Published : 28 May 2020 00:22 IST

గుర్తుకు తెచ్చుకుంటే.. మార్కులు పెరిగినట్టే!

టెన్త్‌ పరీక్షల చివరిదశ ప్రిపరేషన్‌ వ్యూహం

ఒక వాహనం గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. అకస్మాత్తుగా ఎవరైనా అడ్డం వచ్చి బ్రేకు పడింది. ఫలితంగా.. వేగం తగ్గిపోయింది. మళ్లీ అంతకు ముందు వేగం అందుకోవాలంటే కొన్ని సెకన్ల సమయం సరిపోతుంది. ఇప్పుడు పదో తరగతి విద్యార్థులదీ ఇదే పరిస్థితి. అందరూ పరీక్షలకు బాగా సన్నద్ధమయ్యారు. తెలుగు, హిందీ పరీక్షలు పూర్తయ్యాయి. మిగతావి కరోనా కల్లోలంతో ఆగిపోయాయి. రెండు నెలల తర్వాత జూన్‌ 8 నుంచి జరగబోతున్నాయి. అదే స్ఫూర్తిని కొనసాగించగలమా అనే సందేహం చాలామంది విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. గతంలో చదివినవే కాబట్టి చక్కటి ప్రణాళిక, వ్యూహంతో వాటిని గుర్తు చేసుకుంటే మంచి మార్కులు తేలిగ్గా సంపాదించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఓరియంటల్‌, ఒకేషనల్‌ పరీక్షలను పక్కనబెడితే విద్యార్థులు పరీక్ష రాయాల్సింది నాలుగు సబ్జెక్టులు. ఆంగ్లం, గణితం, సామాన్యశాస్త్రం, సాంఘికశాస్త్రం. ఒక్కో దానికి రెండు చొప్పున మొత్తం ఎనిమిది పేపర్లు. చివరగా సాంఘిక శాస్త్రం పేపర్‌-2తో జూన్‌ 29న పరీక్షలు ముగుస్తున్నాయి. పరీక్షలు ప్రారంభం కావడానికి 10 రోజుల వ్యవధి ఉంది. పరీక్షలు ప్రారంభమైన తర్వాత కూడా 20 రోజులపాటు అదే మూడ్‌లో ఉండటం అవసరం. నేర్చుకున్న పాఠ్యాంశాలు మర్చిపోతామేమో అనే భయమూ, సందేహమూ పక్కనపెట్టాలి. నేర్చుకున్నవి మరచిపోయినట్లు అనిపించినా కొద్దిపాటి ప్రయత్నంతో తేలిగ్గా గుర్తుతెచ్చుకోవచ్చంటున్నారు నిపుణులు. ఒకసారి పాఠాలను చూసుకుని శ్రద్ధగా మననం చేసుకుంటే వాటంతట అవే గుర్తొస్తుంటాయి. ఇప్పటివరకూ అనిశ్చితితో గందరగోళ పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు ఇప్పుడు లాక్‌డౌన్‌ విరామానికి సంబంధించిన అలసత్వాన్ని వదిలించుకోవాలి. ఉన్న సమయాన్ని గరిష్ఠంగా సద్వినియోగపరుచుకుంటే ఏడాది మొత్తం చేసిన శ్రమకు మార్కుల ఫలితం లభిస్తుంది.


ఒక్కో పరీక్షకు రెండు రోజుల వ్యవధి

ఈసారి ఒక్కో పరీక్ష మధ్య రెండు రోజుల వ్యవధి ఇచ్చారు. అంటే ఒక పేపర్‌ ముగిసిన తర్వాత రెండు రోజులు సమయం ఉంటుంది కాబట్టి తర్వాత జరిగే పరీక్షకు సన్నద్ధం కావచ్ఛు ఇప్పటికే చదివిన సబ్జెక్టు కావడంతో ప్రధానాంశాలను ఒకసారి పునశ్చరణ చేసుకుంటూ వెళ్లాలి.


ప్లానింగ్‌.. ప్రిపరేషన్‌.. ప్రెజెంటేషన్‌

కొద్దిగా పరిశీలిస్తే ఎవరి బలాలు ఏమిటో, బలహీనతలు ఏమిటో వారికి తెలుస్తాయి. అంటే ఏ సబ్జెక్టు బాగా చదివామో? ఎక్కడ వెనకబడ్డామో? దేన్ని సరిగా చదవలేదో తెలుస్తుంది. నిజాయితీగా సమీక్షించుకొని ఈ పది రోజుల ప్రణాళికను పకడ్బందీగా వేసుకోవాలని ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు నిపుణులైన ఏనుగు ప్రభాకర్‌రావు (కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం, ఒద్యారం), ప్రభుదయాల్‌ (ఖమ్మం జిల్లా, మధిర) సూచిస్తున్నారు.

* ఈ కొద్ది రోజుల్లో పరీక్షల కోసం 3 ‘పీ’లను అనుసరించాలి. అవి ప్లానింగ్‌ (ప్రణాళిక), ప్రిపరేషన్‌ (సన్నద్ధత), ప్రెజెంటేషన్‌ (సమర్పణ). అధిక మార్కులు సాధించాలంటే ఈ మూడింటినీ మెరుగ్గా పాటించడం ముఖ్యం.

* పాఠ్యాంశాల పునశ్చరణకు వీలుగా సొంతగా టైంటేబుల్‌ రూపొందించుకొని చదవాలి. తక్కువ సమయంలో ఎక్కువ చదవాల్సివుందని ఆందోళనకు గురికావొద్ధు ఇంతకు ముందు చదివినవే కాబట్టి ప్రణాళిక ప్రకారం వేగంగా అవగాహనతో చదవడం ముఖ్యం.

* చివరగా జరిగే సాంఘిక శాస్త్రాన్ని ముందుగా చదివితే మంచిది. ఆ తర్వాత వరుసగా సామాన్యశాస్త్రం, గణితం, ఆంగ్లం సబ్జెక్టులను పూర్తి చేయడం లాభిస్తుంది. అప్పుడు ఆంగ్లం పరీక్షకు ముందు ఆంగ్లాన్ని పూర్తి చేయవచ్ఛు దీన్ని కచ్చితంగా పాటించాలనేం లేదు. ఉదాహరణకు సాంఘికశాస్త్రంపై మంచి పట్టుంటే పరీక్షకు ముందు రెండు రోజుల్లో చదువుకోవచ్ఛు పరీక్షల ప్రారంభానికి ముందు మిగిలిన రోజులను మిగిలిన 3 సబ్జెక్టులకు కేటాయించుకోవచ్ఛు

* ఇదివరకే పూర్తి స్థాయిలో అన్ని పాఠ్యాంశాల్నీ చదివి ఉన్నవారు అన్ని పాఠాల్లో కీలకాంశాలు, వ్యాకరణాంశాలు, ఆబ్జెక్టివ్‌ టైపు ప్రశ్నలపై దృష్టి పెట్టాలి.

* పాఠాలను చదివిన తర్వాత ప్రశ్నలను ఊహించుకొని ‘ఫలానా ప్రశ్న వస్తే జవాబు రాయగలనా?’ అని కళ్లు మూసుకొని మననం చేసుకోవాలి. బ్రేక్‌ పడితే ఎక్కడ సందేహం ఉందో దానిపై దృష్టి సారించి మరోసారి చదివి పట్టు సాధించాలి.

* గత మాదిరి ప్రశ్నపత్రాలు, పార్ట్‌-బిలను అభ్యాసం చేయాలి.

* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాల్లోని కామన్‌ పరీక్షల బోర్డు అధికారులు యూట్యూబ్‌, టీశాట్‌లో ఉంచిన అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలను చూస్తే మరింత స్పష్టత వస్తుంది.


పరీక్ష రాసే ముందు..

* ప్రశ్నపత్రం పూర్తిగా చదవాలి. అడిగిన ప్రశ్న, దానికి ఇచ్చిన మార్కులు, జవాబు ఎలా? ఎంత? రాయాలో ముందుగానే నిర్ణయించుకోవాలి.

* ప్రశ్నపత్రం చేతుల్లోకి తీసుకోగానే హడావిడిగా రాయడం మొదలుపెట్టకూడదు. మొదటి 15 నిమిషాలను ప్రశ్నపత్రం చదవడానికి ఉపయోగించాలి. ప్రశ్నల సరళిని అర్థం చేసుకోవడంతోపాటు రాయడానికి ఒక ప్రణాళిక ఏర్పరుచుకోవాలి.

* సీసీఈ విధానం కావడంతో ప్రశ్నలు నేరుగా (డైరెక్టుగా) ఉండవు. కొన్ని తిప్పి అడగవచ్ఛు వాటిని అర్థ.ం చేసుకొని జవాబులు రాయడం ప్రారంభించాలి.

* ప్రశ్నపత్రంలో చాయిస్‌ ఉన్నప్పుడు ప్రశ్నల ఎంపిక సరిగా ఉండాలి.

* కఠినంగా ఉన్న ప్రశ్నలపై ఆందోళన వద్ధు మొదట సులభంగా ఉన్న ప్రశ్నలకు జవాబులు రాసిన తర్వాత కఠిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.

* సమయంపై దృష్టి పెట్టాలి. దేనికి ఎంత సమయం కేటాయించాలో నిర్ణయించుకోవాలి. ప్రతి 30 నిమిషాలకు గంట కొడతారు. పరీక్ష ముగిసే 5 నిమిషాల ముందు కాషన్‌ బెల్‌ కొడతారు. కాబట్టి కంగారు లేకుండా రాయాలి.

* ప్రశ్నల గురించి ఎక్కువ ఆలోచించ వద్ధు మార్కుల ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయాలి.

* జవాబులు రాయడం పూర్తయిన తర్వాత అన్నింటికీ రాశారా? ప్రశ్నల సంఖ్య వేశారా? జవాబుల్లో అంకెలు సరిగ్గా రాశారో? లేదో? సరిచూసుకోవడం చాలా అవసరం.

* సైడ్‌ హెడింగ్‌లను కలంతో అండర్‌లైన్‌ చేయాలి. మార్జిన్లను పాటించాలి. కోడ్‌ పదాలను రాయకూడదు. పదాలు, వాక్యాలు పూర్తిగా రాయాలి. ముఖ్యంగా చేతి రాత బాగుంటే మూల్యాంకనం చేసే ఉపాధ్యాయుడు త్వరగా మీ జవాబులు సరైనవి గుర్తిస్తారు.


ఏ సబ్జెక్టులో ఏవి ముఖ్యం?

ఆంగ్లం: పేపర్‌-1 ప్రశ్నలన్నీ పాఠ్యపుస్తకం నుంచే ఉంటాయి. అందువల్ల పాఠ్యపుస్తకంపై అవగాహనతో చదివితే అధిక మార్కులు సాధించుకోవచ్ఛు అందుకే దీన్ని స్కోరింగ్‌ పేపర్‌గా భావిస్తారని రాజన్న సిరిసిల్లలోని గాలిపెళ్లి ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు పి. శ్రీధర్‌ చెబుతున్నారు. దీంట్లో మొత్తం 15 మార్కులకు ప్యాసేజ్‌లు ఉంటాయి. పేపర్‌-2 విద్యార్థి పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఉంటుంది. అందుకని అర్థం చేసుకుంటూ చదివితే మంచి మార్కులు పొందవచ్ఛు రెండింట్లోనూ గ్రామర్‌ భాగం ఉంటుంది. సాధ్యమైనన్ని ప్రశ్నలకు జవాబులు రాసే ప్రయత్నం చేయాలి. కొద్దిగానే తెలుసని వదిలేయకూడదు. వచ్చింది రాస్తే కొన్ని మార్కులైనా వేస్తారు. ఉదాహరణకు డెయిరీ రాయటం రాదనుకోకుండా మార్జిన్‌ వదిలి, శీర్షిక పెట్టినా కనీసం ఒక మార్కు వస్తుంది. ప్రయత్నలోపం లేకుండా చదవటం, పరీక్షలో ఎక్కువ ప్రశ్నలకు జవాబులు రాయటం చాలా ముఖ్యం.

సాంఘికశాస్త్రం: పటాలపై శ్రద్ధ వహిస్తే మొత్తం 12 మార్కులు సంపాదించుకోవచ్ఛు రెండు పేపర్లలో ఈ మ్యాప్‌ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌లో ఆరు మార్కులకు మ్యాప్‌ ఇస్తారు. తెలంగాణ, భారతదేశ పటాలు గీయడం నేర్చుకోవాలి. అంతేకాకుండా భారతదేశం, ప్రపంచ పటాల్లో వివిధ ప్రాంతాలు, నగరాలు, దేశాలు గుర్తించడం తెలుసుకోవాలి. కొన్ని పరోక్షంగా అడుగుతారు. ఉదాహరణకు యూఎన్‌ఓ కార్యాలయం ఎక్కడ ఉంది? హిట్లర్‌ జన్మించిన దేశాన్ని గుర్తించండి.. అని అడగవచ్ఛు ముఖ్యమైన సంవత్సరాలు, వ్యక్తులు, ప్రాంతాల పేర్లు బాగా గుర్తు పెట్టుకొని రాయాలి. తప్పులు రాస్తే ఆ ప్రభావం మొత్తం జవాబుపై పడుతుందని సబ్జెక్టు నిపుణుడు ప్రభాకర్‌రావు చెబుతున్నారు.

సామానశాస్త్రం: గత ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నల సరళిని అర్థం చేసుకుంటే ఈ సబ్జెక్టులోని భౌతికశాస్త్రానికి చాలావరకు ఎలా సన్నద్ధమవ్వాలో తెలుస్తుంది. ప్రతి పాఠంలోని ప్రయోగాలను పరిశీలించాలి. ప్రయోగ ఉద్దేశం, పరికరాలు, విధానం, జాగ్రత్తలు, ఫలితం వంటివి శ్రద్ధగా చదవాలి. ముఖ్యంగా ఏదైనా ఒక సందర్భాన్ని ఆధారం చేసుకొని పటం గీయడం, ఇచ్చిన పటంలో లోపాన్ని సరిచేసి మళ్లీ గీయడం లాంటివి సాధన చేయాలి. అసంపూర్తిగా ఉన్న పటాన్ని పూర్తిచేయాలి. ముఖ్యమైన ప్రశ్నలు, అధ్యాయాలు అనే భావన విడనాడి పాఠ్య పుస్తకాన్ని మొత్తం క్షుణ్ణంగా చదవాలి. పార్టు-బి కోసం ప్రత్యేకంగా సాధన చేయాల్సిన అంశాలు ఏమీ ఉండవు. ప్రతి పాఠంలోని ప్రతి అంశాన్నీ సమగ్రంగా అధ్యయనం చేస్తే సులభంగా రాయవచ్చని కొత్తగూడెం జిల్లాకు చెందిన సబ్జెక్టు నిపుణుడు ఎ.నాగరాజ శేఖర్‌ సూచిస్తున్నారు. ఇక జీవశాస్త్రంలో ముఖ్యమైన బొమ్మలు, వాటిలోని భాగాలను, వాటి విధులను గుర్తించే విధంగా అభ్యాసం చేయాలని ఖమ్మం జిల్లాకు చెందిన నిపుణుడు కె.రామారావు చెప్పారు. వివిధ అంశాల మధ్య తేడాలపై స్పష్టత ఉండాలి. ఉదాహరణకు కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ; సమ విభజన-క్షయకరణ విభజన వంటివి.

గణితశాస్త్రం: లాక్‌డౌన్‌ సమయంలో విద్యార్థులు గణితానికి దూరం కావాల్సి వచ్చినా అంత భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి నేర్చుకున్న విషయాన్ని పూర్తిగా ఎప్పుడూ మరిచిపోమని అంటున్నారు కరీంనగర్‌ జిల్లా గర్షకుర్తి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, గణితం నిపుణుడు కర్రా అశోక్‌రెడ్ఢి మళ్లీ ఒకసారి సాధన చేస్తే అన్ని విషయాలూ గుర్తుకు వస్తాయి. ముఖ్యమైన భావనలు, సూత్రాలు గుర్తుంచుకోవాలి. సాధన పూర్తిగా రాకపోయినా దత్తాంశం, సారాంశం, పటం, సూత్రం, పద్ధతి రాసినా కొన్ని మార్కులు వస్తాయి. 10 గ్రేడ్‌ సాధించాలంటే అన్ని అధ్యాయాలపై పట్టు సాధించాలనీ, అధ్యాయాల వారీగా మార్కుల వెయిటేజీ లేదనీ ఆయన తెలిపారు.

- పి. బాపనయ్య, ఈనాడు, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts