TRT: దోషరహిత భావ ప్రకటన సామర్థ్య సాధనం!

భాష నిర్మాణం, అందులోని నియమాలను వివరించేదే వ్యాకరణం. అది పదాలు, వాక్యాల నిర్మాణంలో అనుసరించాల్సిన పద్ధతులను తెలియజేస్తుంది. అందుకే భాషా బోధనలో వ్యాకరణం ప్రధానమైన అంశం.

Published : 17 Jun 2024 00:41 IST

టీఆర్‌టీ-2024 తెలుగు మెథడాలజీ
వ్యాకరణ బోధన

భాష నిర్మాణం, అందులోని నియమాలను వివరించేదే వ్యాకరణం. అది పదాలు, వాక్యాల నిర్మాణంలో అనుసరించాల్సిన పద్ధతులను తెలియజేస్తుంది. అందుకే భాషా బోధనలో వ్యాకరణం ప్రధానమైన అంశం. వ్యాకరణ రకాలు, బోధన పద్ధతులు, సోపాన క్రమాలు తదితర మౌలికాంశాలను కాబోయే ఉపాధ్యాయులు క్షుణ్నంగా తెలుసుకోవాలి. భాషా జ్ఞానాన్ని పెంపొందిస్తూనే, తార్కిక జ్ఞానాన్నీ వృద్ధి చేసే వ్యాకరణ లక్ష్యాలతోపాటు అందులో కాలానుగుణంగా వచ్చిన మార్పులు, తెలుగు వ్యాకరణంతో సంబంధం ఉన్న ప్రసిద్ధ రచయితలు, భాషావేత్తల గురించి తగిన అవగాహన కలిగి ఉండాలి.


వ్యాకరణ బోధనోద్దేశాలు

 • వ్యాకరణ బోధన ద్వారా విద్యార్థుల్లో భాషాజ్ఞానాన్ని పెంపొందింపజేయడం.
 • పద స్వరూప స్వభావాలు తెలియజేయడం.
 • వాక్య నిర్మాణ స్వరూప స్వభావాలు తెలియజేయడం.
 • పద, వాక్య సమ్మేళన సంప్రదాయాలను గుర్తించి  విశ్లేషించగలగడం.
 • ప్రాచీన, ఆధునిక భాషా వ్యవహారాలను గ్రహింపజేయడం.
 • దోషరహిత భావ ప్రకటనా సామర్థ్యాన్ని పెంపొందించడం.
 • రచనాశక్తిని పెంపొందింపజేయడం.
 • మాండలిక భాషలు, సోదర భాషల మధ్య ఉండే సామ్య భేదాలను గ్రహింపజేయడం.
 • భాషా వ్యవహారంలో జరిగే ఆదాన ప్రదానాలను  తెలుసుకునేలా చేయడం.
 • తార్కిక శక్తిని పెంపొందించడం.
 • శాస్త్రీయ దృక్పథాన్ని అలవడేలా చేయడం.
 • వ్యాకరణ అధ్యయనం పట్ల ఆసక్తి కలిగించడం.

వ్యాకరణం - రకాలు

అధ్యయన విధానం ఆధారంగా వ్యాకరణాన్ని మూడు  రకాలుగా చెప్పొచ్చు.

1) వర్ణనాత్మక వ్యాకరణం 2) చారిత్రక వ్యాకరణం 3) తులనాత్మక వ్యాకరణం

1. వర్ణనాత్మక వ్యాకరణం

 • ఇది నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాష స్వరూప స్వభావాలను వివరిస్తుంది.
 • వ్యాకర్త తన కాలం నాటి వరకు వినియోగిస్తున్న ప్రామాణిక ప్రయోగాలను ఆధారంగా చేసుకుని  సాధారణీకరణలు చేస్తూ వర్ణనాత్మక వ్యాకరణాన్ని రచిస్తాడు.
 • నన్నయ కాలం నుంచి తమ కాలం వరకు లభ్యమైన ప్రామాణిక ప్రయోగాలను ఆధారంగా చేసుకుని చిన్నయసూరి రచించిన బాలవ్యాకరణం, బహుజనపల్లి సీతారామాచార్యులు రాసిన ప్రౌఢ వ్యాకరణం, వర్ణనాత్మక వ్యాకరణానికి ఉదాహరణలు.

2. చారిత్రక వ్యాకరణం:

 • ఒక భాష విభిన్న కాలాల్లో ఎలాంటి మార్పులకు లోనైందో తెలిపేది చారిత్రక వ్యాకరణం.
 • ఆధునిక శాస్త్రవేత్తలు చారిత్రక వ్యాకరణ అధ్యయనానికి ప్రాధాన్యం ఇచ్చారు.
 • ఇది కాలగతిలో భాషలో జరిగిన ధ్వని మార్పులు, అర్థ విపరిణామాలు, శబ్దజాలంలో మార్పు, మాండలిక భేదాలు, ఇతర భాషల్లో ఆదాన ప్రదానాలు మొదలైన వాటి గురించి తెలుపుతుంది.
 • సి.పి.బ్రౌన్‌ తెలుగు భాషపై చేసిన కృషి ఈ పంథాలోనే సాగింది.

3. తులనాత్మక వ్యాకరణం

 • పలు భాషల మధ్య సామ్యభేదాలను అధ్యయనం చేసే క్రమంలో మౌలిక అంశాలైన సంఖ్యా వాచకాలు, బంధు వాచకాలు, ప్రత్యయాలను పరిగణనలోకి  తీసుకుని భాషల మధ్య జన్య, జనక సంబంధాలను తులనాత్మక వ్యాకరణం ప్రతిపాదిస్తుంది.
 • పూర్వం తెలుగు భాష సంస్కృత భాషాజన్యం అని విశ్వసించేవారు.
 • తెలుగు.. ద్రావిడ భాషా కుటుంబానికి చెందిందని తులనాత్మక అధ్యయనాలు రుజువు చేశాయి.
 • ద్రావిడ భాషల మధ్య సంబంధాన్ని తెలిపే కింది  ఉదాహరణ చూడండి.

కణ్‌ (తమిళం), కణ్ణు (కన్నడం), కణ్‌ (మలయాళం) కన్ను (తెలుగు)

 • 10వ తరగతి వరకు ప్రథమ భాషగా తెలుగును   బోధించే సందర్భంలో వర్ణనాత్మక, చారిత్రక వ్యాకరణాంశాలు మాత్రమే పరిచయం చేయాలి.

వ్యాకరణ బోధన పద్ధతులు

1) నిగమోప పత్తి పద్ధతి: ఇది ప్రాచీన పద్ధతి. దీన్ని శాస్త్ర, సూత్ర పద్ధతి అని కూడా పేర్కొంటారు. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు మొదట సూత్రాన్ని చెప్పి తరువాత సూత్రంలోని పారిభాషిక పదాలను వివరిస్తాడు. ఆ తర్వాత సూత్రాన్ని ఉదాహరణలతో సమన్వయం చేసి చూపిస్తాడు.

2) అనుమానోప పత్తి పద్ధతి: ఇది నవీన వ్యాకరణ బోధన పద్ధతి. దీన్ని వైయ్యాకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి అని కూడా పేర్కొంటారు. ఒకే సంధికి సంబంధించిన కొన్ని ఉదాహరణ పదాలను విద్యార్థుల నుంచి రాబట్టి ఆయా ఉదాహరణ పదాలను వారే విడదీసేలా చేసి, ఆయా పదాల మధ్య జరిగిన సంధి కార్యాన్ని, దానిలోని సామాన్య ధర్మాన్ని వారితోనే చెప్పించాలి.

3) అనుసంధాన పద్ధతి: విద్యార్థులు ఇంతకుముందు తెలుసుకున్న వ్యాకరణ జ్ఞానాన్ని వారు నేర్చుకునే వివిధ పాఠ్యాంశాల్లోని రూపాలు, ప్రయోగాలతో అనుసంధానం చేయడం ద్వారా ఆయా వ్యాకరణ నియమాల అభ్యసనను బలోపేతం చేసే పద్ధతిని అనుసంధాన పద్ధతి అంటారు.

4) ప్రయోగ పద్ధతి: ‘ప్రయోగ శరణం వ్యాకరణం’ అనే భావన ప్రాతిపదికతో వ్యాకరణాంశాలను ప్రత్యేకంగా కాకుండా పాఠ్య బోధనాంశాలతో కలిపి బోధించాలనేది ఈ పద్ధతిలోని విశేషం. భాషా బోధన సందర్భంలో ఈ విధానాన్ని అనుసరించేవారు. దీనికి సంప్రదాయ పద్ధతి అని కూడా పేరు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని