తప్పులెన్నువారు... టెస్టర్లు కాగలరు!

డిజిటల్‌ దిశగా ప్రపంచం దూసుకు పోతోంది. సంస్థల అభివృద్ధిలో సాంకేతికత అస్త్రంగా  మారింది. ఈ మార్పులు సంస్థలతోపాటు, వినియోగదారులకూ మేలు చేకూర్చాలంటే ఎలాంటి లోపాలూ లేకుండా సంబంధిత సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ రూపొందాలి. ప్రోగ్రామింగ్‌లో లోపాలు (బగ్స్‌) సంస్థల పాలిట శాపంగా మారి, వ్యాపారాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. అలా జరగకుండా

Published : 19 May 2022 00:24 IST

ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌ విద్యార్థులకూ అవకాశం

డిజిటల్‌ దిశగా ప్రపంచం దూసుకు పోతోంది. సంస్థల అభివృద్ధిలో సాంకేతికత అస్త్రంగా  మారింది. ఈ మార్పులు సంస్థలతోపాటు, వినియోగదారులకూ మేలు చేకూర్చాలంటే ఎలాంటి లోపాలూ లేకుండా సంబంధిత సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ రూపొందాలి. ప్రోగ్రామింగ్‌లో లోపాలు (బగ్స్‌) సంస్థల పాలిట శాపంగా మారి, వ్యాపారాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. అలా జరగకుండా చూడటానికి ప్రత్యేక నిపుణుల సేవలే కీలకం. ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహించేవాళ్లే టెస్టర్లు. ఎర్రర్‌ ఫ్రీ, యూజర్‌ ఫ్రెండ్లీ సాంకేతికతలో వీరి కృషి కీలకం. ప్రస్తుతం సమర్థులైన టెస్టు ఇంజినీర్ల కొరతను సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ ఎదుర్కొంటోంది. అందువల్ల ఆసక్తి ఉన్నవారు విద్యా నేపథ్యంతో సంబంధం లేకుండా టెస్టింగ్‌ టూల్స్‌లో ప్రావీణ్యం పొంది ఆకర్షణీయవేతనంతో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.

విద్యార్థి ప్రశ్నలకు సమాధానం రాస్తే ఉపాధ్యాయులు మూల్యాంకనం చేస్తారు. ఏవైనా తప్పులు ఉంటే చెప్తారు. అలాగే మరింత మెరుగ్గా సమాధానం ఎలా ఇవ్వాలో విలువైన సూచనలు అందిస్తారు. ఇదే తరహా పని సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సంస్థల్లోనూ జరుగుతుంది. ఇక్కడ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు/ప్రోగ్రామర్లు ఏదైనా లక్ష్యానికి సంబంధించి కోడింగ్‌ రాస్తారు.

ఉదాహరణకు మనం లిఫ్ట్‌ విరివిగా ఉపయోగిస్తున్నాం. బటన్‌ నొక్కగానే మనం ఉన్న ఫ్లోర్‌లోకి వచ్చి, తలుపులు తెరచుకుంటాయి. లోపలకు వెళ్లగానే వాటంతట అవే మూసుకుంటాయి. ఒకవేళ నిర్దేశిత బరువు కంటే ఎక్కువమంది ఎక్కితేే ఆగిపోతాయి. మనం కోరుకున్న ఫ్లోర్‌లోకి బటన్‌ ప్రెస్‌ ఆధారంగా తీసుకెళ్తాయి. తలుపులు తెరుచుకుని, బయటకు రాగానే మూసుకుపోతాయి. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం ఎలా జరుగుతోందో ఆలోచించారా? దీని వెనుక ఉన్నది సాంకేతిక పరిజ్ఞానమే. అయితే ఆ సాంకేతికతలో లోపాలు ఉంటే ప్రమాదాలు జరుగుతాయి. లిఫ్ట్‌ డోర్లు మధ్యలో తెరచుకున్నా, మూడో ఫ్లోర్‌లో ఆగాల్సివుంటే ఐదులో ఆగినా, నిర్దేశిత బరువు కంటే ఎక్కువమంది అందులో ఉన్నప్పటికీ ముందే హెచ్చరించకుండా, పైకి కదిలి మధ్యలో వైరు తెగి ఊడిపడినా ప్రమాదం కదా. ఇలా తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఉండటానికి అందులో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం వినియోగదారుల వద్దకు రాకముందే సరిగా ఉందో, లేదో పరీక్షించడం తప్పనిసరి.

టెస్టింగ్‌ నిపుణులు ఈ తరహా పనులనే చేస్తారు!

దీన్ని డెవలపర్లు ఎందుకు చేయరంటే.. తమ పనిని తామే సమీక్షించినట్లయితే పూర్తిస్థాయిలో లోపాలు కనిపెట్టలేరు. అలాగే కొత్త మార్పులు సూచించలేరు. విద్యార్థి తన జవాబు పత్రాన్ని తానే మూల్యాంకనం చేసుకుంటే ఉపయోగం ఉండదు కదా. విద్యార్థికి ఉపాధ్యాయులు మాదిరి సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో టెస్టు ఇంజినీర్లు ఆ పనిని చేస్తారు (అలాగని వీరు డెవలపర్ల కంటే ఎక్కువ అని కాదు). సాఫ్ట్‌వేర్‌లో ఏవైనా లోపాలు ఉంటే.. చేయాల్సిన మార్పుల గురించి టెస్టు ఇంజినీర్లు సంబంధిత సాఫ్ట్‌వేర్‌ రూపకర్తల బృందానికి తెలియజేస్తారు. వాళ్లు కొత్త మార్పులతో ప్రోగ్రాం రాసి టెస్టర్లకు అందిస్తారు. వీరు మళ్లీ పరిశీలించి, అంతా ఓకే అనుకుంటే సంబంధిత పరికరాల్లో దాన్ని చేరుస్తారు. ఇలా సాంకేతికత దన్నుతో మనం ఉపయోగిస్తున్న ప్రతి వస్తువూ ముందుగా టెస్టర్లు  పరిశీలించిన తర్వాతే మార్కెట్‌లోకి వస్తుంది.


టెస్టింగ్‌ పక్కాగా పూర్తయితే.. తప్పులను గుర్తించి సరిచేయడంతోపాటు సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌కు అయ్యే ఖర్చులు తగ్గించవచ్చు. ఎంతో సమయాన్నీ ఆదా చేయడం వీలవుతుంది. క్లయింట్లకు సంస్థలపై విశ్వాసం పెరిగి వ్యాపారం వృద్ధి
చెందుతుంది. ఈ కారణాలన్నీ టెస్టర్ల డిమాండ్‌ పెంచుతున్నాయి. 2027 నాటికి సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ మార్కెట్‌ సుమారు 4లక్షల 65వేల 804కోట్ల రూపాయలకు చేరుతుందని నిపుణుల అంచనా.


టెస్టింగ్‌ ఎందుకంటే...

ప్రముఖ సంస్థ ఎయిర్‌ బ్యాగ్‌ సెన్సార్‌ డిటెక్టర్‌లో లోపం కారణంగా పది లక్షల కార్లను రీకాల్‌ చేసింది. ఈ ఒక్కటే కాదు, ఇప్పటికీ పలు సంస్థలు తమ కొత్త కార్లను వెనక్కి రప్పిస్తున్నాయనే వార్తలు మనం వింటున్నాం. సాఫ్ట్‌వేర్‌ వైఫల్యం కారణంగా 2016 సంవత్సరానికి గానూ యూఎస్‌ 1.1 ట్రిలియన్‌ డాలర్లు నష్టపోయింది. ఇది 440 కోట్ల మంది వినియోగదారులపై ప్రభావం చూపింది (అమెరికా జనాభా అంత లేదు కదా అనుకోవద్దు. ఒక్కో వినియోగదారుడూ పలు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వస్తువులు, సాధనాలు వినియోగిస్తారు. అందువల్ల ఈ సంఖ్య ఇంత ఎక్కువగా ఉంది).

బ్యాంకులు, షేర్‌ మార్కెట్‌...విమానాలు, కార్లు...వాషింగ్‌ మెషీన్లు, మొబైల్‌ అప్లికేషన్లు, ఈ కామర్స్‌ సంస్థలు, గృహోపకరణాలు, వైద్య పరికరాలు.. ఇలా ప్రతీ రంగం, వస్తువు సాఫ్ట్‌వేర్‌ ప్రాణవాయువుగా పనిచేస్తున్నాయి. ఇందులో ఏదైనా లోపముంటే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంఘటనలు సాఫ్ట్‌వేర్‌లో లోపాల కారణంగానే జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. వస్తువుల్లో నాణ్యత లేకపోతే సంస్థలు విశ్వాసాన్ని కోల్పోతాయి. దీని ప్రభావం వ్యాపారంపై తీవ్ర స్థాయిలో ఉంటుంది. అదే లోపాలు లేకుండా, ఉన్నత ప్రమాణాలతో ఏదైనా వస్తువు/పరికరం రూపొందితే ఆ సంస్థకు ఊహించని లాభాలు దక్కుతాయి. ఇలా జరగాలంటే సంబంధిత వస్తువు(ఏదైనా కావచ్చు) వినియోగదారుడికి చేరకముందే క్షుణ్నంగా తనిఖీ చేయాలి. లోపాలు సరిచేయాలి. ఒకవేళ వినియోగదారులే లోపాలను గుర్తిస్తే ప్రయోజనం ఉండదు. మార్కెట్‌లోంచి మళ్లీ వాటిని వెనక్కి రప్పించి, సరిచేయాలి. దీంతో ఖర్చులు పెరుగుతాయి. కాలయాపన జరుగుతుంది. బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతింటుంది. అందుకే ఇప్పుడు అన్ని సంస్థలూ టెస్టింగ్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి.


ఈ రంగంలోకి రావాలనుకుంటున్న ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌ గ్రాడ్యుయేట్లు టెస్టింగ్‌ టూల్స్‌పై పట్టుతోపాటు, సర్టిఫికేషన్‌ పూర్తిచేసుకోవాలి. కంప్యూటర్‌ సైన్స్‌ ప్రాథమికాంశాలపై అవగాహనా పెంచుకోవాలి. బీటెక్‌/బీఎస్సీ/ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ నేపథ్యం ఉన్నవారు సులువుగానే టెస్టింగ్‌ టూల్స్‌పై ప్రావీణ్యం పొందవచ్చు.


ఏ నైపుణ్యాలు ఉండాలి?

టెస్టు ఇంజినీర్‌గా రాణించడానికి ప్రోగ్రామింగ్‌తో పనిలేదు. అయితే దానిపై అవగాహన ఉంటే మంచిది. సునిశిత పరిశీలన, తర్క పరిజ్ఞానం, ఎనలిటికల్‌ నైపుణ్యాలు ఉన్నవారు టెస్టింగ్‌ వైపు అడుగులేయవచ్చు. సమస్యను ప్రభావవంతంగా వివరించగలిగే నైపుణ్యం ఉండాలి. ఎంఎస్‌ ఆఫీస్‌పై అవగాహన ఉంటే మంచిది. టెస్టింగ్‌ కోసం ఎన్నో టూల్స్‌ ఉన్నాయి. అందులో ముఖ్యమైనవాటిపై పట్టు పెంచుకోవాలి. అలాగే నైపుణ్యానికి ప్రామాణికంగా చెప్పుకోవడానికి సర్టిఫికేషన్లూ ఇందులో ఉన్నాయి. వీటిని పూర్తిచేసుకున్నవారికి విద్యా నేపథ్యంతో సంబంధం లేకుండా సంస్థలు ఉద్యోగాలివ్వడానికి ఆసక్తి చూపుతున్నాయి.


ఎక్కడ నేర్చుకోవచ్చు?

ఇప్పుడు పలు సంస్థలు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానంలో టెస్టింగ్‌ టూల్స్‌పై శిక్షణ అందిస్తున్నాయి. మూడు నెలల్లోనే కోర్సు పూర్తిచేసుకోవచ్చు. మరో 3 నెలలు బాగా సాధన చేసి ఉద్యోగానికి సిద్ధమైపోవచ్చు. హైదరాబాద్‌, వైజాగ్‌ల్లో పలు సంస్థలు రూ.పదిపన్నెండు వేలకే వీటిని నేర్పుతున్నాయి. కొన్ని శిక్షణ కేంద్రాలు సాఫ్ట్‌వేర్‌ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకుని, ప్రాంగణ నియామకాలూ చేపడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న టూల్స్‌లో సెలీనియం, క్యూటీపీ పేరొందాయి. పలు సంస్థల్లో వీటిని ఉపయోగించడాన్ని నేర్పుతున్నారు. తాజా గ్రాడ్యుయేట్లు సుమారు రూ.3.6 నుంచి 4.8 లక్షల వార్షిక వేతనం ఆశించవచ్చు. మూడేళ్ల అనుభవంతో రూ.7.2 లక్షల నుంచి రూ.8.4 లక్షలు పొందవచ్చు. ఐదారేళ్ల అనుభవానికి సర్టిఫికేషన్లు తోడైతే రూ.12 లక్షలుపైగానే అందుకోవచ్చు. సంస్థను బట్టి హోదాలు, వేతనాలు ఉంటాయి. ట్రెయినీ టెస్టు ఇంజినీర్‌, టెస్టు ఇంజినీర్‌, సీనియర్‌ టెస్టు ఇంజినీర్‌, టెస్టు లీడ్‌, టెస్టు మేనేజర్‌...ఇలా హోదాలు అనుభవం/సమర్థత ప్రకారం దక్కుతాయి. వృత్తిలో రాణించడానికి నిరంతరం సంబంధిత కొత్త సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలి. అన్ని సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లోనూ టెస్టింగ్‌ నిమిత్తం ప్రత్యేకంగా విభాగాలు ఉన్నాయి.


ఏం చేస్తారంటే...

ఆ సాఫ్ట్‌వేర్‌ నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ఉందా, లేదా టెస్టింగ్‌తో తెలుసుకుంటారు. క్లయింట్‌తో కుదుర్చుకున్న ఒప్పందం, ప్రమాణాల ప్రకారం ఆ అప్లికేషన్‌ రూపొందిందా, లేదా పరిశీలిస్తారు. ఇక్కడ టెస్ట్‌ చేసేవాళ్లే తుది వినియోగదారులుగా భావించి ఆ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ ఎంత వరకు సౌకర్యవంతంగా ఉందో చూస్తారు. ఏవైనా మార్పుచేర్పులు ఉంటే సూచిస్తారు. టెస్టింగ్‌ పలు విధాలుగా, దశలవారీ ఉంటుంది. ఇవన్నీ దేనికవే ప్రత్యేకమైనవి. ఒక్కో తరహా టెస్టు ద్వారా ఒక్కో రకమైన లక్ష్యాన్ని పరిశీలిస్తారు. ఉన్న సమయం, వనరుల ప్రకారం ఆ అప్లికేషన్‌ను అనుసరించి, ఏ టెస్టింగ్‌ అవనసరమో టెస్టు మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌ ప్రకారం నిర్ణయిస్తారు. ప్రతి చిన్న సాఫ్ట్‌వేర్‌ అనువర్తనానికీ పలు రకాల టెస్టులు చేయాల్సి ఉంటుంది. తక్కువ టెస్టులతో ఎక్కువ లోపాలు కనిపెట్టాలనే లక్ష్యంతో టెస్టు ఇంజినీర్లు పనిచేస్తారు. కొన్నింటికి మాన్యువల్‌ అడ్‌హాక్‌ టెస్టింగ్‌ సరిపోతుంది. అలా వీలుకానివాటికి ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ అవసరం. 

సాఫ్ట్‌వేర్‌ పూర్తిగా రూపొందిన తర్వాత టెస్ట్‌ చేయడం ద్వారా లోపాలను సరిదిద్దడం కష్టమవుతోంది. అలాగే గడువులోగా దాన్ని విడుదల చేయడం సాధ్యం కావడం లేదు. ఖర్చులూ పెరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లో ప్రతి చిన్న భాగాన్నీ అది పూర్తికాగానే పరిశీలిస్తున్నారు. దీనిద్వారా సమస్య ఎక్కడ ఉందో, సులువుగా గుర్తించి, సరిదిద్దడం తేలికవుతుంది. అంతేకాకుండా ఖర్చులు తగ్గి, గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవడం వీలవుతుంది. ఈ కంటిన్యువస్‌ టెస్టింగ్‌ విధానాన్నే  సంస్థలు ఇప్పుడు అనుసరిస్తున్నాయి.


ఇవీ సర్టిఫికేషన్లు

టెస్టింగ్‌లో మనం సమర్థులమని చెప్పుకోవడానికి సర్టిఫికేషన్లు ఉన్నాయి. వీటిని వివిధ సంస్థలు అందిస్తున్నాయి. ఇవి స్థాయిలవారీ ఉంటాయి. ఆ సర్టిఫికేషన్‌ కఠినత్వంపై ఆధారపడి దానికి విలువ ఉంటుంది. నియామకాల్లో సర్టిఫికేషన్లు ఉన్నవారికి ప్రాధాన్యం లభిస్తోంది. సంస్థలు వీరివైపు మొగ్గు చూపడమేకాకుండా, మరికొంత అదనపు వేతనమూ అందిస్తున్నాయి. సర్టిఫికేషన్లు అభ్యర్థుల రెజ్యుమేకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. ఇవి ఉన్నవారికి ఇంటర్వ్యూ కాల్స్‌ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

* సర్టిఫైడ్‌ అసోసియేట్‌ ఇన్‌ సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ (సీఏఎస్‌టీ)

* సర్టిఫైడ్‌ సాఫ్ట్‌వేర్‌ క్వాలిటీ ఎనలిస్ట్‌ (సీఎస్‌క్యూఏ) సర్టిఫికేషన్‌

* ఇంటర్నేషనల్‌ సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ క్వాలిఫికేషన్స్‌ బోర్డు (ఐఎస్‌టీక్యూబీ) సర్టిఫికేషన్‌

* సర్టిఫైడ్‌ క్వాలిటీ ఇంజినీర్‌ (సీక్యూఈ)

* సర్టిఫైడ్‌ మేనేజర్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ (సీఎంఎస్‌టీ)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని