చేయండి తప్పనిసరిగా...!

ఇక నుంచీ ఇంజినీరింగ్‌ ముగిసేలోపు కనీసం మూడు ఇంటర్న్‌షిప్‌లు తప్పనిసరిగా చెయ్యాల్సిందే. ఏఐసీటీఈ నిర్దేశించిందని కాదు కానీ... ప్రతి విద్యార్థి భవితకూ ఇవెంతో మేలు చేస్తాయనేది అందరికీ తెలిసిందే.ఈ కొత్త మార్పుకి అనుగుణంగా విద్యార్థులు ఎలా ప్రణాళిక వేసుకోవాలి? ఇంటర్న్‌షిప్‌ల వల్ల ప్రయోజనాలను గరిష్ఠంగా  ...

Published : 27 Nov 2018 01:45 IST

చేయండి తప్పనిసరిగా...!

ఇక నుంచీ ఇంజినీరింగ్‌ ముగిసేలోపు కనీసం మూడు ఇంటర్న్‌షిప్‌లు తప్పనిసరిగా చెయ్యాల్సిందే. ఏఐసీటీఈ నిర్దేశించిందని కాదు కానీ... ప్రతి విద్యార్థి భవితకూ ఇవెంతో మేలు చేస్తాయనేది అందరికీ తెలిసిందే.ఈ కొత్త మార్పుకి అనుగుణంగా విద్యార్థులు ఎలా ప్రణాళిక వేసుకోవాలి? ఇంటర్న్‌షిప్‌ల వల్ల ప్రయోజనాలను గరిష్ఠంగా  పొందటానికి ఎలా ముందడుగు వేయాలి? 
ఇంజినీరింగ్‌ కళాశాలల నుంచి బయటకు వచ్చే విద్యార్థుల్లో సగానికంటే ఎక్కువమందికి ఉద్యోగార్హత నైపుణ్యాలు ఉండటం లేదని ఎన్నో సర్వేలు చెపుతున్నాయి. ఈ లోపాన్ని సవరించే కృషిలో భాగంగా ఇంటర్న్‌షిప్‌లను తప్పనిసరి చేశారు. ఇప్పటివరకూ పేరున్న కళాశాలలు మాత్రమే ఈ ఇంటర్న్‌షిప్‌ల పద్ధతిని అమలుచేస్తున్నాయి. ఇకనుంచీ ప్రతి ఇంజినీరింగ్‌ కళాశాలా తమ విద్యార్థులు ఇంటర్న్‌పిప్‌లు చేసేలా బాధ్యత తీసుకోవాల్సివుంటుంది. 
ఇంజినీరింగ్‌ విద్యలో లోపాలకు చాలా కారణాలున్నాయి. అయితే వీటిని అధిగమించాలంటే విద్యార్థులు కూడా తమ దృక్కోణాన్ని మార్చుకోవాలి.  విద్యాభ్యాసాన్ని ఆసక్తికరంగా మల్చుకోవాలి. ఇందుకు ఇంటర్న్‌షిప్‌/ అప్రెంటిస్‌షిప్‌ ఎంతో ఉపయోగపడుతుంది.

ఈ లోటుపాట్లు తగ్గించుకుందామా? 
చాలామంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు పరీక్షకు ముందురోజు మాత్రమే చదివి, కనీస మార్కులు తెచ్చుకుంటున్నారు. ఇది ఒక ధోరణిగా మారింది. వాస్తవానికి ఇలా చదవటం వల్ల వారికి ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఈ రకంగా కోర్‌ సబ్జెక్టు విషయంలో పట్టు పెంచుకోవటం తగ్గించి, కేవలం పరీక్షలు పాసవటం మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. 
చాలామంది విద్యార్థులు సిలబస్‌లోని వివిధ కాన్సెప్టులను అవగాహన చేసుకోకుండా పరీక్షల్లో వాటిని ఉన్నదున్నట్టు రాసేస్తుంటారు. అవసరమైన పరిజ్ఞానం లేనందువల్ల ఇలాంటి వారు ఉద్యోగాల్లో చేరిన తొలి రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తోంది. 
ఇంజినీరింగ్‌ అభ్యసించే కాలంలో ప్రతిదీ యాంత్రికంగా తయారుచేయటం చాలామంది విద్యార్థులకు అలవాటవుతోంది. ఇతరుల అసైన్‌మెంట్లను అనుకరించటం, అనుసరించటం దగ్గర్నుంచి అకడమిక్‌ ప్రాజెక్టు నివేదికల కోసం వెబ్‌సైట్ల నుంచి కాపీ- పేస్ట్‌ చేయటం వరకూ ఇదే తంతు. ఇలాంటి ధోరణి ఏమాత్రం సబబు కాదు. ఇలాచేసేవారికి భవిష్యత్తు ఉండదు.

తిరుగులేని ప్రావీణ్యం ఉండాలి

చేయండి తప్పనిసరిగా...! 


సమాజ సమస్యలకు పరిష్కారం చూపే నైపుణ్యాలను వృద్ధి చేసుకోవటమే ఇంజినీరింగ్‌ లక్ష్యం. విద్యార్థులు నేర్చుకున్న విషయాలకూ, వాటి పరిశ్రమల్లో వాటి ఆచరణకూ ఉండే అంతరాన్ని తగ్గించటానికి ఇంటర్న్‌షిప్‌లు ఉపయోగపడతాయి. ఇవి కరిక్యులమ్‌పై విద్యార్థుల దృష్టికోణాన్ని మెరుగుపరుస్తాయి. సబ్జెక్టును బాగా అర్థం చేసుకోవటానికి సాయపడుతుంది.  ఇంటర్న్‌షిప్‌ తర్వాత చాలా కంపెనీలు ఒక నివేదికను ఇవ్వమని విద్యార్థులను అడిగి, ఆ తర్వాతే సర్టిఫై చేస్తాయి. ఈ సమాచారం ఆ కంపెనీకి మాత్రమే సంబంధించి నిర్దిష్టంగా ఉంటుంది కాబట్టి అది ఇంటర్నెట్‌లో లభ్యం కాదు. దాన్ని సొంతంగా చేయాల్సిందే. దానిమూలంగా నివేదికల్లో అధికారిక, విశ్వసనీయ సమాచారం   పొందుపరిచే అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థులు చేసే అకడమిక్‌ ప్రాజెక్టులోనూ ఈ తీరు పాటిస్తే దానికి ప్రామాణికత, నాణ్యత సిద్ధిస్తాయి. ఇప్పటి పోటీ ప్రపంచంలో కంపెనీలను ఇన్నొవేషన్‌ నడిపిస్తోంది. కంపెనీలు మెరికల్లాంటి ఉద్యోగులను నియమించుకుంటేనే ఈ వినూత్నత సాధ్యమవుతుంది. అంటే.. తమ సబ్జెక్టుల్లో తిరుగులేని ప్రావీణ్యం ఉన్న ఉద్యోగులు కంపెనీలకు ముఖ్యం. అలాంటివారిని సంస్థలు అమూల్యమైన ఆస్తులుగా పరిగణిస్తాయి.

ప్రాజెక్టు ఎంపిక కష్టమా? 
ఫైనలియర్‌ ప్లేస్‌మెంట్‌ తరుణంలో జాబ్‌ డిస్క్రిప్షన్‌ (జె.డి.) విషయం తెలియక విద్యార్థులు తడబడుతుంటారు. వారికి సంబంధిత కంపెనీ స్వభావం, తీరుతెన్నులపై పరిజ్ఞానం ఉండకపోవటం వల్లనే ఈ సమస్య ఏర్పడుతుంది. కళాశాలలో ప్లేస్‌మెంట్‌ అధికారిని సంప్రదిస్తే కంపెనీలు కోరుకునే జాబ్‌ డిస్క్రిప్షన్‌ గురించి వివరాలు అందిస్తారు. సీనియర్లను సంప్రదించినా తెలుస్తుంది.  ఇంటర్న్‌షిప్‌లతో జె.డి.ని ఎలా తయారుచేయాలో, అన్వయించాలో స్పష్టత వస్తుంది.  ఆయా రంగాల్లో సాధించవలసినవేమిటో నేర్చుకోవచ్చు. 
ఇంజినీరింగ్‌ విద్యార్థులందరూ కోర్సులో భాగంగా ప్రాజెక్టు చేయాల్సివుంటుంది. చాలామందికి ఏ టాపిక్‌ను ఎంచుకోవాలనేది కష్టమవుతుంది. సాధారణంగా నలుగురు కలిసి చేస్తారు. ఒకళ్లిద్దరే కాకుండా అందరూ చొరవ తీసుకుని భాగస్వాములైతే అందరికీ మంచిది. చివర్లో ప్రాజెక్టు డాక్యుమెంటేషన్‌ దగ్గర సమస్య వస్తుంది. దీంతో గూగుల్‌, యూ ట్యూబ్‌ల వంటివాటిపై ఆధారపడతారు. లేదా కొన్ని ప్రైవేటు కంపెనీల్లో సిద్ధంగా ఉన్నవాటిని కొనుక్కుంటారు. 
అసలు ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం... విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచటం, పరిశ్రమల తాజా అవసరాలను వారికి పరిచయం చేయటం. పరిశ్రమల్లో తాజా ధోరణులపై అవగాహన పెంచుకోవటానికీ, ప్రాజెక్టుకు సరైన అంశాన్ని ఎంచుకోవటానికీ ఇంటర్న్‌షిప్‌లు సాయపడతాయి. కొన్ని కంపెనీలైతే ప్రాజెక్టు సమయంలో అవసరమైన మార్గదర్శకత్వం, వనరులను అందిస్తాయి కూడా. ఇలా చేసిన ప్రాజెక్టులు విద్యార్థి రెజ్యూమెకు బలం చేకూర్చి ప్లేస్‌మెంట్లు సాధించేలా చేస్తాయి.

కళాశాల రెఫరెన్స్‌తో... 
తమ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు సాధించటం ప్రసిద్ధ కళాశాలలకు పెద్ద పనేమీ కాదు. చిన్న కాలేజీలకే ఇది చిక్కు సమస్య. విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ పొందాలంటే తమ కాలేజీ ఫ్యాకల్టీ రెఫరెన్స్‌ తెచ్చుకుంటే సులువవుతుంది. ఆ సంస్థకు సంబంధించినవారి రెఫరెన్సు కూడా ఉపయోగపడుతుంది. 
మరో మార్గం- ఆన్‌లైన్‌ ఇంటర్న్‌షిప్‌ వేదికలు. అలాంటివాటిలో ముఖ్యమైనవి- 
https://intenshala.com, www.letsintern.com, 
https://skillenza.com/challenge/internhunt 
www.youth4work.com www.linkedin.com

- సుహాస్‌ అశోకవర్ధన్‌,  బీటెక్‌+ఎంటెక్‌ (2013-18 బ్యాచ్‌). జేఎన్‌టీయూహెచ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌.

ఎప్పుడు చేస్తే మేలు?

మొదటి సంవత్సరం తర్వాత: ఇంజినీరింగ్‌ విద్యార్థులకు మొదటి సంవత్సరం తర్వాత చాలా సమయం ఉంటుంది. ఈ వ్యవధిని మొదటి ఇంటర్న్‌షిప్‌ను చేయటానికి ఉపయోగించుకోవచ్చు. విద్యార్థులు జనరల్‌ సబ్జెక్టుల నుంచి స్పెషలైజేషన్‌ సంబంధ సబ్జెక్టులకు మారే క్రమంలో ఉంటారు కాబట్టి నాన్‌ ఇంజినీరింగ్‌ ఇంటర్న్‌షిప్‌ను ఎంచుకోవచ్చు. ఉదాహరణ... అడ్మినిస్ట్రేషన్‌, మార్కెటింగ్‌ మొదలైనవి. ఎన్‌జీవోలను సంప్రదించి అక్కడ చేయవచ్చు. అయితే... విద్యార్థుల మొదటి ప్రాధాన్యం మాత్రం తమ స్పెషలేజేషన్‌పై ఆధారపడే ఉండాలి.

రెండో సంవత్సరం తర్వాత: ఈ సమయంలో విద్యార్థులకు సబ్జెక్టు మౌలిక అంశాలు (బేసిక్స్‌) తెలిసివుంటాయి. అందుకని వేసవి సెలవుల్లో సమకాలీన టెక్నాలజీలు, నైపుణ్యాలపై ఆధారపడిన ఇంటర్న్‌షిప్‌ను చేయవచ్చు. ఈ తరహా ఇంటర్న్‌షిప్‌లను ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు ( బీఎస్‌ఎన్‌ఎల్‌, ఈసీఐఎల్‌, ఎల్‌అండ్‌టీ...) అందిస్తుంటాయి. కొన్ని సంస్థల్లో ఎన్‌రోల్‌మెంట్‌ కోసం రూ.6000 నుంచి రూ.10,000 వరకూ చెల్లించాల్సివుంటుంది.

మూడో సంవత్సరం తర్వాత: ఈ దశలో విద్యార్థులు కార్పొరేట్‌ వాతావరణంలో విధులు నిర్వహించగల సామర్థ్యంతో ఉంటారు. వారు తమకున్న నైపుణ్యాల ఆధారంగా ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలి. తగిన నైపుణ్యాలు వృద్ధి చేసుకునివుంటే... చేసిన పనికి  కంపెనీలు కొంత మొత్తం చెల్లిస్తాయి కూడా. ప్రతిభను చూపి ఆకట్టుకున్న ఇంటర్న్‌లకు కొన్ని సంస్థలు ఉద్యోగావకాశమూ కల్పిస్తాయి. వృత్తి నిపుణులతో ఒక నెట్‌వర్క్‌ను దీర్ఘకాలంలో అభివృద్ధి చేసుకోవటానికి ఇక్కడ పునాది వేసుకోవచ్చు.

నాలుగో సంవత్సరం: కళాశాల నుంచి కార్పొరేట్‌ వాతావరణానికి సాఫీగా మారేందుకు ఉపయోగపడేలా కొన్ని కంపెనీలు ఫైనల్‌ సెమిస్టర్లో ఇంటర్న్‌షిప్‌లను అందిస్తున్నాయి. దీనిలో చక్కని ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు కొన్ని కంపెనీలు పూర్తిస్థాయి ఉద్యోగం ఇస్తాయి. ఈ ఇంటర్న్‌షిప్‌ విద్యార్థుల రెజ్యూమె ఆకర్షణీయంగా తయారవటానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి విద్యార్థులకు అవకాశమిచ్చి నియమించుకుంటే వీరు తమకు ప్రధాన బలగంగా తయారవుతారని ఇంటర్వ్యూల తరుణంలో కంపెనీలకు నమ్మకం ఏర్పడుతుంది.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని