Published : 17 Mar 2021 10:43 IST

నేర్చుకుంటే చాలు.. లక్షల్లో జీతాలు!

ఫుల్‌ స్టాక్‌  డెవలపర్లకు గిరాకీ

సాంకేతిక నైపుణ్యాలు ఎంత ముఖ్యమో కరోనా కాలం నిరూపించింది. కొవిడ్‌ ఎన్నో రంగాలపై ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ, ఐటీ రంగం మాత్రం దీన్ని దీటుగా ఎదుర్కొంది. ఈ రంగంలో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. డిజిటల్‌ నైపుణ్యాల కోసం గిరాకీ పెరిగేకొద్దీ, అన్ని కంపెనీలూ ఆయా రంగాల్లో నిపుణుల సంఖ్యను కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. అంత కీలకమైనవి కాబట్టి బహుళజాతి సంస్థలు కోడింగ్‌         నైపుణ్యాలపై పట్టు సాధించినవారికి పెద్ద పీట వేస్తున్నాయి; మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు అందిస్తున్నాయి. అలా కంపెనీలు వెతుకుతున్నవారి జాబితాలో ఫుల్‌ స్టాక్‌ డెవలపర్లు ముందు వరుసలో ఉన్నారు!    

‘గ్లాస్‌ డోర్‌’’ సంస్థ సమాచారం ప్రకారం- భారత్‌లో ఈ అప్లికేషన్‌ డెవలపర్లకు మార్కెట్‌లో చాలా డిమాండ్‌ ఉంది. వీరికి ఐబీఎం కంపెనీలో రూ. 30 లక్షలు, వీఎం వేర్‌ కంపెనీలో రూ. 24 లక్షలు వార్షిక వేతనం ఇచ్చారు. ప్రాథమిక స్థాయిలో ఈ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ నేర్చుకుంటేనే సంవత్సరానికి 6 లక్షల రూపాయిలు ఇచ్చే ఉద్యోగాలు వస్తాయి. ‘పే స్కేల్‌’ సంస్థ ప్రకారం- అమెరికాలో ఈ అప్లికేషన్‌ డెవలపర్ల మూల వేతనం 91,000 డాలర్లు. అంటే సుమారు రూ. 66,00,000.

అక్కడ కరెన్సీ విలువ ఎక్కువ కాబట్టి భారత్‌లో 6 లక్షల రూపాయలైనా అమెరికాలో 91,000 డాలర్లయినా ఒకటే అని మీరు అనుకోవచ్చు. కానీ ఇటీవలి కాలంలో కొత్తగా రిమోట్‌ జాబ్స్‌ కూడా వస్తున్నాయి. అంటే మీ ఇంటి నుంచే అమెరికాలో ఉన్న కంపెనీ కోసం మీరు పని చెయ్యచ్చు. కానీ మీకు అమెరికాలో ఇచ్చే వేతనాలనే ఇస్తారు. అలాంటి ఆకర్షణీయమైన జీతాలను భారత్‌లో మీ ఇంటి నుంచే మీరు సంపాదించవచ్చు. ఈ ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌ నేర్చుకున్నవారికి ఈ దశాబ్దంలో అవకాశాలకు కొదవ లేదని చెప్పవచ్చు!   

ఈ ఫుల్‌ స్టాక్‌ గురించి తెలుసుకోవాలంటే ముందు దీనిలో ఉన్న రెండు భాగాల గురించి తెలుసుకోవాలి. ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌, బ్యాక్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌.       
వేటిపై పట్టు ఉండాలి?
ఫ్రంట్‌ ఎండ్‌ డెవలపర్‌ అవ్వడానికి HTML, CSS, Bootstrap, JavaScript, React   లాంటి వాటిపై పట్టు సాధించాలి. బ్యాక్‌ ఎండ్‌ డెవలపర్‌ అవ్వడానికి Java, Python, NodeJS, SQL, Django  లాంటి వాటిపై పట్టు సాధించాలి. అంతకంటే ముఖ్యంగా ఒక ప్రోగ్రామర్‌లా ఆలోచించడం నేర్చుకోవాలి. ఎందుకంటే లాంగ్వేజ్‌ తెలిస్తే సరిపోదు; దాన్ని ఉపయోగించి అప్లికేషన్లు తయారు చేయగలిగేవారే కంపెనీలకు కావాలి.    
ఒక అప్లికేషన్‌కి సంబంధించిన అన్ని అంశాలు- ఫ్రంట్‌ ఎండ్, బ్యాక్‌ ఎండ్, రెండింటిపై పనిచేయగలిగేవారే ఫుల్‌ స్టాక్‌ డెవలపర్లు. వీరు మొత్తంగా ఒక అప్లికేషన్‌ను సమర్థంగా పనిచేసేలా చూస్తారు.

ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌  
ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేయాలంటే వెంటనే అమెజాన్‌ లేదా ఫ్లిప్‌కార్ట్‌ లాంటి వెబ్‌సైట్‌లోకి వెళతాం. కొనాలనుకున్న వస్తువులన్నీ అక్కడ రంగుల్లో ఒక పద్ధ్దతిలో చక్కగా అమర్చివుంటాయి. ఒక వస్తువు బొమ్మపై క్లిక్‌ చేయగానే ఆ వస్తువు వివరాలతో మరొక కొత్త వెబ్‌ పేజీ తెరుచుకుంటుంది. కావాల్సిన వస్తువుల పరిమాణం మారుస్తుంటే వెబ్‌సైట్‌ మొత్తం మారకుండా ఆ వస్తువు పరిమాణం మాత్రమే మారుతుంది. ఇలా కనపడుతూ మనం ఇంటరాక్ట్‌ అవ్వడానికి వీలు కల్పించేదాన్ని ఫ్రంట్‌ ఎండ్‌ అంటారు. ఇలా ఏదైనా వెబ్‌సైట్‌ని మనం వాడడానికి సులభతరంగా ఉండేలా, అందంగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దేవారే ఫ్రంట్‌ ఎండ్‌ డెవలపర్లు. చూడటానికీ, యూజర్‌ ఉపయోగించడానికీ అనుగుణంగా ఎలా ఉండాలన్న దానిపైనే వీరు పని చేస్తారు.    

రెస్పాన్సివ్‌ వెబ్‌ డిజైన్‌
మనం మొబైల్, లాప్‌ టాప్, టాబ్లెట్‌ లాంటి వివిధ రకాల పరికరాలను వాడుతూ ఉంటాం. ఇవి ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా వేర్వేరు పరిమాణాల్లో ఉంటాయి కదా! డెవలపర్లు ఒక వెబ్‌సైట్‌ని లాప్‌టాప్‌కి విడిగా, టాబ్లెట్‌కి విడిగా, మొబైల్‌కి విడిగా రూపొందిస్తూ ఉంటారా?   

అలా చేస్తే చాలా సమయం వృథా అవుతుంది కదా! అలా కాకుండా ‘రెస్పాన్సివ్‌ వెబ్‌ డిజైన్‌’ అనే విధానాన్ని ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో వెబ్‌సైట్‌ని ఒక్కసారి డెవలప్‌ చేస్తే, అన్ని పరికరాల్లో వాటి తెర పరిమాణానికి తగ్గట్టుగా దానికదే (ఆటోమేటిక్‌)  మారిపోతూ ఉంటుంది. ఈమధ్య కొత్తగా ఏదైనా వెబ్‌సైట్‌ని రూపొందించాలంటే ఈ రెస్పాన్సివ్‌ వెబ్‌ డిజైన్‌నే వాడుతున్నారు, అందుకే ఇది చాలా ముఖ్యమైనది.    

క్రాస్‌ ప్లాట్‌ఫామ్‌ డెవలప్‌మెంట్‌   
మొబైల్లో అయితే ఆండ్రాయిడ్‌/ఐఓఎస్, లాప్‌టాప్‌లో అయితే విండోస్‌.. ఇంకా ఎన్నోరకాల ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ ఉంటాయి. అప్లికేషన్‌ డెవలపర్లు ఆండ్రాయిడ్‌ కోసం ఒక ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌నూ, ఐఓఎస్‌ కోసం వేరొక ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌నూ  ఉపయోగించాల్సి ఉంటుంది. దానికి చాలా సమయం పడుతుంది. అలా కాకుండా, వెబ్‌ సైట్లకు రెస్పాన్సివ్‌ వెబ్‌ డిజైన్‌ టూల్స్‌ ఎలా ఉంటాయో, ఆప్స్‌కి కూడా క్రాస్‌ ప్లాట్‌ఫామ్‌ డెవలప్‌మెంట్‌ టూల్స్‌ ఉంటాయి. అంటే వీటితో ఆప్‌ని ఒక్కసారి డెవలప్‌ చేస్తే ఆండ్రాయిడ్‌ అయినా, ఐఓస్‌ అయినా రెండిట్లోనూ పనిచేస్తుంది.

ఇలాంటి క్రాస్‌ ప్లాట్‌ఫామ్‌ డెవలప్‌మెంట్‌ టూల్స్‌లో రియాక్ట్‌ నేటివ్, ఫ్లట్టర్‌ ప్రముఖమైనవి. రియాక్ట్‌ నేటివ్‌ని ఫేస్‌ బుక్‌ కంపెనీ డెవలప్‌ చేసింది. ఇన్‌స్టాగ్రామ్, మింత్ర లాంటి పెద్ద కంపెనీలు దీన్ని వాడుతున్నాయిు. ఫ్లట్టర్‌ని గూగుల్‌ కంపెనీ డెవలప్‌ చేసింది. గూగుల్‌ పే, ఈబే లాంటి కంపెనీలు దీన్ని వాడుతున్నాయి.   బ్యాక్‌ ఎండ్‌ విషయానికి వస్తే.. ఓలా, ఉబర్‌ లాంటి అప్లికేషన్లను మనం తరచూ వాడుతుంటాం. అందులో మనం ఒక రైడ్‌ రిక్వెస్ట్‌ చెయ్యగానే దగ్గరలో ఉన్న డ్రైవర్లకు మన రైడ్‌ రిక్వెస్ట్‌ వెళ్తుంది. ఒక డ్రైవర్‌ మన రిక్వెస్ట్‌ అంగీకరించగానే, తక్కువ వ్యవధిలోనే రైడ్, ఆ డ్రైవర్‌ల వివరాలు ఒక నోటిఫికేషన్లో వస్తాయి.

గమనించారా..? మనం కేవలం ఒక రైడ్‌ రిక్వెస్ట్‌ పెట్టగానే ఇవన్నీ వాటికవే జరిగిపోతున్నాయి. అవి ఎలా జరుగుతున్నాయి? అలా జరగడానికి ఒక సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌ చేస్తారు. ఆ సాఫ్ట్‌వేర్‌ సర్వర్‌లో రన్‌ అవుతుంది. సర్వర్‌ అంటే ఒక కంప్యూటర్‌ లాగా మనం అనుకోవచ్చు. ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ని రూపొందించడమే బ్యాక్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌! అలా సాఫ్ట్‌వేర్‌ని డెవలప్‌ చేసేవారే బ్యాక్‌ ఎండ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు.    

ఫ్లిప్‌ కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డే సేల్, అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ లాంటివి తెలిసేవుంటాయి. అలాంటి రోజుల్లో అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో లక్షలమంది వినియోగదారులు వివిధ రకాల వస్తువులు కొంటూ ఉంటారు. ఇలా లక్షల్లో వస్తున్న అభ్యర్థనలను సజావుగా నిర్వహించేలా బ్యాక్‌ ఎండ్‌ సాఫ్ట్‌వేర్‌నీ, ఆ సర్వర్లనూ తయారుచేసుకోవడం, సర్వర్ల సంఖ్యను పెంచుకోవడం లాంటివి కూడా సాధారణంగా బ్యాక్‌ ఎండ్‌ డెవలపర్లే చూసుకుంటారు.

నాలుగున్నర నెలల్లో..
ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌ అవ్వాలంటే.. కోర్స్‌ఎరా, యుడెమి లాంటి వేదికలు అందించే కోర్సుల్లో చేరవచ్చు. మరెన్నో సంస్థలు ఈ శిక్షణను అందిస్తున్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే.. సీసీబీపీ టెక్‌ 4.0 ఇంటెన్సివ్‌ ప్రోగ్రాంతో 4.5 నెలల్లోనే ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌ నేర్చుకోవచ్చు. ఈ ప్రోగ్రాంలో చేరటానికి కోడింగ్‌పై ఎటువంటి అవగాహనా అవసరం లేదు. పూర్వానుభవంతో, విద్యార్హతలతో సంబంధం లేకుండా నేర్చుకోవచ్చు. ccbp.in/intensive వెబ్‌సైట్‌లో వివరాలు తెలుసుకోవచ్చు. నైపుణ్యాలు ఉన్నవారు సంవత్సరానికి 4.5 లక్షల నుంచి 9 లక్షల రూపాయిల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది!   

- రాహుల్‌ అత్తులూరి, సీఈఓ నెక్స్‌ట్‌  


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని