Published : 18 Jan 2021 00:22 IST

భవితకే కాదు.. ఉపాధికీ భరోసా!

ఆధునిక జీవితంలో భద్రత ప్రశ్నార్థకమవుతోంది. దీనికి ఎంతో కొంత పరిష్కారంగా బీమా రంగం నిలుస్తోంది. భవిష్యత్తుకు భరోసా కల్పించేవాటిలో ఇన్సూరెన్స్‌ ముందుంటోంది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ రంగానికి ప్రాధాన్యం పెరిగింది. ఆన్‌లైన్‌ పాలసీలు, హెల్త్‌, టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా సమర్థ మానవ వనరులకు ఈ విభాగాల్లో అవకాశాలు విస్తరిస్తున్నాయి.
మనుషులతోపాటు పెంపుడు జంతువులు, ప్రియమైన వస్తువులు...అన్నింటికీ బీమా వర్తిస్తుంది. విలువైన వస్తువులు పోగొట్టుకున్నా, వాహనం ప్రమాదానికి గురైనా, జబ్బుచేసి ఆసుపత్రి పాలైనా బీమా ఉంటే పరిహారం పొందవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దగ్గర బీమా చేసుకునేవారి సంఖ్య తక్కువే అయినప్పటికీ ఇటీవలి కాలంలో పాలసీలు తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. భద్రతకు ప్రాధాన్యం పెరగడం, అనిశ్చిత పరిస్థితులూ, పరిణామాలతో ఈ రంగంలో గణనీయమైన వృద్ధి నమోదవుతోంది. అందువల్ల ఆసక్తి ఉన్నవారు బీమాను కెరియర్‌గా ఎంచుకోవచ్చు. పలు సంస్థలు ఇన్సూరెన్స్‌లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా స్థాయుల్లో కోర్సులు అందిస్తున్నాయి. వాటిని పూర్తిచేసుకుని అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.


ఇవీ ఉద్యోగాలు

* బీమా రంగంలో ప్రాథమిక స్థాయిలో ఎక్కువ సంఖ్యలో ఏజెంట్లు ఉంటారు. ప్రజలతో మాట్లాడి బీమా తీసుకునేలా చేయడంలో వీరి పాత్రే కీలకం. అందువల్ల వీరికి సంస్థలు పెద్ద మొత్తంలో కమిషన్‌ చెల్లిస్తున్నాయి. లక్ష్యాన్ని చేరుకున్నవారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. బీమా ఏజెంట్‌గా సేవలు అందించడానికి పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. వీరు ఐఆర్‌డీఏ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 18 ఏళ్లు నిండాలి. సంభాషణ చాతుర్యం, కలుపుగోలుతనం, బీమాపై అవగాహన, ఎక్కువమందితో సత్సంబంధాలు ఉన్నవారు ఏజెంటుగా రాణించగలరు.
* ఏజెంట్లను పర్యవేక్షించడానికి, సంస్థ లక్ష్యాలను అందుకోవడానికి  డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు (డీవో) ఉంటారు. వీరికి వేతనంతోపాటు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు దక్కుతాయి. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు పరీక్షల ద్వారా ఈ హోదాను పొందవచ్చు.
* బీమా చేసుకున్న వాహనాలకు ప్రమాదం జరిగినా, వస్తువులు దొంగతనానికి గురైనా ఆర్థికంగా ఎంత నష్టం జరిగిందో అంచనా వేసే బాధ్యత సర్వేయర్లది. వీరు కంపెనీలకు కన్సల్టెంట్లుగా వ్యవహరిస్తారు. కర్మాగారాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఆ తీవ్రతకు విలువ కట్టడానికి సాంకేతిక నైపుణ్యం ఉన్న సర్వేయర్లు రంగంలోకి దిగుతారు. ఈ తరహా ఉద్యోగాలకు ఫెలోషిప్‌ లేదా అసిస్టెంట్‌షిప్‌ చేసుండాలి. వీరిని లాస్‌ అడ్జస్టర్‌ లేదా అసెసర్‌గా వ్యవహరిస్తారు.
* పాలసీ నేపథ్యం బట్టి ప్రీమియం ఎంత ఉండాలో యాక్చురీ నిపుణులు నిర్ణయిస్తారు.
* ప్రమాదం జరిగినప్పుడు నష్టం భర్తీ చేయడానికి క్లెయిమ్స్‌ ఎగ్జిస్టర్‌ ఆ ప్రాంతాన్ని పరిశీలించి సంస్థ ఎంత పరిహారం చెల్లిస్తుందో బీమాదారులకు వివరిస్తారు.
* క్లెయిమ్‌ ఎగ్జిస్టర్‌, బీమాదారులు ఇచ్చిన వివరాలు పరిశీలించడానికి క్లెయిమ్స్‌ ఎగ్జామినర్లు ఉంటారు.
* ఒకవేళ అందులో ఏదైనా మోసం ఉన్నట్లు అనిపిస్తే ఇన్సూరెన్స్‌ ఇన్వెస్టిగేటర్‌ దాన్ని శోధిస్తారు. లొసుగులు ఉంటే పరిహారం చెల్లించకుండా చూసే బాధ్యత వీరిదే.
* పాలసీదారుడు గతంలో వాహన ప్రమాదాలు చేశారా, ప్రమాదం జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారా తదితర వివరాలు ఇన్సూరెన్స్‌ అండర్‌ రైటర్లు చూసుకుంటారు.ఆ వివరాల ప్రకారం పాలసీ మంజూరు చేయాలా, వద్దా? ప్రీమియం ఎంత వసూలు చేయాలో నిర్ణయిస్తారు.


కావాల్సిన నైపుణ్యాలు

* ఇతరులను ఒప్పించగలిగే నేర్పు
* తర్కం, విశ్లేషణ నైపుణ్యం  
* వివిధ సంస్థలు అందించే బీమా పథకాలపై పరిజ్ఞానం  
* జనాలతో మమేకం అయ్యే స్వభావం
* బీమా ప్రాధాన్యం వివరించి, సందేహాలను తీర్చే సమర్థత, సహనం


సంస్థలు

* నేషనల్‌ ఇన్సూరెన్స్‌ అకాడెమీ, పుణే  
* ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, హైదరాబాద్‌
* ముంబై యూనివర్సిటీ, ముంబై
* ఇన్సూరెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, ముంబై  * పాండిచ్చేరి యూనివర్సిటీ
* ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌,  హైదరాబాద్‌  * అమిటీ యూనివర్సిటీ
* చార్టర్డ్‌ ఇన్సూరెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌, యూకే.


అవకాశాలు...

ప్రభుత్వ, ప్రైవేటు బీమా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ ఫర్మ్‌లు, ఆర్థిక సంస్థలు, కన్సల్టెన్సీలు, క్రెడిట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ, బిజినెస్‌ ఎనలిస్ట్‌, యాక్చూరియల్‌ ఎనలిస్ట్‌, ఇన్సూరెన్స్‌ ఎనలిస్ట్‌ తదితర హోదాలతో ఉద్యోగాలు ఉంటాయి. వివిధ ఐటీ కంపెనీలు ఇన్సూరెన్స్‌ కోర్సు చదివినవారిని డొమైన్‌ ఎక్స్‌పర్ట్‌, బిజినెస్‌ ఎనలిస్ట్‌ ఉద్యోగాల్లోకి తీసుకుని ఆకర్షణీయ వేతనాలు అందిస్తున్నాయి. ఎల్‌ఐసీ, ఎన్‌ఐసీ, ఎన్‌ఐఏసీఎల్‌, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌లు రెండు లేదా మూడేళ్లకు ఒకసారి అసిస్టెంట్లు, డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు (డీవో), అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (ఏఏవో)/ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (ఏవో), పోస్టులను భర్తీ చేస్తున్నాయి. ఏదైనా డిగ్రీ అర్హతతో వీటికి పోటీ పడవచ్చు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని