విరామం.. వరమే!

పరీక్షల్లో ఫెయిలయితే బాధతో కుంగిపోనక్కర్లేదు. మరోసారి రాసి నెగ్గెయ్యవచ్చు. ‘విలువైన కాలం వృథా అవుతోందే’ అని బాధపడనవసరం లేదు. ఎందుకంటే ఈ వ్యవధిలో విలువైనవి ఎన్నో నేర్చుకోవచ్చు. చేరాల్సిన కోర్సులపై సందిగ్ధతను వదలి స్పష్టత ఏర్పరచుకోవచ్చు. అనుకోకుండా వచ్చిన ఈ విరామం వరంలాంటిదని గ్రహించాలి.  అందుకే

Updated : 22 Apr 2019 03:42 IST

టాప్‌లో నిలిపే గ్యాప్‌ ఇయర్‌!

పరీక్షల్లో ఫెయిలయితే బాధతో కుంగిపోనక్కర్లేదు. మరోసారి రాసి నెగ్గెయ్యవచ్చు. ‘విలువైన కాలం వృథా అవుతోందే’ అని బాధపడనవసరం లేదు. ఎందుకంటే ఈ వ్యవధిలో విలువైనవి ఎన్నో నేర్చుకోవచ్చు. చేరాల్సిన కోర్సులపై సందిగ్ధతను వదలి స్పష్టత ఏర్పరచుకోవచ్చు. అనుకోకుండా వచ్చిన ఈ విరామం వరంలాంటిదని గ్రహించాలి.  అందుకే మంచి మార్కులతో పాసైనవారిలో కూడా కొందరు పైచదువులకు వెళ్ళకుండా ఏడాది గ్యాప్‌ తీసుకుంటున్నారు! కావాలని విద్యాసంవత్సరం నుంచి వెసులుబాటు కల్పించుకునే విధానం ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్నదే. ‘గ్యాప్‌ ఇయర్‌’ అనీ, ‘సబాటికల్‌ ఇయర్‌’ అనీ వ్యవహరించే ఈ ధోరణి మనదేశంలోనూ ప్రాచుర్యం పొందుతోంది. ప్రవేశాలూ, పాఠాలూ, పరీక్షల నిర్విరామ చక్రభ్రమణానికి ఇలా ‘పాజ్‌’ బటన్‌ నొక్కటం ఎందుకు? ఏమిటి ప్రయోజనాలు?
 

రాకేశ్‌ ఇంటర్‌లో ఓ సబ్జెక్టులో తప్పాడు. పరీక్షలు జీవితంలో భాగం కావొచ్చు కానీ.. అదే జీవితం కాదని అతడికి తెలుసు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలో నెగ్గుతాననే నమ్మకం అతడికుంది. అయినా ఈ ఏడాది ఏ కోర్సులోనూ చేరకుండా  విరామం తీసుకోవాలనుకుంటున్నాడు. శరత్‌ అత్యధిక మార్కులు తెచ్చుకున్నాడు. అత్యుత్తమ విద్యాసంస్థల్లో నిశ్చయంగా సీటు వస్తుంది. అయినా సరే, తన కెరియర్‌ మార్గంపై మరింత స్పష్టత రావాలనుకుంటున్నాడు. అందుకే ఈ సంవత్సరం గ్యాప్‌ తీసుకుని, లోకజ్ఞానం, అనుభవం తెచ్చుకుంటానని చెపుతున్నాడు.
ఎందుకంటే... పాస్‌, ఫెయిల్‌లతో నిమిత్తం లేకుండా గ్యాప్‌ తీసుకుని, ద్విగుణీకృత ఉత్సాహంతో ముందడుగు వేయటం కొత్త ఒరవడి!
తరగతి గదులూ, పాఠ్యపుస్తకాల పరిజ్ఞానానికి అతీతంగా విద్యార్థులు నేర్చుకోవాల్సిన లైఫ్‌ స్కిల్స్‌ ఎన్నో ఉన్నాయి. కానీ ఎంట్రన్స్‌ పరీక్షలకూ, కాలేజీ సీట్లకూ పోటీపడటం అనే పరుగులో వీటికి ఆస్కారం తక్కువ. అందరూ నడిచే దారిని అనుసరించేటపుడు ప్రయోగాలకు వీలుండదు. కానీ తమ నిజమైన ఆసక్తి, అవగాహనలపై ఆధారపడి కచ్చితంగా సరిపోయే కెరియర్‌ను ఎంచుకోవాలనుకునే విద్యార్థులకు ‘ఇయర్‌ గ్యాప్‌/ సెమిస్టర్‌ గ్యాప్‌’ మంచి మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. రేపటి కెరియర్‌కు సర్వసన్నద్ధం చేసే ఈ విరామాన్ని ‘ప్రెప్‌ ఇయర్‌’ అని కూడా వ్యవహరిస్తుంటారు.
చాలామంది తమకేం కావాలో స్పష్టత లేకుండానే కళాశాల జీవితంలోకి అడుగుపెడుతుంటారు. ఇలా కాకుండా ప్రణాళికాబద్ధంగా గ్యాప్‌ తీసుకోవటం వల్ల స్వీయ అభిరుచులూ, బలాలపైనా, భవిష్యత్తుపైనా స్పష్టత వచ్చే అవకాశముంది. తగిన కోర్సును ఎంచుకోవటం కోసం మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా, అభిరుచుల పరంగా ఎదగటానికీ, దృక్పథం విశాలం చేసుకోవటానికీ ఇది వారధి అవుతుంది.

ఒకప్పుడు ప్రయోగమే!

‘గ్యాప్‌ ఇయర్‌’ భావన మనదేశంలో ఏడెనిమిది సంవత్సరాలకిందటి వరకూ ఓ ప్రయోగం. ఇప్పుడైతే పెద్ద సంఖ్యలోనే విద్యార్థులు దీనివైపు మొగ్గు చూపిస్తున్నారు. భిన్నకోణాల్లో ఆలోచించి తీసుకునే నిర్ణయంగా ఇది ప్రాచుర్యం పొందుతోంది. ఒక సర్వే ప్రకారం... గ్యాప్‌ ఇయర్‌ తమ ఉద్యోగార్హత సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతోందని 88 శాతం విద్యార్థులు వెల్లడించారు.
2007లో ఉత్తరాఖండ్‌లోని ముసోరిలో మొట్టమొదటి ‘గ్యాప్‌ ఇయర్‌ కాలేజి’ ఆరంభమైంది. విద్యార్థులు తమ ఆసక్తులను గ్రహించి, కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు ఈ కళాశాల సాయపడింది. ప్రస్తుతం ఇది కొనసాగటం లేదు. అయితే చాలా విద్యాసంస్థలూ, సంస్థలూ థియేట్రిక్స్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఎకాలజీ, గ్రీన్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌.. ఇలా ఎన్నో వైవిధ్యభరితమైన అంశాల్లో గ్యాప్‌ ఇయర్‌ ప్రోగ్రాములను అందిస్తున్నాయి.
‘జీవితంలో ఏం చేయాలో స్పష్టత లేనివారికి గ్యాప్‌ ఇయర్‌ ఉపయోగం’ అని చాలామంది విద్యావేత్తలు చెపుతున్నారు. అయితే ‘మనదేశ పరిస్థితులను బట్టి హైస్కూలు దశ దాటాక కాకుండా ఆ తర్వాతి దశలో ఈ నిర్ణయం మంచి ఫలితాన్నిస్తుంది. అప్పటికి వారి మానసిక పరిధులు విస్తృతమవుతాయి. సరైన కెరియర్‌ను ఎంచుకోగలుగుతారు’ అని ప్రసిద్ధ కెరియర్‌ కౌన్సెలర్‌ ఉషా అల్‌బఖర్క్‌ అభిప్రాయపడుతున్నారు.
htttps://yearoutgroup.org/ లాంటి ఎన్నో వెబ్‌సైట్లు మార్గ  దర్శక అంశాలతో సమాచారం అందజేస్తున్నాయి.

చురుగ్గా, చైతన్యవంతంగా...

ఏడాది విరామం అంటే ఏమీ చెయ్యకుండా ఈ కాలంలో తీరిగ్గా, వ్యర్థంగా గడపటం కాదు. ఉత్సాహంగా, చైతన్యవంతంగా, అంతర్గత శక్తులు వెలికివచ్చేలా వివిధ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే సమయమిది. స్వచ్ఛందసేవ, పర్యటన, పార్ట్‌టైమ్‌ కోర్సులు, ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్‌లు లాంటివి చేసుకోవచ్చు. జీవితానికీ, కెరియర్‌కూ సంబంధించి సముచితమైన నిర్ణయం తీసుకోవటానికి దీన్ని ఉపయోగించుకోవాలి. విద్యార్థులు తమ శక్తిసామర్థ్యాలను కనుగొనేందుకు వినియోగించుకోవాలి.
ఈ కాలంలో వారు పొందిన అనుభవం విద్యాపరంగా సానుకూల ప్రభావం చూపిస్తుంది. నేర్చుకోవటంపై కుతూహలం పెంచుతుంది. ‘పార్క్‌’ చేసినట్టున్న విద్యార్థిని ఉత్సాహంగా ‘డ్రైవింగ్‌’ చేసేలా ప్రోత్సహిస్తుంది. నలుగురిలో మెలగటానికీ, భాషానైపుణ్యం వృద్ధి చేసుకోవటానికీ సహకరిస్తుంది. ఎంచుకున్న కెరియర్‌పై అవగాహన పెంచి, దానిలో మెరుగ్గా రాణించేలా చేస్తుంది. తరగతి గదిలో కూర్చుని ఈ జీవిత పాఠాలను నేర్చుకోవడం అసాధ్యం.

హార్వర్డ్‌ ప్రోత్సాహం

ఏటా యు.కె.లో 2 లక్షలమంది, యు.ఎస్‌.లో 40,000 మంది వరకూ విద్యార్థులు విద్యావిరామం తీసుకుంటున్నారు. హార్వర్డ్‌ లాంటి విశ్వవిద్యాలయాలు గ్యాప్‌ ఇయర్‌ తీసుకోమంటూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా పెద్దకుమార్తె మలీయ 2017లో హార్వర్డ్‌లో చేరేముందు ఏడాది విరామం తీసుకున్నారు. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ దేశాల్లో కూడా ఇది ప్రాచుర్యంలో ఉంది.
ఈ విరామం మనదేశంలో మరీ కొత్తది కూడా కాదు. బైపీసీ గ్రూపు విద్యార్థులు మెడికల్‌ ప్రవేశపరీక్షల్లో సీటుతెచ్చే ర్యాంకుకోసం, ఎంపీసీ గ్రూపువారు ఐఐటీ సీటుకోసం లాంగ్‌ టర్మ్‌ శిక్షణ పేరుతో ఒకటి రెండు సంవత్సరాల విరామం తీసుకోవటం తెలిసిందే. విదేశీవిద్య చదవాలనుకునేవారు ఐఈఎల్‌టీఎస్‌ లాంటి ప్రీ రిక్విజిట్‌ టెస్టుల్లో మంచి స్కోరు కోసం గ్యాప్‌ తీసుకుంటుంటారు. అయితే ‘సబాటికల్‌’ భావన పోటీపరీక్షలకు పరిమితమైనది కాదు. అంతకంటే విస్తృతమైనది. ఎంచుకున్న చదువుల్లో రెట్టించిన శక్తితో రాణించేలా,  ‘కంఫర్ట్‌ జోన్‌’ నుంచి బయటపడి సవాళ్ళను ఎదుర్కొనేలా సిద్ధం చేస్తుంది.

ఏమేం చేయొచ్చు?

స్వచ్ఛంద సేవ: సామాజిక సమస్యల్లో ఒకదాన్ని ఎంచుకుని దానిలో పనిచేసి అనుభవం సంపాదించటం. అటవీ, జంతు సంరక్షణ, అనాథ బాలలకు విద్యాబోధన లాంటి ప్రాజెక్టుల్లో విధులు నిర్వహించవచ్చు. వెనుకబడిన, గిరిజన ప్రాంతాల్లో పాఠశాలల నిర్మాణం, వైద్యసహాయం లాంటి వాటిలోనూ సేవలందించవచ్చు.
అవగాహన కార్యక్రమాలు: పారిశుద్ధ్యం, పర్యావరణం, జలసంరక్షణ లాంటి సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన తెచ్చే కార్యక్రమాలు నిర్వహించటం. ఈ సందర్భంగా వివిధరకాల వ్యక్తులను కలవటం, ఆలోచనలు పంచుకోవటం చేయవచ్చు.
పర్యటన: తెలియని కొత్త ప్రదేశాలకు ప్రయాణించి, అక్కడి ప్రజల సంస్కృతీ విశేషాలు గ్రహించటం. ఈ క్రమంలో స్వతంత్రంగా జీవించే నైపుణ్యం అలవరుచుకోవచ్చు.

ఇంటర్న్‌షిప్‌: చదవదల్చిన కెరియర్‌కు సంబంధించిన పరిజ్ఞానం, అనుభవం ఇంటర్న్‌షిప్‌ ద్వారా పొందటం. సంవత్సరంలో ఇది కొద్ది వారాల వ్యవధి ఉన్నా మంచిదే. ఆ కెరియర్‌పై ఆసక్తి నిలుస్తుందో లేదో తేలిపోతుంది.అప్పుడు మరో కెరియర్‌ గురించి ఆలోచించవచ్చు.
పార్ట్‌ టైమ్‌ కోర్సులు: ఆసక్తిని బట్టి స్వల్పకాలిక పార్ట్‌టైమ్‌ కోర్సులు నేర్చుకోవటం. కొత్త భాష, క్రీడ, సంగీత వాద్యం, పెయింటింగ్‌...కావొచ్చు; మెకానిజం, కార్పెంటరీ, కుకరీ..కావొచ్చు. అభిరుచిని బట్టి సంబంధిత కోర్సుల్లో చేరి పరిజ్ఞానం, ఆచరణాత్మక నైపుణ్యం పొందవచ్చు.

ఫెయిలయితే ఏంటి?

పరీక్షల్లో మార్కులు విద్యార్థుల ప్రతిభకు కొలమానం కానే కాదు. ఒక్కోసారి తక్కువ మార్కులు వచ్చి తప్పటం జరుగుతూనే ఉంటుంది. విద్యార్థులు దీన్ని అవమానంగా భావించి బాధలో మునిగిపోకూడదు. ఇదొక అనుకోని అవకాశంగా సానుకూలంగా స్వీకరించాలి. పాసైన వారిలో కూడా కొందరు ఏడాది గ్యాప్‌ తీసుకుంటున్నప్పుడు... ఫెయిల్‌ అవటం వల్ల కాలం వ్యర్థమవు తుందనే బాధకు అర్థంలేదు. తమలోని అంతర్గత శక్తులను మరో రూపంలో వెలికితీసుకువచ్చే సందర్భంగా దీన్ని భావించాలి.
ఏడాది విరామం తీసుకోవటం ప్రయోజనకరమే అయినప్పటికీ ఇది ప్రతి విద్యార్థికీ అవసరం కాకపోవచ్చు. అందుకే విరామం ఎందుకు తీసుకోదల్చుకున్నదీ విద్యార్థులకు స్పష్టత ఉండాలి. మానసికంగా ఎదగటం, కొత్త అంశాలను అనుభవంలోకి తెచ్చుకోవటం, దీర్ఘకాలంలో ప్రయోజనం పొందేలా తమను తీర్చిదిద్దుకోవటం.. లాంటి లక్ష్యాలున్నవారికి ఇది మేలు చేస్తుంది. ఈ నిర్ణయానికి ముందు అన్ని అంశాలనూ బేరీజు వేసుకోవాలి.

                                      

 అనుకూలాలూ       

+ ఈ విరామం ... దేనిపై అత్యంత ఆసక్తి ఉందో గ్రహించే వీలు కల్పిస్తుంది. చదువుల పేరుతో తరచూ పక్కనపెట్టే అభిరుచులపై దృష్టి పెట్టవచ్చు. ఫలితంగా విద్యార్థి విభిన్నమైన కెరియర్‌ని కనుగొనే ఆస్కారముంది.

     ప్రతికూలాలూ

- కొన్నిసార్లు కొందరు విద్యాపరంగా ప్రేరణ కోల్పోయి, చదవటాన్ని భారంగా భావించవచ్చు. అందుకని ఇలాంటి సమస్య వచ్చే ప్రమాదం ఉందో లేదో వ్యక్తిగతలక్షణాలను బట్టి అంచనా వేసుకోవటం మంచిది.

+ కళాశాల విద్య ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి దైనందిన ఖర్చులకోసమైనా ఏదో ఒక పని చేసి సంపాదించటం మంచిది. విరామం ఈ అవకాశాన్నిస్తుంది. బాధ్యతగా, స్వతంత్రంగా ఎదగటానికి ఈ అనుభవం పనికొస్తుంది. - స్పష్టమైన ప్రణాళిక లేకపోతే పని-సంపాదన పేరుతో విలువైన సమయం వృథా అయ్యే ప్రమాదముంది. అందుకే చేసే పని కెరియర్‌కు అదనపు విలువ కలిగించేలా జాగ్రత్తపడాలి.
+ ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో  పర్యటించడం వల్ల కొత్త మనుషులతో పరిచయం, భిన్న సంస్కృతులపై అవగాహన పెరుగుతుంది. కొత్త భాషలు నేర్చుకునే వీలుంటుంది. అనుకోని పరిస్థితుల్లో ఎలా నెగ్గుకురావాలో అనుభవపూర్వకంగా గ్రహింపునకొస్తుంది. - పర్యటనలకు ఆర్థికపరంగా చాలా ఖర్చవుతుంది.  డబ్బును క్రమశిక్షణతో సక్రమంగా వినియోగించటం అవసరం. పర్యటనలు ఎంతవరకు ఉండాలో వాటి గరిష్ఠ ప్రయోజనం, ఆర్థిక స్థితిగతులను బట్టి నిర్ణయించుకోవాలి.
- సీహెచ్‌. వేణు

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని