CBSE Results: త్వరలోనే సీబీఎస్‌ఈ ఫలితాలు.. మొబైల్‌లో ఇలా చెక్‌ చేసుకోవచ్చు!

CBSE Results: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి పరీక్షలు త్వరలోనే విడుదల కానున్నాయి.

Updated : 02 May 2023 18:11 IST

దిల్లీ: లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురుచూస్తోన్న సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) 10, 12వ తరగతి ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. పరీక్షల ఫలితాలను సీబీఎస్‌ఈ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది.  ఈ ఫలితాల విడుదలకు సంబంధించి సీబీఎస్‌ఈ బోర్డు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. పలు జాతీయ మీడియా సంస్థల్లో మాత్రం నేడో, రేపో ఫలితాలు అన్నట్టుగా ఊహాగానాలు జోరుగా కొనసాగుతున్నాయి.

మరోవైపు, మే రెండో వారం నాటికి ఫలితాలు వెల్లడించేందుకు సీబీఎస్‌ఈ బోర్డు యోచిస్తున్నట్టు కూడా వార్తలు వినబడుతున్నాయి. ఫలితాలు విడుదల చేసే తేదీ, సమయాన్ని గతేడాది మాదిరిగానే సీబీఎస్‌ఈ బోర్డు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించే అవకాశం ఉంది. సీబీఎస్‌ఈ పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్‌ 16 వరకు కొనసాగగా.. 12వ తరగతి సమాధానపత్రాల మూల్యాంకనం మాత్రం ఏప్రిల్‌ చివరి వారంతో ముగిసినట్టు తెలుస్తోంది. ఈ రెండు తరగతుల ఫలితాలను కొద్ది గంటల వ్యవధి తేడాతోనే ఒకే రోజు విడుదల చేసే అవకాశం ఉంది.

ఫలితాలు విడుదలయ్యాక..  విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌, పుట్టిన తేదీ, స్కూల్‌ నంబర్‌ వివరాలను ఎంటర్‌ చేసి cbseresults.nic.incbse.nic.in వెబ్‌సైట్‌ల ద్వారా రిజల్ట్స్‌ తెలుసుకోవచ్చు. అలాగే, మీ మొబైల్‌లో ఉమాంగ్‌, డిజీ లాకర్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా ఫలితాలు పొందొచ్చు. గతేడాది 12వ తరగతిలో 92.71శాతం, పదో తరగతిలో 94.40శాతం ఉత్తీర్ణత నమోదైన విషయం తెలిసిందే. విద్యార్థుల్లో అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు ఈ ఏడాది కూడా టాపర్ల జాబితాను విడుదల చేయడం లేదని సమాచారం. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21వరకు సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు జరగ్గా.. 12వ తరగతి పరీక్షలు మాత్రం ఏప్రిల్‌ 5 వరకు కొనసాగాయి. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 38,83, 710మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా.. వీరిలో 21,86,940మంది పదో తరగతి విద్యార్థులు కాగా.. 16,96,770 మంది 12వ తరగతి విద్యార్థులు ఉన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని