Published : 02 Jan 2019 00:45 IST

నేర్పిస్తాం.. డబ్బులిస్తాం!

ప్రముఖ కంపెనీల భారీ ఆఫర్లు

ఇంటర్న్‌షిప్‌..!  గ్రాడ్యుయేషన్‌లోకి చేరిన విద్యార్థుల చూపు దీనివైపు సాగుతోంది. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అయితే ఇది తప్పనిసరి కూడా అయింది. రెజ్యూమేకు అదనపు విలువ చేకూర్చడంతోపాటు చాలాసార్లు ఉద్యోగాన్నీ ఖాయం చేస్తుండటంతో విద్యార్థులు దీనిపై మొగ్గు చూపుతున్నారు. అయితే ఇచ్చే స్టైపెండ్‌ తక్కువే కదా అని అసంతృప్తీ, నిరాశా పడనక్కర్లేదు. కొన్ని బడా సంస్థలు పెద్దమొత్తంలోనే స్టైపెండ్‌ను ఇస్తున్నాయి. దరఖాస్తు చేసుకుని, ఎంపికైతే ఆకర్షణీయమైన మొత్తం అందుకుంటూ ఇంటర్న్‌షిప్‌ కొనసాగించవచ్చు!

నేర్పిస్తాం.. డబ్బులిస్తాం!

ద్యోగానికి రాచమార్గం వేయడంలో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు సాయపడుతున్నాయి. తరగతి గదిలో తాము నేర్చుకున్నది పనిచేసే చోట ప్రయోగాత్మకంగా ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవటంలో గొప్పగా సాయపడుతున్నాయి. ఉద్యోగాలకు ఇలా ముందస్తుగా సిద్ధమయ్యే అవకాశం లభిస్తోంది. అందుకే విద్యార్థులు వీటిపై దృష్టి సారిస్తున్నారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఇంజినీరింగ్‌లో తప్పనిసరి చేయడానికి వెనుక ఉన్న ఉద్దేశం- పరిశ్రమపరంగా విద్యార్థులు ఎంతమేరకు సంసిద్ధంగా ఉన్నారో వారికి వారు అంచనా వేసుకోవడానికి వీలు కల్పించడమే!
ఇంటర్న్‌షిప్‌లో భాగంగా చొరవ చూపి మంచి ప్రదర్శన చేసినవారిని సంస్థలు వారి చదువు పూర్తయ్యాక సంస్థల్లోకి ఆహ్వానిస్తున్నాయి. ఈ రకంగా సంస్థలకూ మేలు జరుగుతోంది. మామూలుగా అయితే... ఒక అభ్యర్థిని తమకనుగుణంగా మలచుకోవడానికి సంస్థలు వారికి శిక్షణనివ్వడం, దానివల్ల సమయం, డబ్బు, మానవ వనరులను వెచ్చించాల్సిరావటం...జరుగుతుంది. వీటికి ప్రత్యామ్నాయ మార్గంగా సంస్థలకు ఇంటర్న్‌షిప్‌లు కనిపిస్తున్నాయి. చాలా సంస్థలు ప్రత్యేకంగా ఇంటర్న్‌షిప్‌లకు సంబంధించి ప్రత్యేకంగా ప్రకటనలు ఇవ్వడం, నియామకాలను చేపట్టడమే ఇందుకు ఉదాహరణ.
అయితే ఇంటర్న్‌షిప్‌ల్లో చాలావరకూ స్టైపెండ్‌ చెల్లించనివే విద్యార్థులకు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల ఇంటర్న్‌షిప్‌ను పొందడానికి అభ్యర్థులే కొంత మొత్తం చెల్లించాల్సి వస్తోంది. దీంతో వీటిపై అనాసక్తి ప్రదర్శిస్తున్నవారూ ఉన్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే.. సంస్థల గురించిన ముందస్తు అవగాహన కల్పించుకోవడం ప్రధానం. ఎందుకంటే.. దేశవ్యాప్తంగా ఎన్నో సంస్థలు ఇంటర్న్స్‌కు పెద్ద మొత్తంలో చెల్లిస్తున్నాయి.

పే పాల్‌ (నెలకు రూ.50,000)

నేర్పిస్తాం.. డబ్బులిస్తాం!

పెద్దనోట్ల రద్దు తరువాత ఆన్‌లైన్‌ లావాదేవీలకు ఎంత ప్రాముఖ్యం పెరిగిందో అందరికీ తెలిసిందే. ఈ రకమైన డబ్బు లావాదేవీల్లో ఈ సంస్థ అగ్రశ్రేణిలో ఉంది. ఈ రంగంలో ఆసక్తి ఉండి, కెరియర్‌ను మలచుకోవాలనుకునేవారికి ఈ సంస్థలో ఇంటర్న్‌షిప్‌ మంచి అవకాశం. సాధారణంగా ఇంజినీరింగ్‌, మార్కెటింగ్‌ గ్రాడ్యుయేట్లకు ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఎక్కువగా బెంగళూరులోనే అవకాశాలున్నాయి. దేశవ్యాప్తంగా అధిక మొత్తంలో వేతనం చెల్లిస్తున్నవాటిలో ముందంజలో ఉంది. దాదాపుగా రూ.50,000 వరకూ చెల్లిస్తున్నారు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్న్‌షిప్‌ కాలవ్యవధి- 10-12 వారాలు. 
వెబ్‌సైట్‌:
www.paypal.com/

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ (నెలకు రూ.60,000) 

క్రెడిట్‌ కార్డుల ప్రపంచంలో అగ్రగామి సంస్థ. భారతీయ సంస్థ కానప్పటికీ దేశంలో ప్రాధాన్యం ఉంది. ‘వింగ్స్‌’ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇంటర్న్‌షిప్‌లను నిర్వహిస్తారు. స్టైపెండ్‌ నెలకు రూ. 60,000 వరకూ ఉంటుంది. ఫైనాన్స్‌ రంగంలో కెరియర్‌ మలచుకోవాలనుకునే ఫ్రెషర్లకు దీన్ని అనువైన ప్రదేశాల్లో ఒకదానిగా చెబుతారు. ఆఫ్‌లైన్‌ ఇంటర్న్‌షిప్‌. గ్రూప్‌ డిస్కషన్‌/ ఆన్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహించి, దానిలో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దానిలోనూ ఉత్తీర్ణులైనవారికి ఇంటర్న్‌షిప్‌ అవకాశాన్ని కల్పిస్తారు. కాకపోతే గుడ్‌గావ్‌, బెంగళూరు సంస్థల్లోనే ఇంటర్న్‌షిప్‌ అవకాశం ఉంది. 
వెబ్‌సైట్‌:
www.americanexpress.com/

గోల్డ్‌మన్‌ సాక్స్‌ (నెలకు రూ.37, 000) 

ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్‌ రంగంలో పేరున్న సంస్థ ఇది. దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్‌ నగరాలన్నింటిలో ఈ సంస్థ సేవలను అందిస్తోంది.రెండు రకాల ఇంటర్న్‌షిప్‌లను అందిస్తోంది. బెంగళూరులోనే అందుబాటులో ఉన్నాయి.  ఆఫ్‌లైన్‌ ఇంటర్న్‌షిప్‌లు. 1. సమ్మర్‌ అనలిస్ట్‌ ఇంటర్న్‌షిప్‌: దీనికి డిగ్రీ రెండో ఏడాది చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.ఫైనాన్షియల్‌ మార్కెట్‌లపై ఆసక్తి ఉన్నవారికి ఇది ఉపయోగకరం. అకడమిక్‌ స్కోరు ఆధారంగా రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌లకు అనుమతిస్తారు. వీటిలో ఎంపికైనవారికి వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్న్‌షిప్‌ వ్యవధి- పది వారాలు.2. విమెన్‌ ఇంజినీర్స్‌ క్యాంపస్‌ హైరింగ్‌ ప్రోగ్రాం:డిగ్రీ, పీజీ అమ్మాయిల కోసం ఉద్దేశించినది. డిగ్రీ రెండో ఏడాది, పీజీ మొదటి ఏడాది చదువుతూ 12 నెలల కంటే తక్కువ పని అనుభవం ఉన్నవారికి ఇంటర్న్‌షిప్‌ అందుబాటులో ఉంది. గంటన్నర వ్యవధి గల పరీక్ష నిర్వహిస్తారు. సాధారణంగా పరీక్ష జూన్‌లో నిర్వహిస్తారు. ఎంపికైనవారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. స్టైపెండ్‌ నెలకు రూ.37,000. 
వెబ్‌సైట్‌:
www.goldmansachs.com/

మైక్రోసాఫ్ట్‌ (నెలకు రూ.40,000) 

కంప్యూటర్‌ రంగంలోనే పేరెన్నికగన్న సంస్థ ఇది. ఈ విభాగంలో చదివే ప్రతి విద్యార్థీ పనిచేయాలని కలగనే సంస్థగా చెప్పొచ్చు. వీరు చెల్లించే స్టైపెండ్‌ మొత్తం దాదాపుగా రూ.40,000. దీనిలో చేరినవారికి కొత్త టెక్నాలజీల పరిచయంతోపాటు అవి ఎలా పనిచేస్తాయో దగ్గర్నుంచి చూసే అవకాశమూ లభిస్తుంది. తద్వారా నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
సమ్మర్‌ ఇంటర్న్‌షిప్స్‌ను అందిస్తున్నారు. కంప్యూటర్స్‌ గ్రాడ్యుయేట్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నిర్ణీత సీజీపీఏ ఉన్నవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. రాతపరీక్ష, టెక్నికల్‌, హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూల ఆధారంగా తీసుకుంటున్నారు.
వెబ్‌సైట్‌: ‌
www.microsoft.com/

క్యాడ్‌బరీ (నెలకు రూ.40,000) 

దేశంలోని మిఠాయి రంగంలో మరో అతిపెద్ద సంస్థ. ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో ఉంది. ఇక్కడ పనికి సంబంధించిన మెలకువలను ప్రాథమిక స్థాయి నుంచి క్లిష్టమైన స్థాయి వరకు నేర్పిస్తారు. ఎంచుకున్న విభాగాన్ని బట్టి ఇంటర్న్‌షిప్‌లు మూడు నుంచి ఆరు నెలల కాలవ్యవధి వరకూ ఉంటాయి. సేల్స్‌, మార్కెటింగ్‌కు సంబంధించిన ఇంటర్న్‌షిప్‌లు ఎక్కువగా ఉన్నాయి. అందిస్తున్న స్టైపెండ్‌ మొత్తం రూ.40,000.
వెబ్‌సైట్‌:
www.cadbury.co.za/

దరఖాస్తు ఎలా?

నేర్పిస్తాం.. డబ్బులిస్తాం!

1 ఆన్‌లైన్‌: పెద్ద సంస్థల అధికారిక వెబ్‌సైట్లు అన్నింటిలో ‘కెరియర్‌’ పేజీ తప్పనిసరిగా ఉంటుంది. దీనిలో ఓపెనింగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటుంది. దీనికి వెళ్లి పూర్తి సమాచారం తెలుసుకోవడంతోపాటు నమోదూ చేసుకోవచ్చు.
2 రెఫరెన్స్‌: సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఎవరైనా తెలిసుంటే వారి సాయం కోరవచ్చు. లింక్‌డిన్‌లో పరిచయాలను ఏర్పరచుకుని, వారిని రెఫరెన్స్‌ ఇవ్వమని అడగొచ్చు.
3 మెయిల్‌: విద్యార్థులు నేరుగా సంస్థల హెచ్‌ఆర్‌లకు ఫలానా సంస్థలో ఇంటర్న్‌షిప్‌ను చేయాలన్న తమ ఆసక్తిని తెలియజేస్తూ మెయిల్‌ పంపొచ్చు. అయితే కవర్‌లెటర్‌, రెజ్యూమేనూ జతచేయాల్సి ఉంటుంది. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో మెయిల్‌ ఐడీని సంపాదించొచ్చు.
4 ఇంటర్న్‌షిప్‌ పోర్టళ్లు: ఇప్పుడు ఇంటర్న్‌షిప్‌లకే ప్రత్యేకంగా ఎన్నో వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఉదా: ఇంటర్న్‌శాల, లెట్స్‌ ఇంటర్న్‌. ఆయా వెబ్‌సైట్లలోకి వెళ్లి నచ్చిన సంస్థలో తగిన ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవే కాకుండా...

మోర్గాన్‌ స్టాన్లీ, ఫ్లిప్‌ కార్ట్‌ నెలకు రూ.25,000-35,000, ఇంటెల్‌ రూ.20,000-35,000, ఏర్‌బీఎన్‌బీ, పెప్సికో, మింత్రా, అమేజాన్‌, ఉబర్‌ ఇండియా, పేటీఎం, ఓలా, రిలయన్స్‌ జియో వంటి సంస్థలు రూ.20,000, అంతకు మించి స్టైపెండ్‌ను అందిస్తున్నాయి.డెలాయిట్‌ నెలకు కనీసం రూ.15,000 ఇస్తోంది. ఎక్కువ శాతం ఆఫ్‌లైన్‌ ఇంటర్న్‌షిప్‌లు; చాలావరకూ ఏడాది పొడవునా అందుబాటులో ఉన్నాయి. ఇంటర్న్‌షిప్‌ల కాలవ్యవధి 2  నెలల నుంచి 6 నెలల వరకూ ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని