ఐఐటీలో బీఎస్‌సీ చేస్తారా?

ఆన్‌లైన్‌ బీఎస్‌సీ ప్రొగ్రామింగ్‌ అండ్‌ డేటా సైన్స్‌ కోర్సులో ప్రవేశానికి ఐఐటీ మద్రాస్‌ ప్రకటన విడుదలచేసింది. ఇందులో చేరాలనుకున్నవారు ముందుగా క్వాలిఫయర్‌ ఎగ్జామ్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇంటర్‌ అన్ని గ్రూపుల వారికీ అవకాశం ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు మద్రాస్‌ ఐఐటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకోవచ్చు....

Published : 05 Apr 2021 00:55 IST

అన్ని గ్రూపుల వారికీ అవకాశం

ఆన్‌లైన్‌ బీఎస్‌సీ ప్రొగ్రామింగ్‌ అండ్‌ డేటా సైన్స్‌ కోర్సులో ప్రవేశానికి ఐఐటీ మద్రాస్‌ ప్రకటన విడుదలచేసింది. ఇందులో చేరాలనుకున్నవారు ముందుగా క్వాలిఫయర్‌ ఎగ్జామ్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇంటర్‌ అన్ని గ్రూపుల వారికీ అవకాశం ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు మద్రాస్‌ ఐఐటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకోవచ్చు. ఆపై మేటి అవకాశాల దిశగా అడుగులేయవచ్చు!

విష్యత్తులో సాంకేతికతదే అగ్రస్థానం. అందులోనూ ప్రోగ్రామింగ్‌, డేటా సైన్స్‌, మెషీన్‌ లర్నింగ్‌లు ముందుంటాయని అంచనా. వీటిపై పట్టున్నవారు మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఆ దిశగా ఆలోచించే ఐఐటీ మద్రాస్‌ కోర్సును రూపొందించింది. బీఎస్‌సీలో ప్రోగ్రామింగ్‌ అండ్‌ డేటా సైన్స్‌ను గత ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో అందిస్తోంది. అయితే ఈ కోర్సులో చేరడానికి ముందుగా క్వాలిఫయర్‌ పరీక్షలో నెగ్గడం తప్పనిసరి. అనంతరం ఫౌండేషన్‌, ఆ తర్వాత డిప్లొమా చివరగా డిగ్రీ- ఇలా అన్ని దశలూ పూర్తిచేసుకున్నవారికి బీఎస్‌సీ పట్టా చేతికందుతుంది.  
క్వాలిఫయర్‌
క్వాలిఫయర్‌ పరీక్షలో అర్హత నిమిత్తం నాలుగు వారాల వ్యవధితో 4 ప్రాథమిక స్థాయి కోర్సులైన ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌ ఫర్‌ డేటా సైన్స్‌, స్టాటిస్టిక్స్‌ ఫర్‌ డేటా సైన్స్‌, కంప్యుటేషనల్‌ థింకింగ్‌ విభాగాల్లో కనీస స్కోర్‌ సాధించాలి. వీటికి సంబంధించి ఒక్కో సబ్జెక్టులో వారానికి రెండు లేదా మూడు గంటల వీడియో పాఠాలు అందిస్తారు. ప్రతి కోర్సులోనూ అసైన్‌మెంట్లు ఉంటాయి. వీటిని నిర్ణీత వ్యవధిలోగా ఆన్‌లైన్‌లో పూర్తిచేయాల్సి ఉంటుంది. వీటిలో అర్హత సాధించినవారినే క్వాలిఫయర్‌ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. అసైన్‌మెంట్లలో జనరల్‌ అభ్యర్థులు 40 శాతం, ఓబీసీలు 35, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 30 శాతం మార్కులు సాధించాలి. వీరికి క్వాలిఫయర్‌ పరీక్షను 4 గంటల వ్యవధితో నిర్వహిస్తారు. ఒక్కో కోర్సుకు గంట వ్యవధి ఉంటుంది. అర్హత సాధించినవారికి ఫౌండేషన్‌ లెవెల్‌ కోర్సులోకి అనుమతిస్తారు. క్వాలిఫయర్‌ ఎగ్జామ్‌లో సాధించిన స్కోరును అనుసరించి మొదటి రెండు టర్మ్‌ల్లో ఎన్ని కోర్సులు నేర్చుకోవచ్చో నిర్ణయిస్తారు. యాభై శాతం సాధించినవారికి 2, 70 వరకు సాధించినవారికి 3, డెబ్భై పైన సాధిస్తే 4 కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. మొదటి రెండు టర్మ్‌ల్లో సాధించిన స్కోర్‌ను అనుసరించి తర్వాతి టర్మ్‌ల్లో ఎన్ని కోర్సులు పూర్తిచేసుకోవచ్చో నిర్ణయిస్తారు.
అభ్యాసమిలా...
ప్రతివారం రికార్డు చేసిన వీడియో పాఠాలు విడుదల చేస్తారు. ఒక్కో కోర్సులో వారానికి పది గంటల నిడివితో వీటిని అందిస్తారు. ఈ వీడియోల్లోనే వీక్లీ అసైన్‌మెంట్లు ఉంటాయి. వీటిని గడువులోగా పూర్తిచేసుకోవాలి. ఒక్కో కోర్సుకి 3 క్విజ్‌లు ఉంటాయి. కోర్సు చివరలో టర్మ్‌ పరీక్షలు ఉంటాయి. ప్రతి కోర్సులోనూ వారానికి ఒక అసైన్‌మెంట్‌ ఉంటుంది. వీటిలో కనీస స్కోరు సాధిస్తేనే టర్మ్‌ చివర్లో పరీక్ష రాయడానికి అవకాశమిస్తారు. అలాగే టర్మ్‌ పరీక్షలు రాయడానికి 3 క్విజ్‌ల్లో కనీసం ఒక దానిలో అర్హత తప్పనిసరే. కోర్సులో చేరినవారు తమకు కేటాయించిన పట్టణ అభ్యసన కేంద్రంలో క్విజ్‌, టర్మ్‌ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ కోర్సు మొత్తం ఆంగ్లంలో అందిస్తున్నారు.డెస్క్‌టాప్‌ లేదా ల్యాప్‌టాప్‌, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండాలి. గూగుల్‌ టూల్స్‌పై అవగాహన ఉంటే మేలు. అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ప్రతి కోర్సులోనూ డిస్కషన్‌ ఫోరం ఉంటుంది.


ఎవరు అర్హులు?

దిలో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌ చదివివుండాలి. ఇంటర్‌ లేదా సమాన స్థాయి కోర్సు పూర్తిచేసినవారై ఉండాలి. మూడేళ్ల డిప్లొమా చదివినవారూ అర్హులే. రెండేళ్ల ఒకేషనల్‌ కోర్సులు, ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఇంటర్‌ లేదా సమాన స్థాయి కోర్సులు చదివినవారూ అర్హులే. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫౌండేషన్‌ కోర్సు మొదలయ్యే సమయానికి ఏదో ఒక బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులో చేరాలి. ప్రస్తుతం బ్యాచిలర్‌ డిగ్రీలో చేరినవారు, పూర్తిచేసుకున్నవారు, మధ్యలో వైదొలగినవారు ఇందులో చేరవచ్చు.
రెగ్యులర్‌ ఎంట్రీ దరఖాస్తు ఫీజు: రూ.3000 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రాయితీ లభిస్తుంది.

క్వాలిఫయర్‌ 2 దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 14

క్వాలిఫయర్‌ కోర్సు: జూన్‌ 21 నుంచి మొదలవుతుంది.

క్వాలిఫయర్‌ పరీక్ష తేదీ: ఆగస్టు 8

పరీక్ష కేంద్రాలు: ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, భీమవరం, గుంటూరు, కడప, అనంతపురం, తిరుపతి, కర్నూలు. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌.
www.onlinedegree.iitm.ac.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని