స్వాగతిస్తున్నాయ్‌.. త్రివిధ దళాలు!

డిగ్రీ అర్హతతోనే ఉన్నత స్థాయి ఉద్యోగాలు రక్షణ దళాల్లో ఎన్నో ఉన్నాయి. వాటిలో యూపీఎస్‌సీ నిర్వహించే కంబైన్డ్‌ డిఫెన్స్‌సర్వీసెస్‌  ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ) ముఖ్యమైంది. డిఫెన్స్‌లో దూసుకుపోవడానికి ఇది దారిచూపుతుంది. పరీక్ష, ఇంటర్వ్యూలో విజయం సాధించినవారిని శిక్షణలో సానబెడతారు. అనంతరం లెవెల్‌-10 వేతనశ్రేణితో లక్షణమైన ఉద్యోగంలోకి తీసుకుంటారు....

Published : 02 Nov 2020 01:16 IST

డిగ్రీతో అద్భుత అవకాశం

డిగ్రీ అర్హతతోనే ఉన్నత స్థాయి ఉద్యోగాలు రక్షణ దళాల్లో ఎన్నో ఉన్నాయి. వాటిలో యూపీఎస్‌సీ నిర్వహించే కంబైన్డ్‌ డిఫెన్స్‌సర్వీసెస్‌  ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ) ముఖ్యమైంది. డిఫెన్స్‌లో దూసుకుపోవడానికి ఇది దారిచూపుతుంది. పరీక్ష, ఇంటర్వ్యూలో విజయం సాధించినవారిని శిక్షణలో సానబెడతారు. అనంతరం లెవెల్‌-10 వేతనశ్రేణితో లక్షణమైన ఉద్యోగంలోకి తీసుకుంటారు. ప్రకటన వెలువడిన నేపథ్యంలో సీడీఎస్‌ఈ 2021 (1) పూర్తి వివరాలు చూద్దాం..

యూపీఎస్‌సీ క్యాలండర్‌ ప్రకారం నిర్వహించే పరీక్షల్లో సీడీఎస్‌ ఒకటి. ఏడాదికి రెండుసార్లు ఈ ప్రకటన వెలువడుతుంది. దేశంలో రక్షణ దళ ఉద్యోగాల నిమిత్తం ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు పోటీ పడే పరీక్ష ఇదే. ఒక్కో విడతలోనూ సుమారు రెండు లక్షల మంది సీడీఎస్‌ఈ రాస్తున్నారు.
ఈ పరీక్ష మరీ అంత కఠినం కాదు. అలా అని సులువుగానూ ఉండదు. ముందు నుంచి సన్నద్ధమైనవారు మొదటి ప్రయత్నంలోనే మెరవవచ్చు. ఇంటర్వ్యూకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ చెరో 300 మార్కులకు చొప్పున ఉంటాయి. ఇంటర్వ్యూలో అయిదు రోజులపాటు వివిధ కోణాల్లో అభ్యర్థిని నిశితంగా గమనిస్తారు. ఇందుకోసం వివిధ పరీక్షలు నిర్వహిస్తారు. అందులో నెగ్గినవారినే శిక్షణలోకి తీసుకుంటారు. వీరు తమ ప్రాధాన్యం, మెరిట్‌లను అనుసరించి ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్సుల్లో సేవలు అందించవచ్చు. ఏర్‌ఫోర్స్‌కు ఎంపికైనవారు పైలట్‌గా విధులు నిర్వర్తించవచ్చు. మెరుగైన ప్రతిభ చూపితే ఫైటర్‌ పైలట్‌గానూ రాణించవచ్చు. సీడీఎస్‌ఈ ద్వారా త్రివిధ దళాల్లో ఏ సర్వీస్‌కి ఎంపికైనప్పటికీ సివిల్‌ సర్వెంట్లతో సమాన మూల వేతనం (లెవెల్‌ 10 పే) అందుతుంది. విధుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపినవారు భవిష్యత్తులో ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌లకు ఉన్నతాధికారి కావచ్చు.

ఉద్యోగంలో...
ర్మీలో లెఫ్టినెంట్‌, నేవీలో సబ్‌ లెఫ్టినెంట్‌, ఏర్‌ఫోర్స్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో కెరియర్‌ ప్రారంభమవుతుంది. ఈ మూడూ సమాన హోదా (లెవెల్‌ 10) ఉన్న ఉద్యోగాలే. రూ.56,100 మూలవేతనం లభిస్తుంది. మిలటరీ సర్వీస్‌ పే కింద అదనంగా రూ.15,500 చెల్లిస్తారు. పైలట్లకు రూ.25 వేలు ఫ్లయింగ్‌ అలవెన్సు అందుతుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ప్రోత్సాహకాలు .. అన్నీ కలుపుకుని సుమారు రూ.లక్ష వేతనం పొందవచ్చు. రెండేళ్ల అనుభవంతో ఆర్మీలో కెప్టెన్‌, నేవీలో లెఫ్టినెంట్‌, ఏర్‌ఫోర్స్‌లో ఫ్లయిట్‌ లెఫ్టినెంట్‌ హోదాలు సొంతం చేసుకోవచ్చు. ఆరేళ్లు విధుల్లో కొనసాగినవారు సంబంధిత దళాల్లో మేజర్‌/ లెఫ్టినెంట్‌ కమాండర్‌/ స్క్వాడ్రన్‌ లీడర్‌ గుర్తింపు పొందవచ్చు. 13 ఏళ్ల సేవలతో ఏర్‌ ఫోర్సులో వింగ్‌ కమాండర్‌ కావచ్చు. అదే నేవీలో కమాండర్‌, ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా పొందవచ్చు.  
పరీక్ష ఇలా...
ఇంగ్లిష్‌, జనరల్‌ నాలెడ్జ్‌, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌ అంశాల్లో అభ్యర్థుల ప్రావీణ్యాన్ని పరీక్షిస్తారు. ఒక్కో పేపర్‌ వంద మార్కులకు చొప్పున మొత్తం 300 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు రెండు గంటలు కేటాయించారు. మ్యాథ్స్‌లో వంద, మిగిలిన రెండు పేపర్లలోనూ 120 చొప్పున ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. తప్పు సమాధానాలకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులో మూడో వంతు చొప్పున తగ్గిస్తారు. ఇంగ్లిష్‌ విభాగం తప్ప ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్షలో అర్హత సాధించడానికి పేపర్‌ 1లో 20, 2లో 10, 3లో 20 శాతం మార్కులు తప్పనిసరి. ఓటీఏ పోస్టులకు పరీక్ష, ఇంటర్వ్యూ ఒక్కోటీ 200 మార్కులకే ఉంటాయి. ఒక్క ఓటీఏ పోస్టులకే దరఖాస్తు చేసుకున్నవారు మ్యాథ్స్‌ పేపర్‌ రాయనవసరం లేదు.

ప్రశ్నలడిగే విభాగాలు

ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌
ఈ విభాగంలో అడిగే ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. అరిథ్‌మెటిక్‌ (నంబర్‌ సిస్టమ్‌, ఎలిమెంటరీ నంబర్‌ థియరీ), ట్రిగనోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్‌, స్టాటిస్టిక్స్‌ అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు.
ఇంగ్లిష్‌
అభ్యర్థి ఆంగ్ల భాషను ఎలా అర్థం చేసుకుంటున్నారో పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. కాంప్రహెన్షన్‌, ఎర్రర్స్‌ అండ్‌ ఒమిషన్స్‌, ఫిల్‌ ఇన్‌ ది బ్లాంక్స్‌, జంబుల్డ్‌ సెంటెన్స్‌, సెంటెన్స్‌ కరెక్షన్‌, సిననిమ్స్‌, యాంటనిమ్స్‌, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్‌, పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్‌, స్పెలింగ్‌ మిస్టేక్స్‌, సెంటెన్స్‌ ట్రాన్ఫర్మేషన్‌, రిపోర్టెడ్‌ స్పీచ్‌ల నుంచి ప్రశ్నలు సంధిస్తారు.
జనరల్‌ నాలెడ్జ్‌
ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితానికి ముడిపడినవే ఉంటాయి. రోజువారీ పరిశీలనల ద్వారా ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. వర్తమాన అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. సైన్స్‌, టెక్నాలజీ అంశాల్లో తాజా మార్పులపై ప్రశ్నలు వస్తాయి. భారతదేశ చరిత్ర, భౌగోళికశాస్త్రం అంశాల్లో అభ్యర్థి అవగాహనను పరీక్షిస్తారు.

రాణించడానికి...
భ్యర్థులు ముందుగా పాత సీడీఎస్‌ఈ ప్రశ్నపత్రాలను బాగా అధ్యయనం చేయాలి. ఇవన్నీ యూపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. సమాధానాలూ విడిగా అదే వెబ్‌సైట్‌లో లభిస్తున్నాయి. వీటిద్వారా ప్రశ్నల తీరు తెలుస్తుంది. సబ్జెక్టులు/ విభాగాల వారీగా ఏయే అంశాల్లో దృష్టి సారించాలో అర్థమవుతుంది.
ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌ పేపర్‌ను ఇంటర్మీడియట్‌, డిగ్రీ స్థాయుల్లో గణిత నేపథ్యం ఉన్నవారు సులువుగానే ఎదుర్కోవచ్చు. అదనపు సమయం కేటాయించుకుని వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే ఈ విభాగంలో ఆశించిన మార్కులు పొందగలరు. ముందుగా సిలబస్‌లో పేర్కొన్న అధ్యాయాల కోసం 8, 9, 10 తరగతుల గణితం పాఠ్య పుస్తకాలను బాగా చదువుకుంటే సరిపోతుంది.  
జనరల్‌ నాలెడ్జ్‌ పేపర్‌కు సంబంధించి... భారతదేశ చరిత్ర, భౌగోళికశాస్త్రం, జాగ్రఫీ, పాలిటీ సబ్జెక్టులకు ఎన్‌సీఈఆర్‌టీ 8, 9, 10 తరగతుల పుస్తకాల్లో సమాచారం ఉపయోగపడుతుంది. లూసెంట్‌ లేదా అరిహంత్‌ జీకే పుస్తకాల్లో ఏదో ఒకటి చదువుకున్నా సరిపోతుంది. సైన్స్‌ విభాగంలోని ప్రశ్నలకు ఎన్‌సీఈఆర్‌టీ 6-10 తరగతుల పుస్తకాల్లోని ముఖ్యాంశాలు చూసుకోవాలి. వర్తమాన అంశాలు, తాజా అభివృద్ధి కార్యక్రమాలు, నియామకాలు..తదితరాల నిమిత్తం ఏదైనా దినపత్రికను అనుసరించాలి.
ఇంగ్లిష్‌ విభాగం ప్రశ్నలన్నీ హైస్కూల్‌ ఆంగ్ల పాఠ్యపుస్తకాల స్థాయిలోనే ఉంటాయి. అందువల్ల 8,9,10 తరగతుల ఆంగ్ల పుస్తకాల్లోని వ్యాకరణాంశాలను బాగా చదువుకోవాలి.
పరీక్షకు ముందు వీలైనన్ని నమూనా ప్రశ్నపత్రాల సాధన తప్పనిసరి. ఇలా చేసినప్పుడు సమయపాలనను విధిగా పాటించాలి. సమాధానాలు సరిచూసుకుని, ఏ సబ్జెక్టులో అందులోనూ ఏ అంశాలు/విభాగాల్లో తప్పులు చేస్తున్నారో గమనించి, వాటికి తుది సన్నద్ధతలో ప్రాధాన్యం ఇవ్వాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని