Agnipath: ఆర్మీ ‘అగ్నివీర్‌’ నియామక ర్యాలీ షెడ్యూల్‌ విడుదల.. ఏ జిల్లా వారికి ఎక్కడంటే..?

Agnipath: ఆర్మీ అగ్నివీర్‌ నియామక ర్యాలీలకు తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ర్యాలీలు ఎప్పుడంటే.. 

Updated : 25 May 2023 20:37 IST

దిల్లీ:  ‘అగ్నిపథ్’(Agnipath)లో భాగంగా నిర్వహించిన అగ్నివీరుల(Agniveer)నియామక ర్యాలీల తేదీలు ఖరారయ్యాయి. ఏప్రిల్‌లో నిర్వహించిన ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఫలితాలను ఆదివారం ప్రకటించిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ఆఫీస్‌ (ARO).. తాజాగా నియామక ర్యాలీల తేదీలను విడుదల చేసింది. ఈ ర్యాలీలో భాగంగా రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శారీరక సామర్థ్య, వైద్య తదితర పరీక్షలు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ పట్టణాల్లో జోన్ల వారీగా జూన్‌ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు నిర్ణీత తేదీల్లో ర్యాలీ జరగనుంది. 

అధికారులు విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం.. ఏఆర్‌వో విశాఖపట్నం పరిధిలోని అభ్యర్థులకు జులై 20 నుంచి ఆగస్టు 2 వరకు విజయనగరంలో ర్యాలీ నిర్వహిస్తారు.  ఏఆర్‌వో గుంటూరు పరిధిలోని అభ్యర్థులకు ఆగస్టు 20 నుంచి ఆగస్టు 31 వరకు పల్నాడులో ర్యాలీ ఉంటుంది.  అలాగే ఏఆర్‌వో సికింద్రాబాద్‌ పరిధిలోని అభ్యర్థులకు నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 2 వరకు హకీంపేట్‌ (మేడ్చల్‌ మల్కాజ్‌గిరి)లో ర్యాలీ నిర్వహిస్తారు. ఈ  నియామకాల్లో భాగంగా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ కేటగిరీల్లో ఖాళీలు భర్తీ కానున్నాయి. అభ్యర్థుల వడపోత అనంతరం నాలుగేళ్ల కాలానికి అగ్నివీరులను ఎంపిక చేస్తారు. 

  • విజయనగరంలో జరిగే ర్యాలీకి విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్‌, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, ఏలూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విజయనగరం, కృష్ణా(విజయవాడ) యానాం (కేంద్రపాలిత ప్రాంతం)
  • పల్నాడులో జరిగే ర్యాలీకి గుంటూరు, కర్నూలు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్‌ఆర్‌ కడప, అనంతపురం, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి
  • హకీంపేటలో జరిగే ర్యాలీకి తెలంగాణలోని అన్ని జిల్లాల వారు హాజరు కావాల్సి ఉంటుంది. 

అగ్నివీర్‌ నియామక ర్యాలీ జాబితా ఇదే..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని