Published : 25 May 2020 01:17 IST

క్యాంపస్‌కి వెళ్లకున్నాకూపీ లాగొచ్చు!

కళాశాలల ఎంపికకు పరోక్ష మార్గాలెన్నో

వృత్తివిద్యకైనా, సాధారణ డిగ్రీకైనా ఉత్తమ కళాశాలలోనే చేరాలనేది విద్యార్థుల కోరిక. వారి తల్లిదండ్రుల ఆకాంక్ష. లాక్‌డౌన్‌ కారణంగా ప్రవేశపరీక్షలన్నీ ఆలస్యంగా జరగబోతున్నాయి. ఒకసారి పరిస్థితి మెరుగయ్యిందంటే అడ్మిషన్‌ప్రక్రియల్లో వేగం పెరుగుతుంది. అప్పుడు తీరా కాలేజీలకు నేరుగా వెళ్లి చూసి, నిర్ణయం తీసుకునేంత వ్యవధి ఉండకపోవచ్ఛు అందుకే ఇప్పటినుంచే కళాశాలల ఎంపికపై దృష్టిపెట్టటం మేలు. విద్యాసంస్థలు తెరుచుకునేదాకా వేచి ఉండకుండా కళాశాలల స్థితిగతులపై ఓ అంచనాకు రావటానికి బోలెడు పరోక్ష మార్గాలున్నాయ్‌!

న్నతవిద్యలోకి అడుగు పెట్టబోతున్నామనగానే.. కోర్సు ఎంపిక ఒక ఎత్తయితే.. కళాశాల ఎంపిక ఇంకో సమస్య. బాగా నచ్చిన కొన్ని కళాశాలలను జాబితాగా రాసుకుని.. వరసగా వాటిని సందర్శించటం విద్యార్థులూ, తల్లిదండ్రులూ చేసే పని. కళాశాల భవనం, పరిసరాలు, గ్రౌండ్‌, లైబ్రరీ మొదలైనవి చూసేసి, సంబంధిత ఫ్యాకల్టీతో, సీనియర్‌ విద్యార్థులతో మాట్లాడి..బాగా నచ్చిన కాలేజీని ఎంపిక చేసుకోవడం! సాధారణ పరిస్థితిలో ఉండే అవకాశమిది! మరి ఇప్పుడు?

ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులందరూ కళాశాల ఎంపిక విషయంలో ప్రత్యేక దృష్టిపెడతారు. ఎక్కువ శాతం విద్యార్థులు, తల్లిదండ్రులు నేరుగా పరిశీలించాకే నిర్ణయం తీసుకోవడానికి సుముఖంగా ఉంటారు. గత ఏడాది ఒక సంస్థ చేసిన సర్వే ప్రకారం 70% విద్యార్థులు, 84% తల్లిదండ్రులు ఈవిధమైన ఎంపికకే ప్రాధాన్యమిస్తున్నారు.

అందులో భాగంగా.. బాగా అనిపించిన, ఎంచుకున్న కోర్సుకు తగిన కళాశాలల వివరాలను సేకరించి పెట్టుకోవడం, వాటిని నేరుగా సందర్శించి ఆపై నిర్ణయం తీసుకోవడం వంటివి చేస్తుండేవారు. కొన్ని కళాశాలలైతే ఎంపిక చేసిన నగరాల్లో ఏర్పాటు చేసే ఎడ్యుకేషన్‌ ఫేర్‌లలో తమ వివరాలను ప్రదర్శించేవి. లాక్‌డౌన్‌ కారణంగా వీటన్నింటికీ కళ్లెం పడింది. సాధారణ పరిస్థితిలో వీటన్నింటికీ కొంత సమయం అందుబాటులో ఉండేది.కానీ ఇప్పుడు ప్రవేశపరీక్షల తర్వాత అంత వ్యవధి ఉండే అవకాశం తక్కువ.

కాలేజ్‌ వెబ్‌సైట్లు

ఏదైనా కళాశాల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే మొదటి అడుగు- దాని అధికారిక వెబ్‌సైట్‌. అయితే హోం పేజీ వరకే చూసి వదిలేయకూడదు. సాధారణంగా కళాశాల సందర్శకులు ఎక్కువగా చూసే అంశాలనే హోం పేజీలో పెడుతుంటారు. కళాశాల గురించి ఎక్కువగా అవగాహన తెచ్చుకోవాలంటే మాత్రం లోతుగా అన్ని అంశాలనూ పరిశీలించాలి. ఎక్కువ సమయం దీనికి కేటాయించాలి. కళాశాలను నేరుగా చూడటానికి వెళ్లినపుడు ఎలాంటి సందేహాలు వస్తాయో వాటికి సమాధానాలు ఇక్కడ దొరుకుతాయేమో చూసుకోవాలి.

ఉదాహరణకు: ● ప్రవేశ ప్రక్రియకు కావాల్సినవేంటి? ఫీజు వివరాలు ● నచ్చిన కోర్సులు ఇక్కడ ఉన్నాయా? కేవలం విద్యకే ప్రాముఖ్యమా? ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ ఆక్టివిటీస్‌కు ప్రాముఖ్యమిస్తున్నారా? స్కాలర్‌షిప్‌ అవకాశాలు ● క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు మొదలైనవి.

వారు పెట్టిన సమాచారానికే పరిమితం కావొద్ధు వెబ్‌సైట్‌లో కళాశాలకు సంబంధించిన పెట్టిన ఫొటోలు, వీడియోలనూ పరిశీలించాలి. ఇవి సాధారణంగా యాజమాన్యం ఏ అంశాలకు ప్రాధాన్యమిస్తుందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. తాము కోరుకునే అంశాలు అందించే వీలు ఉందో లేదో తెలుసుకోవాలి.

అలాగే ఉపాధ్యాయులు, వారి అర్హతలు, డిపార్ట్‌మెంట్‌ వారీ వివరాలపైనా దృష్టిపెట్టాలి. చర్చల ద్వారా బోధన/ లెక్చర్‌ ఆధారితం/ ప్రాక్టికల్‌ ఆధారిత బోధన..ఏది అమలవుతోందో పరిశీలించుకోవాలి. ఎంచుకున్న కోర్సునుబట్టి ప్రాజెక్టులు, పరిశ్రమల సందర్శన వంటి వాటికి ఆస్కారం ఉందేమో కూడా తెలుసుకోవాలి.

కళాశాల సిబ్బందితో మాట్లాడటం

కళాశాలకు సంబంధించి క్షుణ్ణంగా తెలుసుకోవడానికి కళాశాల అడ్మిషన్‌ విభాగం/ రెప్రజెంటేటివ్‌తో ఫోన్‌ ద్వారా మాట్లాడొచ్ఛు సాధారణంగా వీరి వివరాలు కళాశాల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అవసరమైన వివరాలను మెయిల్‌ చేయమనీ అడగొచ్ఛు కళాశాల తాజా వివరాలను బ్రోషర్‌/ బుక్‌లెట్‌ రూపంలో ఏటా తయారు చేస్తుంటారు. ప్రస్తుత పరిస్థితిపై అవగాహనకు ఇవి సాయపడతాయి.

విద్యార్థుల అభిప్రాయమేంటి?

ఎంత చదివినా, ఎంత చూసినా నేరుగా అందులో చదివినవారి ద్వారా తెలుసుకున్న సమాచారానికి విలువ ఎక్కువ. ఇప్పటికే చదువుతున్నవారు ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా చెప్పగలుగుతారు. లెక్చరర్లు, బోధన విధానం వగైరా వాటిని వీరి నుంచి తెలుసుకోవచ్ఛు కళాశాల ద్వారా విద్యార్థి పొందగల లాభాలు- ఇంటర్న్‌షిప్‌లు, ప్రాంగణ నియామకాలు మొదలైనవాటిని ఇటీవలే చదువు పూర్తిచేసుకున్నవారు చెప్పగలుగుతారు. కళాశాలలు తమ పూర్వవిద్యార్థులతో క్లబ్‌లు వంటివి నడుపుతుంటాయి. లేదా వారే స్వయంగా ఒక అసోసియేషన్‌గా ఏర్పడుతున్నారు. వీరు తమ జూనియర్లకు ఉద్యోగం, ప్రాజెక్టుల పరంగా దిశానిర్దేశం చేస్తుంటారు. కళాశాల వెబ్‌సైట్‌ల్లో ప్రతిభ చూపిన విద్యార్థుల సమాచారం లభిస్తుంది. వారిని సంప్రదించొచ్ఛు సోషల్‌ మీడియాలో వెతికినా ప్రయోజనం ఉంటుంది. స్టూడెంట్‌ ఫేస్‌బుక్‌ గ్రూప్స్‌ లేదా లింక్‌డిన్‌లో వెతకి వారితో మాట్లాడవచ్ఛు అడ్మిషన్‌ అధికారిని అడగడం ద్వారా కూడా కొంతమందిని పరిచయం చేసుకోవచ్చు.

సోషల్‌ మీడియా

కళాశాలలూ, విశ్వవిద్యాలయాలూ తమ వెబ్‌సైట్లను అప్పుడప్పుడే అప్‌డేట్‌ చేస్తుంటాయి. కానీ తమ సోషల్‌ మీడియా వేదికలపై తరచూ దృష్టిపెడుతుంటాయి. ఇప్పుడు ఇది సాధారణమైంది కూడా. క్యాంపస్‌లో తాజా అంశాలను తెలుసుకునే వీలు ఇక్కడ కలుగుతుంది. అధికారిక వెబ్‌సైట్‌లో దొరకని సమాచారమూ ఇక్కడ లభిస్తుంది. విద్యార్థుల విజయ గాథలు, పూర్వవిద్యార్థుల అభిప్రాయాలు, క్యాంపస్‌ తాజా ఫొటోలు వంటివన్నీ ఇక్కడ పెడుతుంటారు.

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలో కళాశాల/ విశ్వవిద్యాలయం పేరుతో వెతికి, టైంలైన్‌లో ఉన్న సమాచారాన్ని పరిశీలించండి. కొన్ని, వారాలు/ నెలల సమాచారం పరిశీలిస్తే కళాశాల ప్రాముఖ్యం- విద్య, సామాజికాంశాలు, కల్చరల్‌ అంశాల్లో దేనికి ఇస్తుందో అర్థమవుతుంది. కొన్ని కళాశాలలు కేవలం ఒక అకౌంట్‌కే ప్రాముఖ్యం ఇవ్వొచ్ఛు మరికొన్ని అందుబాటులో సామాజిక మాధ్యమాలన్నీ ఉపయోగిస్తుండొచ్ఛు విద్యార్థి తన వీలును బట్టి, ఒకటి లేదా రెండింటిలో ఈ సమాచారాన్ని పరిశీలించుకోవచ్చు

కోరా లాంటి సైట్లలో విద్యార్థులు విద్యాసంస్థల స్థితిగతులపై రివ్యూలు రాస్తుంటారు. వాటిని గమనించవచ్ఛు ఆన్‌లైన్‌లో దొరికే ఏ సమాచారాన్నయినా యథాతథంగా నమ్మకూడదు. వీలైనంతగా క్రాస్‌చెక్‌ చేసుకోవటం తప్పనిసరి.

వర్చువల్‌ టూర్‌

కళాశాల అంటే కేవలం భవనం కాదు. తరగతి గది వాతావరణం, పరిసరాలు, మైదానం, గ్రంథాలయం, ప్రయోగశాలలు.. ఇంకా ఎన్నో! కొన్నేళ్లపాటు చదువును ఫలవంతంగా పూర్తి చేయాలంటే అందుకు తగ్గ అనుకూల వాతావరణం ఉండాలి. చాలామంది నేరుగా వెళ్లేది కూడా ఈ అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించడానికే. ఆ అవకాశం లేనివారికి వీలుగా ఇప్పుడు చాలా ప్రముఖ సంస్థలు వర్చువల్‌ టూర్‌ వీలు కల్పిస్తున్నాయి. మెయిల్‌ ద్వారా సంప్రదిస్తే లింకు ద్వారా వర్చువల్‌ టూర్‌ అవకాశాన్ని కల్పిస్తాయి. అన్ని కళాశాలల్లోనూ వర్చువల్‌ టూర్‌ అవకాశం ఉండకపోవచ్ఛు అప్పుడు వివిధ వెబ్‌సైట్‌లు, సామాజిక మాధ్యమాల్లో కళాశాలలకు సంబంధించిన సమాచారం చూడొచ్ఛు వాటిల్లో ఉంచిన ఫొటో స్లైడ్‌లపై ఆధారపడొచ్ఛు విద్యార్థులూ యూట్యూబ్‌ ద్వారా ఈ సమాచారాన్ని పంచుకుంటున్నారు. వాటిని పరిశీలించుకోవచ్చు.

ఇలా చేయొద్దు

చాలామంది స్నేహితులు ఎంచుకున్నారనో, వారితో గడపొచ్చనో లేదా ఎవరైనా చెప్పారనో కళాశాలను మరో ఆలోచనేమీ లేకుండా ఎంచుకుంటుంటారు. ఇంకొన్నిసార్లు అన్నలు, అక్కలు, బంధువులూ ఇదివరకే చదివారనో ఎంచుకుంటుంటారు. సొంత పరిశోధన చేయకుండా ఎంచుకోకూడదు.

విద్యార్థులను ఆకర్షించడానికి కొన్ని కళాశాలలు ప్రారంభోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటాయి. ఇలాంటి పైమెరుగులకు మోజుపడి చేరొద్దు.

ప్రతి ఒక్కరికీ నచ్చిన ప్రాంతాలు ఉంటాయి. అక్కడ ఉండొచ్చనే భావనతో వివరాలేమీ తెలుసుకోకుండా ఆ ప్రాంతంలోని కాలేజీలో చేరాలనుకోకూడదు. అదీ మంచి పద్ధతి కాదు.

ప్రముఖులు చదివారనో, ఎక్కువ ర్యాంకులు వచ్చాయనో చూసి చేరొద్ధు మొత్తంగా భవిష్యత్‌ ఎలా ఉన్నదే ముఖ్యం తప్ప ఏ ఒక్కరో పేరు సాధిస్తే సరిపోదు కదా!

కోరుకున్న కోర్సు దొరికితే చాలనుకోకూడదు. సరైన బోధన లేనపుడు ఎంత మంచి కోర్సు చదివినా ప్రయోజనం ఉండదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని