CM Jagan: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌

గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్ల జారీకి సీఎం జగన్‌ పచ్చజెండా ఊపారు. దీంతో రాష్ట్రంలో త్వరలో రెండు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. 

Updated : 25 May 2023 16:10 IST

అమరావతి: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్-1, గ్రూప్-2  పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పచ్చజెండా ఊపారు. సుమారు 1000కి పైగా పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఖాళీగా ఉన్న గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీపై సీఎం గురువారం ఉన్నతాధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా పోస్టుల భర్తీపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని తెలిపారు. పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని చెప్పారు. నోటిఫికేషన్‌ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందన్నారు. గ్రూప్‌-1కి సంబంధించి సుమారు 100కిపైగా, గ్రూప్‌-2కు సంబంధించి సుమారు 900కిపైగా ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు. మొత్తంగా 1000కిపైగా పోస్టులు భర్తీ చేయనున్నామని అధికారులు సీఎంకు వివరించారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని సూచించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని