Updated : 21 Apr 2022 05:20 IST

వర్తమాన అంశాల్ని వల్లెవేయండి..

పోటీ పరీక్షల్లో కరెంట్‌ అఫైర్స్‌ ముఖ్యభూమిక పోషిస్తాయి. రోజూ మారే వీటిలో ముఖ్యమైన అంశాలను గుర్తించి గతం, ప్రస్తుతానికి అన్వయించుకుంటూ చదవగలిగితే విజయం మీదవుతుంది. అనేక ప్రభుత్వోద్యోగాల నోటిఫికేషన్లు రానున్న నేపథ్యంలో వర్తమానాంశాల్ని నోట్సు, ప్రాక్టీస్‌ బిట్స్‌, రివిజన్‌ ద్వారా ఎలా చదువుకోవాలో చూద్దాం.

స్టాటిక్‌ జీకే ప్రశ్నలుండొచ్చు..

ఈ మధ్యకాలంలో ప్రశ్నల సరళి చాలావరకూ మారింది. గతంలో ప్రశ్నలు ఏకవాక్యంలో ఉండేవి. ఇప్పుడు కరెంట్‌ అఫైర్స్‌తో పాటు స్టాటిక్‌ (ఎ,బి లేదా బి, సి)ను కలిపి ప్రశ్నలడుగుతున్నారు. కాబట్టి రోజూ కరెంట్‌ అఫైర్స్‌తోపాటు సంబంధిత స్టాటిక్‌ జీకే కూడా చదువుకోగలిగితే కరెంట్‌ అఫైర్స్‌లో విజయం సాధించినట్లే. కాబట్టి నోట్సు తయారు చేసుకోవడం మంచిది.

ప్రాక్టీస్‌ బిట్స్‌పై మరింత పట్టు..

కరెంట్‌ అఫైర్స్‌ ఎక్కువశాతం బిట్స్‌ రూపంలోనే వస్తాయి. వీటికి సాధన అవసరం. మనం చదివినవి ఏ మేరకు జ్ఞాపకం ఉన్నాయో సాధన వల్లే తెలుస్తుంది. పాత ప్రశ్నపత్రాల్లో ప్రశ్నల సరళిని అర్థం చేసుకోవాలి. ఏదైనా బ్యాంకింగ్‌ లేదా క్రీడాంశాలపై గతంలో ఎలా ఇచ్చారో పోలుస్తూ, ఇప్పుడు ఎలా అడగడానికి అవకాశం ఉందో ఆలోచిస్తూ, విశ్లేషణాత్మకంగా చదవాలి. ఇందుకు ప్రతి నెలా పక్ష, మాసపత్రికల్లో ప్రాక్టీస్‌ ప్రశ్నలు వస్తుంటాయి. వాటిని అనుసరించాలి. లేదంటే ప్రాక్టీస్‌ క్వశ్చన్‌ పేపర్లు విడిగా దొరుకుతాయి. వాటిని సాధన చేయాలి.

ఏడాది నోట్సు తయారీ..

కరెంట్‌ అఫైర్స్‌ సన్నద్ధతలో చాలా చక్కగా ఉపయోగపడేవి దినపత్రికలే! నిత్యం వార్తాపత్రికలను చదివేటప్పుడు వర్తమాన అంశాలను అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయాంశాలుగా విభజించుకోవాలి. క్రీడలు, వాణిజ్యం, బ్యాంకింగ్‌, గ్రంథాలు- వాటి రచయితలు, ముఖ్యమైన తేదీలను నెలల వారీగా ఏడాదికాలానికి నోట్సు రాసి సిద్ధం చేసుకోవాలి. ఆధారంగా ఏదైనా ఒక మంచి మాసపత్రికను ఎంచుకోవచ్చు.

* నోట్స్‌ తయారుచేసుకునే సమయంలో ఏ-4 సైజు రకం పేజీని ఎంచుకోవడం ఉత్తమం. ఏ షీట్‌కి ఆ షీట్‌, ఏ అంశానికి ఆ అంశం విడివిడిగా, విపులంగా ఉండాలి. ఇలా రాసుకున్న అంశాలకు, సంబంధిత వార్తాపత్రిక కటింగ్స్‌ను కూడా జోడించామంటే రివిజన్‌ సులభమవుతుంది.

* గతంతో పోలిస్తే, కరెంట్‌ అఫైర్స్‌లో విశ్లేషణాత్మక విషయాలకు ప్రాధాన్యం పెరిగింది. ప్రతి అభ్యర్థీ అందుకు తగ్గట్టుగా ప్రతి టాపిక్‌ను ఐదు నుంచి ఏడు పాయింట్లు వచ్చేలా స్టాటిక్‌ విధానంలో నోట్సు సిద్ధం చేసుకోవడం అవసరం. మ్యాగజీన్స్‌లో సమాచారం విపులంగా ఉన్నప్పటికీ, మళ్లీ సొంతంగా రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం, చదవడం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

అంశాల విభజన ఇలా ఉండాలి...

* అంతర్జాతీయ అంశాలు: అంతర్జాతీయ సదస్సులు, వార్తల్లో వ్యక్తులు, అవార్డులు, క్రీడాంశాలు, ఇతర దేశాల సమాచారం, కమిటీలు- నివేదికలు, పర్యావరణం- జీవ వైవిధ్యం మొదలైనవి.

* జాతీయ అంశాలు: కొత్త ముఖ్యమంత్రులు, గవర్నర్‌లు, ఇతర ముఖ్యవ్యక్తులు, జాతీయ సదస్సులు, జాతీయ పథకాలు, రక్షణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అవార్డులు, ప్రదేశాలు, దినోత్సవాలు మొదలైనవి.

* రాష్ట్ర అంశాలు: రాష్ట్ర మంత్రివర్గ సమాచారం, కొత్తగా పదవుల్లోకి వచ్చిన వ్యక్తులు, రాష్ట్ర పథకాలు, అవార్డులు- క్రీడలు, ప్రదేశాలు, దినోత్సవాలు, కమిటీలు- నివేదికలు, గ్రంథాలు-రచయితలు మొదలైన అంశాలు.

* స్టాటిక్‌ జి.కె: దేశాలు- రాజధానులు- వాటి కరెన్సీ, పార్లమెంట్‌ పేర్లు, వివిధ అంశాలకు సంబంధించిన మొదటి వ్యక్తులు, నదీ ప్రవాహ నగరాలు, ప్రత్యేక రోజులు- వాటి ప్రాముఖ్యం, వివిధ ఆవిష్కరణలకు సంబంధించిన అంశాలు.

రివిజన్‌ చేయండిలా..

మనం దినపత్రికలో చదివిన ప్రతి అంశాన్ని రివిజన్‌ చేయలేం. అందుకే ప్రత్యేకించి నోట్స్‌ రాసుకోవడం, వాటికి న్యూస్‌ పేపర్‌ కటింగ్స్‌ అతికించి, చదవడం ఒక పద్ధతి.

ఇదే రివిజన్‌కు మరో పద్ధతి: గ్రూప్‌ డిస్కషన్‌...

ఉదా: ముగ్గురు లేదా నలుగురు విద్యార్థులు కలిసి ఒక బృందంగా ఏర్పడి, ముందుగా ఆరోజు వర్తమానాంశాల్ని చదవాలి. తరువాత ఒకరు జాతీయం, మరొకరు అంతర్జాతీయం, ఇంకొకరు ప్రాంతీయం.. ఇలా అంశాలను పంచుకోవాలి. ఒకరు ప్రశ్నలు అడుగుతుంటే, మరో ముగ్గురు జవాబులు చెప్తూ ప్రిపేర్‌ అవ్వొచ్చు. ఈ క్రమంలో మనం జవాబు సరికానిది చెప్తే, వేరే విద్యార్థి సరిచేస్తారు. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలడుగుతూ రివిజన్‌ చేయడం వల్ల, ఎక్కువకాలం గుర్తుంటాయి.

సమాచార వనరులు..

* యోజన: ఇది ఒకప్పుడు ప్రణాళికా సంఘం, ఇప్పుడు నీతి ఆయోగ్‌ మాసపత్రిక. ఆర్థికపరమైన అంశాల గురించి విస్తృతంగా చెబుతుంది.

* కురుక్షేత్ర: వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి మొదలైన అంశాలకు సంబంధించి ఇది చక్కని సమాచార వనరు.

* ఎకనమిక్‌, పొలిటికల్‌ వీక్లీ: ప్రపంచ ఆర్థిక, సామాజిక, రాజకీయ  పరమైన అంశాలను అందించే వెబ్‌సైట్‌.

* న్యూస్‌ ఆన్‌ ఎయిర్‌.కామ్‌: దీన్ని ఆల్‌ ఇండియా రేడియో నిర్వహిస్తోంది. ముఖ్యమైన చర్చలు వంటి అంశాలుంటాయి.

ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో: అధికారిక గణాంకాలు, అంశాలు ఇందులో ఉంటాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని