుల నుంచి రక్షించేందుకు కంపెనీ అంగీకరించింది.
 • క్రీ.శ. 1800లో నిజాం అలీఖాన్‌ ఆంగ్లేయులతో మరో ఒడంబడిక చేసుకున్నాడు. దీని ప్రకారం సైన్యం పోషణకు అయ్యే ఖర్చుల కోసం నగదు లేనందువల్ల మైసూర్‌ యుద్ధాల కాలంలో లభించిన బళ్లారి, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలను కంపెనీకి సర్వహక్కులతో స్వాధీనం చేశాడు.
 • ఈ విధంగా హైదరాబాద్‌ నిజాం కంపెనీ చేతిలో బందీ అయ్యాడు. అతడి అధికారం నామమాత్రం అయింది.
 • ఈ షరతులను అంగీకరించిన రెండో స్వదేశీ పాలకుడు అవధ్‌ నవాబు వజీర్‌ అలీ. 
 • క్రీ.శ. 1765లో జరిగిన బక్సార్‌ సంధి నాటి నుంచి అవధ్‌ నవాబులు కంపెనీ మిత్రులుగా ఉన్నారు.
 • వెల్లస్లీ కంటే ముందు ఉన్న గవర్నర్‌ జనరళ్లు అవధ్‌ రాజ్య స్వతంత్య్రాన్ని హరించాలని భావించలేదు. వెల్లస్లీ మాత్రం 1801 నవంబరు 10న బలవంతంగా ఒప్పంద షరతులపై అలీతో సంతకం చేయించాడు. రోహిల్‌ఖండ్‌లోని సారవంతమైన గంగా, యమున నదుల (అంతర్వేది) మధ్య ప్రాంతాలను అవధ్‌ నవాబు ఆంగ్లేయులకు అప్పగించాడు. ఇది కంపెనీ ఆర్థిక స్థిరత్వానికి దారి తీసింది.
 • 1801 తర్వాత మహారాష్ట్రుల్లో నెలకొన్న అంతఃకలహాలు, అనైక్యతను ఆసరాగా తీసుకుని ఇండోర్‌ సంస్థానాధీశుడైన హోల్కార్‌ను, బరోడా రాజు గైక్వాడ్‌ను వెల్లస్లీ తనవైపు తిప్పుకున్నాడు. 1802 నాటికి పీష్వా బాజీరావు బేసిన్‌ సంధి ప్రకారం సైన్యసహకార షరతులపై సంతకాలు చేశాడు
 • గ్వాలియర్‌ పాలకుడైన సింధియా, నాగపూర్‌ పాలకుడైన భోన్‌స్లే మాత్రం ఆంగ్లేయుల సైన్యాలను ఎదుర్కొన్నారు. కానీ పరాజయం పాలయ్యారు. 
 • వెల్లస్లీ, లార్డ్‌ లేక్‌ నేతృత్వంలోని ఆంగ్లేయ సైన్యాలు 1803లో మరాఠాల సైన్యాలను నిర్వీర్యం చేశాయి. దీంతో మరాఠాలు (హోల్కార్‌) సైన్య సహకార సంధికి అంగీకరించారు.
 • ఇదేవిధంగా తంజావూర్, మైసూర్, సింధియా, రాజపుత్ర రాజ్యాలైన జోధ్‌పూర్, జైపూర్, మచేరి, బుంది, భరత్‌పూర్‌ వెల్లస్లీ సైన్య సహకార సంధికి బలైపోయాయి.
 • ఈ సంధి వల్ల స్వదేశీ పాలకుల సొమ్ముతో కంపెనీ భారీ సైన్యాలను పోషించింది. ఫలితంగా ఈస్ట్‌ ఇండియా కంపెనీ భారత భూమిపై సర్వాధికారాలు పొందిన రాజకీయ శక్తిగా అవతరించింది.

విలియం బెంటింక్‌

భారత్‌లో పనిచేసిన బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్స్‌ అందరిలోకెల్లా భారతీయులకు అత్యంత ప్రీతిపాత్రుడు విలియం బెంటింక్‌. 

 • బ్రిటిష్‌ మాజీ ప్రధానమంత్రి పోర్ట్‌లాండ్‌ కుమారుడైన బెంటింక్‌ విద్యావేత్త, ఉదారవాది. 
 • ఇతడి కాలంలోనే భారతదేశంలో ఒక నూతన శకం ఆరంభమైంది. 
 • ఇతడు ఇంగ్లండ్, ఇతర ఐరోపా దేశాల్లో తన కాలంలో బాగా ప్రజాభిమానం పొందాడు. 
 • మానవులందరూ సమాన అవకాశాలు, హక్కులు పొందాలని, విద్య మానవుల సర్వతోముఖాభివృద్ధికి ఒక మెట్టు అని బెంటింక్‌ భావించాడు. 
 • భారతీయులకు సంప్రదాయ విద్యతోపాటు, ఇంగ్లిష్‌ విద్యావిధానాన్ని నేర్పాల్సిన బాధ్యత బ్రిటిష్‌ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశాడు. 
 • భారతీయుల వెనుకబాటుతనానికి, అజ్ఞానానికి, మూఢవిశ్వాసాలకు రాజకీయ అస్థిరత మాత్రమే కాకుండా సరైన విద్య వారికి లభించకపోవడమే ప్రధాన కారణమని తెలిపాడు. 
 • ఆంగ్ల భాషలో విద్యాబోధన సమాజంలో నూతన భావాలను వ్యాప్తి చేస్తుందని, ప్రజల్లో హేతుబద్ధ, ఉదారవాద ధోరణిని పెంపొందిస్తుందనీ ప్రకటించాడు.

బెంటింక్‌ సంస్కరణలు

బెంటింక్‌ తన ఏడేళ్ల పరిపాలనా కాలంలో ఆంగ్ల మాధ్యమంలో బోధనా పద్ధతిని ప్రవేశపెట్టాడు. 

 • అంతేకాకుండా బెంగాల్‌ తదితర ప్రాంతాల్లో ఆచరణలో ఉన్న సతీసహగమనం లాంటి దురాచారాన్ని నిషేధిస్తూ 1829 డిసెంబరు 4న ఒక చట్టం చేయించాడు. దీని ప్రకారం సతీసహగమనాన్ని అనుసరించేవారు, ప్రోత్సహించేవారు శిక్షార్హులని ప్రకటించాడు. 
 • బెంటింక్‌ చేసిన ఈ చారిత్రాత్మక చట్టం అనేకమంది బాల్యాన్ని రక్షించింది.
 • ఈ కార్యంలో బెంగాల్‌ సంఘసంస్కర్త రాజా రామ్మోహన్‌రాయ్‌ బెంటింక్‌కు అండగా నిలిచారు. 
 • బెంటింక్‌ చేసిన సతీసహగమన నిషేధ చట్టాన్ని సవాల్‌ చేస్తూ కొందరు సంప్రదాయ భారతీయులు ప్రీవీ కౌన్సిల్‌కు అప్పీలు చేయగా, రామ్మోహన్‌రాయ్‌ స్వయంగా ఇంగ్లండ్‌ వెళ్లి అక్కడి హౌస్‌ ఆఫ్‌ కామర్స్‌లో తన వాదనను వినిపించి గెలిచాడు. దీంతో ఈ చట్టం శాశ్వత రూపం సంతరించుకుంది. 
 • థామ్సన్‌ అనే బ్రిటిష్‌ చరిత్రకారుడు ‘భారత్‌లోని ఆంగ్లేయ ప్రభుత్వ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం ఇదొక్కటే’ అని అభివర్ణించాడు.
 • బెంటింక్‌ భారత్‌లో ప్రవేశపెట్టిన ఆంగ్ల విద్యా బోధన పథకాన్ని అమలు చేయడంలో అతడికి అండగా నిలిచిన వారిలో చార్లెస్‌ ట్రెవెల్‌యాన్, బెంథామ్‌లు ఉన్నారు. దీనిపట్ల విశేషంగా ఆకర్షితుడై 1834లో విద్యాబోధనా సంఘం అధ్యక్షుడిగా భారత్‌కు వచ్చినవారు లార్డ్‌ మెకాలే. 
 • మెకాలే నాయకత్వంలోని కమిటీ క్రీ.శ. 1835 ఫిబ్రవరిలో గవర్నర్‌ జనరల్‌ కౌన్సిల్‌కు తన చారిత్రాత్మకమైన నివేదికను సమర్పించింది. 
 • ఈ నివేదిక ఆంగ్ల విద్యకు సంబంధించి అధికార విధానానికి పునాదులు వేసింది. 
 • ప్రజలకు ఉపయోగపడే రంగాల్లో ప్రభుత్వ నిధులను వినియోగించే స్వేచ్ఛ, అధికారం ప్రభుత్వానికి ఉందనీ, ప్రజల నాడి ఆంగ్ల భాషకు అనుకూలంగా ఉందని తెలిపారు. సంస్కృతం, అరబిక్‌ భాషలు నేర్చుకోవాలనే కోరిక వారికి లేదని, భారతీయులను మేధావులుగా చేసే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని మెకాలే తన నివేదికలో పేర్కొన్నాడు. 
 • ఆంగ్ల భాషవల్ల భారతదేశంలో ఒక కొత్త తరగతి ఉద్భవించగలదని, ఈ తరగతివారు రక్తం, రంగులో భారతీయులుగా, భావాలు, ఆచార వ్యవహారాలు, మేధస్సులో ఆంగ్లేయులుగా ఉంటారనే నమ్మకాన్ని మెకాలే వ్యక్తం చేశాడు. 
 • మెకాలే అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవించిన బెంటింక్‌ ప్రభుత్వం ఆంగ్ల భాషను బోధనా భాషగా గుర్తించింది.

ఆంగ్ల విద్య - ఫలితాలు

బెంటింక్‌ ప్రవేశపెట్టిన ఆంగ్ల విద్యావిధానం బెంగాల్, బొంబాయి, మద్రాస్‌ మొదలైన ప్రాంతాల్లో నివసించే ఉన్నత, ధనిక, మధ్య తరగతుల వారిని విశేషంగా ఆకర్షించింది. 

 • దీని ఫలితంగా ఆంగ్ల విద్యను అభ్యసించిన భారతీయులు క్రమంగా పొందిన కొత్త జ్ఞానాన్ని తమ తోటి భారతీయులకు అందించారు. క్రమంగా పాశ్చాత్య విద్యనభ్యసించిన మధ్యతరగతి వర్గం అవతరించింది. 
 • వీరు ఉపాధ్యాయులుగా, పాత్రికేయులుగా, అడ్వకేట్‌లుగా, వైద్యులుగా, ఉద్యోగస్వామ్యంగా సమాజంలో స్థిరపడ్డారు. బ్రిటిష్‌ పరిపాలనా వ్యవహారాల్లో ఆంగ్లేయులకు సహకరించారు. 
 • ఈ రకంగా ఆంగ్ల విద్యాబోధన, ఆంగ్ల భాష, ఒక కేటలిస్ట్‌గా పనిచేసింది. క్రమంగా పాశ్చాత్య విద్యను అభ్యసించిన భారతీయుల్లో జాతీయభావం, వ్యక్తిత్వం, సామాజిక న్యాయం, రాజకీయ హక్కులు అనే భావాలు జనించాయి. 
 • మాతృదేశం, తోటి మానవుల పట్ల వారిలో నూతన ఆశలు చిగురించాయి. 
 • సంప్రదాయబద్ధమైన కులవ్యవస్థను వారు ధిక్కరించారు. కొందరు సంఘసంస్కరణోద్యమాలు చేపట్టారు. మరికొందరు స్త్రీ జనరోద్ధరణకు కృషి చేశారు. పలువురు రాజకీయ సంఘాలను నెలకొల్పారు.
 • ఈ విధంగా విలియం బెంటింక్‌ సంఘ, విద్యా సంస్కరణలు భారతీయుల్లో బ్రిటిష్‌ అనుకూల వర్గాన్ని రూపొందించాయి. 
 • కాలగమనంలో ఆంగ్ల విద్యను అభ్యసించిన మధ్యతరగతి భారతీయులే దేశీయుల్లో జాతీయతా భావాన్ని పెంపొందించి, బ్రిటిష్‌ వలసవాద, సామ్రాజ్యవాదాన్ని అంతం చేయడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించారు.

రచయిత
డాక్టర్‌ వి. రాజ్‌మహ్మద్‌ 
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని