పాల ఉత్పత్తిలో ప్రథమం?

ఏపీపీఎస్‌సీ, టీఎస్‌పీఎస్‌ సర్వీసులూ, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ మొదలైన నియామక పరీక్షల సిలబస్‌లో భారతదేశ భౌగోళిక వ్యవస్థ ఓ భాగం. దీనిపై సమగ్ర అవగాహన తెచ్చుకోవటం పోటీపరీక్షార్థుల కర్తవ్యం.

Updated : 07 Jan 2020 02:14 IST

పోటీ పరీక్షల కోసం.. భౌగోళిక వ్యవస్థ జీవ సంపద

ఏపీపీఎస్‌సీ, టీఎస్‌పీఎస్‌ సర్వీసులూ, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ మొదలైన నియామక పరీక్షల సిలబస్‌లో భారతదేశ భౌగోళిక వ్యవస్థ ఓ భాగం. దీనిపై సమగ్ర అవగాహన తెచ్చుకోవటం పోటీపరీక్షార్థుల కర్తవ్యం. భౌగోళిక వ్యవస్థ పరిధిలో జీవ సంపదపై అభ్యర్థులు అధ్యయనం చేయాల్సివుంటుంది. పశువుల్లోని వివిధ రకాలు, ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం!

ప్రపంచంలో అతిపెద్ద పశు/ జీవ సంపద ఉన్న దేశం భారత్‌. దేశ వ్యవసాయ రంగంలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర దీనిదే. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత్‌దే అగ్రస్థానం. గేదెల ద్వారా 63%, ఆవుల ద్వారా 33%, మేకల ద్వారా 3%, ఇతరాల ద్వారా 1% ఉత్పత్తి చేస్తుంది. పాల ఉత్పత్తిలో ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉన్నాయి.

ప్రపంచంలో మన దేశానిది... ఎ) మొత్తం జీవ సంపద పాల ఉత్పత్తిలో, గేదెలు, మేకల పాల ఉత్పత్తిలో, మొత్తం బొవైన్‌ సంపదలో మొదటి స్థానం బి) మేకలు, చేపల ఉత్పత్తిలో, పందుల పరిశ్రమల్లో, పశు సంపదలో రెండో స్థానం సి) గొర్రెల ఉత్పత్తి, గుడ్ల ఉత్పత్తిలో .... మూడో స్థానం డి) చికెన్‌ ఉత్పత్తిలో నాలుగో స్థానం ఇ) పౌల్ట్రీ మీట్‌ ప్రొడక్షన్స్‌, పౌల్ట్రీ ఉత్పత్తిలో ఐదో స్థానం ఎఫ్‌) బాతుల ఉత్పత్తిలో ఎనిమిదో స్థానం జి) ఒంటెలు, ఉన్ని ఉత్పత్తిలో తొమ్మిదో స్థానం

పశు జాతులు - రకాలు
1. పాలిచ్చే జాతులు (Milk Bread): ఇందులో గిర్‌, గిర్‌సింధ్‌ జాతులు గుజరాత్‌, రాజస్థాన్‌, సాహివాల్‌ జాతులు పంజాబ్‌, హరియాణ, ఉత్తర్‌ప్రదేశ్‌, దేవుని జాతి.. ఆంధ్రప్రదేశ్‌ మొదలైనవి.
2. వ్యవసాయ జాతులు (Drought Breed): ఇందులో నగోరి జాతులు రాజస్థాన్‌, హరియాణ, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బచేరి జాతి బిహార్‌, మాల్వీ జాతి మధ్యప్రదేశ్‌, ఖిల్లారి మహారాష్ట్రలో ఉన్నాయి.
3. ఉభయ జాతులు (Dual Breed):
  ఇందులో కంక్రాజ్‌ జాతులు గుజరాత్‌, దాంగ్రి జాతులు మహారాష్ట్ర; ఒంగోలు జాతులు - ఆంధ్రప్రదేశ్‌; వెచూర్‌ జాతి కేరళ, కృష్ణలోయ జాతి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, మేవతి ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నాయి.
4. దిగుమతి జాతులు (Exotic Breed): వీటిని ఐరోపా దేశాల నుంచి, న్యూజిలాండ్‌ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఇవి రోజుకు 30-35 లీటర్ల పాలు ఇస్తాయి. మన దేశ జాతులు ఒక లీటర్‌ మాత్రమే ఇస్తున్నందున ‘టీ కప్‌ ఆఫ్‌ కౌ కంట్రీ’ అని పిలుస్తారు. ఇందులో ప్రధానంగా జెర్సీ, స్విస్‌, స్వీస్‌బ్రౌన్‌, ప్రైషియన్‌ మొదలైనవి ఉన్నాయి.
5. మేలైన జాతులు (Quality Breed): దేశంలో మేలైన జాతుల్లో ఒంగోలు - ఆంధ్రప్రదేశ్‌, దేవుని - ఆంధ్రప్రదేశ్‌, పుంగనూర్‌ - ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, మైసూర్‌ - కర్ణాటక, ముర్రా - హరియాణ. ఒంగోలు జాతికి ప్రపంచంలోనే అత్యంత మేలైన జాతి అని పేరు.

మాదిరి ప్రశ్నలు
1. వేచూర్‌ పశు జాతులు ఏ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి? (ASO 2016)
1. ఉత్తర్‌ప్రదేశ్‌   2.గుజరాత్‌ 3. తమిళనాడు  4. కేరళ

2. కిందివాటిలో పాలిచ్చే జాతి కానిది? (SSC 2016)
1. గిర్‌సంద్‌  2. సహివాల్‌ 3. నగోరి  4. దేవుని

3. పశు సంపద గణాంకాలను ఎన్నేళ్లకు ఒకసారి చేస్తారు?  (RRB 2016)
1) 2   2) 4     3) 5     4) 10

4. ప్రపంచంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే దేశం? (GROUP-2, 2011)
1. అమెరికా  2. బ్రెజిల్‌   3. డెన్మార్క్‌   4. భారత్‌

5. పంది మాంసాన్ని ఏమని పిలుస్తారు?  (FBO 2017)
1. బీఫ్‌  2. పోర్క్‌   3. చికెన్‌   4. మీట్‌

6. 20వ జంతుసంపద గణాంకాల ప్రకారం అత్యధికంగా పశు సంపదను పెంచిన రాష్ట్రాలు?
1. ఉత్తర్‌ప్రదేశ్‌ - రాజస్థాన్‌   2. పశ్చిమ బంగ - తెలంగాణ  3. ఉత్తర్‌ప్రదేశ్‌ - ఆంధ్రప్రదేశ్‌  4. పశ్చిమ బంగ- ఆంధ్రప్రదేశ్‌

7. ప్రపంచంలోనే అత్యంత మేలైన జాతిగా ప్రసిద్ధిచెందింది?
1. జెర్సీ  2. ఒంగోలు   3. పుంగనూర్‌   4. దేవుని

8. దేశంలో అత్యధిక జంతు సంపద ఉన్న రాష్ట్రం?
1. ఉత్తర్‌ప్రదేశ్‌   2. మధ్యప్రదేశ్‌ 3. పశ్చిమ బంగ   4. ఆంధ్రప్రదేశ్‌

సమాధానాలు: 1-4 2-3 3-3 4-4 5-2 6-2 7-2 8-1

- కొత్త గోవర్థన్‌ రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని