సన్నద్ధతలో సవాళ్లేమిటి?

ఆర్థిక సర్వే అనగానే వివిధ రకాలైన స్థూల ఆర్థిక (మాక్రో ఎకనామిక్స్‌) గణాంకాలను గుర్తుంచుకోవాలని చాలామంది అభ్యర్థులు భావిస్తుంటారు. దాదాపు 50 శాతం ప్రశ్నలను స్థూల ఆర్థిక అంశాల నుంచి ఆబ్జెక్టివ్‌ కోణంలో అడగటం జరుగుతూ వస్తోంది....

Published : 10 Feb 2021 06:06 IST

ఆర్థిక సర్వే.. బడ్జెట్‌

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సర్వే, బడ్జెట్‌లు కేవలం పాలకులూ, ఆర్థిక నిపుణులకే కాదు.. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న ప్రతి అభ్యర్థికీ కీలకమైనవే! వీటిలో ప్రశ్నల ధోరణి ఎలా ఉంటుంది?

ర్థిక సర్వే అనగానే వివిధ రకాలైన స్థూల ఆర్థిక (మాక్రో ఎకనామిక్స్‌) గణాంకాలను గుర్తుంచుకోవాలని చాలామంది అభ్యర్థులు భావిస్తుంటారు. దాదాపు 50 శాతం ప్రశ్నలను స్థూల ఆర్థిక అంశాల నుంచి ఆబ్జెక్టివ్‌ కోణంలో అడగటం జరుగుతూ వస్తోంది.
* సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ లాంటి రాతపరీక్షల్లో 1-2 ప్రశ్నలు

* బ్యాంకు పీఓ పరీక్షల కరెంట్‌ విభాగంలో 4, 5 ప్రశ్నలు

* రాష్ట్ర సర్వీస్‌ కమిషన్‌ జనరల్‌ స్టడీస్‌ విభాగంలో 2-3 ప్రశ్నలు
* తెలుగు రాష్ట్రాల సర్వీస్‌ కమిషన్ల గ్రూప్‌- 2 పరీక్షల్లో 5 నుంచి 20 ప్రశ్నలు వస్తున్నాయి.
* గ్రూప్‌-1, సివిల్‌ సర్వీస్‌ పరీక్షల ప్రిలిమినరీలో 3-4 ప్రశ్నలు అడుగుతున్నా మెయిన్స్‌లో ఎకనామిక్‌ సర్వే, బడ్జెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
* ఎకనామిక్‌ సర్వే, బడ్జెట్‌లపై పట్టు పెంచుకుంటే గ్రూప్‌- 1 మెయిన్స్‌ ఎకానమీలో 20 మార్కుల వరకు ప్రభావవంతంగా సమాధానాలు రాయవచ్చు.

* ఎకానమీ విభాగంలో అడిగే మిగతా ప్రశ్నల్లో కూడా సందర్భోచితంగా సర్వే, బడ్జెట్‌ అంశాలను ఆధారాలుగా వివరించాల్సి ఉంటుంది.

* సాధారణ వ్యాసంలో కూడా నేరుగా కొన్ని సందర్భాల్లో బడ్జెట్‌తో ముడిపడిన ప్రశ్నలు రావచ్చు.


ప్రశ్నల ధోరణిలో మార్పు ?

కొద్దికాలంగా బడ్జెట్‌ అంశాలకు సంబంధించిన కారణ- ఫలిత సంబంధాలపై అధికంగా ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక మంత్రి ‘ఈ కారణం చేత ఇలా జరిగింది’ అని బడ్జెట్‌ ప్రసంగంలో వివరించేవాటిపై ఎగ్జామినర్‌ దృష్టి పెడుతున్నారు. బడ్జెట్లో వివిధ సందర్భాల్లో వాడుతున్న కొత్త, పాత పదాలను ప్రశ్నల రూపంలోకి మారుస్తున్నారు. ఉదాహరణకు... బ్యాడ్‌ బ్యాంక్‌, unicorn సంస్థలు, ఆపరేషన్‌ గ్రీన్‌ స్కీం, గిగ్‌ కార్మికులు, మెట్రో నియో, మిషన్‌ పోషణ్‌ 2.0, న్యూమోకొకల్‌ వ్యాక్సిన్‌ లాంటి పదాలు తాజా బడ్జెట్లో కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు, కేటాయింపులు, వైఫల్యాలు, సాఫల్యాలు- ఎప్పటి మాదిరిగానే ప్రశ్నల రూపంలో వస్తున్నాయి. తాజాగా కేంద్ర బడ్జెట్‌లో బడ్జెట్‌ ఆరు పునాదుల్ని పేర్కొంటూ కొత్త రూపంలో వివిధ ఆర్థిక విషయాలను సమర్పించారు. ఆ ధోరణిని పరిశీలించాలి.


900 పేజీల ఆర్థిక సర్వే ఎలా చదవాలి?

పోటీ పరీక్ష అభ్యర్థులు ఎదుర్కొనే ప్రధాన సవాలు ఇదే. ఎక్కడ మొదలు పెట్టాలి? ఎక్కడ ముగించాలి? దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి అనే విషయంలో నిర్ధారించుకోలేక సహజంగానే ఇబ్బంది పడుతూ ఉంటారు. విశ్వసనీయమైన వ్యక్తులో, ప్రచురణ సంస్థలో  ఆర్థిక సర్వే, బడ్జెట్‌ విషయాలను క్లుప్లీకరించి ప్రచురించిన పుస్తకాలుంటే వాటి మీద ఆధారపడవచ్చు. లేకపోతే అభ్యర్థులు తమ సిలబస్‌లోని అంశాలను దగ్గర పెట్టుకుని వాటికి సంబంధించిన సర్వే, బడ్జెట్‌ విభాగాల్ని గ్రహించి నోట్సు తయారు చేసుకునే పద్ధతిని అనుసరించవచ్చు. 1, 2 ప్రశ్నలు మాత్రమే వస్తాయనుకునే పరీక్షల్లో వీలైనంతవరకు మాక్రో ఎకనామిక్స్‌పై దృష్టి పెడితే దాదాపుగా సరిపోతుంది. ఆయా పరీక్షలకు సంబంధించిన గత ప్రశ్నపత్రాలను చూడటం ద్వారా ఏ తరహా ప్రశ్నలు వస్తున్నాయో గ్రహించవచ్చు.

- కొడాలి భవానీ శంకర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని