సానుకూలతే సక్సెస్‌ మంత్ర!

రాతపరీక్షలో ఆకాశమే హద్దుగా ప్రతిభ చూపినవారు కూడా మౌఖిక పరీక్ష అనగానే ఎంతో కొంత తడబడటం సహజం. తగిన   మెలకువలు గ్రహించి ఆత్మవిశ్వాసంతో వాటిని ఆచరిస్తే.. ఈ తుది ఘట్టంలోనూ తిరుగులేని ముద్ర వేయొచ్చు. ఉద్యోగ సాధన కలను సాకారం చేసుకోవచ్చు!  గ్రూప్‌-1కే కాకుండా ఇతర నియామక పరీక్షలకూ ఇంటర్వ్యూ మెలకువలు ఆవశ్యకమే! ...

Published : 03 May 2021 00:47 IST

రాతపరీక్షలో ఆకాశమే హద్దుగా ప్రతిభ చూపినవారు కూడా మౌఖిక పరీక్ష అనగానే ఎంతో కొంత తడబడటం సహజం. తగిన   మెలకువలు గ్రహించి ఆత్మవిశ్వాసంతో వాటిని ఆచరిస్తే.. ఈ తుది ఘట్టంలోనూ తిరుగులేని ముద్ర వేయొచ్చు. ఉద్యోగ సాధన కలను సాకారం చేసుకోవచ్చు!  గ్రూప్‌-1కే కాకుండా ఇతర నియామక పరీక్షలకూ ఇంటర్వ్యూ మెలకువలు ఆవశ్యకమే!  

హోదా రీత్యా, ప్రజా సేవల ప్రాధాన్యం దృష్ట్యా గ్రూప్‌-1 ఉద్యోగాలు అఖిల భారత సర్వీసు ఉద్యోగాల తర్వాత అత్యంత ప్రాముఖ్యమైనవి. ఆర్డీఓ, డీఎస్‌పీ, సీటీఓ, మునిసిపల్‌ కమిషనర్‌ లాంటి ఉద్యోగాలకు ఐఏఎస్‌/ ఐపీఎస్‌ హోదా పొందే అవకాశాలూ ఉంటాయి. వివిధ హెచ్‌ఓడీ కార్యాలయాలకు గ్రూప్‌-1 ఉద్యోగులు అధిపతులుగా మారే అవకాశం కూడా ఉంది. కీలక ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వామ్యంతో పాటు నిర్ణయాల అమలు విషయంలో వీరు ప్రధాన పాత్రను పోషిస్తారు. ఇలాంటి పోస్టులకు   అర్హులను ఎంపిక చేసేటప్పుడు అభ్యర్థి జ్ఞాన స్థాయితో పాటు మూర్తిమత్వ లక్షణాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే ఇంటర్వ్యూలకు సిద్ధమైతే మంచి ఫలితాలను సాధించవచ్చు.
సామాజిక అంశాల పట్ల బాధ్యత: కాబోయే గ్రూపు-1 ఉద్యోగులు తమకు సంక్రమించిన అధికారాన్ని సమాజ పురోగతికి వినియోగించాలి. ఆ దిశగా పక్షపాతం, బంధు ప్రీతి, వర్గ తత్వం, ప్రాంతీయ తత్వం లాంటి అవలక్షణాలు లేకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించగలరా అని బోర్డు పరిశీలిస్తుంది. ఇలాంటి విషయాల్లో ఏదైనా ఫలితాలు సాధించేందుకు భారతదేశ సామాజిక వ్యవస్థ, సామాజిక సంస్థలు- వాటి పరిణామం, సంబంధిత తాజా ధోరణులు, పరిపాలన సంబంధిత విషయాలు తప్పనిసరిగా అవగాహన కలిగివుండాలి. పరిపక్వతతో సమాధానాలు చెప్పగలగాలి. ఆయా విషయాల పట్ల సహానుభూతితో స్పందించాలి.
1. విషయ పరిజ్ఞానం పరిధి: ఇంటర్వ్యూ అనేది మూర్తిమత్వ లక్షణాల పరీక్ష అయినా వాటిని పసిగట్టేందుకు బోర్డు వివిధ సందర్భాల్లో కొన్ని విషయ సంబంధిత ప్రశ్నలు అడగటం ఆనవాయితీ. ముఖ్యంగా అభ్యర్థి గ్రాడ్యుయేషన్‌ సబ్జెక్టుల్లో ప్రాథమికాంశాలూ,  తాజా పరిణామాలూ, ప్రస్తుత గ్రూప్‌-1 సిలబస్‌ అంశాల పరిజ్ఞానం పరిశీలనలోకి తీసుకోవచ్చు. ఇంటర్వ్యూ సన్నద్ధతకు సమయం దొరికినందువల్ల అభ్యర్థులు రోజూ 2, 3 గంటల సమయం ఈ విభాగానికి కేటాయిస్తే ప్రిపరేషన్‌ సంపూర్ణత్వానికి దారితీస్తుంది.
2. వర్తమాన అంశాల వారధి: బోర్డు సభ్యులందరికీ అభ్యర్థిని అవగాహన చేసుకునేందుకు అవకాశమిచ్చే ఉమ్మడి వేదిక -వర్తమానాంశాలు. ఇటీవల జరిగిన పాలిటెక్నిక్‌ లెక్చరర్ల ఇంటర్వ్యూలో కూడా కొంతమంది అభ్యర్థులను అంతర్జాతీయ విషయాలపై ప్రశ్నలు అడిగారు. సాంకేతిక లెక్చరర్‌ పోస్టులకు అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాలతో పెద్ద సంబంధం లేదు. అయినా ఎందుకు అడిగినట్లు? విషయ సంబంధిత సభ్యులు బోర్డులో లేనప్పుడు ఇలా అనేక విషయాలపై ప్రశ్నలు అడుగుతారు. అందులోనూ గ్రూప్‌-1 అభ్యర్థులకు అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ, వర్తమాన అంశాలు సిలబస్‌లో కూడా ఉన్నాయి. పైగా అభ్యర్థుల అవగాహన స్థాయిని పరిశీలించడానికి ఈ తరహా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అందుకని వర్తమాన అంశాలను పూర్వ రంగంతో సహా మరలా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఇంటర్వ్యూకి ఉపకరించవచ్చు. దినపత్రికల అధ్యయనం ద్వారా బోర్డు సభ్యులు అడిగే అంశాలకు దగ్గరగా వెళ్ళవచ్చు. వివాదాస్పద అంశాలు- రాజ్యాంగ పరమైనవి, ఆర్థికపరమైనవి, శాస్త్ర సాంకేతికపరమైనవి, సామాజిక పరమైనవి అని విభజించుకుని అధ్యయనం చేస్తే పట్టు సాధించవచ్చు.
3. మీ గురించి మీకు తెలుసా: అటుఇటుగా 30 సంవత్సరాల వయసుండే అభ్యర్థులకు వారి జీవితంపై అవగాహన ఏమిటి? ఇది గ్రహించేందుకు బోర్డు బయోడేటా సంబంధిత అంశాలపై ప్రశ్నలు అడుగుతుంది. కుటుంబం, చదువులు, అలవాట్లు, ఆశయాలు, బలాలు, బలహీనతలు, విజయాలు, వైఫల్యాలు మొదలైనవన్నీ వ్యక్తిగత కోణంలో అభ్యర్థులు అర్థం చేసుకుంటే బోర్డుకు చెప్పగలుగుతారు. బయోడేటా సంబంధిత విషయాల్ని క్రమబద్ధంగా వ్యక్తపరచాలి. ఈ విషయాల వ్యక్తీకరణంలో ఏదైనా లోపం ఉంటే మాత్రం ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు పడే అవకాశం ఉంది. మొత్తమ్మీద బయోడేటాను శాస్త్రీయంగా విశ్లేషించుకుని ఎటువంటి ప్రశ్నలు వస్తాయో అంచనా వేసుకుని సిద్ధమైతే మంచి ఫలితాలు ఉంటాయి!  

- కొడాలి భవానీ శంకర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని