Updated : 17 Jan 2022 04:07 IST

నిలిచిపోవద్దు.. నీ లక్ష్యం వీడొద్దు

సన్నద్ధత దెబ్బతినకుండా పార్ట్‌టైమ్‌ విధులు సాధ్యమే!  

పోటీ పరీక్షలకు తయారవటం దీర్ఘకాలం చేయాల్సిన కృషి. రోజులు గడుస్తున్నకొద్దీ ఉత్సాహం కరిగిపోయి, నిరాశ మేఘాలు కమ్ముకోవచ్చు. వెనకడుగు వేసేలా అవరోధాలు ఎదురుకావొచ్చు. పేద, మధ్యతరగతి అభ్యర్థులకు ఇంటినుంచి రానురానూ ఆర్థిక మద్దతు తగ్గిపోవటం సహజమే. ఇలాంటపుడు నిస్సహాయంగా లక్ష్యం నుంచి నిష్క్రమించనక్కర్లేదు. పట్టుదలతో సన్నద్ధతను కొనసాగించగలిగే ఆచరణీయ మార్గాలను ఎవరికి వారు అన్వేషించవచ్చు! ఆర్థిక ఆసరాను కల్పించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓటమిని ఒప్పుకోకుండా ఓరిమి చూప  గలిగే పరిణతినీ, ఆశావహ దృక్పథాన్నీ పెంచుకోవటం అన్నిటికన్నా ముఖ్యం!

జయ..వెంకటేష్‌.. విజయ్‌.. రవి!
వీళ్ళు నలుగురు మిగతా నిరుద్యోగుల మాదిరిగానే మూడు నాలుగేళ్ల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ కొలువులపై ఆశలు పెట్టుకొన్నారు. ఉన్నతోద్యోగాలు సాధించాలని దృఢ సంకల్పంతో హైదరాబాద్‌ ప్రయాణమై వెళ్లారు. కోచింగ్‌ తీసుకున్నారు. నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ కఠోర శ్రమపడ్డారు. ఎన్నికల హడావిడి తర్వాత నోటిఫికేషన్లు రాకపోయినా పట్టుదల సడలనీయలేదు.

అనుకోనిరీతిలో 2020లో కరోనా జోరు మొదలై అన్ని రంగాలూ కుదేలై నోటిఫికేషన్లు కనుచూపు మేరలో కనిపించలేదు. ఉన్న కొద్దిపాటి డబ్బు అయిపోయింది. ఊరు వెళ్ళలేని పరిస్థితి. ఎటుచూసినా ఆశాజనకంగా లేని భవిష్యత్తు. ఆర్థికపరమైన ఒత్తిళ్లు. ‘కోచింగ్‌ కొనసాగించాలా? ప్రిపరేషన్‌ను ముందుకు తీసుకువెళ్లాలా? వేరే పని ఏదైనా చూసుకోవాలా?’.. నిర్ణయించుకోలేని నిస్సహాయ పరిస్థితి!

‘ఏమో, ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్‌ రావచ్చేమో!’ ప్రకటన వచ్చాక ఇంత తీవ్రమైన పోటీలో అప్పటికప్పుడు సన్నద్ధత ప్రారంభిస్తే సమయం సరిపోదని మనసు హెచ్చరిస్తోంది. అదే సమయంలో ఆర్థికపరమైన మద్దతు లేక ప్రిపరేషన్‌ కొనసాగించలేని నిస్సహాయత.'

సరిగ్గా ఇలాంటి సంఘర్షణలో నుంచి తొలి కిరణం లాంటి ఆలోచన వారిలో ఉదయించింది. దాన్ని అమలు చేశారు. ఆర్థిక చిక్కులన్నీ చెల్లాచెదురు చేశారు. పట్టుదలతో ప్రిపరేషన్‌ కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన కొద్దిపాటి నోటిఫికేషన్లలో విజయం సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తెలంగాణ నోటిఫికేషన్ల కోసం కూడా ఎదురుచూస్తున్నారు.
ఇంతకీ వారిలో వచ్చిన ఆలోచన వారి జీవిత విధానాన్ని ఎలా మార్చిందో చూద్దాం.


పాఠాల బోధన

తెలంగాణ వాసి జయ స్కాలర్‌షిప్పుల సహాయంతో గణితంలో పీజీ చేసింది. సివిల్‌ సర్వీస్‌ను తుది లక్ష్యంగా నిర్దేశించుకుంది. తల్లిదండ్రులు ఇచ్చిన కొద్దిపాటి ఆర్థిక మద్దతుతో పోటీ పరీక్షల ప్రిపరేషన్‌ను ప్రారంభించింది. ఇదే సమయంలో తెలంగాణలో గ్రూప్‌ 1, 2 సర్వీసుల పరీక్షల ప్రకటనలు వస్తాయని వార్తలు రావడంతో వాటిపైనే దృష్టి సారించింది. నోటిఫికేషన్లు రాలేదు కానీ కరోనా ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది. హైదరాబాదులో ఉండి చదువు కొనసాగించలేని పరిస్థితి. అలా అని వట్టి చేతులతో ఇంటిమొహం పట్టలేని హృదయ వేదన.

దీంతో ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేందుకూ, సన్నద్ధత నుంచి బయటకు వెళ్లకుండా ఉండేందుకూ తనే ఒక ఫ్యాకల్టీ సభ్యురాలి అవతారం ఎత్తింది. ప్రముఖ ఆన్‌లైన్‌ కోచింగ్‌ సంస్థలో చిన్న శిక్షకురాలిగా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె పాఠాలు అభ్యర్థుల్లోకి చొచ్చుకుపోవటంతో కొన్ని ఆన్‌లైన్‌ సంస్థలు ఆమె సహకారం తీసుకునేందుకు ముందుకొచ్చాయి. దానితో తన జీవిత లక్ష్యసాధనకు సిద్ధమవుతున్న పాఠాల్ని తాత్కాలిక జీవనోపాధి కోసమూ ఉపయోగించుకోవటం ప్రారంభించింది. నోటిఫికేషన్ల కోసం నిరీక్షిస్తున్నప్పటికీ ప్రత్యామ్నాయ ఆర్థిక ప్రణాళికను అనుసరించడంతో ఆత్మవిశ్వాసాన్ని పోగు చేసుకుంది. భవిష్యజ్జీవితంపై ఆశతో ముందుకు వెళ్తోంది.


బిట్స్‌, నోట్సు  

వెంకటేష్‌ వెనుకబడిన తెలంగాణా ప్రాంతం నుంచి యూనివర్సిటీ విద్య కోసం హైదరాబాద్‌ వచ్చాడు. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనే ఆశతో నాలుగేళ్లుగా కృషి చేస్తున్నాడు. ప్రపంచానికి వచ్చిన ఆర్థిక సమస్యలు అతణ్ణీ చుట్టుముట్టాయి. నోటిఫికేషన్లు లేవు. ఇంటి నుంచి ఆర్థికపరమైన మద్దతు పొందలేని పరిస్థితి.

సమస్య నుంచి బయటపడేందుకు అనేక ఆలోచనలు చేశాడు. ముఖ్యంగా ఆర్థిక అవరోధాల్ని ఎదుర్కొనేందుకు కంటెంట్‌ రైటర్‌గా తనను తాను మార్చుకున్నాడు. పోటీ పరీక్షలకు ఉపకరించే పుస్తకాల పబ్లికేషన్‌ దగ్గర  బిట్స్‌ రాసేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఒక్కొక్క బిట్టుకు ఆ సంస్థ చేసే చెల్లింపులతో నెలకు 10వేల నుంచి 15 వేల రూపాయలు సంపాదించే స్థితికి చేరాడు. దానితో తన ఖర్చులు పోను ఐదారు వేల రూపాయిలు ఇంటికి పంపించగలిగిన ఆర్థిక శక్తిగా మారాడు. తను ఏ ఆశయంతో ప్రిపరేషన్‌ ప్రారంభించాడో అవే పరీక్షలకు సంబంధించిన బిట్స్‌, నోట్స్‌ తయారుచేయడం అనే పని వల్ల తన లక్ష్యం నుంచి పక్కకు వెళ్ళలేదు. కుటుంబానికీ ఆసరాగా ఎదిగాడు. ధైర్యంగా జీవితం మీద ఆశ పెంచుకుని నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నాడు. సన్నద్ధతను ఆనందంగా కొనసాగిస్తున్నాడు.


ఆన్‌లైన్‌ ట్యూషన్లు

విజయ్‌ దక్షిణ ఆంధ్రకు చెందిన బీటెక్‌ విద్యార్థి. గ్రూప్‌- 1, 2 సర్వీసులు లక్ష్యంగా నిర్దేశించుకుని నాలుగైదు సంవత్సరాలుగా తయారవుతూనే ఉన్నాడు. ఎంతకాలమని తల్లిదండ్రులు ఆర్థిక మద్దతు ఇవ్వగలరు? పైగా నోటిఫికేషన్లు కనుచూపుమేరలో కనిపించడం లేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగిగా మారాలనే సంకల్పం అతడిలో బలహీనపడలేదు. కరోనా సమయంలో తీవ్ర ఆర్థిక అవరోధాలను ఎదుర్కొన్నాడు.

వాటిని పరిష్కరించుకునే క్రమంలో వచ్చిన ఆలోచనే ఆన్‌లైన్‌ ట్యూటర్‌గా మారటం. తనకు బాగా పట్టున్న గణితంలో ఆన్‌లైన్‌ బోధకుడిగా చేరాలన్న ఆలోచన  అమలుచేశాడు. డబ్బు ఆర్జించడం ప్రారంభించాడు. ఆన్‌లైన్‌ ట్యూషన్‌కు డిమాండ్‌ పెరగడంతో ఆరు నెలలు తిరక్కుండానే ఆర్థికంగా బలపడ్డాడు. ప్రతిరోజూ రెండు గంటల సమయాన్ని కేటాయిస్తూ మిగతా సమయాన్ని ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందేందుకు వినియోగిస్తున్నాడు. తాజాగా వచ్చిన జూనియర్‌ అసిస్టెంట్‌ పరీక్షలను ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో శక్తుల్ని కేటాయించగలుగుతున్నాడు. కుటుంబానికి భారంగా మిగలకుండా పైపెచ్చు తన వంతు సహాయం అందిస్తున్నాడు.


బుక్‌ సెల్లింగ్‌

వి దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు పట్టుబట్టి హైదరాబాద్‌లో కోచింగ్‌లో చేరాడు. అందరిలాగానే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎస్‌ఐ గానీ, గ్రూప్‌- 2 గానీ నోటిఫికేషన్లు రావా అనే ఆశతో సన్నద్ధత కొనసాగిస్తున్నాడు. ఆర్థిక అవరోధాలనుంచి బయటపడేందుకు అమెజాన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో పుస్తకాలు అమ్మేసెల్లర్‌ గా నమోదు చేసుకున్నాడు. వివిధ పుస్తకాలను లిస్టింగ్‌ చేయడం ద్వారా తనకు కావలసిన డబ్బులు సమకూర్చుకుంటున్నాడు.

ప్రభుత్వ కొలువు కోసం ప్రతిరోజూ 10 గంటలు చదవటం అనే నిర్ణయాన్ని మాత్రం వీడలేదు. అందుకే నోటిఫికేషన్లు కొద్దిగా ఆలస్యం అయినా సరే, ప్రభుత్వ ఉద్యోగాన్ని  పొందగలననే బలమైన నమ్మకాన్ని ఏర్పరుచుకున్నాడు.

నీసం 4 నుంచి 6 గంటలైనా ఏదో ఒక ప్రత్యామ్నాయ ఉపాధిపై దృష్టి పెట్టి మిగతా సమయాన్ని పోటీ పరీక్షల కోసం వెచ్చించడం- ప్రస్తుత పరిస్థితుల్లో ఆచరణీయమైన, సముచిత నిర్ణయం. అవరోధాల్ని ఎదుర్కొని విజయం సాధిస్తేనే కదా అది సంపూర్ణ
విజయం అయ్యేది!


Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని