TS Exams 2022: కలిపింది... విడగొట్టింది ఆ ఒప్పందమే!

చరిత్రలో కొన్ని సంఘటనలు విచిత్రంగా అనిపిస్తాయి. ఒక్కోసారి ఒకే అంశం సందర్భాలను బట్టి రెండు పరస్పర విరుద్ధమైన ప్రభావాలను చూపుతుంటుంది. అలాంటి ఒక ఒప్పందం తెలుగు రాష్ట్రాలు కలవడానికి, విడిపోవడానికి కారణమైంది.

Updated : 10 Apr 2022 23:58 IST

తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం

చరిత్రలో కొన్ని సంఘటనలు విచిత్రంగా అనిపిస్తాయి. ఒక్కోసారి ఒకే అంశం సందర్భాలను బట్టి రెండు పరస్పర విరుద్ధమైన ప్రభావాలను చూపుతుంటుంది. అలాంటి ఒక ఒప్పందం తెలుగు రాష్ట్రాలు కలవడానికి, విడిపోవడానికి కారణమైంది. అదే పెద్దమనుషుల ఒప్పందం. తెలుగు సంస్కృతిని పెంపొందించుకోవాలనే లక్ష్యంతో   14 అంశాల ఆధారంగా రెండు ప్రాంతాలూ విలీనమయ్యాయి. అవి అమలుకు నోచుకోలేదనే అసంతృప్తి తీవ్రమై చివరకు రెండు రాష్ట్రాలుగా విడిపోయాయి. ఈ ఒప్పంద నేపథ్యాన్ని, రెండు ప్రాంతాల మధ్య ఏర్పడిన వైరుధ్యాలను అభ్యర్థులు సమగ్రంగా అర్థం చేసుకోవాలి. ఈ అధ్యాయం నుంచి పరీక్షల్లో ప్రశ్నలు తరచూ అడుగుతున్నారు. సంఘటనలను కేవలం బట్టీ పట్టకుండా వివరంగా, విశ్లేషణాత్మకంగా చదివితే పూర్తి ప్రయోజనం పొందవచ్చు. 


పెద్దమనుషుల ఒప్పందం

పెద్దమనుషులెవరు?

1. బెజవాడ గోపాలరెడ్డి, 2. నీలం సంజీవరెడ్డి, 3. సత్యనారాయణ రాజు, 4. గౌతు లచ్చన్న, 5. బూర్గుల రామకృష్ణారావు, 6. కె.వి.రంగారెడ్డి, 7. ఎం.చెన్నారెడ్డి, 8. జేవీ నర్సింగరావు

ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పడిన తర్వాత నాటి హైదరాబాద్‌ రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలను కూడా విలీనం చేయాలని కొందరు పెద్దలు ఆకాంక్షించారు. తెలుగు మాట్లాడేవారందరితో ఒకే రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తెలుగు జాతి సంస్కృతిని పెంపొందించుకోవచ్చని భావించారు.   కానీ  దీన్ని నాటి తెలంగాణ నాయకులు కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో  తెలంగాణ నాయకుల భయాలను తొలగించడానికి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ తెలంగాణ ప్రాంతానికి అనేక హామీలతో కూడిన ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వంలో నాటి ప్రధానమంత్రి, హోం మంత్రి, కాంగ్రెస్‌ కమిటీలో   పలుకుబడి ఉన్న ఆంధ్ర నాయకుల ఒత్తిడి లాంటి కారణాలు 14 అంశాల పెద్ద మనుషుల ఒప్పందానికి దారి తీశాయి.  ఆంధ్ర రాష్ట్రం నుంచి నలుగురు నాయకులు, హైదరాబాద్‌ రాష్ట్రానికి చెందిన మరో నలుగురు నాయకులు 1956 ఫిబ్రవరి 20న కేంద్ర హోం మంత్రి గోవింద వల్లభ్‌ పంత్‌ సమక్షంలో సంతకాలు చేశారు. దీనికే పెద్దమనుషుల ఒప్పందమని పేరు.


14 అంశాలు
* తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రజలకు కల్పించిన రక్షణలు.

1) కేంద్ర, సాధారణ పరిపాలనా ఖర్చులకు వ్యయాన్ని రెండు ప్రాంతాల నిష్పత్తిని అనుసరించి ఖర్చు చేయాలి. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన మిగులు నిధులను తెలంగాణ ప్రాంత అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలి. ఈ అంశాలు 5 సంవత్సరాల వరకు కొనసాగుతాయి.  తెలంగాణ ప్రాంత శాసన సభ సభ్యులు కోరితే దీన్ని మరో 5 ఏళ్లు పొడిగించవచ్చు. 

2) తెలంగాణ మద్యపాన నిషేధాన్ని తెలంగాణ ప్రాంత విధానసభ సభ్యులు నిర్ణయించిన ప్రకారం కొనసాగిస్తారు. 

3) తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ విద్యార్థులకు ఉండే సౌకర్యాలను కొనసాగిస్తారు. లేదంటే మొత్తం రాష్ట్రంలోని విద్యా సంస్థల ప్రవేశాల్లో 1/3వ వంతుకు తగ్గకుండా తెలంగాణ వారికి కేటాయించాలి. ఈ రెండు అంశాల్లో తెలంగాణ వారికి ఏది సమ్మతమైతే అది కొనసాగుతుంది.

4) రెండు రాష్ట్రాల విలీనం వల్ల మిగులు ఉద్యోగులను తొలగించాల్సి వస్తే ఇరు ప్రాంతాల నిష్పత్తిలో మాత్రమే తొలగించాల్సి ఉంటుంది.

5) భవిష్యత్తులో ఉద్యోగుల నియామకం ఇరు ప్రాంతాల ప్రజల నిష్పత్తిలో కొనసాగాలని పేర్కొన్నారు.

6) రాష్ట్ర సాధారణ పరిపాలనలో లేదా న్యాయవ్యవస్థలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉర్దూను 5 ఏళ్ల వరకు కొనసాగించాలి. ప్రాంతీయ మండలి సమీక్షపై ఇది ఆధారపడి ఉంటుంది.

7) ప్రభుత్వ నియామకాలకు సంబంధించి ఉద్యోగుల్లో తెలంగాణ వారికి తెలుగును నిర్బంధం చేయకూడదు.

8) తెలంగాణకు ఉద్యోగ నియామకాల్లో నివాస అర్హతను 12 ఏళ్లుగా నిర్ణయించారు.

 9) తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయ భూముల అమ్మకాలను తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతీయ మండలి నియంత్రిస్తుంది.

 10) తెలంగాణ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి ఒక ప్రాంతీయ మండలి ఏర్పాటు చేస్తారు.

 11) ప్రాంతీయ మండలి నిర్మాణాన్ని పేర్కొంటుంది.  

12) ఈ ప్రాంతీయ మండలిని చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేయాలి. ఈ ఏర్పాటును పదేళ్ల తర్వాత సమీక్షించాలి.

13) రాష్ట్ర మంత్రి మండలి ఇరు రాష్ట్రాల మధ్య 60 : 40 నిష్పత్తిలో (ఆంధ్ర : తెలంగాణ) ఉంటుంది. ఈ మంత్రుల్లో తప్పకుండా ఒక ముస్లింను తెలంగాణ నుంచి నియమించాలి.

 14) ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారైతే డిప్యూటీ ముఖ్యమంత్రి తెలంగాణకు చెందినవారై ఉండాలి. ముఖ్యమంత్రి తెలంగాణకు చెందిన వారైతే ఉప ముఖ్యమంత్రి ఆంధ్రాకు చెందినవారై ఉండాలి. హోంశాఖ, ఆర్థికశాఖ, రెవెన్యూ శాఖ, ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, వాణిజ్యం - పరిశ్రమలు శాఖల్లో ఏవైనా రెండు మంత్రిత్వ శాఖలు తప్పనిసరిగా తెలంగాణ వారికి ఇవ్వాలి.

కానీ ఒప్పందంలోని ఈ 14 అంశాలూ మొదటి పన్నెండు సంవత్సరాల్లోనే పూర్తిగా ఉల్లంఘనకు గురయ్యాయి. దాని పర్యవసానంగా 1969లో మొదటి దశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వచ్చింది. అనంతరం 2001లో మలిదశ ఉద్యమం ప్రారంభమై అతని కాలంలోనే తీవ్రం కావడంతో 2014లో రాష్ట్ర విభజన జరిగింది. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని