బ్యాంకు కొలువు కొట్టండిలా!

ప్రసిద్ధ బ్యాంకు ఐడీబీఐ 1544 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంట్లో భాగంగా కాంట్రాక్టు పద్ధతిలో 1044 ఎగ్జిక్యూటివ్‌లు, పీజీడీబీఎఫ్‌ ద్వారా 500 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. గత సంవత్సరం వరకు వీటి భర్తీకి విడివిడిగా నోటిఫికేషన్‌లు వచ్చేవి.

Updated : 07 Jun 2022 01:25 IST

ప్రసిద్ధ బ్యాంకు ఐడీబీఐ 1544 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంట్లో భాగంగా కాంట్రాక్టు పద్ధతిలో 1044 ఎగ్జిక్యూటివ్‌లు, పీజీడీబీఎఫ్‌ ద్వారా 500 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. గత సంవత్సరం వరకు వీటి భర్తీకి విడివిడిగా నోటిఫికేషన్‌లు వచ్చేవి. ఈ ఏడాది మొదటిసారిగా ఒకే నోటిఫికేషన్‌ విడుదలయింది. అభ్యర్థులు ఏదో ఒక్కదానికే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ సన్నద్ధత రాబోయే ఐబీపీఎస్‌, ఎస్‌బీఐ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది!


ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) ఎగ్జిక్యూటివ్‌లను కాంట్రాక్టు పద్ధతిలో నియమించినప్పటికీ వారి కాంట్రాక్టును సంవత్సరానికి ఒకసారి చొప్పున గరిష్ఠంగా మూడు సంవత్సరాల వరకూ పొడిగిస్తారు. ఆ తర్వాత వారిని అసిస్టెంట్‌ మేనేజర్లుగా నియమించే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు దాదాపుగా ఎగ్టిక్యూటివ్‌లు అందరినీ ఆ విధంగా అసిస్టెంట్‌ మేనేజర్‌లుగా నియమించారు.

అసిస్టెంట్‌ మేనేజర్‌లను నేరుగా కాకుండా పీజీడీబీఎఫ్‌ (పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌) ప్రోగ్రామ్‌ ద్వారా ఎంపిక చేస్తారు. దీనిలో ఎంపికైన అభ్యర్థులకు 9 నెలలపాటు తరగతి గది శిక్షణ, 3 నెలలపాటు ఏదైనా ఐడీబీఐ బ్యాంకులో ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. ఆ తర్వాత వారికి పీజీడీబీఎఫ్‌ సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తూ ఐడీబీఐలో అసిస్టెంట్‌ మేనేజర్‌లుగా నియమిస్తారు.


ప్రభుత్వ బ్యాంకేనా?

ఐడీబీఐను రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రైవేటు బ్యాంక్‌గానే గుర్తించినప్పటికీ దీనిలో ప్రభుత్వ వాటా 45.48 శాతం. ప్రభుత్వ రంగానికి చెందిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వాటా 49.24 శాతం కలిపి మొత్తంగా 94.72 శాతం వాటా ప్రభుత్వానిదే. ప్రైవేటు వాటా కేవలం 5.28 శాతం ఉంది. అందువల్ల ప్రైవేటు బ్యాంకుగానే పరిగణించినప్పటికీ ఇది ప్రభుత్వానికి చెందినదే. దేశవ్యాప్తంగా 2000కు పైగా బ్రాంచీలతో ప్రతిభావంతంగా పనిచేస్తున్న నమ్మకమైన బ్యాంక్‌ ఇది.


జీతభత్యాలు ఎలా ఉంటాయి?

కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమితులైన ఎగ్జిక్యూటివ్‌లకు ఇతర భత్యాలేవీ లేకుండా ఏకీకృత వేతనం (కన్సాలిడేటెడ్‌ రెమ్యూనరేషన్‌) చెల్లిస్తారు. వారికి మొదటి సంవత్సరం నెలకు రూ.29,000 చొప్పున, రెండో సంవత్సరం నెలకు రూ.31,000 చొప్పున, మూడో సంవత్సరం నెలకు రూ.34,000 చొప్పున చెల్లిస్తారు.

పీజీడీబీఎఫ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా అసిస్టెంట్‌ మేనేజర్‌లుగా ఎంపికైన వారికి ప్రోగ్రామ్‌ సమయంలో మొదటి 9 నెలలకు రూ.2,500 చొప్పున, ఇంటర్న్‌షిప్‌ 3 నెలల సమయంలో నెలకు రూ.10,000 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఆ తర్వాత బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా నియమితులయ్యాక రూ.36,000 మూల వేతనంలో ఇతర భత్యాలతో కలిపి రూ.60,000 వరకు నెలసరి వేతనం ఉంటుంది.

పీజీడీబీఎఫ్‌ ప్రోగ్రామ్‌ ఫీజు: ఎంపికైన అభ్యర్థులు రూ.3,50,000 + జీఎస్టీ ప్రోగ్రామ్‌ ఫీజును చెల్లించాలి. అయితే అభ్యర్థులపై ఆర్థిక భారం పడకుండా ఐడీబీఐ ఈ మొత్తానికి విద్యా రుణాన్ని మంజూరు చేస్తుంది. దీన్ని అభ్యర్థులు కోర్సు పూర్తయిన తర్వాత అసిస్టెంట్‌ మేనేజర్‌గా నియమితులయ్యాకే చెల్లించాల్సి ఉంటుంది. పీజీడీబీఎఫ్‌ ప్రోగ్రామ్‌ కోర్సుకు ఎంపికైన అభ్యర్థులు అసిస్టెంట్‌ మేనేజర్‌లుగా నియమితులయ్యాక కనీసం 3 సంవత్సరాలు బ్యాంకులో పనిచేసే విధంగా సర్వీస్‌ బాండ్‌ను సమర్పించాలి.


ఎంపిక

ఎగ్జిక్యూటివ్‌లు: వీరిని ఆన్‌లైన్‌ పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్టుల ద్వారా.

అసిస్టెంట్‌ మేనేజర్‌: పీజీడీబీఎఫ్‌ కోర్సు కోసం వీరిని ఆన్‌లైన్‌ పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టుల ద్వారా.


ఈ సన్నద్ధతతో ఏదో ఒక బ్యాంకు ఉద్యోగం

డీబీఐ నియామక పరీక్షకు తక్కువ సమయం ఉందనే ఆలోచన విరమించుకోవాలి. దీని సన్నద్ధత త్వరలో రాబోయే ఐబీపీఎస్‌ పరీక్షలకూ ఉపయోగపడుతుందని గుర్తించాలి. ఐబీపీఎస్‌, ఆర్‌ఆర్‌బీ పరీక్ష ఆగస్టులో, క్లర్క్‌ పరీక్ష సెప్టెంబర్‌లో, పీవో పరీక్ష అక్టోబర్‌లో ఉన్నాయి. అభ్యర్థులు శ్రద్ధగా ఈ పరీక్షకు ప్రిపరేషన్‌ మొదలుపెట్టి కొనసాగించాలి. ఎస్‌బీఐ క్లర్క్‌, పీవో నోటిఫికేషన్లు కూడా త్వరలో రాబోతున్నాయి. ఈ సన్నద్ధతతో ఏదో ఒక బ్యాంకు ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: దీనిలో సింప్లిఫికేషన్స్‌, అప్రాక్సిమేట్‌ వాల్యూస్‌, నంబర్‌ సిరీస్‌, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌, అరిథ్‌మెటిక్‌ల నుంచి ప్రశ్నలు ఉంటాయి. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ను రీజనింగ్‌ విభాగంలో ఉంచినప్పటికీ ఈ విభాగాల్లోని భాగంగానే చూసుకోవాలి. పర్సంటేజి, యావరేజి, రేషియో, కాలిక్యులేషన్స్‌లో పట్టు ఉంటే డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ ప్రశ్నలను తేలికగా సాధించవచ్చు.

రీజనింగ్‌: దీంట్లో వెర్బల్‌, లాజికల్‌ రీజనింగ్‌ల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఆల్ఫా/న్యూమరిక్‌ సిరీస్‌, డైరెక్షన్స్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, ఇనీక్వాలిటీస్‌, సిలాజిజమ్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, పజిల్స్‌ నుంచి, లాజికల్‌ రీజనింగ్‌లో స్టేట్‌మెంట్‌- అసమ్షన్స్‌/ ఇన్‌ఫరెన్స్‌/ కంక్లూజన్‌/ కోర్స్‌ ఆఫ్‌ యాక్షన్‌, డెసిషన్‌ మేకింగ్‌, కాజ్‌-ఎఫెక్ట్‌, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటిలో సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, పజిల్స్‌ నుంచి దాదాపు 50 శాతం ప్రశ్నలు ఉంటాయి.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: గ్రామర్‌ బాగా తెలిస్తే దాని సంబంధ ప్రశ్నలైన రీ అరేంజ్‌మెంట్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌, సెంటెన్స్‌ కరెక్షన్‌, ఫిల్లర్స్‌, వర్డ్‌ రీప్లేస్‌మెంట్‌, జంబుల్డ్‌ సెంటెన్సెస్‌, క్ల్లోజ్‌టెస్ట్‌ మొదలైన వాటిని తేలికగా సాధించవచ్చు. రీడింగ్‌ కాంప్రెహెన్షన్‌, ఒకాబులరీ (సిననిమ్స్‌/ యాంటనిమ్స్‌) నుంచి ప్రశ్నలు ఉంటాయి.

జనరల్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగంలో జనరల్‌, ఎకానమీ, బ్యాంకింగ్‌ రంగాలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. బ్యాంకింగ్‌ పదజాలాన్ని నేర్చుకోవాలి. బ్యాంకుల ట్యాగ్‌లైన్స్‌, బ్యాంకుల విలీనానికి సంబంధించిన అంశాలను బాగా చూసుకోవాలి. వీటితోపాటుగా ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ పథకాలు, ముఖ్యమైన వ్యక్తులు, ప్రదేశాలు మొదలైనవీ తెలుసుకోవాలి. కంప్యూటర్‌/ ఐటీ కూడా ఇదే విభాగంలో చేర్చారు. బేసిక్‌ కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌/ సాఫ్ట్‌వేర్‌ల గురించి తెలుసుకుంటూ ఈ రంగంలోని తాజా పరిణామాలను గమనించాలి.


సాధన... నమూనా పరీక్షలు

గ్జిక్యూటివ్స్‌ పరీక్ష జులై 9న, అసిస్టెంట్‌ మేనేజర్ల పరీక్ష జులై 23న నిర్వహిస్తారు. రెండు పోస్టులకూ పరీక్షా విధానం ఒకటే. కానీ ప్రశ్నల స్థాయిలో భేదం ఉంటుంది. పరీక్షలోని మొత్తం నాలుగు విభాగాల్లో కనీస మార్కులతో విడివిడిగా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు మార్కులను తగ్గిస్తారు.

ఇంతకుముందు నుంచీ బ్యాంకు పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నవారికి దీని కోసం ఇబ్బంది ఉండదుగానీ మొదటిసారి పరీక్ష రాసేవారు సమయాన్ని దృష్టిలో ఉంచుకుని కృషిచేయాలి.

* త్వరగా సబ్జెక్టుల్లోని టాపిక్స్‌ నేర్చుకుని సాధన చేయాలి.

* ఎక్కువ మార్కులు వచ్చే టాపిక్స్‌ను ముందు పూర్తిచేయాలి.

* రోజూ టాపిక్స్‌ నేర్చుకుని సాధన చేస్తూ నమూనా పరీక్షలు కూడా రాస్తూ ఉండాలి. దీనివల్ల ప్రిపరేషన్‌ ఏ మేరకు ఉందో తెలుస్తుంది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని