విదేశీ విద్య: వీసా మెలకువలు
చిన్నచిన్న జాగ్రత్తలతో కల సఫలం!
విద్యార్థులు విదేశీ గడ్డపై అడుగుపెట్టాలన్నా.. విదేశీ విద్య కల నెరవేర్చుకోవాలన్నా చివరిదైన దశ వీసా దశను దాటడం తప్పనిసరి. ఒకరకంగా విదేశీ కలకు దీన్ని గేట్వేగా చెప్పొచ్చు. కానీ దీని పేరు వినగానే ‘అమ్మో’ అనేవారే ఎక్కువ. ఎక్కువగా తిరస్కరణకు గురవ్వడమే ఇందుకు కారణం. కానీ అభ్యర్థులు చేసే చిన్న చిన్న పొరబాట్లే అందుకు కారణమన్నది నిపుణుల మాట. ఫాల్ ప్రవేశాలకు ప్రయత్నించేవారు వీటిని గమనించుకోవడం తప్పనిసరి!
సులువుగా చెప్పాలంటే.. వీసా అనేది ‘అఫిషియల్ ట్రావెల్ డాక్యుమెంట్’. కోరుకున్న దేశంలో న్యాయబద్ధంగా అడుగుపెట్టడానికి ఇది తప్పనిసరి. అందుకే విదేశీ విద్యాభ్యాస ప్రక్రియలో దీన్ని తుది, అతి ముఖ్యమైన దశగా చెబుతారు. కానీ దరఖాస్తు చేసే
వారికీ, దాన్ని పొందేవారికీ మధ్య వ్యత్యాసం ఎక్కువే. ఒక్కోసారి మంచి మార్కులు, ప్రతిభ ఉన్నా తిరస్కరణ/ ఆలస్యమవడం వంటివి జరుగుతుంటాయి. రద్దు అయితే ఏడాది వృథా. ఆలస్యమైతే కొన్ని తరగతులు కోల్పోవాల్సి ఉంటుంది. పరిస్థితి ఏదైనా విద్యార్థికి నష్టమే. చాలావరకూ ఈ పరిస్థితులకు విద్యార్థులు చేసే చిన్నచిన్న పొరబాట్లే కారణమని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ముందుగానే ఎక్కువశాతం పొరబాట్లు జరిగే అవకాశమున్న వాటిని సరిచూసుకుంటే ఈ పరిస్థితి నుంచి సులువుగా బయటపడొచ్చు, విదేశీ విద్యాభ్యాసం అనే కలను ఖాయంగా సొంతం చేసుకోవచ్చు.
ఇంటర్వ్యూ పరంగా..
విద్యార్థి తన వివరాలు, లక్ష్యాలను సూచించడానికి వీసా దరఖాస్తు పనికొస్తే.. ఇంటర్వ్యూ వాటిని ఒప్పించడానికీ, దరఖాస్తు ఆమోదం పొందడానికీ తోడ్పడుతుంది. అయితే ఇక్కడ చేసే పొరబాట్లూ తిరస్కరణకు కారణమవొచ్చు.
ఆలస్యమవొద్దు
చాలాకొద్ది సందర్భాల్లో మినహా వీసా ఇంటర్వ్యూను అభ్యర్థి అనుకూలత ఆధారంగానే షెడ్యూల్ చేస్తారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఆలస్యంగా వస్తే.. ఇంటర్వ్యూ/ విదేశీవిద్య పరంగా విద్యార్థి సీరియస్‌గా లేరనే భావన కలుగుతుంది. వీసా ఇంటర్వ్యూ విద్యార్థికి తన లక్ష్యాలను, ఎంచుకున్న దేశంలో విద్యాపరంగా ఉన్న ఆసక్తిని తెలియపరిచే ఒక అవకాశం. ఆలస్యం చేయడం ఒకరకమైన ప్రతికూల అభిప్రాయాన్ని ఏర్పరచగలదు. ఒక్కోసారి ఆలస్యమైన సమయాన్నిబట్టి వీసా పొందడానికి అనర్హులుగానూ భావించే అవకాశముంది.
ఇంటర్వ్యూ సమయానికి కనీసం 15 నుంచి 30 నిమిషాల ముందుగా చేరుకోవాలి. ఇది అభ్యర్థిపై సానుకూల అభిప్రాయాన్ని ఏర్పరచడమే కాకుండా.. మిమ్మల్ని మీరు స్థిమితపరచుకోవడానికీ, ఇంటర్వ్యూకు మానసికంగా సిద్ధమవడానికీ తోడ్పడుతుంది. ఇంటర్వ్యూ నివాస నగరంలోనే జరిగితే మీరున్న స్థలం నుంచి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ట్రాఫిక్ వంటి అంశాలను ముందుగానే పరిగణనలోకి తీసుకోవాలి. వేరే ఊరికి వెళ్లాల్సివస్తే ఒకరోజు ముందుగానే చేరుకుని, ఇంటర్వ్యూ ప్రదేశానికి సమయానికి చేరుకునేలా జాగ్రత్త పడాలి.
వస్త్రధారణకూ ప్రాధాన్యం
ఇంటర్వ్యూ- అది కళాశాల ప్రవేశానికి సంబంధించి అయినా.. ఉద్యోగపరమైనదైనా మొదటి అభిప్రాయం/ ఫస్ట్ ఇంప్రెషన్‌కు ప్రాధాన్యముంటుంది. కాబట్టి, వస్త్రధారణకు ప్రాధాన్యమివ్వాలి. విద్యార్థి వీసా విషయంలో ఎంతవరకూ శ్రద్ధగా, పట్టుదలగా ఉన్నారన్నదాన్ని దీని ఆధారంగా అంచనావేస్తారు. కాబట్టి వేసుకునే దుస్తులు, ఆభరణాలు, శరీరభాష అన్నింటినీ గమనించుకోవాలి. విశ్రాంతిగా సాగిలపడినట్లుగా కుర్చీలో కూర్చోవడం, చేతులు కట్టుకోవడం, ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడం లాంటివి వ్యతిరేక ప్రభావం చూపగలవు.
ఇంటర్వ్యూకు ముందే వేసుకునే దుస్తులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. మరీ ప్రొఫెషనల్గానో, సంప్రదాయ దుస్తుల్లోనో వెళ్లాల్సిన పనిలేదు. శరీర భాషకూ ప్రాధాన్యముంటుంది కాబట్టి, అద్దంలో సాధన చేసుకోవడం మంచిది. కుర్చీలో నిటారుగా కూర్చోవడం, ఐకాంటాక్ట్ ఇవ్వడం, చిరునవ్వును ఆద్యంతం కొనసాగించటం ప్రధానం.
సమాధానాన్ని దాటవేయొద్దు
దరఖాస్తుపరంగా ఎన్నో పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వాటిపరంగా ఇంటర్వ్యూయర్ ఇంటర్వ్యూలో స్పష్టత ఏర్పరచుకుంటారు. దానిలో భాగంగా లోతైన ప్రశ్నలు అడుగుతారు. ఆ సమయంలో చెప్పే సమాధానం అబద్ధంగా తోచినా, దాటవేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అనిపించినా వీసా ఆమోదం పొందే అవకాశాలు దూరమైనట్లే.
ఇంటర్వ్యూకు వెళ్లేముందే సమర్పించిన పత్రాలను జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని ప్రశ్నలు ఒక్కోసారి వ్యక్తిగతంగానూ సాగొచ్చు. ఇలాంటి సమయంలో సమాధానాన్ని దాటవేయడం ఏమాత్రం తగదు. కాస్త సమయం తీసుకుని ఆలోచించుకుని సమాధానం చెప్పాలి. అలాగే అబద్ధం చెప్పొద్దు. మీ పత్రాలన్నీ ఇంటర్వ్యూయర్ వద్ద ఉంటాయన్నది గుర్తుంచుకోవాలి.
వాదించొద్దు
ఇంటర్వ్యూయర్ చూసే అంశాల్లో విద్యార్థి వ్యక్తిత్వం/ స్వభావాన్ని పరీక్షించడం ఒకటి. ఒక్కోసారి వ్యక్తిగతమైన, కొంచెం వ్యక్తపరచడానికి ఇబ్బందిపడే అంశాలనూ అడగొచ్చు. ఇలాంటివాటి విషయాల్లో తక్షణ కోపానికి గురవడం, వాదించడం లాంటివి చేయొద్దు. ఇది అభ్యర్థిపై ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతుంది. త్వరగా ఉద్రిక్తులయ్యే/ కలహాలకు వెళ్లే వ్యక్తిగానూ భావించొచ్చు.
ఇలాంటి ప్రశ్నలు అడిగినపుడు ఇబ్బందికి గురవ్వడం సాధారణమే. మామూలు పరిస్థితిలో ఎవరైనా ప్రశాంతంగా ఉంటారు. అనూహ్య పరిస్థితుల్లో ఎలా నెట్టుకొస్తాడో పరిశీలించడమే ఈ ప్రశ్నల ఉద్దేశం. కాబట్టి సంయమనం పాటించగలగాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టగల ప్రశ్నలు.. వాటికి ఎలా సమాధానం ఇవ్వాలో ముందుగానే సాధన చేసుకోవాలి. అవసరమైతే ఇంటర్వ్యూయర్‌ను కొంత సమయాన్నీ కోరొచ్చు.
దరఖాస్తు పరంగా..ఆర్థిక పరంగా..
దేశాన్ని బట్టి ఆర్థిక అవసరాల్లో మార్పులుంటాయి. దరఖాస్తు చేసుకున్న దేశానికి అనుగుణంగా మీ దగ్గర నిధులున్నాయో లేదో చూసుకోవాలి. ఉదాహరణకు- కోర్సు కాలవ్యవధికి అనుగుణంగా విద్యను అభ్యసించడానికీ, అక్కడ నివసించడానికీ తగినన్ని నిధులున్నాయేమో పరిశీలించుకోవాలి. అందుకు తగ్గ స్టేట్మెంట్లనూ సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ స్కాలర్షిప్ను దక్కించుకుని ఉంటే సంబంధింత ఆధారాలనూ సమర్పించాల్సి ఉంటుంది. అటెస్టెడ్ బ్యాంక్ స్టేట్మెంట్లనూ సమర్పించాల్సి ఉంటుంది. స్పాన్సర్ వివరాలనూ జోడించాలి. సంబంధిత డిక్లరేషన్/ అఫిడవిట్లను జతచేయాల్సి ఉంటుంది. ప్రయాణానికీ, విజయవంతంగా కోర్సును పూర్తిచేసుకోవడానికీ విద్యార్థికి ఉన్న ఆర్థిక ఆధారాన్ని ఇవి రుజువు చేస్తాయి. వీసా నిర్ణయంలో ఆర్థిక అంశానికి ముఖ్య ప్రాధాన్యముంటుంది.
ధ్రువపత్రాల సమర్పణ
దేశాన్నిబట్టి కోరే ధ్రువపత్రాల జాబితాలో మార్పులుంటాయి. వాటిని ముందుగానే తెలుసుకుని సిద్ధం చేసుకోవాలి. సమర్పించే పత్రాలపైనే వీసా ఆధారపడి ఉంటుంది. ఏ ఒక్కటి మరిచినా.. వీసా తిరస్కరణకు గురవ్వడమో, ఆలస్యమవడమో జరుగుతుంది. కాబట్టి, ముందస్తు పరిశోధన తప్పనిసరి. అడ్మిషన్ లెటర్ ముఖ్యమైన పత్రాల్లో ఒకటి. దాన్ని చేర్చడం మర్చిపోవద్దు. కొన్ని వీసా సంబంధిత వెబ్సైట్లు దేశాన్ని బట్టి సమర్పించాల్సిన పత్రాల జాబితాను అందుబాటులో ఉంచుతున్నాయి. వాటి సాయాన్నీ తీసుకోవచ్చు.
నిబంధనలు
ప్రతి దేశానికీ దరఖాస్తు చేసుకున్న వీసానుబట్టి కొన్ని ప్రత్యేక నియమ నిబంధనలుంటాయి. వాటిని అతిక్రమించినా, ఉల్లంఘించినా, నియమాలపరంగా మోసం చేయాలని చూసినా దాని ప్రభావం ప్రస్తుతం దరఖాస్తు చేస్తున్నదానిపైనే కాకుండా భవిష్యత్తుపైనా ప్రభావం పడుతుంది. ఉదాహరణకు- చదువుకోవడానికి వెళుతూ త్వరగా పొందాలనే ఉద్దేశంతో టూరిస్ట్ వీసాకు ప్రయత్నించడం, తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించడం మొదలైనవి చేయొద్దు. ఈ విషయంగా పొరబాట్లు జరగకుండా చూసుకోవాలి.
నివాసమెక్కడ?
ఎక్కడ ఉండబోతున్నారు? విదేశీ ప్రణాళికలో దీనికీ ప్రాధాన్యముంటుంది. దీనికి వీసా ఇంటర్వ్యూలోనూ, దరఖాస్తులోనూ కచ్చితంగా సమాధానమివ్వగలగాలి. అప్పుడే విద్యార్థి పూర్తి సన్నద్ధతతో ఉన్నట్లుగా భావిస్తారు. అకామడేషన్ రుజువుతోపాటు చెల్లింపులకు సంబంధించిన పత్రాలనూ జోడించాలి.
దీన్నీ గమనించుకోండి!
వీసా దరఖాస్తులో భాగంగా ఎన్నో ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. విదేశంలో ఏర్పాటు చేసుకున్న అకామడేషన్, షెడ్యూల్ చేసుకున్న విమాన టికెట్.. వంటివీ ఇందులో భాగమే. చాలావరకూ వీసా తప్పక పొందాలన్న ఉద్దేశంతోనే వీటినీ జత చేస్తుంటారు. నిజానికి ఇది తప్పు విషయమేమీ కాదు. కాకపోతే దీనిలో కొంత రిస్క్ కూడా దాగుంది. కానీ ఒకసారి ఆలోచించండి! ఒకవేళ అనుకోకుండా వీసా తిరస్కరణకు గురైతే? అప్పుడేం చేస్తారు? డబ్బు అనవసర వృథానే కదా! అందుకే టికెట్, అకామడేషన్‌కు సంబంధించి రిఫండ్ అవకాశం ఉందేమో గమనించుకోవాలి. ఆ తరువాతే బుక్ చేసుకోవడం మంచిది. వీసా ఆలస్యమైనా కూడా డబ్బు వృథా కాకుండా చూసుకున్నట్లే కదా!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02/02/23)
-
Sports News
WPL: మహిళల ప్రీమియర్ లీగ్.. ఫిబ్రవరి రెండో వారంలోనే వేలం!
-
Sports News
Usman Khawaja: వీసా ఆలస్యంతో ఆస్ట్రేలియా ఓపెనర్ అసంతృప్తి.. ఫన్నీ పోస్ట్ వైరల్
-
Movies News
Kiara Sidharth Malhotra: కియారా- సిద్ధార్థ్‌ల వివాహం అప్పుడేనా? శరవేగంగా పనులు..!
-
Movies News
Mukhachitram: విశ్వక్సేన్ ‘ముఖచిత్రం’.. ఓటీటీలోకి వచ్చేస్తోంది!
-
Politics News
CM Kcr-Amith jogi: సీఎం కేసీఆర్‌తో అమిత్ జోగి భేటీ.. జాతీయ రాజకీయాలపై చర్చ