నీట్‌... ఆ తర్వాత!

ఇంటర్‌లో బైపీసీ గ్రూపు చదివినవారిలో చాలామంది లక్ష్యం...  వైద్య కళాశాలల్లో సీటు సాధించటం! జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్‌ ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో తమ ర్యాంకును బట్టి విద్యార్థులు సీట్ల సాధన విషయంలో అంచనాలు వేసుకుంటున్నారు. నీట్‌లో ఆశించిన ర్యాంకు రానివారు అంతగా నిరాశపడనక్కర్లేదు. వైద్య అనుబంధ రంగాల్లో, ఇతర రంగాల్లో వారికి దీటైన ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి.

Updated : 15 Nov 2021 05:38 IST

ఇంటర్‌లో బైపీసీ గ్రూపు చదివినవారిలో చాలామంది లక్ష్యం...  వైద్య కళాశాలల్లో సీటు సాధించటం! జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్‌ ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో తమ ర్యాంకును బట్టి విద్యార్థులు సీట్ల సాధన విషయంలో అంచనాలు వేసుకుంటున్నారు. నీట్‌లో ఆశించిన ర్యాంకు రానివారు అంతగా నిరాశపడనక్కర్లేదు. వైద్య అనుబంధ రంగాల్లో, ఇతర రంగాల్లో వారికి దీటైన ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. విద్యాసంవత్సరం నష్టపోయినా సరే, నీట్‌ లాంగ్‌ టర్మ్‌ సన్నద్ధతకు మొగ్గు చూపే విద్యార్థులు చాలామంది. ఇలాంటివారు దానితో పాటు జాతీయ ప్రాధాన్య సంస్థలు నిర్వహించే ప్రవేశపరీక్షలపైనా దృష్టి పెట్టవచ్చు!    

నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌) ద్వారా జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో ఉన్న అన్ని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌/ ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఈ ప్రవేశ పరీక్ష సింగిల్‌ విండో ఎంట్రన్స్‌గా ప్రఖ్యాతి చెందింది. పెన్‌-పేపర్‌ పద్ధతిలో జాతీయస్థాయిలో నిర్వహించిన ఈ పరీక్ష ద్వారా దాదాపు 554 మెడికల్‌ కాలేజీల్లోని 83,125 ఎంబీబీఎస్‌ సీట్లు, 315 డెంటల్‌ కాలేజీల్లోని 26,949 బీడీఎస్‌ సీట్లను నింపుతారు. దీంతోపాటు 52,000 ఆయుష్‌, జాతీయ స్థాయిలోని కొన్ని కాలేజీల్లో 525 బీవీఎస్‌సీ- ఏహెచ్‌ సీట్లను కూడా భర్తీ చేస్తున్నారు. నీట్‌ రాసిన విద్యార్థులు కౌన్సెలింగ్‌ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి వివరాలను ్త్మ్మ్ప://్ఝ‘‘.-i‘.i-/ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

తెలంగాణలో 5240 ఎంబీబీఎస్‌ సీట్లనూ, ఆంధ్రప్రదేశ్‌లో 5210 ఎంబీబీఎస్‌ సీట్లనూ నీట్‌ ర్యాంకుల ఆధారంగానే కేటాయిస్తారు. (కౌన్సెలింగ్‌ నాటికి వీటి సంఖ్యలో కొద్ది మార్పులుండవచ్చు).

ఎయిమ్స్‌, జిప్‌మర్‌, సీఎంసీ, మణిపాల్‌ లాంటి పేరొందిన మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశానికీ, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లోని ఎంబీబీఎస్‌ ప్రవేశాలకూ ఈ నీట్‌ ర్యాంకే ప్రామాణికం.

నీట్‌ -2021: ఎంబీబీఎస్‌ సీటు అంచనా

నీట్‌- 2020లో తెలంగాణ ఓసీ కేటగిరిలో కన్వీనర్‌ కోటా సీటు 497 మార్కుల వద్ద (89011 ఆలిండియా ర్యాంకు) కటాఫ్‌గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఓసీ కేటగిరిలో కన్వీనర్‌ కోటా సీటు ఏయూ 547 /ఎస్‌వీయూ 541 మార్కుల వద్ద (ఆలిండియా ర్యాంకు 50858- ఏయూ/54995- ఎస్‌వీయూ..) కటాఫ్‌గా ఉంది. ఈ సంవత్సరం కటాఫ్‌ మార్కు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే.. పేపర్‌ గత ఏడాది కంటే కొంచెం క్లిష్టంగా ఉంది. మెడికల్‌ కాలేజీలూ, సీట్లూ పెరిగాయి. అందుకని ఈ సంవత్సరం ఓసీ కేటగిరిలో తెలంగాణలో కన్వీనర్‌ కోటా సీటు 473 మార్కుల వద్ద లభించే అవకాశం ఉందని అంచనా.  

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పై కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు అల్లోపతి వైద్యవిధానానికి మారవచ్చు.

రాష్ట్రస్థాయిలో....

నీట్‌ కాకుండా రాష్ట్ర స్థాయిలో బైపీసీ విద్యార్థులకు టీఎస్‌ ఎంసెట్‌, ఏపీ ఈఏపీసెట్‌ల ద్వారా అగ్రికల్చర్‌, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలు ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంసెట్‌ ద్వారా కింది కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతాయి.
1. బీఎస్సీ (అగ్రికల్చర్‌) 2. బీఎస్సీ (హార్టీకల్చర్‌) 3. బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌ 4. బీఎఫ్‌ఎస్‌సీ 5. బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ (దీనికి బైపీసీ విద్యార్థులు బ్రిడ్జ్‌ కోర్సు పూర్తిచేయాల్సి ఉంటుంది) 6. బీఎస్సీ (ఫారెస్ట్రీ) 7. బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ 8. బీఫార్మసీ 9. ఫార్మా-డి ఇవన్నీ ప్రాముఖ్యమున్న ప్రొఫెషనల్‌ కోర్సులు. వీటిని పూర్తిచేసిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కొలువులను సాధించవచ్చు. వీటికి సంబంధించి ప్రస్తుతం కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరుగుతోంది.

ఫార్మసీ, నర్సింగ్‌...

ఔషధాల తయారీలో పాత్ర వహించే ఫార్మసీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతిష్ఠాత్మక కాలేజీలెన్నో ఈ కోర్సులను నిర్వహిస్తున్నాయి.  

బిట్స్‌: దీంట్లో బిట్‌శాట్‌ ద్వారా ప్రవేశాలు జరుగుతాయి. ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు ఫార్మా రంగ పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందవచ్చు. పరిశోధనను ఎంచుకుంటే ఉపకార వేతనాలనూ పొందగలరు. గీతం: ఇది హైదరాబాద్‌లో ఉన్న డీమ్డ్‌ విశ్వవిద్యాలయం. దీనిలో ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. అనురాగ్‌ యూనివర్సిటీ: మౌలిక సదుపాయాలతో జాతీయస్థాయిలో మంచి ర్యాంకింగ్‌ పొందిన సంస్థ. బీ-ఫార్మసీ, ఫార్మా-డి కోర్సులున్నాయి.  జేఎన్‌టీయూ: ప్రభుత్వ ఆధ్వర్యంలోని జేఎన్‌టీయూ బీ-ఫార్మసీ, ఫార్మా-డి కోర్సులు అందిస్తోంది.

ఫార్మసీతోపాటు పారామెడికల్‌ (ఆప్టోమెట్రీ, రేడియాలజీ, ఎంఎల్‌టీ.) కోర్సులను నిమ్స్‌, అపోలో, యశోద మొదలైన సంస్థలు నిర్వహిస్తున్నాయి. వీటి ద్వారా విద్యార్థులు త్వరగా ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు.

బీఎస్‌సీ నర్సింగ్‌- అత్యధిక ఉపాధి అవకాశాలున్న మరో కోర్సు. దీన్ని అనేక ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలు, అనుబంధ ఆసుపత్రులు నిర్వహిస్తున్నాయి.


ప్రసిద్ధ జాతీయస్థాయి విద్యాసంస్థల్లో..

బైపీసీ విద్యార్థులు జాతీయస్థాయి ప్రాధాన్యం ఉన్న విద్యాసంస్థల్లో వివిధ కోర్సులు చేయవచ్చు. వీటిని పూర్తి చేస్తే భవిష్యత్తు   ఉజ్వలంగా ఉంటుంది.  

ఐసీఏఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌)

ఈ సంస్థ జాతీయ స్థాయిలో ఏఐఈఈఏ (యూజీ) పరీక్షను నిర్వహించి అగ్రికల్చర్‌, ఇతర అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలను జరుపుతుంది. ఈ ఐసీఏఆర్‌ నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో రెండున్నర గంటల నిడివితో 150 ప్రశ్నలకు 600 మార్కులతో జరుగుతుంది. సాధారణంగా జనవరి- ఫిబ్రవరి నెలల్లో ప్రకటన వెలువడుతుంది. కరోనా కారణంగా ఈ ఏడాది జులైలో ప్రకటన ఇచ్చి, పరీక్షను ఆగస్టులో నిర్వహించారు.  

ఐఐఎస్‌ఈఆర్‌ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌)

ఈ సంస్థల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌-ఎంఎస్‌ కోర్సు ఉంది. ఇది 7 ప్రధాన నగరాల్లో ఉంది. జాతీయ స్థాయిలో నిర్వహించే కేవీపీవై, ఐఐటీ-జేఈఈ, స్టేట్‌ బోర్డుల మార్కుల ఆధారంగా వీటిలో ప్రవేశం   జరుగుతుంది.  సాధారణంగా జనవరి - ఫిబ్రవరి నెలల్లో ప్రకటన వెలువడుతుంది. ఈ ఏడాది జులైలో ప్రకటన ఇచ్చి, పరీక్షను ఆగస్టులో నిర్వహించారు.  

ఎన్‌ఐఎస్‌ఈఆర్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌)

దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఈ సంస్థలో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీ ప్రోగ్రామ్‌- బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో ఉంటుంది. ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఎన్‌ఈఎస్‌టీ (నెస్ట్‌) పరీక్ష నిర్వహిస్తారు. కోర్సులో చేరిన విద్యార్థులకు పూర్తిస్థాయి ఉపకార వేతనాలు ఇస్తారు. సాధారణంగా జనవరి- ఫిబ్రవరి నెలల్లో ప్రకటన వెలువడుతుంది. కరోనా కారణంగా ఈ ఏడాది జూన్‌లో ప్రకటన ఇచ్చి, పరీక్షను ఆగస్టులో నిర్వహించారు.  

పైన తెలిపిన ప్రొఫెషనల్‌ కోర్సులే కాకుండా బీఎస్సీలో వివిధ కాంబినేషన్లలో అనేక కళాశాలల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మెడికల్‌ అనుబంధ కోర్సులయిన నర్సింగ్‌, ఫిజియో   థెరపీ, పబ్లిక్‌ హెల్త్‌, మెడికల్‌ ల్యాట్‌ టెక్నాలజీ (ఎంఎల్‌టీ) కోర్సులకు కూడా డిమాండ్‌ ఎక్కువగా ఉంది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని