అవుతారా.. ఆర్థిక ఇంజినీర్లు!

యంత్రాల నిర్మాణం, లోపాల సవరణ చేసేది సాధారణ ఇంజినీర్లు. అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థలను ఆరోగ్యకరమైన బాటలో నడిపేది ఫినాన్షియల్‌ ఇంజినీర్లు. గణితం.. గణాంక శాస్త్రాల్లో పట్టు ఉంటే ఆర్థిక ఇంజినీర్లుగా అవకాశాలను అందుకోవచ్ఛు పొదుపులు, పెట్టుబడులు, అప్పులు, రిస్క్‌లు,

Published : 10 Mar 2020 00:25 IST

యంత్రాల నిర్మాణం, లోపాల సవరణ చేసేది సాధారణ ఇంజినీర్లు. అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థలను ఆరోగ్యకరమైన బాటలో నడిపేది ఫినాన్షియల్‌ ఇంజినీర్లు. గణితం.. గణాంక శాస్త్రాల్లో పట్టు ఉంటే ఆర్థిక ఇంజినీర్లుగా అవకాశాలను అందుకోవచ్ఛు పొదుపులు, పెట్టుబడులు, అప్పులు, రిస్క్‌లు, లాభాలు, నష్టాలు.. ఇలా అన్నింటిపై అవగాహన పెంచుకొని.. విశ్లేషించి.. వివరించి సంస్థలను అభివృద్ధి చేయడం వీరి ప్రధాన కర్తవ్యం. స్టాక్‌లు, సెక్యూరిటీలు, సెన్సెక్స్‌, షేర్‌మార్కెట్‌... వంటి వాటి గమనాన్ని వర్తమానంలో గమనించి భవిష్యత్తును అంచనా వేస్తారు. మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, ఎకనామిక్స్‌, కామర్స్‌, ఫినాన్స్‌, అకౌంట్స్‌ విభాగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ రంగంలో వేగంగా ఎదగవచ్చు.

ఫలానా కంపెనీ షేరు కొంటే లాభాలు గ్యారంటీ అని చెప్పాలంటే కారణాలను వివరించాలి, పెట్టుబడుల నుంచి మంచి ఫలాలను అందుకోవాలంటే ఏంచేయాలో విశ్లేషించగలగాలి, కంపెనీ పద్దుల పుస్తకాలను వివరంగా ఉంచాలి, ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలో ప్రామాణికాల సాయంతో చెప్పాలి. వీటితోపాటు సంస్థలు తమ ఖర్చులను ఏ విధంగా తగ్గించుకోవచ్చు, లాభాలను ఎలా పెంచుకోవచ్ఛు. తదితర విషయాలన్నింటినీ శాస్త్రీయంగా చెప్పడానికి రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి. వాటిని సాధించుకోవడానికి కొన్ని స్కిల్స్‌ కావాలి. అలాంటి నైపుణ్యాలను నేర్పేందుకు కోర్సులు ఉన్నాయి. వాటిలో దేన్ని ఎంచుకున్నా.. అంకెలపై పట్టు, తర్కం, విశ్లేషణ, సునిశిత పరిశీలన, ఇతర అంశాలపై అవగాహన ఉండాలి. మార్కెట్‌ పోకడలను గమనించగలగాలి.


ఇన్వెస్ట్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌

ఫినాన్స్‌ విభాగంలో అత్యంత విలువైనదిగా ఇన్వెస్ట్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ విభాగాన్ని చెప్పుకోవచ్ఛు సంస్థలకు సంబంధించిన రోజువారీ ఆర్థిక కార్యకలాపాలకు ఒక కొత్త రూపాన్ని తీసుకురావడంలో దీని పాత్ర ప్రధానమైంది. సవాళ్లను స్వీకరించడానికి ఇష్టపడేవారు, డేటా, నంబర్లలో ట్రెండ్‌ని గుర్తించగలిగేవాళ్లు, కాలిక్యులేషన్లను ఇష్టపడేవాళ్లు ఈ కెరియర్‌ను పరిశీలించవచ్ఛు ఇందులో రాణించాలంటే ఎక్కువ సమయం వెచ్చించాలి. కొత్తగా చేరినవారు, ప్రారంభస్థాయి ఉద్యోగులైతే మరింత కష్టపడాలి. గోల్డ్‌మెన్‌ శాక్స్‌ లాంటి సంస్థలు టాప్‌ బిజినెస్‌ స్కూళ్ల విద్యార్థులను ఇందుకోసం నియమించుకుంటున్నాయి. కార్పొరేట్‌ సంస్థలకు వీరు ఆర్థిక సలహాదారులుగానూ వ్యవహరిస్తారు. విశ్లేషణాత్మక ఆలోచనాపరులు, కమ్యూనికేషన్‌, ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌ ఉన్నవారు ఇన్వెస్ట్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ వైపు మొగ్గు చూపవచ్చు.

విద్యా నేపథ్యం: ఇన్వెస్ట్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ కావాలంటే ఫినాన్స్‌, కామర్స్‌, ఎకనామిక్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉండాలి. పేరున్న సంస్థల్లో ఎంబీఏ ఫినాన్స్‌ స్పెషలైజేషన్‌ పూర్తిచేసుకున్నవారికి అవకాశాలు ఎక్కువ.


కార్పొరేట్‌ ఫినాన్స్‌

అందుబాటులో ఉన్న నిధులను ప్రణాళిక ప్రకారం ఖర్చుచేయడాన్ని కార్పొరేట్‌ ఫినాన్స్‌ అంటారు. బడ్జెట్‌ ప్రకారం ఆర్థిక వనరులను సవ్యంగా ఉపయోగించాలి. ఇందుకోసం కంపెనీలు కార్పొరేట్‌ ఫినాన్స్‌ నిపుణులను నియమించుకుంటున్నాయి. కంపెనీల అంతర్గత వ్యవహారాల బాధ్యతలూ వీరే చూసుకుంటారు. నిధులు వృథా కాకుండా చూడటం వీరి ప్రధాన కర్తవ్యం. నిధులను వేటి కోసం వెచ్చిస్తున్నారు, ఎంతెంత కేటాయిస్తున్నారు, ఆ కేటాయింపుల అవసరం ఏ మేరకు ఉంది, ఎక్కడ తగ్గించుకోవచ్ఛు.. వంటి వ్యవహారాలను ఈ నిపుణులు పర్యవేక్షిస్తారు. ఆపరేషన్‌ వ్యయాలు ఎలా తగ్గించుకోవచ్చో సంస్థలకు సూచిస్తారు. ఉద్యోగులను తగ్గించాలన్నా, పెంచాలన్నా వీరి సలహాలే కీలకం. పెట్టుబడులపై వస్తున్న ఫలితాలను సమీక్షిస్తారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తారు. డబ్బుని స్మార్ట్‌గా వినియోగించడంలో నైపుణ్యం, ఆసక్తి ఉంటే కార్పొరేట్‌ ఫినాన్స్‌ కెరియర్‌ను స్వీకరించవచ్ఛు

విద్యా నేపథ్యం: ఫినాన్స్‌ నేపథ్యంతో డిగ్రీ లేదా ఎంబీఏ ఫినాన్స్‌ ఉన్న అభ్యర్థులు ఇందులో రాణించవచ్ఛు పెద్ద కార్పొరేట్‌ సంస్థలు, ఇన్వెస్ట్ట్‌మెంట్‌ బ్యాంకుల్లో వీరికి అవకాశాలు లభిస్తాయి. సునిశిత పరిశీలన, మార్కెట్‌పై అవగాహన ఉండాలి.


పబ్లిక్‌ అకౌంటింగ్‌

సంస్థలోకి వస్తున్న, సంస్థ నుంచి బయటకి వెళుతున్న నిధుల వివరాలను పకడ్బందీగా రికార్డులకు ఎక్కించడం పబ్లిక్‌ అకౌంటింగ్‌ నిపుణుల బాధ్యత. ఖర్చులు తగ్గించుకుని, రెవెన్యూ మార్గాలను పెంపొందించుకోవడానికి కంపెనీలకు వీరు సూచనలు చేస్తారు. ఇంటర్నల్‌ ఆడిటింగ్‌ విధులు నిర్వర్తిస్తారు. సంస్థ పెట్టుబడులు, ఖర్చులు ఎంతవరకు ఫలవంతమవుతున్నాయి, భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవడానికి ఇవి ఏ మేరకు ఉపయోగపడతాయనే అంశాలను ఈ నిపుణులు విశ్లేషిస్తారు.

విద్యా నేపథ్యం: బీకాం, ఎంకాం కోర్సులు పూర్తిచేసుకున్నవారు ఈ విభాగంలో రాణించవచ్ఛు సర్టిఫైడ్‌ పబ్లిక్‌ అకౌంటెంట్‌ (సీపీఏ) గుర్తింపు పొందినవారు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలను అందిపుచ్చుకోవచ్ఛు ఎంబీఏ ఫినాన్స్‌తోపాటు సర్టిఫికేషన్‌ ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి.అన్ని రకాల కార్పొరేట్‌ కంపెనీలు, అకౌంటింగ్‌ ఫర్మ్‌ల్లో పబ్లిక్‌ అకౌంటింగ్‌ నిపుణులకు ఉద్యోగాలుంటాయి. అంకెలతో పని చేయడాన్ని ఆస్వాదించేవారు పబ్లిక్‌ అకౌంటింగ్‌కి ప్రాధాన్యం ఇవ్వవచ్ఛు


పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌

కామర్స్‌, సైన్స్‌ రెండింటి మేళవింపే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌. పోర్టుఫోలియో మేనేజర్‌ కావడానికి ఈ రెండు సబ్జెక్టులపై పట్టు తప్పనిసరి. కంపెనీ లేదా క్లయింట్‌ పెట్టుబడుల వైవిధ్యాన్ని పోర్ట్‌ఫోలియో నిపుణులు విశ్లేషిస్తారు. ఏయే రంగాలకు ఎంత కేటాయించాలో నిర్ణయించడంతోపాటు అందుకు స్పష్టమైన కారణాలను వివరిస్తారు. అవకాశాలను అన్వేషించడం, బలాలు, బలహీనతలను విశ్లేషించుకొని ముందుకెళ్లడం, స్థానిక, అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న అవరోధాలను గమనించడం వీరి విధుల్లో ప్రధానమైనవి. రిస్క్‌ తీసుకుంటూనే వీలైనంత వరకు లాభాల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తారు. సిప్‌లు, పలు రకాల ఇన్సూరెన్స్‌ పాలసీల ఆవిష్కరణ తదితరాల్లో పోర్టుఫోలియో మేనేజర్ల సేవలే కీలకం.

విద్యా నేపథ్యం: గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఫినాన్స్‌, అకౌంటింగ్‌, ఎకనామిక్స్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్లపై పట్టుండాలి. హై లెవెల్‌ మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌ కోర్సులు చదివినవారు పోర్ట్‌ఫోలియో మేనేజర్లుగా రాణించడానికి అవకాశాలున్నాయి. ప్రఖ్యాత సంస్థల్లో ఎకనామిక్స్‌ లేదా ఎంబీఏ ఫినాన్స్‌ చదివినవారికి ప్రాధాన్యం ఉంటుంది.


ఫినాన్షియల్‌ ప్లానింగ్‌

ఆర్థిక ప్రణాళికల్లో పక్కాగా వ్యవహరించే అభ్యర్థులు ఫినాన్షియల్‌ ప్లానింగ్‌ను కెరియర్‌గా ఎంచుకోవచ్ఛు సంస్థలు, వ్యక్తులు తమ వద్ద ఉన్న నిధులను ఏ విధంగా ప్రణాళికాబద్ధంగా ఉపయోగించవచ్చో ఈ నిపుణులు వివరిస్తారు. ఎందులో పెట్టుబడులు పెట్టాలి, ఎంతవరకు రిస్క్‌ తీసుకోవచ్చు, భవిష్యత్తు అవసరాలు తీరడానికి ఇప్పుడున్నదాన్ని వైవిధ్యంగా ఎలా ఉపయోగించాలి...మొదలైన వాటిని వీరు విశ్లేషించి, సూచనలు చేస్తారు. వినియోగదారుల పెట్టుబడులను సమీక్షిస్తారు. అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా మార్పులు సూచిస్తారు. పన్ను తగ్గించుకోవడానికి అవకాశం ఉన్న మార్గాలను వివరిస్తారు. ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌లో పట్టున్నవారికి ఈ రంగంలో అభివృద్ధి ఉంటుంది.

విద్యా నేపథ్యం: యూజీ స్థాయిలో కామర్స్‌, ఫినాన్స్‌, ఎకనామిక్స్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సులు చదివినవారు ఫినాన్షియల్‌ ప్లానర్‌ కావడానికి ప్రయత్నించవచ్ఛు ఈ సబ్జెక్టుల్లో పీజీ ఉంటే ఇంకా ప్రయోజనకరం. సర్టిఫైడ్‌ ఫినాన్షియల్‌ ప్లానర్‌ (సీఎఫ్‌పీ) గుర్తింపు పొందినవారు కార్పొరేట్‌ కంపెనీలు, ఫినాన్షియల్‌ అడ్వైజరీ సంస్థల్లో రాణించవచ్ఛు


స్టాక్‌ బ్రోకింగ్‌

ఇదీ ఇన్వెస్ట్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ లాంటిదే. ఫినాన్స్‌లో పట్టున్నవారికి స్టాక్‌ బ్రోకింగ్‌ లాభదాయకమైన, గౌరవనీయమైన వృత్తిగా చెప్పుకోవచ్ఛు కంపెనీల స్టాక్‌లు, షేర్లను అమ్మడం, కొనడం ద్వారా కొంత మొత్తాన్ని సంపాదించడమే స్టాక్‌ బ్రోకింగ్‌ లక్ష్యం. ఏ కంపెనీల షేర్లను కొనాలి, వాటిని ఎప్పుడు అమ్మాలి, కొనుగోలుకు, అమ్మకానికి ఏది ఉత్తమ సమయం వంటివన్నీ వీరు వివిధ ప్రామాణికాల ఆధారంగా నిర్ణయించి క్లయింట్లకు సూచిస్తారు. ఇందుకోసం కంపెనీల ఉత్పత్తుల్లో నాణ్యత, ఆ కంపెనీల తాజా నిర్ణయాలు, ఆ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌, వాటి భవిష్యత్తు లక్ష్యాలు, ఆ రంగంలో ఉన్న పోటీ... తదితర కోణాల్లో సమాచారాన్ని సేకరించి ఒక అంచనాకు వస్తారు. ప్రస్తుత మార్కెట్‌ స్థితిగతులపై వీరికి పట్టుండాలి. ఎనలిటికల్‌, స్టాటిస్టికల్‌ స్కిల్స్‌, స్టాక్‌ మార్కెట్‌పై అవగాహన తప్పనిసరి.

విద్యా నేపథ్యం: స్టాటిస్టిక్స్‌, ఎకనామిక్స్‌, మ్యాథ్స్‌, ఫినాన్స్‌ నేపథ్యం ఉన్నవారు స్టాక్‌ బ్రోకింగ్‌లో రాణించవచ్ఛు స్టాక్‌ బ్రోకింగ్‌, స్టాక్‌ ఎనాలిసిస్‌, స్టాక్‌ మార్కెట్‌ రిసెర్చ్‌కు సంబంధించి షార్ట్‌ టర్మ్‌, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులూ ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) అందించే కోర్సుల్లో చేరి ప్రావీణ్యం పొందవచ్ఛు


రిస్క్‌ మేనేజ్‌మెంట్‌

ఆర్థిక ఫలాలు పొందడానికి సంస్థలు పెట్టుబడులు పెంచుకోవాలి. అనుకోని నష్టాలను తగ్గించుకోవడానికి వ్యూహాలను అనుసరించాలి. ఇలాంటి విధులను నిర్వహించే వారే రిస్క్‌ మేనేజర్లు. వీరు సంస్థలకు కన్సల్టెంట్లుగానూ వ్యవహరిస్తారు. కంపెనీల పెట్టుబడులు ఎంతవరకు సురక్షితం, నష్టాలకు ఉన్న అవకాశాలు, నష్టాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి.. మొదలైన వాటిని సూచిస్తారు. విజన్‌, మిషన్‌తో కూడిన బిజినెస్‌ మోడల్‌ను కంపెనీలకు అందిస్తారు. ఇందుకోసం గణితం, తర్క నైపుణ్యం అవసరం.

విద్యా నేపథ్యం: మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌ సబ్జెక్టుల్లో గట్టి పట్టున్నవారు రిస్క్‌ మేనేజ్‌మెంట్‌లో రాణించవచ్ఛు రిస్క్‌ మేనేజ్‌మెంట్‌కూ కోర్సులు ఉన్నాయి. ఎంబీఏలో స్పెషలైజేషన్‌గా, పీజీ డిప్లొమా కోర్సుగా అందిస్తున్నారు. ఐఐఆర్‌ఎంతోపాటు మరికొన్ని సంస్థలు ఈ కోర్సులకు పేరు పొందాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని