ఏ దేశమేగినా..!

కుదిరితే యూఎస్‌ లేదంటే యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, చైనా... ఏ దేశమైనా ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో అత్యున్నత ప్రమాణాలు... ఆకర్షణీయమైన ఉద్యోగావకాశాలు! విదేశీ విద్య అందిస్తోన్న మేటి ఫలాలివి. అయితే ట్యూషన్‌ ఫీజు, నివాస, దైనందిన అవసరాలకు ఎంతో వ్యయం. అసలు విదేశాల్లో చదువు అంటేనే  ఖర్చుతో కూడుకున్న  వ్యవహారం. అందుకే ప్రతిభ, ఆసక్తి ఉన్నప్పటికీ ఆర్థిక స్థితి సహకరించక చాలామంది

Updated : 22 Jul 2019 00:52 IST

ఆర్థిక భారం తగ్గించే ఉపకార వేతనాలు
విదేశీ విద్య

కుదిరితే యూఎస్‌ లేదంటే యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, చైనా... ఏ దేశమైనా ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో అత్యున్నత ప్రమాణాలు... ఆకర్షణీయమైన ఉద్యోగావకాశాలు! విదేశీ విద్య అందిస్తోన్న మేటి ఫలాలివి. అయితే ట్యూషన్‌ ఫీజు, నివాస, దైనందిన అవసరాలకు ఎంతో వ్యయం. అసలు విదేశాల్లో చదువు అంటేనే  ఖర్చుతో కూడుకున్న  వ్యవహారం. అందుకే ప్రతిభ, ఆసక్తి ఉన్నప్పటికీ ఆర్థిక స్థితి సహకరించక చాలామంది వెనుకడుగేస్తున్నారు. ఇలాంటివారు తమ కల నెరవేర్చుకోవటానికి వివిధ ఉపకార వేతనాలు అండగా నిలుస్తున్నాయి!
విదేశాల్లో లభించే ఉపకార వేతనాల కోసం అంతర్జాతీయ విద్యార్థుల మధ్య చాలా పోటీ ఉంటుంది. అలా అని సందేహాలతో వెనకడుగు వేసేకంటే ప్రయత్నలోపం లేకుండా దరఖాస్తు చేసుకోవటం మంచిది. స్కాలర్‌షిప్పు లభిస్తే విద్యాభ్యాస కాలంలో ఆర్థికంగా ఎంతో వెసులుబాటు ఉంటుందని మర్చిపోకూడదు. ఈ సందర్భంగా విద్యార్థులు కొన్ని ముఖ్యాంశాలు గమనించాలి.
* చివరి తేదీ సమీపించేదాకా తాత్సారం చేయకూడదు. వీలైనంత ముందుగానే దరఖాస్తు చేయటం అన్ని విధాలా మంచిది.
* నిబంధనలు శ్రద్ధగా చదివి, వాటికి అనుగుణంగా అవసరమైన పత్రాలతో, కచ్చితమైన వివరాలతో దరఖాస్తు చేయాలి.
* ఉపకార వేతనాలు అందించే సంస్థలూ, యూనివర్సిటీలకు ఫేస్‌బుక్‌ పేజ్‌ ఉంటే దాన్ని అనుసరించటం మేలు. నియమ నిబంధనల్లో మార్పులు చేస్తే అవి వెబ్‌సైట్లలో వెంటనే కనిపించకపోవచ్చు. కానీ ఫేస్‌బుక్‌ ద్వారా తాజా అంశాలు వెనువెంటనే తెలిసే అవకాశం ఉంటుంది.

యూఎస్‌లో...
ఫుల్‌ బ్రైట్‌ నెహ్రూ ఫెలోషిప్‌

యునైటెడ్‌ స్టేట్స్‌ ఇండియా ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ ఈ స్కాలర్‌షిప్పులను అందిస్తోంది. భారత్‌-అమెరికాల మధ్య విద్యాసంబంధాలు మెరుగుపర్చడానికి వీటిని నెలకొల్పారు. వీటిద్వారా భారతీయ విద్యార్థులు అమెరికాలో, అక్కడివారు భారత్‌లో చదువుకోవచ్చు. యూఎస్‌లో మాస్టర్‌ కోర్సు లేదా రిసెర్చ్‌ కోర్సుల్లో చేరడానికి ఫుల్‌బ్రైట్‌ ఫెలోషిప్పులు ఉపయోగపడతాయి.
ఎవరు అర్హులు: నాలుగేళ్ల బ్యాచిలర్‌ కోర్సు లేదా పీజీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. చేరాలనుకుంటోన్న కోర్సుకు సంబంధించి మూడేళ్ల పని అనుభవం ఉండాలి. నాయకత్వ లక్షణాలు, కమ్యూనిటీ సర్వీస్‌, కమ్యూనికేషన్‌, మోటివేషన్‌ స్కిల్స్‌ ఉన్నవారికి ప్రాధాన్యం.
ఏ చదువుల కోసం: కళలు- సంస్కృతి, పర్యావరణ విద్య, అంతర్జాతీయ న్యాయవిద్య, ప్రజారోగ్యం, జండర్‌ స్టడీస్‌, అర్బన్‌ అండ్‌ రీజనల్‌ ప్లానింగ్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌. వీటిలో సీటొస్తే ట్యూషన్‌ ఫీజు, పుస్తకాలు, నివసానికి అవసరమైన స్ట్టైపెండ్‌ అందిస్తారు.వచ్చిన దరఖాస్తుల్లో అర్హతలున్నవారిని తీసుకుంటారు.
దరఖాస్తులు ఎప్పుడు: ఆయా కోర్సులవారీగా మే, జూన్‌, జులైలో దరఖాస్తులు స్వీకరిస్తారు.
వెబ్‌సైట్‌: www.usief.org.in

టాటా స్కాలర్‌షిప్‌

టాటా ఎడ్యుకేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు అందిస్తోంది. అమెరికాలో యూజీ అభ్యసించడానికి వీటిని అందిస్తున్నారు.
ఎవరు అర్హులు: అభ్యర్థులు కార్నెల్‌ యూనివర్సిటీలో యూజీ కోర్సుల్లో ప్రవేశం పొంది ఉండాలి.
ఎంత మొత్తం: యూజీ కోర్సుల్లో చేరిన అభ్యర్థులు 8 సెమిస్టర్లకూ ట్యూషన్‌ ఫీజు చెల్లిస్తారు. దీంతోపాటు వసతి, భోజనం, వైద్య బీమా, రవాణా ఖర్చులను టాటా ఎడ్యుకేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు భరిస్తుంది. 20 మందికి ఈ స్కాలర్‌షిప్పు అందిస్తారు.
దరఖాస్తులు ఎప్పుడు: కార్నెల్‌ విశ్వవిద్యాలయంలో యూజీ ప్రవేశాల సమయంలో దరఖాస్తు చేసుకోవాలి. సాధారణంగా అక్టోబరు/ నవంబరులో ఈ ప్రక్రియ మొదలవుతుంది.
వెబ్‌సైట్‌: https://admissions.cornell.edu/apply/international-students/tata-scholarship

అమెరికా, ఐరోపా, యూకే...
ఇన్‌లాక్స్‌

ఇన్‌లాక్స్‌ శివదాసాని ఫౌండేషన్‌ ఈ స్కాలర్‌షిప్పును భారతీయ విద్యార్థులకోసం అందిస్తోంది. ఇందులో భాగంగా పేరొందిన విదేశీ విశ్వవిద్యాలయాల్లో సీటు పొందిన విద్యార్థులకు స్కాలర్‌షిప్పు అందిస్తారు.
ఏ దేశాల్లో: అమెరికా, ఐరోపా, యూకే ఎంత మొత్తం: లక్ష డాలర్లు ప్రతి విద్యార్థికీ మంజూరు చేస్తారు.
దరఖాస్తులు: ఫిబ్రవరి నుంచి స్వీకరిస్తారు.
వెబ్‌సైట్‌: www.inlaksfoundation.org

కెనడాలో...
యూబీసీ ఇంటర్నేషనల్‌ లీడర్‌ ఆఫ్‌ టుమారో

ర్థిక అవసరాలుండి, చదువులో మెరుగ్గా ఉన్న విద్యార్థులను ప్రోత్సహించడానికి బ్రిటిష్‌ కొలంబియా యూనివర్సిటీ ఈ స్కాలర్‌షిప్పులు అందిస్తోంది. అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరినవారికి ఈ ఉపకారవేతనాలు వర్తిస్తాయి. మంచి అకడమిక్‌ నేపథ్యం, స్పోర్ట్స్‌, పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌, డిబేట్‌లో ప్రావీణ్యం ఉన్నవారికి సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం లభిస్తుంది. కెనడాలో విద్యా సంస్థల్లో చేరినవారికి ఇవి వర్తిస్తాయి.
ఏం చెల్లిస్తారు: ట్యూషన్‌ ఫీజు, వసతి, భోజన ఖర్చులు.
దరఖాస్తులు: సెప్టెంబరులో మొదలవుతాయి.
వెబ్‌సైట్‌: https://students.ubc.ca/enrolment/finances

ఐరోపాలో..
ఎరాస్‌మస్‌ ముండస్‌ స్కాలర్‌షిప్‌

యూరోపియన్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఎరాస్‌మస్‌ ముండస్‌ స్కాలర్‌షిప్పులు అందిస్తున్నారు. ఈ స్కాలర్‌షిప్పులకు ఎంపికైనవారు ఐరోపాలోని విద్యాసంస్థల్లో ఉచితంగా చదువుకోవచ్చు. పరిశోధనలు కొనసాగించుకోవచ్చు.
అర్హత: ఈ స్కాలర్‌షిప్పు పొందడానికి మాస్టర్‌/ డాక్ట్టొరల్‌ స్థాయుల్లో ఎరాస్‌మస్‌ ముండస్‌ జాయింట్‌ ప్రోగ్రాంలో ఎందులోనైనా ఎంపికవ్వాలి.
ఏ విభాగాల్లో: 16 మాస్టర్‌, 29 డాక్టొరల్‌ కోర్సుల్లో స్కాలర్‌షిప్పు చెల్లిస్తున్నారు.
ఏం చెల్లిస్తారు: ట్యూషన్‌ ఫీజు, వసతి, భోజనానికి అయ్యే ఖర్చులు, ప్రయాణ చార్జీలు,
బీమా దరఖాస్తులు: అక్టోబరు నుంచి జనవరిలోగా
వెబ్‌సైట్‌: https://eacea.ec.europa.eu/erasmus-plus/news/newerasmus-plus-funding-opportunities_en

యూకేలో...
కామన్‌వెల్త్‌ స్కాలర్‌షిప్‌ అండ్‌ ఫెలోషిప్‌

కామన్‌వెల్త్‌ దేశాలకు చెందిన విద్యార్థులు యూకేలో చదువుకోవడానికి కామన్‌వెల్త్‌ ఫెలోషిప్పులు అందిస్తున్నారు. యూకేకు చెందిన అంతర్జాతీయ అభివృద్ధి విభాగం వనరులు సమకూరుస్తుంది. పలు రకాల కోర్సుల్లో యూకేలో చదువుకుని జ్ఞానం, నైపుణ్యాలు పెంపొందించాలనే లక్ష్యంతో వీటిని ఇస్తున్నారు.
ఎవరి కోసం: వివిధ సబ్జెక్టుల్లో యూకేలో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో చేరడానికి.
అర్హత: ఇంగ్లిష్‌ మీడియంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఉండాలి. కనీసం 60 శాతం మార్కులతో సోషల్‌ సైన్సెస్‌, హ్యుమానిటీస్‌ లేదా 65 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, సైన్స్‌, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ఎందులోనైనా యూజీ/ పీజీ ఉత్తీర్ణత సాధించాలి. కేంద్ర మానవవనరుల శాఖ  ఇంటర్వ్యూలు నిర్వహించి, దరఖాస్తులను వడపోస్తుంది.
ఏ కోర్సుల్లోకి: ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, ప్యూర్‌ అండ్‌ అప్లైడ్‌ సైన్స్‌, అగ్రికల్చర్‌, హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌.
ఏం చెల్లిస్తారు: ట్యూషన్‌ ఫీజు, ప్రయాణ చార్జీలు, వసతి, భోజన ఖర్చులు
దరఖాస్తులు: సాధారణంగా ఆగస్టు నెలలో ఆహ్వానిస్తారు.
ఎంతమందికి: షార్ట్‌లిస్ట్‌ చేసినవారిలో అర్హులైన విద్యార్థులకు.
వెబ్‌సైట్‌: http:// cscuk.dfid.gov.uk/

చెవనింగ్‌ స్కాలర్‌షిప్‌

యూకే ప్రభుత్వ అంతర్జాతీయ విభాగం చెవనింగ్‌. విద్యా, వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకుని, ప్రపంచ నాయకులుగా పరివర్తనానికి వీలుకల్పించేందుకు స్కాలర్‌షిప్పులు, ఫెలోషిప్పులు అందిస్తున్నారు.
ఎవరి కోసం: యూకేలో ఏడాది వ్యవధి పీజీ కోర్సులు చదవాలనుకునే భారతీయులకు
అర్హత: యూజీ లేదా పీజీ పూర్తిచేసుకుని, రెండేళ్లు పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం
ఎంత మందికి: 65
ఏం చెల్లిస్తారు: ట్యూషన్‌ ఫీజు, వసతి, ప్రయాణ ఖర్చులు.
దరఖాస్తులు: ఆగస్టులో మొదలవుతాయి
వెబ్‌సైట్‌: www.chevening.org

గ్రేట్‌ స్కాలర్‌షిప్‌

యూకే ప్రభుత్వం తరఫున ఈ స్కాలర్‌షిప్పులు బ్రిటిష్‌ కౌన్సెల్‌ అందిస్తుంది. వీటిద్వారా 35 మంది భారతీయులు యూకేలో యూజీ లేదా పీజీ కోర్సుల్లో చేరవచ్చు. అయితే ఏడాది మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌ మంజూరవుతుంది. ట్యూషన్‌ ఫీజు చెల్లిస్తారు. మిగిలినవన్నీ అభ్యర్థులే భరించాలి. ఇదే తరహాలో ఛార్లెస్‌ వల్లాస్‌ స్కాలర్‌షిప్పులు సైతం భారతీయ విద్యార్థులకు యూకేలో చదువుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. వీటికోసం ఏప్రిల్‌/  మేలో దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది.
వెబ్‌సైట్‌: https://www.britishcouncil.in/study-uk/scholarships

మరిన్ని ఉపకార వేతనాల వివరాలు www.eenadupratibha.net లో


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని