వెదుకులాటలో మెరవాలంటే..?

ఉద్యోగం చేయడానికే కాదు.. దాన్ని వెతుక్కోడానికీ కొన్ని నైపుణ్యాలు కావాలి. నెలలు, సంవత్సరాల అన్వేషణ అడ్డదిడ్డంగా సాగకూడదు. అర్థవంతమైన ప్రయత్నాలతో అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అవసరమైన స్కిల్స్‌ నేర్చుకోవాలి. ఎప్పటికప్పుడు సరికొత్త ఉత్సాహంతో సక్సెస్‌ దిశగా దూసుకెళ్లాలి. శ్రీకాంత్‌ కొలువుల వేటలో ఎప్పుడూ బిజీగా కనిపిస్తాడు. ఇంటర్వ్యూలకు హాజరవుతుంటాడు.  ఏ ఉద్యోగానికైనా ఎంపికయ్యాడో లేదో తెలిసేంత వరకు శ్రద్ధగా వేచి ఉంటాడు. ఇతర ప్రయత్నాలేవీ చేయడు...

Published : 08 Aug 2019 00:35 IST

కృషితో నాస్తి నిరుద్యోగం

ఉద్యోగం చేయడానికే కాదు.. దాన్ని వెతుక్కోడానికీ కొన్ని నైపుణ్యాలు కావాలి. నెలలు, సంవత్సరాల అన్వేషణ అడ్డదిడ్డంగా సాగకూడదు. అర్థవంతమైన ప్రయత్నాలతో అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అవసరమైన స్కిల్స్‌ నేర్చుకోవాలి. ఎప్పటికప్పుడు సరికొత్త ఉత్సాహంతో సక్సెస్‌ దిశగా దూసుకెళ్లాలి. 

శ్రీకాంత్‌ కొలువుల వేటలో ఎప్పుడూ బిజీగా కనిపిస్తాడు. ఇంటర్వ్యూలకు హాజరవుతుంటాడు.  ఏ ఉద్యోగానికైనా ఎంపికయ్యాడో లేదో తెలిసేంత వరకు శ్రద్ధగా వేచి ఉంటాడు. ఇతర ప్రయత్నాలేవీ చేయడు. సెలక్ట్‌ కాలేదని తెలిసిన తర్వాత మరో ఉద్యోగానికి అప్లై చేస్తాడు. దరఖాస్తుకీ ఇంటర్వ్యూకీ మధ్య కనీసం నెలరోజుల సమయం ఉంటుంది. ఇంటర్వ్యూ అయిపోయినా ఎంపికైనదీ లేనిదీ వెంటనే తెలియదు. దానికి కొంత కాలం గడిచిపోతుంది. పైకి మాత్రం పట్టువదలని విక్రమార్కుడు మళ్లీ మళ్లీ అప్లికేషన్లతో ఉద్యోగాన్వేషణ చేస్తున్నట్లే కనిపిస్తుంది. ఎంతకీ ఏ ఉద్యోగం రాదు. ఎక్కడ పొరపాటు జరుగుతోంది? ఒక్కోసారి ఒక్కో ఉద్యోగానికి దరఖాస్తు చేయడం కంటే ఒక్కసారే మూడునాలుగు అప్లికేషన్లు పెట్టవచ్చుగా.. ఎంతో సమయం ఆదా అవుతుంది. ఈ ఆలోచన చాలామందికి వెంటనే తట్టదు. ఇలా సమయం వృథా కాకుండా, ఈ మధ్యలో నిరుత్సాహం ఆవహించకుండా కొన్ని నైపుణ్యాలను నేర్చుకుంటే ఉద్యోగసాధన సులువవుతుంది. 
అన్వేషణా ఉద్యోగమే 
నిరుద్యోగిగా ఉన్నప్పుడు నిర్దేశిత లక్ష్యమంటూ ఉండదు. ప్రతిరోజూ కొన్ని పనులు పూర్తిచేయాలనే నిబంధన లేకపోవడంతో కాస్త బద్ధకంగానే పనులు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాన్ని వెతకడాన్నే ఉద్యోగంగా పెట్టుకోవాలి. ఇదీ ఒక నైపుణ్యమే. నిర్ణీత సమయానికే నిద్ర లేచి తయారవ్వాలి. ఉద్యోగాన్వేషణకు నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోవాలి. ఫోన్‌ కాల్స్‌, ఈ-మెయిల్స్‌, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లు చూడటానికి టైమ్‌ నిర్దేశించుకోవాలి. చేయాల్సిన పనులను ఒక పట్టిక రూపంలో రాసుకోవాలి. దాని ప్రకారం పనులు పూర్తిచేయాలి. మరో విధంగా చెప్పాలంటే చేస్తున్న పనులన్నింటినీ పై అధికారి పర్యవేక్షిస్తున్నట్లుగా భావించాలి. రోజూ తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన పనుల మీద దృష్టి కేంద్రీకరించాలి. దొరికిన సమయాన్ని వీడియో గేమ్‌లతోనో, సోషల్‌ మీడియాతోనో, టీవీలతోనోే వృథా చేయకూడదు. 
కొత్త అంశాలు నేర్చుకోవాలి 
అంతర్జాలంలో ఎంతసేపు ఉద్యోగాన్వేషణ చేయాలో నిర్ణయించుకోవాలి. పూర్తి సమయం అందులోనే ఉండిపోవడమూ సరికాదు. ఎందుకంటే నైపుణ్యాల మెరుగుకు కొంత టైమ్‌ ఉంచుకోవాలి. కొత్త కొత్త అంశాలు నేర్చుకోవాలి. ఏదైనా కోర్సులో చేరాలి. జాబ్‌ ఫేర్‌లు, వర్క్‌షాప్‌లు, కాన్ఫరెన్సులు, సెమినార్లకు హాజరవ్వాలి. అక్కడ ఎక్కువమందిని కలవడం వల్ల నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశముంటుంది. వృత్తిపరమైన సమావేశాలకు హాజరు    కావాలి. దాంతో ఎంచుకున్న రంగంలో వస్తున్న మార్పులపై అవగాహన ఏర్పడుతుంది. కొన్ని సంస్థల్లో స్వచ్ఛంద కార్యకర్తగా పనిచేయడం ద్వారా రాయడంలో, మాట్లాడటంలో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. పరిచయాలను పెంచుకోవడం ద్వారా ఉద్యోగావకాశాలు ఎక్కువవుతాయి.

లక్ష్యసాధన దిశగా..!

ద్యోగాన్వేషణలో భాగంగా చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలను ఒకచోట రాసుకోవాలి. ఆ దిశగా రోజూ ప్రయత్నించాలి. ఒక వారంలో లేదా నెలలో ఎన్ని దరఖాస్తులను పంపాలి, ఎన్ని సెమినార్లు లేదా వర్క్‌షాప్‌లకు హాజరు కావాలి లేదా ఎంతమంది కొత్తవాళ్లను కలవాలనే వాటిని ముందే నిర్దేశించుకోవాలి. అనుకున్న వాటిని ఎంతవరకు అమలు చేస్తున్నారో పరిశీలించుకోవాలి. దీని వల్ల ఏ పని ఎంత వరకు జరుగుతోందనే విషయం తెలుస్తుంది. లక్ష్య సాధనలో ఏ మేరకు ప్రగతి సాధ్యమైందో అర్థమవుతుంది.

అవకాశాన్ని కల్పించుకోవాలి

వకాశం వచ్చేంత వరకూ వేచి ఉండకూడదు. అవకాశాన్ని వెతుక్కుంటూ వెళ్లాలి. ఉదాహరణకు పనిచేయాలని కోరుకుంటున్న కంపెనీలు ప్రస్తుతం ఉద్యోగులను భర్తీ చేయకపోయినా, అక్కడి సిబ్బందిని సంప్రదించి సంస్థ పట్ల ఆసక్తిని తెలియజేయాలి. ఉత్సాహాన్ని గమనించి భవిష్యత్తులో ఉద్యోగాల భర్తీ సమయంలో  అవకాశం కల్పించవచ్చు. హెచ్‌ఆర్‌ నిపుణులు అభ్యర్థులలో ఉండే ఇలాంటి లక్షణాలనూ గమనిస్తారు.

ఇతర మార్గాలు 
ఉద్యోగ ప్రయత్నాలతోపాటు పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేయవచ్చు. దీని వల్ల చిన్నచిన్న ఖర్చులకు కూడా కుటుంబ సభ్యుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కాంట్రాక్ట్‌ వర్కర్లుగా, ఫ్రీˆలాన్సర్లుగా చేయవచ్చు. ఒక్కోసారి పార్ట్‌టైమ్‌ ఉద్యోగంలో చేరిన తర్వాత అదే ఫుల్‌టైమ్‌గా మారే అవకాశాలూ ఉన్నాయి. అది కుదరకపోయినా అక్కడి పరిచయాలు ఉద్యోగ ప్రయత్నంలో ఉపయోగపడతాయి. 
మరింత శక్తితో ముందుకు 
ఎప్పుడూ ఉద్యోగాన్వేషణలోనే కాలం గడపడం కాస్త విసుగనిపించవచ్చు. అప్పుడు కొద్దిగా విరామం తీసుకోవాలి. రాత్రిళ్లు వారాంతాల్లో విశ్రాంతి తీసుకోవాలి. దాని వల్ల మర్నాడు మరింత ఉత్సాహంతో పనిచేయడానికి వీలవుతుంది. పరిసరాలను మార్చడం, కొత్త అనుభవాలు ఉద్యోగాన్వేషణలో కొత్త కోణాలను పరిచయం చేస్తాయి.  ఫలితాలు ఆశాజనకంగా లేకపోతే నిరుత్సాహంతో ప్రయత్నాలను విరమించకూడదు. ఎక్కడ, ఎందుకు వైఫల్యం ఎదురైందో సమీక్షించుకోవాలి. బలహీన అంశాలను గ్రహించి లోటుపాట్లు సరిదిద్దుకోవాలి. సహనంతో, పట్టు దలతో వ్యవహరిస్తే నిశ్చయంగా విజయం వరిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని