ప్రిపరేషన్‌కో పద్ధతి సర్కారీ కొలువు సాధ్యం ఇలా:

పోటీపరీక్షల్లో తీవ్రమైన పోటీని ఎదుర్కొని అంతిమ విజయం సాధించేందుకు తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని

Published : 14 Dec 2021 13:46 IST

 13తోచినట్టు చదవటం కాకుండా సన్నద్ధతలో శాస్త్రీయ పంథా అనుసరిస్తే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు సాధ్యమవుతాయి. కంటెంట్‌ అధ్యయనంలో సరైన విధానాలు పద్ధతిని పాటించటం ద్వారా బహుళ ప్రయోజనాలు సమకూరతాయి. 

పోటీపరీక్షల్లో తీవ్రమైన పోటీని ఎదుర్కొని అంతిమ విజయం సాధించేందుకు తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని శాస్త్రీయ విధానాలను పరిశీలిద్దాం! 

అభ్యసన ప్రక్రియలో మొట్టమొదట క్లిష్టత లేని పాఠ్యాంశాలు లేదా పేపర్లు ఎంపిక చేసుకోవాలి. సిలబస్‌లో ఇచ్చిన విషయ సూచికలు అనుసరించిన క్రమంలో మొట్టమొదట సాధారణ పరిజ్ఞానానికి సంబంధించిన పాఠ్యాంశాలు ఉండవచ్చు. లేదా క్లిష్ట పరిజ్ఞానానికి సంబంధించి పాఠ్యాంశాలు ఉండవచ్చు. అందుకే సిలబస్‌లో ఇచ్చిన క్రమంలో చదవకుండా ముందుగా సాధారణ పరిజ్ఞాన అంశాలను ఎంచుకుని చదవాలి. తరువాత మరికొంత క్లిష్టత ఉన్న అంశాలను చదవాలి. చిట్టచివరికి బహుళ సంశ్లిష్ట అంశాల సంగతి చూడాలి. ఇదే సూత్రం బహుళ పేపర్లుండే పోటీ పరీక్షలకు కూడా వర్తిస్తుంది. 

అంటే- పోటీ పరీక్షల్లో పేపర్లన్నీ పరిమాణం రీత్యా, క్లిష్టత రీత్యా ఒకేరకంగా ఉండవు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు మొదట సులభమైన పేపర్‌ను లేదా సాధారణ పరిజ్ఞానానికి సంబంధించిన పేపర్‌ను ఎంపిక చేసుకోవాలి. తదనంతరం సంక్లిష్టత అధికంగా ఉన్న పేపర్‌ని ఎంచుకుని అధ్యయనం చేయాలి. ఈ విధంగా అభ్యసన ప్రయాణం సాధారణ పరిజ్ఞానం నుంచి సంశ్లిష్ట పరిజ్ఞానానికి వెళ్లే విధంగా ఉంటే అభ్యర్థుల్లో ఉత్సాహంగా అధ్యయనం జరుగుతోంది. ప్రేరణ ఎక్కువ ఉంటుంది. ఆత్మవిశ్వాసం అధికమవుతుంది. దీర్ఘకాలిక అభ్యసనలో తప్పనిసరిగా పాటించాల్సిన మెలకువ ఇది.

తెలిసిన విషయాలనుంచి..

కళాశాల విద్య ముగిసిన తరువాత పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవ్వడం సహజం. అందువల్ల అభ్యర్థులకు ఏ పోటీ పరీక్ష రాసే ముందు అయినా ఎంతో కొంత పూర్వ పరిజ్ఞానం ఉంటుంది. పోటీ పరీక్షలకు తయా రయ్యే అభ్యర్థులు మొత్తం సిలబస్‌ని అధ్యయనం చేసి, తమకు పరిచయం ఉన్న పాఠ్యాంశాలు లేదా పేపర్లను ముందస్తుగా అధ్యయనం చేసే ప్రణాళికతో ఉండాలి.    తెలిసిన విషయాలపై పట్టు సులభంగా దొరుకుతుంది. జ్ఞాపకశక్తి కూడా సులభంగా ఏర్పడుతుంది. తెలిసిన విషయాల పునాదిగా తెలియని విషయాల వైపు అభ్యర్థుల అభ్యసన ప్రయాణం ఉండాలి. అలాంటి ప్రయాణ క్రమంలో చిన్న చిన్న అవరోధాలు వచ్చినా స్పష్టంగా ఎదుర్కొని ముందుకు వెళ్లే అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా భావన వికాసం (కాన్సెప్ట్‌ ఫార్మేషన్‌) బలంగా ఏర్పడుతుంది. బలమైన భావనలు ఏర్పడినప్పుడు అంతర్గతంగా విశ్లేషణ, అవగాహన సామర్ధ్యాలు ఏర్పడతాయి. ఫÄలితంగా పోటీ పరీక్షల్లో వచ్చే ఫ్యాక్ట్‌ ఆధారిత ప్రశ్నలే కాక ఇతర అవగాహన, విశ్లేషణ సంబంధిత ప్రశ్నలనూ సులభంగా ఎదుర్కోగలుగుతారు.

మూడు దశల్లో...

సాధారణ విషయాల నుంచి సంక్లిష్ట విషయాల వైపు; తెలిసిన విషయాలనుంచి తెలియని విషయాల వైపు పయనించేందుకు కి¨ంది దశల్లో అధ్యయనం కొనసాగించాలి.పాఠశాల పుస్తకాలపై పట్టు: దీన్ని సాధించటం మొదటి దశ. ముఖ్యంగా భౌగోళిక, రాజ్యాంగ, ఆర్థిక, చరిత్ర, జనరల్‌ సైన్స్‌ మొదలైన విభాగాల పాఠ్యాంశాలను పాఠశాల పుస్తకాల్లో ప్రాథమిక అంశాల స్థాయి నుంచి వివరిస్తారు. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్‌ మొదలైన పరీక్షల్లో జనరల్‌ ఇంగ్లిష్‌ను ప్రాథమిక స్థాయి నుంచి సంక్లిష్ట స్థాయి వరకూ చదివేందుకు పాఠశాల పుస్తకాలు ఉపకరిస్తాయి.

మధ్యస్థాయి క్లిష్టత: చరిత్ర, రాజ్యాంగం, ఆర్థిక, శాస్త్ర సాంకేతికత, విపత్తు నిర్వహణ మొదలైన విభాగాల్లో మధ్యస్థాయి క్లిష్టతతో కూడిన ప్రశ్నలు వస్తాయి. వీటి కోసం ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్‌ స్థాయుల్లో ఉండే పుస్తకాలు ఉపకరిస్తాయి. సిలబస్‌ను బట్టి ఆయా స్థాయుల్లోని పుస్తకాలను ఎంపిక చేసుకోవాల్సిన జాగ్రత్తను అభ్యర్థులు పాటించాలి.

గరిష్ఠ క్లిష్టత: ఈ స్థాయి క్లిష్ట ప్రశ్నలను ఎదుర్కోగలిగే సామర్ధ్యమున్న అభ్యర్థులే తుది ఎంపిక జాబితాలో ఉంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు క్లిష్టత ఎక్కువగా ఉన్న ప్రశ్నలు ఏయే పేపర్లలో ఏయే పాఠ్యాంశాల్లో అడుగుతున్నారో లోతైన పరిశీలన చేయాలి. పరిశీలన ద్వారా నిర్ణయించుకున్న పేపర్లు లేదా పాఠ్యాంశాలను విశ్వవిద్యాలయాల ప్రచురణల నుంచి గానీ, ప్రముఖ రచయితల పుస్తకాల నుంచి గానీ సేకరించుకుని అధ్యయనం చేయటం ఉత్తమం. సివిల్స్, గ్రూప్‌-1 లాంటి పరీక్షలు రాసే అభ్యర్థులు దినపత్రికల్లో వచ్చే ప్రముఖ వ్యక్తుల ఆర్టికల్స్‌పై కూడా దృష్టి పెట్టాలి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని