Economic Development: ఉత్పాదకతలో క్షీణతే.. ఆర్థికాభివృద్ధికి అవరోధం!

ఏ దేశ మైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే సహజవనరులు, సాంకేతికత, అవస్థాపన సౌకర్యాలు, మానవ వనరులు మొదలైనవి కీలకంగా ఉంటాయి. ఈ వనరులన్నీ ఉత్పాదకతలో ముఖ్య భూమిక పోషిస్తాయి.

Updated : 20 Jun 2024 01:21 IST

ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
ఇండియన్‌ ఎకానమీ

ఏ దేశ మైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే సహజవనరులు, సాంకేతికత, అవస్థాపన సౌకర్యాలు, మానవ వనరులు మొదలైనవి కీలకంగా ఉంటాయి. ఈ వనరులన్నీ ఉత్పాదకతలో ముఖ్య భూమిక పోషిస్తాయి. దేశంలో లభ్యమయ్యే వనరుల అధిక లేదా తక్కువ వినియోగం అల్ప ఉత్పాదకతకు కారణమవుతుంది. ఉత్పాదకతలో క్షీణతే దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన అవరోధం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.

ఆర్థిక వృద్ధి - ఆర్థికాభివృద్ధి

సామాజిక, సాంస్కృతిక అవరోధాలు

సామాజిక సంస్థలు, వాటి దృక్పథాలు, సంప్రదాయ నమ్మకాలు, విలువలు, దృఢమైన వృత్తుల విభజన, పొదుపు చేయడంలో, పెట్టుబడి పెట్టడంలో ప్రజల ఉద్దేశాలు, సామాజిక విధులకు చేసే వ్యయం, బంధుప్రీతి, అసమర్ధ, చెడు పరిపాలన, లంచగొండితనం, విద్య విషయంలో సామాజిక దృక్పథం, శారీరక శ్రమ విషయంలో ప్రతికూల అభిప్రాయం, ప్రాచీన మతాలు, తీరికగా గడిపేందుకు అధిక విలువ ఇవ్వడం, కర్మ సిద్ధాంతాన్ని పాటించడం మొదలైనవి ఆర్థికాభివృద్ధికి అనుకూలమైనవి కాదు. ఇవి అల్పాభివృద్ధి చెందిన దేశాల్లో ప్రగతిని అడ్డుకుంటాయి.

మూలధన కొరత

మూడో ప్రపంచ దేశాల్లో మూలధన కొరత వల్ల ఆర్థికాభివృద్ధి కుంటుపడుతోంది. మూలధన కల్పనలో డిమాండ్, సప్లై వైపు విషవలయాలు ఉన్నాయి. డిమాండ్‌ వైపు పెట్టుబడి చేపట్టడానికి అవసరమైన ప్రోత్సాహకాల కొరత ఉంది. వస్తువుల ఉత్పత్తి విస్తరణ తగినంత డిమాండ్‌ ఏర్పడటం వల్ల కొనసాగుతుంది. అయితే అల్పాదాయ దేశాల్లో ఆదాయాలు తక్కువగా లేదా సక్రమంగా లేకపోవడం వల్ల ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ డిమాండ్‌ కొరత ఏర్పడుతుంది. తక్కువ ఉత్పాదకత వల్ల తక్కువ ఆదాయాలు ఏర్పడతాయి. తక్కువ ఉత్పాదకతకు మూలధన కొరత ప్రధాన కారణం. పెట్టుబడికి తగినంత ప్రోత్సాహం లేకపోవడంతో మూలధనానికి తక్కువ డిమాండ్‌ ఏర్పడుతుంది. ఈ విధంగా డిమాండ్‌ వైపు ఏర్పడే విషవలయం సంపూర్ణం అవుతుంది.

డిమాండ్‌ వైపు విషవలయం

  • సప్లై వైపు మూలధన కల్పన పొదుపును సమీకరించడంతో మొదలవుతుంది. అయితే పొదుపు స్థాయి (Y-C=S) ఈ దేశాల్లో అతి తక్కువ. 
  • దీనికి కారణం ఆదాయం తక్కువగా ఉండటమే. ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, పని చేసేవారి ఉత్పాదకత తక్కువగా ఉండటం తక్కువ ఆదాయాలకు దారి తీస్తుంది. మూలధన కొరత వల్ల ఉత్పాదన తగ్గుతుంది. మూలధన కల్పన లేకపోవడం తక్కువ స్థాయి పొదుపు, పెట్టుబడులకు కారణమవుతుంది. ఈ విధంగా సప్లై వైపు ఏర్పడే విషవలయం సంపూర్ణం అవుతుంది.

సప్లై వైపు విషవలయం

  • తక్కువ ఉత్పాదకత తక్కువ ఆదాయానికి దారి తీస్తుందని డిమాండ్‌ వైపు, సప్లై వైపు ఏర్పడే విషవలయాలు పేర్కొంటున్నాయి. 
  • తక్కువ పొదుపు, తక్కువ పెట్టుబడి వల్ల మూలధన కొరత ఏర్పడి పురాతన ఉత్పత్తి పద్ధతులు కొనసాగుతూనే ఉంటాయి. అభివృద్ధి జరగదు.

వ్యవసాయ అవరోధం

అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ ప్రధానంగా వ్యవసాయాధారిత దేశాలే. వీటి స్థూల దేశీయోత్పత్తిలో ఎక్కువ వాటా వ్యవసాయ ఉత్పత్తులదే. ఎగుమతుల విలువలో వ్యవసాయ వస్తువుల నుంచే అధిక రాబడి వస్తుంది. వ్యవసాయరంగం అధిక ఉద్యోగితను కూడా సృష్టిస్తుంది. రైతులు అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించడంలో, ఉత్పత్తి - పెట్టుబడికి కావాల్సిన ప్రోత్సాహకాలు, ఉత్పాదకాల లభ్యత, వాటి ధరలు, నీటిపారుదల సౌకర్యాల కల్పన, వాతావరణం, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మొదలైన అంశాలకు సంబంధించి అవరోధాలు ఉన్నాయి. వీటన్నింటి ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తి తక్కువగా ఉంటోంది. దీనివల్ల అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఉత్పత్తికి పెరుగుతున్న డిమాండ్‌ను అందుకోలేకపోతోంది. తలసరి వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులు తక్కువ. వెనకబడిన వ్యవసాయ రంగం ఆర్థికాభివృద్ధికి పెద్ద అవరోధం.

విదేశీ మారక అడ్డంకి

ప్రపంచ ఆర్థిక  వ్యవస్థలో అసమానత్వాన్ని పెంచే శక్తుల వల్ల అంతర్జాతీయ వర్తకంలో అభివృద్ధి చెందిన దేశాలకే లాభాలు దక్కాయి. దీని ఫలితంగా విదేశీ మారకద్రవ్య సమస్య ఏర్పడింది. అల్పాభివృద్ధి చెందిన దేశాల ఎగుమతులు పెరిగినా, ఇతర రంగాలను ఉపేక్షించి ఎగుమతుల రంగాన్ని అభివృద్ధి చేసినందువల్ల అది అభివృద్ధికి ఎక్కువగా తోడ్పడలేదు. ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడితే వస్తువులకున్న డిమాండ్, వాటి ధరలపై అంతర్జాతీయ ఒడిదొడుకుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మార్కెట్‌ అసంపూర్ణతలు, వ్యవస్థాపరమైన మూలధనం కొరత, వ్యవస్థాగత సర్దుబాటు సరిగా లేకపోవడం లాంటి కారణాల వల్ల వెనకబడిన దేశాల వర్తక నిబంధనలు మెరుగైనా సరే దాని ఫలితం ఉత్పత్తి, ఉద్యోగితల పెరుగుదలలో కనిపించడం లేదు.

జనాభా పెరుగుదల అవరోధం

జనాభా పెరుగుదల మూడో ప్రపంచ దేశాల్లో జీవన ప్రమాణాల పెరుగుదలకు నిరోధం అవుతుంది. అవి:

  • అధిక జనాభా పెరుగుదల మూలధన కల్పనకు ప్రతిబంధకం అవుతుంది. ఉత్పాదకత వృద్ధిరేటును అడ్డుకుంటుంది
  • ఇతరులపై ఆధారపడి జీవించేవారిని పోషించడం వారిని పోషించే వారికి భారమవుతుంది. ఉద్యోగావకాశాలు లేక దారిద్య్రంలో ఉంటారు.
  • పట్టణాల్లో ప్రత్యక్ష నిరుద్యోగిత నెలకొంటుంది.
  • పల్లె ప్రాంతాల్లో అల్ప ఉద్యోగిత ఏర్పడుతుంది.
  • తక్కువస్థాయి సమతౌల్య ఊబి యథాతథంగా ఉంటుంది.
  • పైన పేర్కొన్న అంశాల దృష్ట్యా జనాభా పెరుగుదల మూడో ప్రపంచ దేశాలకు అభివృద్ధి నిరోధక శక్తిగా పనిచేసి, అభివృద్ధి పంథాకు ఆటంకం అవుతుంది.

ద్వైవిధ్యం అభివృద్ధికి అవరోధం

ఇది ఆర్థిక వ్యవస్థలోని ఆర్థిక, సామాజిక విభజనను పేర్కొంటుంది.

  • సమాజంలోని వివిధ రంగాలు, ప్రాంతాల మధ్య ఉన్న సాంకేతిక స్థాయి, వ్యత్యాసాలు, ప్రాంతీయ అసమానతలు, సామాజిక అలవాట్లు మొదలైన వాటిలో ఉన్న తేడాలు ఈ సందర్భంగా బయటపడతాయి. వీటినే సాంకేతిక, ప్రాంతీయ, సామాజిక ద్వైవిధ్యం అంటారు. వీటివల్ల ప్రజల జీవన ప్రమాణాల్లో, వివిధ రంగాల్లో, ప్రాంతాల్లో సామాజిక వర్గాల్లో తేడాలు అధికం అవుతాయి. ఇవి ఆర్థిక ద్వైవిధ్యానికి దారి తీస్తాయి. ఆర్థిక ద్వైవిధ్యం బలపడుతుంది.
  • ద్వైవిధ్యంలో నాలుగు అంశాలు ఉన్నాయి.

1) ఒకే ఉపరితలంలో ఉన్నతమైన, హీనమైన పరిస్థితులు పక్కపక్కనే ఏర్పడతాయి. ఉదాహరణకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కొత్త, సాంప్రదాయ ఉత్పత్తి పద్ధతులు నెలకొని ఉండటం.

2) వీటి సహజీవనం నిరంతరమైంది. ఏదో వరద మాదిరి వచ్చిపోయేది కాదు. ఉదాహరణకు ప్రపంచంలో ధనిక, పేద దేశాలు సహజీవనం చేయడం. ఇది చరిత్ర వల్ల ఏర్పడిన సంఘటన కాదు. నిరంతరం కనిపిస్తున్న వాస్తవమే.

3) ఉన్నతమైన, హీనమైన పరిస్థితుల స్థాయి, వాటి మధ్య ఉన్న తేడా పెరగడం తటస్థిస్తుంది. ఉదాహరణకు అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఉత్పాదకతలో తేడా పెరుగుతుంది.

4) ఉన్నతమైన, హీనమైన అంశాల మధ్య ఉన్న పరస్పర సంబంధం వల్ల హీనమైన పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఉన్నతమైన అంశాలు పాటుపడవు. వీలున్నంత వరకు హీనమైన అంశాలను అణగదొక్కేందుకు ఉన్నతమైన అంశాలు ప్రయత్నిస్తాయి. తద్వారా అల్పాభివృద్ధి స్థిరపడిపోతుంది.

  • ప్రముఖ ఆర్థికవేత్త గున్నార్‌ మిర్దాల్‌ ఈ అంశాలను క్షుణ్నంగా పరిశీలించి, వివిధ దేశాలు, దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ద్వైవిధ్యం ప్రాంతీయ భేదాలను పెంచి మొత్తం ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని కుంగదీస్తుందని పేర్కొన్నారు. 
  • శ్రామికుల వలస, మూలధన ప్రవాహం, వ్యాపార ప్రవాహాల కారణంగా అభివృద్ధి చెందిన దేశాలు, ప్రాంతాలు వెనకబడిన దేశాలు, ప్రాంతాలను పీల్చిపిప్పి చేస్తాయని ఆయన వెల్లడించారు. దీన్నే తిరోగమన ప్రభావాలు (BackWash Effects) అంటారు. 
  • కానీ వెనకబడిన దేశాలు, ప్రాంతాలు (ఉదా: వలస వెళ్లినవారు పంపే ధనం, సాంకేతిక విజ్ఞాన వ్యాప్తి, జ్ఞానం పెరగడం మొదలైనవి.) అభివృద్ధి చెందిన ప్రాంతాల నుంచి కొన్ని ప్రయోజనాలు  పొందుతాయి. గున్నార్‌ మిర్దాల్‌ వీటిని విస్తరణ ప్రభావాలుగా (Spread Effects) పేర్కొన్నారు. అయితే వాస్తవంగా విస్తరణ ప్రభావాలు తిరోగమన ప్రభావాల కంటే బలహీనంగా ఉంటాయి. అందువల్ల ద్వైవిధ్యం ఏర్పడి బలపడుతుంది. ఈ కారణంగానే అంతర్జాతీయ అసమానతలతోపాటు పేద, ధనిక దేశాలకు ఆర్థిక వ్యత్యాసం పెరుగుతోంది.

గమనిక

  • తిరోగమన ప్రభావాలు అంటే వ్యాపారం, మూలధన, శ్రామిక ప్రవాహాలు అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశాలకు తరలిపోవడంతో ఏర్పడే దుష్పరిణామాలు.
  • విస్తరణ ప్రభావాలు అంటే వ్యాపారం, మూలధనం, శ్రమశక్తి పేద దేశాలు, ప్రాంతాల నుంచి అభివృద్ధి చెందిన దేశాలు, ప్రాంతాలకు ప్రవహించడం వల్ల పేద దేశాలకు ఏర్పడే ప్రయోజనాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని