Updated : 30 Oct 2020 04:38 IST

ఎంబీబీఎస్‌ కల.. తీరుతోందిలా!

విదేశీ విద్యా సంస్థల్లో చదివేందుకు ఆసక్తి

ఏటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య  

డాక్టర్‌ అవ్వాలనేది ఎంతోమంది విద్యార్థుల కల. ‘నీట్‌’లో మంచి ర్యాంకు రాకపోవడం వల్లనో, ఇతర కారణాలతోనో ఎంబీబీఎస్‌లో చేరడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి వారందర్నీ విదేశీ విశ్వవిద్యాలయాలు సాదరంగా ఆహ్వానిస్తున్నాయి. ముఖ్యంగా మన విద్యార్థులు చైనా, రష్యా, ఉక్రెయిన్‌, నేపాల్‌, కిర్గిస్తాన్‌, జార్జియా, ఫిలిప్పైన్స్‌, కజకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆర్మేనియా తదితర దేశాలకు వైద్యవిద్య కోసం వెళుతున్నారు. మన దేశం నుంచి ఏటా ఇతర దేశాలకు వెళ్లే వైద్య విద్యార్థుల శాతం 10-15  వరకు పెరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. గత కొన్నేళ్లుగా క్రమంగా ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది.
కరోనా కారణంగా కొన్ని దేశాల్లో యూనివర్సిటీలు ఆన్‌లైన్‌ కోర్సులను కూడా తాత్కాలికంగా అందిస్తున్నాయి. వీటికి మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఈ) నుంచి కూడా అనుమతులు ఉండటంతో ఇబ్బందులు తలెత్తడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా 300 వరకు విదేశీ యూనివర్సిటీలు వైద్య విద్యను అందిస్తున్నాయి. అయితే యూనివర్సిటీ ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటికి పదిసార్లు ఆరా తీయాలి. గతంలో ఆయా యూనివర్సిటీల్లో చదివిన విద్యార్థులు, అవి అందిస్తున్న కోర్సులు, ఎంసీఐ పరీక్ష (ఎఫ్‌ఎంజీఈ)లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం.. ఇలా అన్ని విషయాలపై ఆరా తీయాలి. కొన్ని దేశాల్లో ఎంబీబీఎస్‌ చేసి భారత్‌ తిరిగి వచ్చిన తర్వాత ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి. అయితే కొన్ని దేశాల్లో చదివిన ఎంబీబీఎస్‌కు ఇక్కడ ఇంటర్న్‌షిప్‌ లేకుండానే నేరుగా అనుమతి ఇస్తున్నారు. అంతేకాక 2022 తర్వాత ప్రతి వైద్య విద్యార్థీ నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్టు రాయాల్సిందే. దీంతో ఎక్కడ ఎంబీబీఎస్‌ చేసినా ఒక్కటే అనే భావన కూడా విద్యార్థుల్లో ఉంది. అంతేకాక కొన్ని విదేశీ విశ్వవిద్యాలయాలు  నాణ్యత ప్రమాణాలకు పెద్ద పీట వేస్తున్నాయి. క్లాస్‌ రూం తరగతులతోపాటు నిర్ణీత గంటలపాటు ప్రాక్టికల్‌ తరగతులు పూర్తి చేయాలి. అయితే కొన్ని యూనివర్సిటీల్లో వైద్యవిద్య నాణ్యతలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. దేశం నుంచి యూనివర్సిటీ వరకు ఎంపిక చాలా ముఖ్యమని ఆ రంగంలోని నిపుణులు చెబుతున్నారు.

విద్యా రుణాలతో...
విదేశాల్లో వైద్య విద్య అంటే ఎంతో ఖర్చు అవుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. అయితే విదేశాల్లో ఎంబీబీఎస్‌ చేసినా ఖర్చులో పెద్దగా తేడా ఉండదు. ముఖ్యంగా బ్యాంకులు విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. నిర్ణీత మొత్తం వరకు ఎలాంటి హామీ లేకుండా బ్యాంకుల నుంచి  రుణం తీసుకోవచ్చు. కోర్సు పూర్తి అయిన తర్వాత రుణ చెల్లింపులు చేపట్టే వీలుంది.
విదేశీ చదువుల విషయంలో తల్లిదండ్రులకు కొన్ని ఆందోళనలు సహజం. ముఖ్యంగా అమ్మాయిలను ఒంటరిగా అంత దూరం పంపేందుకు జంకుతుంటారు. అందుకే బంధువులో, తెలిసినవారో ఉన్న దేశాలకు పంపేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. కొన్ని దేశాల్లో మంచి యూనివర్సిటీలు ఉన్నా సరే... అక్కడ తెలిసినవారు ఎవరూ ఉండక పోవచ్చు. ఇలాంటివారు నమ్మకమైన కన్సల్టెన్సీలను ఆశ్రయించి తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. బంధువులు, స్నేహితులు ఇదివరకు తమ పిల్లలను ఏ కన్సల్టెన్సీ ద్వారా పంపారు? వారు ఎలాంటి సేవలు అందించారు? ఏవైనా ఇబ్బందులు తలెత్తాయా? తదితర సమాచారం సేకరించాలి. కొన్ని కన్సల్టెన్సీలు ఏళ్లుగా నాణ్యమైన సేవలను అందిస్తుంటాయి. తల్లిదండ్రులు, విద్యార్థుల ఆదరణ పొందుతుంటాయి. అయితే దేశం కాని దేశంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తిన కీలక సమయాల్లో కొన్ని కన్సల్టెన్సీలు చేతులు ఎత్తేస్తుంటాయి. మరికొన్ని మాత్రం తామున్నామంటూ రంగంలోకి దిగి అక్కడ ప్రభుత్వాధికారులతో మాట్లాడి సమస్యలు లేకుండా చూస్తుంటాయి. ఇది వరకు ఆయా కన్సల్టెన్సీల ద్వారా వెళ్లిన విద్యార్థులూ, వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఇలాంటి వివరాలు ఆరా తీయాలి. ఆన్‌లైన్‌లో కూడా ఆ సంస్థ గురించి సమాచారం సేకరించాలి. ఇలా కన్సల్టెన్సీని ఎంపిక చేసుకుంటే ఇబ్బందులేమీ లేకుండా సాఫీగా విద్య సాగుతుంది. తల్లిదండ్రులకు ఆందోళనా తప్పుతుంది.

ఎంపిక నుంచి చేరే వరకు...
ఏ దేశం వెళ్లాలి... అక్కడ ఏ విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసుకోవాలనేది కీలకం. అయితే ఇక్కడే చాలామంది అవగాహన లేక ఏదో ఒక యూనివర్సిటీలో చేరి ఇబ్బందులు పడుతుంటారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇదేమంత పెద్ద కష్టం కాదని నిపుణులు చెబుతున్నారు.
ఏటా వేలల్లోనే...
ముఖ్యంగా చైనా, రష్యా, ఉక్రెయిన్‌, నేపాల్‌, కిర్గిస్తాన్‌, జార్జియా, ఫిలిప్పైన్స్‌, కజకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆర్మేనియా లాంటి దేశాలకే ఏటా దేశం నుంచి 20 వేల మంది ఎంబీబీఎస్‌ కోసం వెళుతున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3 వేల మంది వరకు ఉంటారని చెబుతున్నారు. అయితే కరోనాతో ఈ సంవత్సరం కొంత ప్రభావం ఉన్నప్పటికీ కొన్ని యూనివర్సిటీలు ఆన్‌లైన్‌ క్లాసులు అందిస్తుండటం విశేషం. అన్ని దేశాల్లో కరోనా తగ్గుముఖం పడుతుండటంతో త్వరలోనే మళ్లీ పూర్వపు స్థితి వస్తుందని    భావిస్తున్నారు.
ఈ క్రమంలో యూనివర్సిటీ ఎంపిక నుంచి కోర్సులో చేరేవరకు తగిన జాగ్రత్తలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది విదేశాల్లో ఎంబీబీఎస్‌ చేయడానికి ఒక   ప్రధాన కారణం- ఇక్కడ ప్రైవేటు కళాశాలలతో పోల్చితే ఖర్చు తక్కువగా ఉండటం. ఇక్కడ ప్రైవేటు కళాశాల్లో రూ.75 లక్షల వరకు ఖర్చవుతుంటే... కొన్ని విదేశీ విద్యా సంస్థల్లో రూ.30 లక్షల ఖర్చుతోనే కోర్సు పూర్తి అవుతోంది. అయితే చదువు విషయంలో రాజీ లేకుండా నాణ్యమైన వసతులు, సదుపాయాలతో విద్యనందించే  విద్యా సంస్థను ఎంపిక చేసుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు.

యూనివర్సిటీ ఎంపిక ముఖ్యం
2018 మే నుంచి విదేశాల్లో వైద్య విద్యలో చేరాలంటే నీట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ జీవో జారీ చేసింది. నీట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా కేంద్ర, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకుంటే ఎన్‌వోసీ జారీ చేస్తారు. అయితే నీట్‌ ఉత్తీర్ణత పెద్ద కష్టం కాదు. విదేశాల్లో ఎంబీబీఎస్‌ చేసినా.. తర్వాత మన వద్ద ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఎంజీఈ) రాయాలి. ఏ యూనివర్సిటీ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఎఫ్‌ఎంజీఈలో ఉత్తీర్ణత సాధిస్తున్నారో పరిశీలించి ఆ మేరకు మంచి యూనివర్సీటీని ఎంపిక చేసుకునే వీలుంటుంది. అక్కడ విద్య నాణ్యతను బట్టి ఎఫ్‌ఎంజీఈలో ఉత్తీర్ణత శాతం ఎక్కువ ఉంటుందని గ్రహించాలి. చాలా విదేశీ యూనివర్సిటీల్లో ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత పొందినా...తర్వాత ఇక్కడ నిర్వహించే ఎఫ్‌ఎంజీఈ పరీక్షల్లో విద్యార్థులు వెనుకబడుతున్నారు. ఈ పరీక్షల్లో పాసైతేనే మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) గుర్తింపు ఇస్తుంది.
ఆహారం.. వాతావరణం  
మంచి విద్యా సంస్థ మాత్రమే కాదు... మంచి వాతావరణం, ఆహారం కూడా ముఖ్యం. లేదంటే అంత సుదీర్ఘకాలం అక్కడ కోర్సు కొనసాగించడం కొంత ఇబ్బందే. మన వాతావరణానికీ, ఆహారపు అలవాట్లకూ దగ్గరగా ఉన్నవాటిని ఎంపిక చేసుకుంటే చదువు సాఫీగా సాగుతుంది. సబ్జెక్టుపై లోతుగా అధ్యయనం చేయడానికి అవసరమైన మౌలిక వసతులు, బోధన బృందం ఉన్నవాటిని ఎంపిక చేసుకోవాలి. ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌కు ప్రాధాన్యం ఇచ్చేవి కూడా మంచివే. మన విద్యార్థులు ఏ యూనివర్సిటీలను ఎంపిక చేసుకుంటున్నారు... అందుకు కారణాలపై ఆరా తీయాలి. అలాంటి చోట్ల  ఒకరికొకరు తోడుగా ఉంటారు. నేరాలు తక్కువగా సురక్షిత దేశాల్లో యూనివర్సిటీలు ఎంపిక చేసుకోవడం అవసరం. క్యాంపస్‌ వాతావరణం...విద్యార్థులకు అందించే వసతులు...తర్వాతి అవకాశాలు మొదలైనవాటిపై తెలుసుకోవడం అవసరం.  
ఎక్కడైనా... మన విద్యార్థులే!
ఏ దేశమేగినా...మన విద్యార్థులే ఏదో ఒక కోర్సు చేస్తూ కన్పిస్తున్నారు. దాదాపు 90 దేశాల్లో లక్షల మంది చదువుకుంటున్నారు. ప్రధానంగా ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, వైద్యవిద్య కోర్సుల్లో చేరుతున్నారు. 2017లో విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు సంఖ్య 5.53 లక్షలు ఉంటే.. అది 2019 నాటికి 8 లక్షలకు దాటింది. ఈ ఏడాది కరోనా కారణంగా స్తబ్దత నెలకొన్నాసరే...పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత మళ్లీ యథాతథ పరిస్థితి ఉంటుందని నిపుణుల అంచనా. ముఖ్యంగా వివిధ దేశాల్లో వైద్య విద్య అభ్యసించే వారి శాతం పెరుగుతూ వస్తోంది.  
నీట్‌ ఫలితాల అనంతరం.. ఇటీవలే నీట్‌ ఫలితాలు వెలువడ్డాయి. ఏ ర్యాంకు వరకు సీటు వస్తుందో కూడా చాలా మందికి అవగాహన వచ్చేసింది. గత ఫలితాల ఆధారంగా అంచనా వేసుకుంటున్నారు. ఇక సీటు రాదని తెలిసినవారు ఎంబీబీఎస్‌ కోసం విదేశీ విద్యా సంస్థలపై ఆరా తీస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... అక్కడ ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు.. ఇలాంటి వాటిపై తల్లిదండ్రులూ, విద్యార్థులూ తెలుసుకుంటున్నారు. మరికొందరు ఇప్పటికే అక్కడ ఎంబీబీఎస్‌ చదువుతున్న విద్యార్థులను సంప్రదిస్తున్నారు. అక్కడి విద్యా బోధన, వాతావరణం, ఆహారం, సంస్కృతి మొదలైనవాటిని తెలుసుకుంటున్నారు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలచుకొని వైద్య విద్యవైపు విజయవంతంగా అడుగులు వేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు