కొత్త పరిస్థితుల్లో కెరియర్ వ్యూహం
అదనపు అర్హతలూ నైపుణ్యాలూ అనివార్యం
తరగతులు ఆగిపోయి.. పరీక్షలు వాయిదా పడి.. నియామకాలు నిలిచిపోయి.. కొలువులు కరిగిపోయి... కరోనా మహమ్మారి విద్యా ఉద్యోగ రంగాల్లో కల్లోలమే నింపింది. పరిస్థితులు కుదుటపడటం ఎంతోకొంత మొదలయింది. రేపటి కోసం.. మెరుగైన భవిత కోసం.. విద్యార్థులూ.. ఉద్యోగార్థులూ ఏం చేయాలి? ఏం నేర్చుకోవాలి? నిపుణుల సూచనలివిగో!
ఉద్యోగాల తీరుతెన్నులపై కొవిడ్-19 పెను ప్రభావం చూపుతోంది. కరోనా మహమ్మారి నియంత్రణ జరిగినప్పటికీ వాటి పర్యవసానాల మూలంగా గతకాలపు పరిస్థితులే తిరిగొస్తాయని చెప్పలేని పరిస్థితి. 2020లో కళాశాల చదువులు పూర్తి చేసుకుని బయటకు వచ్చే గ్రాడ్యుయేట్లు తమ సీనియర్లతో పోలిస్తే తొలి కొలువు సాధించే విషయంలో క్లిష్ట కాలాన్ని ఎదుర్కోబోతున్నారు.ఉద్యోగరంగం భవితను నిర్ణయించేది ‘స్కిల్లింగ్’ మాత్రమేనని రిక్రూట్మెంట్ నిపుణులు తేల్చిచెబుతున్నారు.
కొలువుల పరంగా భవిష్యత్ చిత్రం ఎలా ఉండబోతోంది? భౌతిక ప్రమేయం అవసరం లేని/తక్కువ అవసరమున్న ఉద్యోగాలకు గిరాకీ ఉంటుంది. డిజిటల్ టెక్నాలజీస్, ఆటోమేషన్, హెల్త్‌కేర్, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఉద్యోగ నియామకాలూ, క్యాంపస్ ప్లేస్మెంట్లూ విద్యార్హతలకు తోడు నైపుణ్య ఆధారితంగానే ఉంటాయి. ప్రస్తుతం గిరాకీ ఉన్న నైపుణ్యాల్లో 35 శాతం కేవలం ఐదేళ్లకే మారిపోతాయని వరల్డ్ ఎకనమిక్ ఫోరం చెప్తోంది. అందుకే పరిణామాలను గమనిస్తూ నిరంతరం నూతన నైపుణ్యాలను నేర్చుకుంటూ ఉండాల్సిందే.
విద్యార్థులూ, ఉద్యోగార్థులూ సాంకేతిక, డొమైన్ నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవటం తప్పనిసరి.
* టెన్త్, ఇంటర్మీడియట్ పూర్తిచేసినవారు తగిన టెక్నీషియన్ స్థాయి కోర్సుల్లో ప్రవేశించవచ్ఛు
* డిప్లొమా, ఐటీఐ హోల్డర్లు సూపర్వైజరీ ప్రోగ్రాముల్లో చేరటం మేలు.
* ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, ఇతర గ్రాడ్యుయేట్లూ మేనేజీరియల్ ప్రోగ్రాములు చేయటం మంచిది.
కరోనా ప్రభావంతో నియామక ప్రక్రియల్లో స్తబ్ధత ఏర్పడింది. ఏర్‌లైన్స్, ట్రావెల్ అండ్ టూరిజం, హాస్పిటాలిటీ, రిటెయిల్, ఎంటర్టైన్మెంట్, ఈ-కామర్స్ లాంటి పరిశ్రమలతో పోలిస్తే ఐటీ, ఫార్మాస్యూటికల్, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌లు తక్కువ ప్రభావానికి గురయ్యాయని కొన్ని సర్వేల్లో తేలింది. ఉద్యోగార్థుల్లో చాలామంది మెరుగైన అవకాశాల కోసమూ, కెరియర్ ఎదుగుదల కోసమూ లాక్డౌన్ విరామ సమయంలో కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటుండటం ఓ సానుకూలమైన అంశం. ఉచితంగా లభించే మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సుల (మూక్స్) కారణంగా నేర్చుకోవటం ఎంతో సులభమైపోయింది.
ఇవి ఉంటే ఢోకా లేనట్టే!
ఈ కరోనా విపత్కాలంలో కొన్ని నైపుణ్యాలు అధిక ప్రాముఖ్యం పొందాయి. ఏ రకమైన కోర్సులు చేసేవారైనా వీటిని అలవర్చుకోవటం, మెరుగుపర్చుకోవటంపైనే వారి ఉజ్వల భవిత ఆధారపడివుంటుంది.
1 దారి చూపి నడపాలి
కరోనా అనంతర కాలంలోనూ చాలా పరిశ్రమల్లో భౌతిక దూరం పాటించటం, ఇంటి నుంచి పని..కొనసాగే అవకాశాలున్నాయి. పరిమిత కాలపు తాత్కాలిక నియామకాలు మాత్రమే జరిగే ‘గిగ్ ఎకానమీ’ క్రమంగా విస్తరిస్తుంది. విభిన్న స్థలాల నుంచి కంప్యూటర్ల ద్వారా పనిచేసే ఫ్రీలాన్స్ ఉద్యోగులు పెరుగుతారు. ఇలాంటి వివిధ బృందాలను సమన్వయం చేస్తూ అన్ని స్థాయుల్లో సమర్థంగా నేతృత్వం వహించేవారుండాలి. నాయకత్వ పటిమ, బృందాలను ప్రోత్సహించి ఉత్తేజపరిచగల సామర్థ్యం ఉన్న వ్యక్తులకు గిరాకీ ఎక్కువ.
2 సాంకేతికతపై పట్టు
సాంకేతిక నైపుణ్యాలు ఎంత ముఖ్యమో లాక్డౌన్ కాలం నిరూపించింది. కరోనానంతర కాలంలో మిమ్మల్ని ఉద్యోగాలకు చేరువ చేసే అత్యుత్తమ మార్గం... టెక్నాలజీ పరిజ్ఞానం. రాబోయేకాలంలోనూ మహమ్మారులు, అవాంతరాలు ఎదురైతే ఏఐ, బిగ్‌డేటా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, వర్చువల్ రియాలిటీ టెక్నాలజీలే కంపెనీలను ఆదుకుంటాయి. అంత కీలకమైనవి కాబట్టే వీటిపై పట్టు సాధించినవారికి పెద్ద పీట లభిస్తుంది. ఫ్యాక్టరీలు, అకౌంటింగ్ కార్యాలయాలు..మరే ఇతర సంస్థల్లో పనిచేసేవారైనా ఈ టెక్ టూల్స్‌ను సమర్థంగా ఉపయోగించగలిగితే వారికి తిరుగుండదు.
3 మార్పుతో.. నేర్పుగా..
ఆధునిక సాంకేతికత చొచ్చుకువస్తున్న ఈ రోజుల్లో కంపెనీల పని తీరులో గణనీయమైన మార్పులు వస్తున్నాయని తెలిసిందే. వాటి గమనాన్ని కొవిడ్ ఉత్పాతం మరింత వేగవంతం చేసింది. ఇకపై రిటైరయ్యేవరకూ చేసే ఉద్యోగాలుండవు. కరోనా అనంతర ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే నిరంతర మార్పులకు అనుగుణంగా వేగంగా తమను మల్చుకోవాల్సిందే (అడాప్టబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ). సరికొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ ఉన్నవాటికి ఎప్పటికప్పుడు సాన పెట్టుకోవాల్సిందే. మార్పును సానుకూలంగా స్వాగతిస్తూ బహుళ బాధ్యతల నిర్వహణకు సంసిద్ధంగా ఉండాలి.
4 ఉద్వేగాల నియంత్రణ
అనిశ్చితమైన, సవాళ్లతో కూడిన సమయాల్లో ఇమోషనల్ ఇంటలిజెన్స్ (ఈక్యూ) ప్రాధాన్యం వహిస్తుంది. ఉద్యోగులు తమ కొలువుల గురించి ఆందోళనపడే పరిస్థితుల్లో వారి భావోద్వేగ స్థితితో అనుసంధానమవటం కీలకం. అందుకే ఇంటర్వ్యూల్లో అభ్యర్థుల ఐక్యూ కంటే మించి ఈక్యూనే గమనించటం ఎక్కువవుతోంది. ఇతరుల భావోద్వేగాలను గుర్తించి, తన ఉద్వేగాలను గ్రహించి, నియంత్రణలో ఉంచుకోవటం/ ప్రకటించటమే ఈక్యూ. బలమైన ఈక్యూ ఉన్నవారు ఏ పరిశ్రమలోనైనా రాణించగలుగుతారు.
5 తర్కం.. విచక్షణ
కరోనా విపత్తు సందర్భంగా, అంతకు ముందూ ప్రధానంగా సోషల్‌మీడియాలో నకిలీ వార్తల విజృంభణ మనం చూశాం. అధ్యయనాలనూ, డేటానూ వక్రీకరించి, స్వార్థపరులు తమ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఏది వాస్తవం? ఏది కాదు? అనేది విచక్షణతో గ్రహించటం ముఖ్యం. విభిన్న వనరుల నుంచి వచ్చిన సమాచారాన్ని బేరీజు వేసుకోవాలి. ఇందుకు పక్షపాతం లేని విమర్శనాత్మక ఆలోచనా విధానం (క్రిటికల్ థింకింగ్) అవసరం. సమాచారాన్ని తార్కికంగా, హేతుబద్ధంగా విశ్లేషించే వారే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇలాంటివారినే సంస్థలు కోరుకుంటాయి.
ఫ్రెషర్లు ఇలా చేస్తే మేలు
ఆన్లైన్ అభ్యాసం: ఈ కరోనా కాలంలో ఉచితంగా, స్వల్పఫీజుతో ఎన్నో విలువైన, విస్తృతి ఉన్న కోర్సులను ఆన్లైన్లో నేర్చుకునే అవకాశం ఏర్పడింది. సద్వినియోగం చేసుకుని వీలైనన్ని సర్టిఫికేషన్లు సంపాదించాలి. ఈ అర్హతలే మిగిలినవారికంటే మిమ్మల్ని ముందు నిలుపుతాయి.
డిజిటల్ నైపుణ్యాలు: కొవిడ్ సంక్షోభం మూలంగా రిమోట్లో ఉండి పనిచేయగలిగే ఆన్లైన్ సాంకేతికత, డిజిటల్ నైపుణ్యాలకు ప్రాముఖ్యం హెచ్చింది. ఏ రకమైన కోర్సులు చేసేవారైనా సంబంధిత డిజిటల్ నైపుణ్యాలు నేర్చుకోవాలి.
ఇంటర్న్‌షిప్ అనుభవం: ఎంచుకునే డొమైన్లో కొలువు దక్కకపోయినా, తగిన వేతనం లభించకపోయినా రాజీపడాల్సిరావొచ్ఛు పని అనుభవం పొందటం ముఖ్యం. అందుకని అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్‌ల్లో గానీ, ఏదో ఒక ఉద్యోగంలో గానీ చేరిపోవటం మంచిది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TS News: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సీబీఐకి బదిలీ చేయాలా? వద్దా?: 6న హైకోర్టు తీర్పు
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Spy Balloon: అమెరికాలో చైనా బెలూన్ కలకలం.. అసలేంటీ ‘స్పై బెలూన్’..?
-
Movies News
Social Look: వెడ్డింగ్ డాక్యుమెంటరీ బిజీలో హన్సిక.. క్యాప్షన్ ఆలోచించలేక రకుల్!
-
General News
TSPSC Group 4: గ్రూప్-4కు 9.5లక్షల దరఖాస్తులు.. ప్రిపరేషన్లో ఈ టిప్స్ పాటిస్తే విజేత మీరే!
-
General News
TS High court: భారాస ఎంపీ నామా నాగేశ్వరరావుపై మనీలాండరింగ్ కేసులో యథాతథస్థితి