విశిష్ట సంస్థలో... విభిన్న భాషలు!

విద్యార్థులకు మేటి ఉపాధి అవకాశాలు అందించేవాటిలో ఇంగ్లిష్‌, విదేశీ భాషలు ముందు వరుసలో ఉంటున్నాయి. దీంతో ఈ చదువులను దేశంలో వివిధ విద్యాసంస్థలు అందిస్తున్నాయి. వాటిలో ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ) ముఖ్యమైందిగా చెప్పుకోవచ్చు. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో, క్యాంపస్‌లు లఖ్‌నవూ, షిల్లాంగ్‌లలో ఉన్నాయి. ఈ సంస్థ యూజీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో కోర్సులు అందిస్తోంది.

Updated : 30 Aug 2021 06:09 IST

విద్యార్థులకు మేటి ఉపాధి అవకాశాలు అందించేవాటిలో ఇంగ్లిష్‌, విదేశీ భాషలు ముందు వరుసలో ఉంటున్నాయి. దీంతో ఈ చదువులను దేశంలో వివిధ విద్యాసంస్థలు అందిస్తున్నాయి. వాటిలో ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ) ముఖ్యమైందిగా చెప్పుకోవచ్చు. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో, క్యాంపస్‌లు లఖ్‌నవూ, షిల్లాంగ్‌లలో ఉన్నాయి. ఈ సంస్థ యూజీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో కోర్సులు అందిస్తోంది. వాటిలో ప్రవేశానికి ప్రకటన వెలువడింది!

భాషలు నేర్చుకోవటంపై ఆసక్తి ఉన్నవారు అండర్‌ గ్రాడ్యుయేషన్‌ (యూజీ) నుంచే అడుగులు వేయవచ్చు. ఆనర్స్‌ విధానంలో ఫ్రెంచ్‌, స్పానిష్‌, జర్మన్‌, రష్యన్‌, జపనీస్‌, అరబిక్‌..తదితర భాషలు నేర్చుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఈ భాషల్లో పీజీ, పీహెచ్‌డీలనూ పూర్తిచేసుకోవచ్చు. ఆంగ్ల భాష బోధనపై పట్టు పెంచుకోవడానికి పీజీ డిప్లొమా ఇన్‌ టీచింగ్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌, ఆంగ్ల ఉపాధ్యాయులుగా రాణించడానికి ఇంగ్లిష్‌లో బీఎడ్‌, అనువాదకుల కోసం ట్రాన్స్‌లేషన్‌ కోర్సులను ఇఫ్లూ అందిస్తోంది. పరీక్షలో చూపిన ప్రతిభతో కోర్సుల్లోకి తీసుకుంటారు. వీటిని పూర్తిచేసుకున్నవారు మంచి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.

పరీక్ష ఇలా...

యూజీ, పీజీ, పీజీ డిప్లొమా, బీఎడ్‌ కోర్సుల్లో ప్రవేశానికి వంద మార్కులకు ఆబ్జెక్టివ్‌ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. అన్ని పీహెచ్‌డీ కోర్సుల్లోనూ ప్రవేశానికి ఆన్‌లైన్‌ పరీక్షతోపాటు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ పరీక్ష 70 మార్కులకు, ఇంటర్వ్యూ 30 మార్కులకు ఉంటాయి.

యూజీ అన్ని కోర్సులకూ ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ, ఎనలిటికల్‌ రీజనింగ్‌ స్కిల్స్‌లో ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్‌ కోర్సుకు అదనంగా జనరల్‌ నాలెడ్జ్‌ విభాగం ఉంటుంది. అలాగే ఫారిన్‌ లాంగ్వేజ్‌లకు ఆ భాషకు చెందిన దేశంపై అవగాహన, ఆచార వ్యవహారాలు, సంబంధిత భాషలో ప్రాథమిక ఒకాబ్యులరీ ప్రశ్నలు వస్తాయి. జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి కరంట్‌ అఫైర్స్‌, మీడియా అండ్‌ కమ్యూనికేషన్‌లో ప్రాథమిక పరిజ్ఞానంపై ప్రశ్నలు అడుగుతారు. 

పీజీ కెఫెటేరియా మినహా మిగిలిన ఇంగ్లిష్‌ కోర్సులకు ఆంగ్లభాషలో ప్రావీణ్యం, జనరల్‌ నాలెడ్జ్‌, ఎనలిటికల్‌ రీజనింగ్‌ స్కిల్స్‌, డొమైన్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలు ఉంటాయి. ఫారిన్‌ లాంగ్వేజ్‌లకు సంబంధిత భాషలో అభ్యర్థి పరిజ్ఞానం, జనరల్‌ నాలెడ్జ్‌, ఎనలిటికల్‌ రీజనింగ్‌ స్కిల్స్‌, డొమైన్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలు వస్తాయి. బీఎడ్‌ ఇంగ్లిష్‌లో ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ, జనరల్‌ నాలెడ్జ్‌, ఎనలిటికల్‌ రీజనింగ్‌ స్కిల్స్‌, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు.

పీహెచ్‌డీలకు సంబంధిత భాష/ సబ్జెక్టులో పరిజ్ఞానంతోపాటు రిసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌, రిసెర్చ్‌ మెథడాలజీ,  లాజికల్‌ అండ్‌ ఎనలిటికల్‌ రీజనింగ్‌, డొమైన్‌ నాలెడ్జ్‌ల్లో ప్రశ్నలు వస్తాయి.

పరీక్షలో అర్హతకు జనరల్‌ అభ్యర్థులు 50, ఓబీసీలు 45, ఎస్సీ, ఎస్టీలైతే 30 శాతం మార్కులు సాధించాలి. పీహెచ్‌డీ కోర్సులకైతే అన్‌ రిజర్వ్‌డ్‌, ఓబీసీ క్రీమీలేయర్‌ అభ్యర్థులు 50; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఓబీసీ నాన్‌ క్రీమీలేయర్‌ అభ్యర్థులకు 45 శాతం మార్కులు తప్పనిసరి. 


ఏ కోర్సులు... ఎన్ని సీట్లు?

యూజీ (బీఏ)...

బీఏ ఇంగ్లిష్‌ (ఆనర్స్‌): హైదరాబాద్‌ క్యాంపస్‌లో 40, లఖ్‌నవూలో 40, షిల్లాంగ్‌లో 20 సీట్లు ఉన్నాయి.

బీఏ (ఆనర్స్‌): అరబిక్‌, చైనీస్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, జపనీస్‌, కొరియన్‌, పర్షియన్‌, రష్యన్‌, స్పానిష్‌ ఒక్కో కోర్సులో హైదరాబాద్‌ క్యాంపస్‌లో 20 చొప్పున సీట్లు ఉన్నాయి.

బీఏ: జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ కోర్సు షిల్లాంగ్‌ క్యాంపస్‌లో నిర్వహిస్తున్నారు. 20 సీట్లు ఉన్నాయి.

అర్హత: పై కోర్సుల్లో ప్రవేశానికి జనరల్‌, ఓబీసీ అభ్యర్థులైతే ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం మార్కులు ఉండాలి.


టీచర్‌ ఎడ్యుకేషన్‌

కోర్సు: బీఎడ్‌ ఇంగ్లిష్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌లో 50 సీట్లు ఉన్నాయి.

అర్హత: బీఏ ఇంగ్లిష్‌ లేదా ఎంఏ ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత.

పీజీడీటీఈ: హైదరాబాద్‌లో 40, లఖ్‌నవూలో 20 సీట్లు ఉన్నాయి.

పీజీడీటీఏ: హైదరాబాద్‌ క్యాంపస్‌లో 20 సీట్లు ఉన్నాయి.

అర్హత: పీజీ కోర్సుల్లో ప్రవేశానికి బ్యాచిలర్‌ డిగ్రీలో జనరల్‌, ఓబీసీ అభ్యర్థులు 55 శాతం, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే సంబంధిత అంశాన్ని డిగ్రీ లేదా ప్రత్యేక డిప్లొమా స్థాయిలో చదివుండాలి.


పీజీ (ఎంఏ)

ఇంగ్లిష్‌ (కెఫెటేరియా): హైదరాబాద్‌ క్యాంపస్‌లో 90, లఖ్‌నవూలో 40, షిల్లాంగ్‌లో 30 సీట్లు ఉన్నాయి.

ఇంగ్లిష్‌ లిటరేచర్‌: హైదరాబాద్‌ క్యాంపస్‌లో 20, షిల్లాంగ్‌లో 30 సీట్లు ఉన్నాయి.

లిటరేచర్స్‌ ఇన్‌ ఇంగ్లిష్‌: హైదరాబాద్‌ క్యాంపస్‌లో 20 సీట్లు ఉన్నాయి.

కంపారిటివ్‌ లిటరేచర్‌: హైదరాబాద్‌లో 20 సీట్లు ఉన్నాయి.

లింగ్విస్టిక్స్‌: హైదరాబాద్‌, లఖ్‌నవూ, షిల్లాంగ్‌ ఒక్కో క్యాంపస్‌లోనూ 20 చొప్పున ఉన్నాయి.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌: హైదరాబాద్‌లో 20 సీట్లు ఉన్నాయి.

జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌: హైదరాబాద్‌ క్యాంపస్‌లో 20, షిల్లాంగ్‌లో 20 సీట్లు ఉన్నాయి.

హైదరాబాద్‌ క్యాంపస్‌లో హిందీ, కంప్యుటేషనల్‌ లింగ్విస్టిక్స్‌, అరబిక్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌, ఫ్రెంచ్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌, జర్మన్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌, జపనీస్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌, హిస్పానిక్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌, రష్యన్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌ ఒక్కో సబ్జెక్టులో 20 చొప్పున సీట్లు ఉన్నాయి.


పీహెచ్‌డీ...

లింగ్విస్టిక్స్‌ అండ్‌ ఫొనెటిక్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఎడ్యుకేషన్‌, ఎడ్యుకేషన్‌, హిందీ, ఇండియా అండ్‌ వరల్డ్‌ లిటరేచర్స్‌, ఇంగ్లిష్‌ లిటరేచర్‌, కంపారిటివ్‌ లిటరేచర్‌, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌, ఈస్తటిక్స్‌ అండ్‌ ఫిలాసఫీ, ఫిల్మ్‌ స్టడీస్‌ అండ్‌ విజువల్‌ కల్చర్‌, ఫ్రెంచ్‌, రష్యన్‌, జర్మన్‌, స్పానిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌ల్లో పీహెచ్‌డీ కోర్సులు ఉన్నాయి. 

అర్హత: సంబంధిత విభాగంలో పీజీ లేదా సమానస్థాయి కోర్సు పూర్తిచేసినవాళ్లు వీటికి అర్హులు.


ట్రాన్స్‌లేషన్‌లో..

పీజీ డిప్లొమా ఇన్‌ ట్రాన్స్‌లేషన్‌ కోర్సు హైదరాబాద్‌ క్యాంపస్‌లో అందిస్తున్నారు. 20 సీట్లు ఉన్నాయి.

అర్హత: 55 శాతం (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలైతే 50 శాతం) మార్కులతో ఎంఏ ఇంగ్లిష్‌ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి ఏడాది.


ప్రోత్సాహకాలు

పీహెచ్‌డీ తప్ప మిగిలిన కోర్సుల్లో చేరిన విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1.5 లక్షల కంటే తక్కువగా ఉంటే ఇఫ్లూ మెరిట్‌ కం మీన్స్‌ ఫెలోషిప్‌, ట్యూషన్‌ ఫీజు మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు ప్రోత్సాహకాలు ఉంటాయి. వీరికి ప్రతి నెల రూ.వెయ్యి చొప్పున అందిస్తారు.

ఇవి కొనసాగడానికి సెమిస్టర్ల వారీ కనీస మార్కులు సాధించడం తప్పనిసరి. నెట్‌ అర్హతతో పీహెచ్‌డీలో చేరినవారికి జేఆర్‌ఎఫ్‌ వ్యవధిలో నెలకు రూ.31,000, ఎస్‌ఆర్‌ఎఫ్‌లకు రూ.35,000 ఫెలోషిప్‌ అందుతుంది. నెట్‌ లేనివారికి రూ.8000 చెల్లిస్తారు.


ఏమిటీ కెఫెటేరియా?

ఎంఏ ఇంగ్లిష్‌ (కెఫెటేరియా) కోర్సు ఇఫ్లూ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ తరహా ఆంగ్ల పీజీ కోర్సు దేశంలో మరే ఇతర విశ్వవిద్యాలయంలోనూ లేదు. కెఫెటేరియాలో భాగంగా ఇంగ్లిష్‌లో 5 రకాల కోర్సులు అందిస్తున్నారు. అవి... ఇంగ్లిష్‌, లింగ్విస్టిక్స్‌, టీచింగ్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాజ్‌ ఎ సెకండ్‌ లాంగ్వేజ్‌,  లిటరరీ అండ్‌ కల్చరల్‌ స్టడీస్‌, ఇంగ్లిష్‌ లిటరేచర్‌. వీటిలో మొత్తం 90 సీట్లు ఉన్నాయి.

ఈ కెఫెటేరియా కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో ఒక్కో సెక్షన్‌ నుంచి 25 చొప్పున 4 సెక్షన్లలో వంద ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌ ఎలో లిటరేచర్‌, బి-లో రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, సి-లో ఆర్గనైజేషనల్‌ ఎబిలిటీ అండ్‌ రైటింగ్‌ స్కిల్స్‌, డి- సెక్షన్‌లో వెర్బల్‌ అండ్‌ ఎనలిటికల్‌ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ కోర్సులో చేరిన తర్వాత మూడో సెమిస్టర్‌ వరకు అభ్యర్థులు ఉమ్మడిగానే చదువుకుంటారు. వారికి పైన పేర్కొన్న అయిదింటిలో ఎక్కువ క్రెడిట్స్‌ లభించిన విభాగంలో/ వారి ఆసక్తి ప్రకారం నాలుగో సెమిస్టర్‌ ఉంటుంది. కోర్సు పూర్తయిన తర్వాత సంబంధిత స్పెషలైజేషన్‌తో పీజీ డిగ్రీ ప్రదానం చేస్తారు.


ముఖ్యమైనవి.. క్లుప్తంగా

* దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 31

* ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు: రూ.500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు: రూ.250.

* పరీక్ష తేదీలు: యూజీ, పీజీ, టీచర్‌ ఎడ్యుకేషన్‌, పీజీ డిప్లొమా కోర్సులకు సెప్టెంబరు 9, రిసెర్చ్‌ కోర్సులకు: సెప్టెంబరు 18

* పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ.

* వెబ్‌సైట్‌:www.efluniversity.ac.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని