Current affairs: కరెంట్‌ అఫైర్స్‌

ఏపీ నూతన డీజీపీగా సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు 2024, జూన్‌ 19న నియమితులయ్యారు.

Published : 22 Jun 2024 00:06 IST

ఏపీ నూతన డీజీపీగా సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు 2024, జూన్‌ 19న నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయనను కో ఆర్డినేషన్‌ విభాగం డీజీపీగా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం పోలీసు దళాల అధిపతిగా (హెచ్‌ఓపీఎఫ్‌)గా  పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.


అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ హెల్త్‌ ఎఫెక్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (హెచ్‌ఈఐ), యునిసెఫ్‌ సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాయుకాలుష్య ప్రభావంపై 2024, జూన్‌ 19న నివేదిక విడుదల చేసింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో 12% దీనివల్లేనని నివేదిక వెల్లడించింది. 2021లో వాయు కాలుష్యంతో భారత్‌లో అయిదేళ్లలోపు చిన్నారులు 1,69,400 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి మరణాలే నైజీరియాలో 1,14,100; పాకిస్థాన్‌లో 68,100; ఇథియోపియాలో 31,100; బంగ్లాదేశ్‌లో 19,100 మరణాలు సంభవించాయని నివేదిక తెలిపింది.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారత వృద్ధి రేటు 7.2 శాతానికి చేరొచ్చని ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. వినియోగదారు విశ్వాసం పెరగడంతో వ్యయాలు అధికమవడం, పెట్టుబడులు కూడా వృద్ధి చెందడం ఇందుకు కారణమని పేర్కొంది. దేశ వృద్ధిరేటు 7 శాతంగా ఉంటుందని ఈ సంస్థ 2024, మార్చిలో అంచనా వేసింది. 

 2025-26, 2026-27 ఆర్థిక సంవత్సరాల్లో దేశ వృద్ధిరేటు వరుసగా 6.5%, 6.2 శాతంగా నమోదు కావొచ్చని ఫిచ్‌ అంచనా వేసింది. 


అంతర్జాతీయ ఇంధన పరివర్తన సూచీలో భారత్‌కు 63వ ర్యాంక్‌ లభించిందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) 2024, జూన్‌ 19న వెల్లడించింది. ఈ సూచీలో స్వీడన్‌ అగ్రస్థానంలో నిలవగా, తర్వాతి స్థానాల్లో డెన్మార్క్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌ ఉన్నాయి.

కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


  మాదిరి ప్రశ్నలు

  •  భారత సంచలన పారా ఆర్చర్‌ శీతల్‌ దేవి 2024, ఏప్రిల్‌లో జరిగిన ఖేలో ఇండియా ఎన్టీపీసీ జాతీయ ర్యాంకింగ్‌ ఆర్చరీ పోటీల్లో ఏ పతకం గెలుచుకుని వార్తల్లో నిలిచారు? 

(రెండు చేతులు లేని ఈ  క్రీడాకారిణి సాధారణ ఆర్చర్లతో పోటీ పడి మరీ పతకం గెలిచింది. శీతల్‌ నిరుడు ఆసియా పారా క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఓ వెండి పతకం గెలిచింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో అర్జున పురస్కారం అందుకుంది. చేతులు లేని ఏకైక అంతర్జాతీయ పారా ఆర్చరీ ఛాంపియన్‌ ఈమే కావడం విశేషం.)

   జ: రజతం


  •  2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కోట్ల టర్నోవరుతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీగా ఏ సంస్థ వార్తల్లో నిలిచింది?

(2023-24లో ఈ సంస్థ నికర లాభం రూ.69,621 కోట్లుగా నమోదైంది. 2022-23లో రూ.9.74 లక్షల కోట్లుగా ఉన్న సంస్థ టర్నోవరు, 2023-24లో 2.6 శాతం పెరిగి రూ.10 లక్షల కోట్లకు చేరుకుంది.)

జ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌


  •  ప్రపంచంలోని అత్యుత్తమ చదరంగ  క్రీడాకారులు తలపడిన క్యాండిడేట్స్‌ టోర్నీ విజేతగా నిలిచిన భారత క్రీడాకారుడెవరు? 

(టోర్నీలో చివరిదైన 14వ రౌండ్‌లో హికరు నకముర (అమెరికా)తో గేమ్‌ను డ్రా చేసుకుని ఈ భారత క్రీడాకారుడు విజేతగా నిలిచాడు. మొత్తం 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ గెలుపుతో ప్రపంచ టైటిల్‌ కోసం డిఫెండింగ్‌ ఛాంపియన్‌ డిన్‌ లిరెన్‌ (చైనా)తో తలపడేందుకు ఇతను అర్హత సాధించాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ (2014) తర్వాత క్యాండిడేట్స్‌ టోర్నీ గెలిచిన రెండో భారత ఆటగాడిగా ఇతను నిలిచాడు. పిన్న  వయసులో క్యాండిడేట్స్‌ టోర్నీ గెలిచి, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన ఆటగాళ్లలో ఈ భారత  ఆటగాడు (17 ఏళ్లు) తొలి స్థానంలో నిలిచాడు.)

  జ: దొమ్మరాజు గుకేష్‌

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని