Updated : 03 Jun 2020 06:06 IST

సృజనాత్మకతకు  స్వాగతం!

ఇంటర్‌ తర్వాత క్రియేటివ్‌ కోర్సులు

అద్భుత డిజైన్లతో ఆకర్షించే వస్తువులు.. అలరించే రుచులతో అందంగా అందే ఆహారాలు.. కాలాన్ని కళాత్మకంగా బంధించే ఛాయా చిత్రాలు.. ప్రతి సూర్యోదయంతో చురుక్కుమనిపించే వేడి వేడి వార్తలు .. ఇవన్నీ సృజనాత్మక రూపాలు. ఆసక్తులు, అభిరుచులతో ముడిపడిన రంగాలు. హాబీల్లాగా కనిపిస్తూ మంచి ఆదాయాన్నిచ్చే ఉద్యోగాలు. మనసుకు నచ్చినట్లు పనిచేసుకోడానికి వీలుకల్పించే అవకాశాలు. వాటిని అందుకోవాలంటే కొన్ని కోర్సులు చేయాలి. అందుకు ఇంటర్మీడియట్‌ అర్హత సరిపోతుంది.

చ్చిన కెరియర్‌కు ప్రాధాన్యం ఇవ్వడానికే ఇప్పటి యువత మొగ్గుచూపుతోంది. మనసు మెచ్చిన ఉపాధిని ఎంచుకుంటే సృజనాత్మకత పెరుగుతుంది. సంతృప్తి లభిస్తుంది. చేసే పనిలోనూ కొత్తదనం కనిపిస్తుంది. నిజానికి రంగం ఏదైనా క్రియేటివిటీని ప్రదర్శిస్తే మంచి రాణింపు ఉంటుంది. ఉదాహరణకు కొన్ని నగలను చూస్తే ఆహా అనిపిస్తుంది. వాహనాలు కనిపించగానే డిజైన్‌ అద్భుతంగా ఉందని మెచ్చుకుంటారు. కొద్దిగా పెద్ద హోటళ్లు లేదా ఫంక్షన్లలో ఆహారాన్ని రుచికరంగా చేయడంతోపాటు అందంగా అలంకరిస్తారు. చూడగానే నోరూరే విధంగా ఉంటాయి. అలాగే జ్ఞాపకాలను సజీవం చేసే ఫొటోలూ, ఏకాగ్రతను కాసేపు కట్టిపడేసే అడ్వర్జైజ్‌మెంట్లు, సమాచారాన్ని సమగ్రంగా ఆవిష్కరించే కథనాలు.. ఇవన్నీ క్రియేటివిటికీ నిదర్శనాలే. ఇలాంటి వాటికీ కొన్ని కోర్సులు ఉన్నాయి. ఔత్సాహికులు అభిరుచికి అనుగుణంగా వాటిని ఎంచుకుంటే వృత్తి జీవితంలో అభివృద్ధిని అందుకోవచ్చు.

డిజైనింగ్‌

రంగం, వస్తువుతో సంబంధం లేకుండా డిజైనింగ్‌కు ప్రాధాన్యం ఉంది. ఒక ఊహ/ ఆలోచనకు భౌతిక రూపం ఇవ్వడమే డిజైనింగ్‌. డిజైనింగ్‌ అనగానే ఫ్యాషన్‌ డిజైనింగ్‌ గుర్తొస్తుంది. కానీ నగల నుంచి వస్తువులు, దుస్తులు, వాహనాలు.. ఇలా ఎన్నో విభాగాల్లో దీని ఉనికి ఉంది. సృజనాత్మకతను పని ద్వారా చూపించాలనుకునే వారికి ఇదో చక్కటి మార్గం. దీనిలోనూ.. యాక్సెసరీ డిజైన్‌, గేమ్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఇంటీరియర్‌ అండ్‌ స్పేస్‌ డిజైనింగ్‌, ఫర్నిచర్‌ డిజైనింగ్‌, ఇండస్ట్రియల్‌ డిజైన్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌/ ఆటోమోటివ్‌ డిజైన్‌, వెబ్‌ డిజైన్‌, యానిమేషన్‌ డిజైన్‌, ప్రొడక్ట్‌ డిజైన్‌, లెదర్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌, సౌండ్‌ రికార్డింగ్‌ అండ్‌ డిజైన్‌ వంటి కోర్సులున్నాయి. డిగ్రీ స్థాయిలో బి.డిజైన్‌, బీఎస్‌సీ, బీఎఫ్‌డీ, బీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంచుకున్న కోర్సును బట్టి కాలవ్యవధి మూడు నుంచి నాలుగేళ్ల వరకు ఉంటుంది. దాదాపుగా సంస్థలన్నీ తమకంటూ ప్రత్యేకమైన ప్రవేశపరీక్షను నిర్వహిస్తున్నాయి. అన్ని కోర్సులకూ ఇంటర్మీడియట్‌ ఏదైనా గ్రూప్‌తో పూర్తిచేసినవారు అర్హులు. కొన్ని టెక్నాలజీ ఆధారిత కోర్సులకు మాత్రం ఎంపీసీ తప్పనిసరిగా అడుగుతున్నారు.●

అందిస్తున్న ప్రముఖ సంస్థలు

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ, ముంబయి

ఏషియన్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌, నోయిడా

ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్‌

ద ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఆర్ట్‌ అండ్‌ యానిమేషన్‌, కోల్‌కతా

కలినరీ ఆర్ట్స్‌

అందరికీ అవసరమైంది ఆహారం. దాన్ని అందంగా, ఆకర్షణీయంగా, రుచికరంగా అందించడం కలినరీ ఆర్ట్స్‌లో భాగం. ప్రాంతీయ సంస్కృతికి ప్రాధాన్యమిస్తూనే ఆహారంలో ఆధునికతను జొప్పించడం దీనిలో కనిపిస్తుంది. దేశాల్లోనే కాదు, విదేశాల్లోనూ వీరికి ప్రాధాన్యం ఉంది. డిగ్రీ స్థాయిలో బీఏ ఇన్‌ కలినరీ ఆర్ట్స్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ కేటరింగ్‌ టెక్నాలజీ అండ్‌ కలినరీ ఆర్ట్స్‌, బీఎస్‌సీ కోర్సులు లభిస్తున్నాయి. ఇంటర్మీడియట్‌ ఏ గ్రూప్‌ వారైనా దరఖాస్తు చేసుకోవచ్ఛు చాలావరకూ సంస్థలు ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకు ఇంటర్వ్యూ ఆధారంగా, తెలుగు మాధ్యమంలో చదివినవారికి ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు

ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌, తిరుపతి

కలినరీ అకాడమీ ఆఫ్‌ ఇండియా, హైదరాబాద్‌

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కలినరీ ఆర్ట్స్‌, హైదరాబాద్‌

ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కలినరీ ఆర్ట్స్‌, న్యూదిల్లీ

ఏఐఎంఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌, బెంగళూరు మొదలైనవి

జర్నలిజం

దయమే ఇంటి గుమ్మం ముందుకు వచ్చి వాలే వార్తా పత్రికల నుంచి అనుక్షణం తాజా తాజా వార్తలూ, విభిన్న చర్చాకార్యక్రమాలతో హోరెత్తించే టీవీలు, రేడియోల వరకు అన్నింటిలోనూ జర్నలిజం ఉంటుంది. వార్తలు, రకరకాల సమాచారం, సంఘటనలు, స్థానిక, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను ప్రజలకు ఈ విభాగమే చేరవేస్తుంది. వార్తలకే పరిమితం కాకుండా జీవనశైలికి సంబంధించిన ఫీచర్లనూ, వివిధ కార్యక్రమాలనూ ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలు రూపొందిస్తున్నాయి. ఇప్పుడు వెబ్‌సైట్లు, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ జర్నలిజం నిపుణులు సేవలందిస్తున్నారు. వార్తా కథనాన్ని గుర్తించడం, దాన్ని ఆకట్టుకునే విధంగా, అర్థవంతంగా, సృజనాత్మకంగా తీర్చిదిద్దడం వీరి ప్రధానమైన విధులు. ఆసక్తి ఉన్నవారి కోసం ఇంటర్మీడియట్‌ అర్హతతో బీఏ, బీఏ ఆనర్స్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ జర్నలిజం కోర్సులు అందుబాటులో ఉన్నాయి. చాలావరకూ సంస్థలు ప్రవేశపరీక్షలను నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, న్యూదిల్లీ

ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి

యోగి వేమన యూనివర్సిటీ, కడప

సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మీడియా అండ్‌ కమ్యూనికేషన్‌, పుణె

ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్‌ ● క్రైస్ట్‌ యూనివర్సిటీ, బెంగళూరు మొదలైనవి

ఫొటోగ్రఫీ

క జ్ఞాపకం, ఆనందం, వేడుక, వార్త.. విషయం ఏదైనా దాన్ని దృశ్యబద్ధం చేసి ఏళ్లు గడిచిన తర్వాత తిరిగి గుర్తుచేయడంలో ఫొటోల పాత్ర మరచిపోలేనిది. కళాత్మక దృష్టితో ప్రపంచాన్ని చూసే వారికి ఫొటోగ్రఫీ మంచి కెరియర్‌. సంతృప్తితోపాటు చక్కటి జీతభత్యాలనూ అందిస్తుంది. ఈ విభాగంలో ఎక్కువగా డిప్లొమా కోర్సులు ఉన్నాయి. బీఎఫ్‌ఏ (ఫొటోగ్రఫీ), బీఎస్‌సీ, బీఏ లాంటి డిగ్రీలు చేయడానికీ వీలుంది. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా స్పెషలైజేషన్లనూ అందిస్తున్నాయి. ఫోరెన్సిక్‌, ఫుడ్‌, వెడ్డింగ్‌, ఫ్యాషన్‌, వైల్డ్‌లైఫ్‌, ఆటోమొబైల్‌ మొదలైనవి వాటిలో ప్రముఖమైనవి. చాలావరకూ సంస్థలు మెరిట్‌ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇంటర్మీడియట్‌ ఏ గ్రూప్‌ వారైనా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, అహ్మదాబాద్‌

నిఫ్ట్‌- హైదరాబాద్‌, ముంబయి, దిల్లీ

సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, పుణె

పెరల్‌ అకాడమీ, దిల్లీ, బెంగళూరు, ముంబయి, కోల్‌కతా, జయపుర

అపీజే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, దిల్లీ

ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, చండీగఢ్‌

ఎంఐటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, పుణె మొదలైనవి.●

అడ్వర్‌టైజింగ్‌

స్తువును వినియోగదారులకు పరిచయం చేయడానికి చక్కటి మార్గం అడ్వర్‌టైజ్‌మెంట్‌. వస్తువు/ సేవలకు సంబంధించి ప్రజల్లో తగిన ముద్ర వేయడమే దీని లక్ష్యం. ఇందులో భాగంగా వివిధ మాధ్యమాలను ఉపయోగిస్తుంటారు. వార్తాపత్రికలు, మేగజీన్లు, టీవీ, రేడియో, మెయిల్‌, వెబ్‌సైట్‌, టెక్స్ట్‌ మెసేజ్‌లు, బిల్‌ బోర్డ్స్‌, హోర్డింగ్స్‌ మొదలైనవన్నీ ప్రచారానికి సాధనాలే. ఈ విభాగంలో డిగ్రీ, డిప్లొమాలు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ స్థాయిలో బీఎస్‌సీ, బీఏ చేయవచ్ఛు ఎక్కువ శాతం కోర్సులు పబ్లిక్‌ రిలేషన్స్‌, బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌, మాస్‌ కమ్యూనికేషన్‌, మార్కెటింగ్‌, డిజైనింగ్‌ విభాగాలతో కలిపి అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియట్‌ ఏ గ్రూప్‌తో పూర్తిచేసిన వారైనా దరఖాస్తు చేసుకోవచ్ఛు చాలావరకూ సంస్థలు మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తున్నాయి.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు

సీఎంఆర్‌ యూనివర్సిటీ, బెంగళూరు

ఐఐఎంసీ, న్యూదిల్లీ

అడ్వర్టైజింగ్‌ అకాడమీ, దిల్లీ

సెయింట్‌ జేవియర్‌ కాలేజ్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌, ముంబయి

ముద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌, అహ్మదాబాద్‌ మొదలైనవి.

ఆసక్తి.. అభిరుచి.. ఉద్యోగం కలిస్తే అభివృద్ధి వేగంగా ఉంటుంది.

ఇంకా.. ఫిల్మ్‌ అండ్‌ టీవీ, యానిమేషన్‌, బ్యుటీషియన్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, లిటరేచర్‌ మొదలైన కోర్సులూ సృజనాత్మకత ప్రధానంగా ఉండేవే. విద్యార్థులు తమ ఆసక్తిమేరకు నచ్చినదాన్ని ఎంచుకుని శిక్షణ పొందితే మంచి అవకాశాలను అందుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts